కాంగ్రెస్ కలహాలు కమలానికి కలిసొస్తాయా ?
posted on Dec 22, 2022 @ 12:46PM
తెలంగాణ కాంగ్రస్ లో ముదురుతున్న అంతర్గత కలహాలు, సీనియర్, జూనియర్, అసలు, నకిలీ విబేధాలు బీజేపీకి కలిసొస్తాయ? బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్న కమల దళం నిజంగా భారాసకు ప్రధాన ప్రత్యర్ధి , ప్రత్యామ్నాయం కాగలుగుతుందా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కమలం ఖాతాలో చేరిపోతుందా? అంటే, రాజకీయ విశ్లేషకులు అవునని అంటూనే అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మాత్రం అనుమానం లేదు ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి వచ్చేది కమల దళమే అంటున్నారు. అలాగని, బీజేపీ రాష్ట్ర నాయకత్వంలోనూ కొత్త పాత విబేధాలు లేక పోలేదు. అయితే, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడం, కాంగ్రెస్ అధిష్టానం కంటే బీజీపీ కేంద్ర నాయకత్వం బలంగా ఉండడం ఆపార్టీకి కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మరోవంక చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే ఆలోచనతో ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వం, బీఆర్ఎస్ ను మొగ్గలోనే తుంచేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుఔతున్న కేసీఆర్ కు అసెంబ్లీ ఎన్నికల్లోనే చెక్ చెప్పేందుకు మోడీ షా జోడీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలోనే వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమని ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలోని కాషాయ శ్రేణుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.
తాజాగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 80 స్థానాలకుపైగా గెలుస్తామనే విశ్వాసంతో ప్రధాని మోదీ ఉన్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ధర్మపురి అర్వింద్ కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. ఈ సందర్బంగా తెలంగాణలోని రాజకీయ పరిణామాలు, బీజేపీ పరిస్థితి గురించి అర్వింద్‌ను అడిగి మోడీ వివరాలు తెలుసుకున్నారు.
ప్రధానితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ధర్మపురి అర్వింద్.. తెలంగాణలో 80కిపైగా సీట్లలో బీజేపీ విజయం సాధిస్తుందంటూ మోదీ సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండాలని మోదీ సూచించారని, తనపై బీఆర్ఎస్ నేతల దాడి గురించి కూడా తెలుసుకున్నట్లు అర్వింద్ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ గెలుపుపై మోడీ ధీమాతో ఉన్నారని తెలిపారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతో కొట్టు మిట్టాడుతున్నా, కాంగ్రెస కు ఇంచుమించుగా అన్ని నియోజవర్గాల్లో,ఒకటి రెండు మార్లు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన, గెలిచిన బలమైన అభ్యర్దులున్నారు. క్యాడరుంది. ఓటు బ్యాంకు ఉంది.
అదే బీజేపీ విషయానికి వస్తే, ఒక 25 -30 నియోజక వర్గాలు మినహా మిగిలిన మూడింట రెండు వంతుల నియోజక వర్గాల్లో అభ్యర్ధులే లేని పరిస్థితి ఉందని అంటున్నారు. అందుకే కమలం పార్టీ నాయకత్వం కాంగ్రెస్ అంతర్గత కలహాలను ఆసరాగా చేసుకుని, ఆ పార్టీ నాయకులను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అలాగే బీఆర్ఎస్ లోని అసంతృప్తులను తమ వైపుకు తెచ్చుకునే ప్రయత్నాలూ సాగిస్తోంది. ఒక విధంగా పశ్చిమ బెంగాల్ ఫార్ములానే బీజేపీ తెలంగాణలోనూ ఫాలో అవుతోందని అంటున్నారు. అధికారంలోకి వచ్చే ప్రయత్నం సాగిస్తూనే అసెంబ్లీ ఎన్నికల్లో వ్యాజ్యం సాధించినా లేకున్నా లోక్ సభ ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఖాళీ చేయాలనే దిశగా పావులు కదుపుతోందని అంటున్నారు.
అదలా ఉంటే, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంలో ఇంకా సందిస్గ్ధత తొలిగి పోలేదు. ఆయినా. రాజకీయ పార్టీలన్నీ, ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయాయి. ప్రధాన పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అంతర్గత కలహాలకు చుక్క పెట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపారు. సో... కాంగ్రెస్ అంతర్గత కలహాల పై ఆశలు పెంచుకున్న బీజేపీ కలలను కాంగ్రెస్ పార్టీ నిజం చేస్తుందా? అంటే, అందుకు ఇప్పటికిప్పుడు స్పష్టమైన సమాధానం ఇవ్వడం కుదరదని పరిశీలకులంటున్నారు.
మరో వంక తెలుగు దేశం పార్టీ బుధవారం (డిసెంబర్ 21) ఖమ్మంలో నిర్వహించిన శంఖారావం సభ తెలంగాణలో టీడీపీ, డౌన్ బట్ నాట్ అవుట్ అని నిరూపించింది. అలాగే కొత్తగా తెర పైకి వచ్చిన వైఎస్సార్‌టీపీ, బీఎస్పీ వంటి పార్టీల ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇంకా స్పష్టం కావలసి ఉందని అంటున్నారు. అలాగే, ఎత్తులు పొత్తులు ఎప్పుడు ఏవిధంగా మారతాయో చూడవలసి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.