ఎర్రగంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిలు సమంజసం కాదు.. సుప్రీం
posted on Jan 16, 2023 @ 1:26PM
ఎర్ర గంగిరెడ్డికి ఏపీ హై కోర్టు డిఫాల్ట్ బెయిలు మంజూరు చేయడం సమంజసం కాదని దేశ సర్వోన్నత న్యాయ స్థానం పేర్కొంది. నిందితుడిపై నాన్ బెయిలబుల్ కేసు ఉన్నప్పుడు చార్జిషీట్ దాఖలు కాలేదన్న కారణంతో కేసులోని మెరిట్స్ పరిగణనలోకి తీసుకోకుండా డిఫాల్ట్ బెయిలు మంజూరు చేయడం తగదని సుప్రీం కోర్టు విస్పష్టంగా చెప్పింది.
ఎర్ర గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిలు రద్దు కాదంటూ ఏపీ హై కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారించిన సుప్రీం కోర్టు ఏపీ హైకోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగా బెయిల్ అంశంపై మరో సారి విచారణ చేపట్టాలని తెలంగాణ కోర్టుకు సూచిస్తూ.. ఏపీ హై కోర్టు తీర్పుపై తెలంగాణ హై కోర్టులో మరో సారి విచారణ జరపాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పులివెందులలోని తన స్వగృహంలో వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి విదితమే. ఈ కేసులో నిందితుడు ఎర్రి గంగిరెడ్డిని సీబీఐ గతంలో అరెస్టు చేసింది. ఆ తరువాత గంగిరెడ్డికి కింది కోర్టు బెయిలు మంజూరు చేసింది. చార్జిషీట్ దాఖలు చేయనందున ఎర్ర గంగిరెడ్డికి బెయిలు మంజూరు చేస్తున్నట్లు కింది కోర్టు తీర్పు చెప్పింది.
అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీ హైకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్ధించింది. దీంతో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీం కోర్టు ఏపీ హైకోర్టు తీర్పును తప్పుపడుతూ, ఎర్రగంగిరెడ్డి బెయిలుపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారించాలనీ, మెరిట్స్ ఆధారంగా తీర్పు ఇవ్వాలని సూచించింది. వైఎస్ వివేకా హత్య కేసును సుప్రీం కోర్టు ఏపీ హై కోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదలీ చేసిన సంగతి విదితే.