కొడాలి నాని హీరోగా వీవీవినాయక్ దర్శకత్వంలో సినిమా?
posted on Jan 16, 2023 @ 2:52PM
కొడాలి నాని హీరోగా త్వరలో ఒక సినిమా రాబోతోందా? ఆ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడా? ఈ ప్రశ్నలు గుడివాడలో జరిగిన సంక్రాంతి వేడుకలలో వినాయక్ ప్రసంగం కారణంగా పుట్టుకొచ్చాయి. హిట్ సినిమాల దర్శకుడిగా ఓ వెలుగు వెలిగిన వీవీ వినాయక్ ఇప్పుడు చేతిలో సినిమాలు లేక దాదాపు ఖాళీగా ఉన్నారు. సినిమా ప్రారంభోత్సవాలకు, లేదా తొలి షాట్ దర్శకత్వానికి పరిమితమైపోయారు.
సరే పనిలో పనిగా ఈ మధ్య ఓ సినిమాలో హీరోగా కూడా నటించేస్తున్నారు. ఇలా దర్శకత్వం వినా అన్నీ చేసేస్తున్న వీవీ వినాయక్.. తాజాగా తనే కొడాలి నానికి ఒక ప్రపోజల్ చేశారు. అదేమిటంటే తన దర్శకత్వంలో కొడాలి నాని హీరోగా ఓ సినిమా చేస్తాననీ, అందుకు నాని అంగీకరించాలని. అది కూడా ఎక్కడంటే..గుడివాడలో జరిగిన సంక్రాంతి వేడుకలలో.. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఏటా జరిగే సంక్రాంతి వేడుకలకు ఈ ఏడాది వీవీ వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా కొడాలి నానిపై పొగడ్తల వర్షం కురిపించిన వీవీ వినాయక్.. కొడాలి నాని అంగీకరిస్తే ఆయన హీరోగా తన దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమని ప్రకటించేశారు.
అయితే ఆయన ప్రతిపాదనకు కొడాలి నాని నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అయితే బూతులే డైలాగులుగా చెప్పే కొడాలి నానిని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు జనం సిద్ధంగా ఉంటారా అన్న అనుమానం కూడా వీవీ వినాయక్ కు రాకపోవడానికి కారణం.. ఆయన వైసీపీలో ఏదో ఒక గుర్తింపు పొందేందుకు చేస్తున్న ప్రయత్నంగానే చూడాలని వైసీపీ శ్రేణులే జోకులేస్తున్నాయి. ఇటీవలి కాలంలో వీవీ వినాయక్ వైసీసీ నేతలతో సన్నిహితంగా మెలుగుతున్నారనే చెప్పాలి. ఇటీవల కాపు కార్పొరేషన్ చైర్మన్ గా జక్కంపూడి రాజా నియమితుడైన సందర్భంలో కూడా వీవీ వినాయక్ జక్కంపూడి రామ్మోహన రావుపై పొగడ్తల వర్షం కురిపించారు. వైఎస్ హయాంలో జక్కంపూడి రామ్మోహనరావు మంత్రిగా పని చేసిన సంగతి విదితమే.
అదే సమయంలో వీవీ వినాయక్ ముఖ్యమంత్రి జగన్ పై కూడా ప్రశంసల వర్షం కురిపించి తన అభిమానాన్ని చాటుకున్నారు. జగన్ ప్రసంగాలు తనలో స్ఫూర్తి నింపాయని కూడా చెప్పుకున్నారు. వైసీపీ ఇటీవలి కాలంలో ఏ రంగంలోనైనా ఏదో పాటి గుర్తింపు ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతోంది.
జనసేనాని పవన్ కల్యాణ్ రాష్ట్రంలో పొత్తుల విషయంలో క్లారిటీ ఇచ్చేసినప్పటి నుంచీ కాపు సామాజిక వర్గం మద్దతు కోసం వైసీపీ పాకులాట ఎక్కువగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగానే తన నియోజకవర్గంలో తన ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలకు కొడాలి నాని వీవీ వినాయక్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారని చెబుతున్నారు. అదే సమయంలో సినీ రంగంలో అవకాశాలు తగ్గిపోయిన వినాయక్ కూడా రాజకీయంగా వైసీపీ పంచన చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని అంటున్నారు.