వ్యూహాత్మక వైరమేనా?
posted on Jan 16, 2023 @ 12:38PM
పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కనిపిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య వైరం వ్యూహాత్మకమేనా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఈ ఎనిమిదిన్నరేళ్ల కాలంలో అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత నుంచి ప్రధాని మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి మోడీ ఇరువురి మధ్యా మైత్రి పలు సందర్భాలలో ప్రస్ఫుటంగా కనిపించిందని చెబుతున్నారు.
ఇప్పుడు కూడా ఉప్పూ నిప్పులా.. కనీసం ఒకరిని ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడనంతగా డిస్టెన్స్ మెయిన్ టెయిన్ చేస్తున్నా.. అక్కడ ఆయన, ఇక్కడ ఈయన ముచ్చటగా మూడవసారి ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు అనుసరిస్తున్న వ్యూహమే తప్ప మరొకటి కాదని పరిశీలకులు అంటున్నారు. వ్యూహాత్మకంగా నువ్వు కొట్టి నట్లు చేయి నేడు ఏడ్చినట్లు చేస్తాను అన్నట్లుగానే వీరి తీరు ఉందని చెబుతున్నారు. ఇద్దరి మధ్య ఏదో భీకర యుద్ధం సాగుతోందనే భ్రమలు కలిపించేందుకు, అటు నుంచి ఇటు నుంచి ఉభయ పార్టీలూ మాటల తూటాలు సంధించుకుంన్నారని విశ్లేషిస్తున్నారు. విశ్లేషకుల మాటలు ఎలా ఉన్నా టీపీసీసీ చీఫ్ రెవంత్ కూడా ఇదే అంటున్నారు. ఇరువురూ కలిసి ప్రజలను మోసం చేసి అటు కేంద్రంలో మోడీ, ఇటు రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలన్న వ్యూహంతో పావులు కదుపుతున్నారని అంటున్నారు. విజయ దశమి పండగ పూట కేసేఆర్, తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారు. కేంద్రంలో ప్రదాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకే కేసేఆర్ ప్రాంతీయ పార్టీ పేరు మార్చి జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు.
మోడీ గుజరాత్ మోడల్ కు కేసీఆర్ తెలంగాణ మోడల్ ప్రత్యామ్నాయం అంటున్నారు. అయితే కేసీఆర్ ఈ ఏడాది 9 రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పాలిత రాష్ట్రాలపై గురి పెట్టడం లేదు. ఆయన తన దృష్టి మొత్తాన్నీ ఏపీపైనే కేంద్రీకృతం చేశారు. అలాగే గత ఏడాది చివరిలో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పడు కూడా మహారాష్ట్ర, కర్ణాటకలలో పోటీ చేస్తామంటున్నారు కానీ.. తన జాతీయ పార్టీకి అధ్యక్షుడిని నియమించడానికి మాత్రం ముందుగా ఏపీనే ఎన్నుకున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు జరుగుతాయి. అక్కడ ముందస్తు ఎన్నికలు జరుగుతాయని వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటి వరకూ అవి ఊహాగానాలు మాత్రమే.
నిజానికి, కేసేఆర్ జాతీయ రాగం ఎత్తుకున్నదే, కేంద్రంలో మళ్ళీ మరో సారి, మోడీని గెలిపించెందుకే అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెబుతున్నది నిజమేనా అన్న అనుమానం కలగడానికి కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అనుసరిస్తున్న విధానమే కారణం. అన్నిటికీ మించి ఆయన తెలంగాణలో వేసే ప్రతి అడుగూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలహీనం చేయడానికే అన్న విధంగా ఉంటోంది. తమిళ నాడులో కాంగ్రెస్ మిత్ర పక్షంగా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన డిఎంకే అధినేత, ఆ ర్రాష్ట ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను కలిసి కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమిలోని, శివసేన, ఎన్సీపీలను కాంగ్రెస్ నుంచివిడదీసే ప్రయత్నం చేశారు. జార్ఖండ్ లోనూ కాంగ్రెస్ తో కలిసున్న ఝార్ఖండ్ ముక్తి మోర్చా ( జేఎంఎం) ను థర్డ్ ఫ్రంట్ కు ఆహ్వానం పలికారు. సరే అవేమీ కార్యరూపం దాల్చలేదనుకోండి.. కానీ ఆ ప్రయత్నం అయితే కేసీఆర్ చేశారు. అవన్నీ విఫలమైన తరువాత కేసీఆర్ బీఆర్ఎస్ ను ఏర్పాటు చేసి కూడా బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్టాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ ఊసే ఎత్తలేదు.
ఇప్పుడు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న కర్ణాటక, మహారాష్ట్రలలో పోటీ చేస్తామంటున్నారు. అక్కడ పోటీ చేస్తే చీలేది బీజేపీ వ్యతిరేక ఓటేననడంలో సందేహం లేదు. అంతవరకు ఎందుకు, గడచిన ఎనిమిది సంవత్సరాలలో తెలంగాణలోనే కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ, సిపిఐ, పార్టీలకు చెందిన 40 మందికి పైగా ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను ప్రలోభాలకు గురి చేసి గోడ దూకించిన కేసీఆర్, బీజేపే వైపు మాత్రం కన్నెత్తయినా చూడలేదు. అందుకే కేసీఆర్ తెర తీసిన భారతీయ రాష్ట్ర సమితి, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తన పార్టీ మరో సారి అధికారాన్ని పదిల పరుచుకోవడానికేనని విశ్లేషకులు అంటున్నారు.