గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్.. మరో వివాదం
posted on Jan 16, 2023 @ 11:39AM
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇక ముఖ్యమంత్రి, గవర్నర్ సంబంధాల విషయం అయితే చెప్పనే అక్కర లేదు. ఉప్పు నిప్పు అంటే బాగుంటుందేమో , ఆ ఇదరి మధ్య మాటలు లేవు. మాట్లాడుకోవడాలు లేవు. వివాదాలకు మాత్రమే ఉన్నాయి. అధికార పరిధి మొదలు ప్రోటోకాల్ ఉల్లంఘనల వరకు ఒకటని కాదు రెండు కీలక రాజ్యాంగ వ్యవస్థల నడుమ వివాదాలకు కొదవ లేదు. అనేక వివాదాల చుట్టూ దుమారం రేగుతోంది. ఇప్పటికే అనేక పర్యాయాలు ఇదే విషయంగా చాలా చాలా చర్చ జరిగింది. జరుగుతూనే వుంది. అనివార్యం అయితే తప్ప ముఖ్యమంత్రి మంత్రులు మాత్రమే కాదు, సీఎస్, డీజీపీ సహా ఇతర అధికారులు ఎవరూ.. రాజ్ భవన్ వైపు చూడడమే మానేశారు.
అదలా ఉంటే ఇప్పుడు మరో సారి మరో వివాదం తెరపై కొచ్చింది. ఇటీవల మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో డెలీవరీ కోసం అడ్మిట్ అయిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరి కొందరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ దుర్ఘటనపై గవర్నర్ స్పందించారు. స్పందనలోనే సందేహాలు వ్యక్త పరిచారు. మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో బాలింతల మృతి చెందడంపై తనకు అనేక అనుమానాలున్నాయని గవర్నర్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. రాజ్ భవన్ లో ఆదివారం (జనవరి 15) నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లడుతూ మలక్ పేట ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మరణించడం బాధాకరమన్నారు. బాలింతల మరణాలపై ఓ గైనకాలజిస్ట్ గా తనకు ఎన్నో అనుమానాలు, ఉన్నాయని అన్నారు. గవర్నర్ గా మాత్రమే కాకుండా ఒక డాక్టర్ గా కొన్ని అనుమానాలున్నాయని అన్నారు. నిజానికి, ఆసుపత్రికి వెళ్లాలని అనుకున్నా కానీ, పండుగ కారణంగా వెళ్లలేకపోయానని అన్నారు. గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలోనూ నలుగురు మరణించిన విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు. రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా వైద్య రంగంలో వసతులు మెరుగుపరచ వలసిన అవసరం ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను మరింతగా మెరుగు పరచాల్సిన అవసరాన్ని గవర్నర్ నొక్కి చెప్పారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె కోరారు. అలాగే రాష్ట్ర శాసన సభ ఆమోదం తెలిపిన కీలక బిల్లులకు సంబదించి, గవర్నర్ ప్రభుత్వ బిల్లులు పెండింగ్ లో లేవని, తన పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. వర్సిటీ నియామకాల బిల్లులో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. యూనివర్సిటి నియామకాల బిల్లు వివాదాలతో ఆలస్యం కారాదన్నదే తన అభిమతమని గవర్నర్ వివరించారు. ఈ తరహా విధానాలను గతంలో న్యాయస్థానాలు అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా గవర్నర్ గుర్తు చేశారు.
యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని గవర్నర్ కోరారు. అయితే సాధారణ పరిస్థితులలో అయితే ఇలాంటి వ్యాఖ్యలకు అంతగా ప్రాధాన్యత ఉండక పోవచ్చును కానీ ఒక్క తెలంగాణలోనే కాకుండా ఇరుగు పొరుగు రాష్త్రాలలోనూ గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు నడుమ దూరం పెరిగిన నేపధ్యంలో, గవర్నర్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీయవచ్చని అంటున్నారు .