జగన్ సినీ రాజకీయ మాయ.. ఈ సారి కనిపించదా?
posted on Jan 16, 2023 @ 10:42AM
ఏపీ రాజకీయ సమీకరణాల్లో స్పష్టత వస్తున్న కొద్దీ 2024 ఎన్నికలలో వార్ వన్ సైడ్ అయిపోతుందన్న భావన సర్వత్రా కలుగుతోంది. స్వయంగా అధికార పార్టీయే ఆ నిర్ణయానికీ, నిర్ధారణకూ వచ్చేసిందనిపించేలా ఆ పార్టీ నేతల మాటలు ఉంటున్నాయి. ఔను నిజమే.. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి అన్నీ మంచి శకునములే.. అధికార లాభ సూచనలే అన్నట్లుగా పరిస్థితులు కలిసి వచ్చాయి. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సినిమా గ్లామర్ కు ఎంత ప్రాధాన్యత ఉందో తెలియనిది కాదు. ఆ సినిమా గ్లామర్ అండ అప్పటి ఎన్నికలలో వైసీపీకి పుష్కలంగా లభించింది.
ఔను అప్పట్లో సినీ పరిశ్రమ దాదాపుగా వైసీపీ వెనుక నిలబడిందని చెప్పవచ్చు. అప్పట్లో మంచి ఫామ్ లో ఉన్న థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృధ్వీ రాజ్, కమోడియన్ కమ్ హీరో అలీ, రైటర్, కమ్ యాక్టర్ పోసాని కృష్ణ మురళి వీళ్లు ముగ్గురూ బహిరంగంగా వైసీపీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరే కాకుండా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా వైసీపీకీ, జగన్ కు మద్దతుగా నిలిచారు. రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేశారు. వీరే కాకుండా తెరవెనుక మద్దతు ఇచ్చిన సినీ పరిశ్రమకు చెందిన వారింకెంత మందో అన్నారు.
2019 ఎన్నికలకు మందు వైసీపీలో ఓ వెలుగు వెలగడమే కాకుండా.. వైసీపీ అండతో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ ఇష్టారీతిన విమర్శలు గుప్పించి జగన్ దృష్టిలో పడిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్, సినీ పరిశ్రమలో పనవ్ కల్యాణ్ కు సన్నిహిత స్నేహితుడిగా గుర్తింపు పొంది, కేవలం జగన్ పంచన చేరడం కోసం ఆయనకు దూరంగా జరిగిన అలీ, మొదటి నుంచీ చిరంజీవికీ, పవన్ కల్యాణ్ కూ దగ్గరి వాడుగా గుర్తింపు పొందిన పోసాని కృష్ణ మురళి.. వీళ్లంతా.. తమ శక్తికి మించి, పరిశ్రమలో తమ స్థానం ఏమౌతుందన్న బెరుకు కూడా వదిలేసి వైసీపీ కోసం పాటుపడ్డారు. కష్టపడ్డారు.
వీళ్లందరిలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. పృధ్వీరాజ్ రెండు ఆకులు ఎక్కువ తిన్నారు. నోరున్నదే విమర్శించడానికి అన్నట్లుగా ఆయన చెలరేగిపోయారు. ఆయన చెలరేగిపోతున్న సమయంలో.. ఇప్పుడైతే బూతుల నేతలుగా పేరొందిన కొడాలి నాని వంటి వారు కూడా ఆయన ముందు దిగదుడుపు అన్నట్లుగా అప్పట్లో పృధ్వీ విమర్శలు ఉండేవి. సరే ఆ తరువాత వైసీపీ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అన్ని వదిలేసి తన కోసం ప్రత్యర్థులను విమర్శించడమే పనిగా పెట్టుకున్న పృధ్వికి ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు. సినీ పరిశ్రమ నుంచి వైసీపీ కోసం కష్టపడి పని చేసిన వారెందరో ఉన్నప్పటికీ.. జగన్ కు ఇష్టమైన భాషా ప్రయోగం చేసిన పృధ్వికి మాత్రమే ఆయన పదవి కట్టబెట్టారు.
మిగిలిన వారికి తరువాత చూద్దాం అంటూ బజ్జగింపుతో సరిపెట్టారు. పదవి దక్కడంతో పృద్వీ మరింతగా రెచ్చిపోయారు. ప్రతి పక్ష పార్టీల నాయకులను ఎంత ఎక్కువగా దూషిస్తే అంతగా ముఖ్యమంత్రి గుడ్ లుక్స్ లో ఉంటానని భావించారో ఏమో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకు పడ్డారు. చివరకు, అమరావతి రైతుల ఆందోళలోనూ వేలు పెట్టారు. సినిమా కూతలు కూశారు. అమరావతి రైతుల ఉద్యమంపై పృథ్వీ చేసిన డర్టీ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైయ్యాయి. అయినా అయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రతిపక్షాలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అయితే, పృధ్వి ఎస్వీబీసే వైభోగం మూడు నాళ్ళ ముచ్చటగా ముగిసి పోయింది.
ఒక మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన వాయిస్ రికార్డులు బయటకు రావటంతో ఎస్వీబీసీ ఛైర్మన్ బాధ్యతల నుండి తప్పించారు. ఇక అంతే ఆ తరువాత వైసీపీలో పృధ్విని పట్టించుకున్న వారే లేరు. ఇలాంటి అసభ్య వాయిస్ రికార్డులతో దొరికిన ఇతర వైపీపీ నాయకులపై ఎలాంటి చర్యా తీసుకోని జగన్ పృధ్వి విజయంలో మాత్రం ఉద్వాసన చెప్పడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. పదవి నుంచి పీకి పారేశారు. మరో వంక వెనకా ముందు చూసుకోకుండా, నోరు పారేసుకున్న ఆయన్ని ఇండస్ట్రీ కూడా వదిలేసింది. దీంతో పృద్వీ రెంటికీ చెడ్డ రేవడిలా రోడ్డున పడ్డారు.
ఇక ఆ తరువాత ప్రముఖ కమేడియన్ అలీ విషయానికి వస్తే.. మూడేళ్ల పాటు అదిగో ఇదిగో అంటూ ఊరించి.. రాజ్యసభ సభ్యత్వం నుంచి వక్ఫ్ బోర్డు చైర్మన్ వరకూ పెద్ద పెద్ద పదవుల ఆశ చూపి.. చివరకు ఓ సలహాదారు పోస్టుతో సరిపెట్టారు. అలాగే అయినదానికీ కానిదానికీ కూడా జగన్ ను భుజాన వేసుకుని మోసే పోసాని కృష్ణ మురళీకి కూడా నామినేటెడ్ పోస్టు పారేశారు. అలాగే ఎప్పుడో జగన్ ప్రచారానికి ఓ పాట పాడిన మంగ్లీకి కూడా ఓ సలహాదారు పోస్టు ఇచ్చేశారు. అయితే.. మోహన్ బాబు ఫ్యామిలీని ఇసుమంతైనా పట్టించుకోలేదు.
ఇవన్నీ కాసేపు పక్కన పెడితే..జగన్ మూడున్నరేళ్ల పాలనలో సినీ పరిశ్రమను అష్ట కష్టాల పాల్జేశారు. రాజకీయంగా తనతో విభేదిస్తున్న ఒకరిద్దరిని దృష్టిలో ఉంచుకుని మొత్తం పరిశ్రమనే ఇబ్బందుల్లోకి నెట్టేశారు. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల సమయంలో జగన్ కు మద్దతుగా నిలబడేందుకు సినీ పరిశ్రమ నుంచి ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. పదవులు ఇచ్చాం వీళ్లు మాతోనే ఉంటారు అని భావిస్తున్న అలీ, పోసానిలు కూడా ఈ సారి చురుకుగా వైసీపీ తరఫున నిలుస్తారన్న నమ్మకం అయితే లేదు. ఎందుకంటే.. వారికిచ్చిన సలహాదారు పోస్టులు ఉత్సవ విగ్రహాల్లాంటివే.. తమ స్టేచర్ కు, పడిన కష్టానికి అవి తగిన పదవులని వారు భావించడం లేదు. దీంతో ఈ సారి ఎన్నికలలో గతంలో అండగా నిలిచిన సినీ గ్లామర్ ఈ సారి వైసీపీకి ఉండదని చెబుతున్నారు.