ఐక్య పోరాటం కోసం షర్మిల పిలుపు!
posted on Apr 1, 2023 @ 4:56PM
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల తెలంగాణలో సుదీర్ఘంగా పాదయాత్ర నిర్వహించారు. ఒకటి రెండు సార్లు ఆమె అరెస్టు సందర్భంగా వినా ఆమె పాదయాత్రను పట్టించుకున్న వారు లేరు. ఆమె విమర్శలకు స్పందిచిన వారూ లేరు. అసలు షర్మిల తన తండ్రి వైఎస్సార్ పేరుమీద వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టినప్పటి నుంచే ఆమె రాజకీయాలపై పలువురు అనేకానేక అనుమానాలు వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో తన సొంత అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఆమె ఆ రాష్ట్రం వదిలి తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టడం ఏమిటి? అన్న ప్రశ్నాస్త్రాలు సంధించారు.
ఆ సందర్భంగానే జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న జైలులో ఉన్న సమయంలో ఏపీ అంతా కాలికి బలపం కట్టుకుని నడిచిన షర్మిల ఇప్పడు ఎవరు వదిలిన బాణం? అంటూ సందేహాలు సైతం వెల్లువెత్తాయి. అయితే ఆమె తెలంగాణ అంతా కాలినడకన చుట్టేసిన తరువాత ఇక ఆ ప్రశ్న ఇప్పుడు అప్రస్తుతం. ఇప్పుడు అందరిలోనే ఒకే సందేహం వ్యక్తమౌతోంది. అసలు ఆమె రాజకీయ లక్ష్యం ఏమిటి? ఆమె వాస్తవంగా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పిస్తున్నారు? ఆమె వెంట ఉన్నది ఎవరు? వాస్తవానికి తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను మించి ఆమె కేసీఆర్ పైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా చాలా చాలా ధైర్యంగా విమర్శలు చేశారు. అయినా ఆమె పాదయాత్రను పట్టించుకున్న వారు కానీ, ఆమెను, ఆమె పార్టీని ఒక రాజకీయ శక్తిగా గుర్తించిన వారు కానీ ఎవరూ లేకుండా పోయారు.
ఈ నేపథ్యంలోనే ఆమె బీఆర్ఎస్ యేతర పార్టీలతో కలిసి ఉమ్మడి పోరాటానికి సమాయత్తమౌతున్నారు. అందుకే కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లకు ఫోన్ చేసి మరీ టీపీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఐక్య పోరాటానికి పిలుపు నిచ్చారు. ప్రభుత్వ అవినీతిని ప్రజలలో ఎండట్టేందుకు ఐక్య పోరాటానికి కలిసి రావలసిందిగా కోరారు. అయితే షర్మిల వినతిని, ఆహ్వానాన్ని, పిలుపును కాంగ్రెస్, బీజేపీలు ఎలా స్వీకరిస్తారు. అంశాల వారీగా అయినా కలిసి పని చేయడానికి ముందుకు వచ్చే పరిస్థితి ఉంటుందా? అంటే పరిశీలకులు మాత్రం అలాంటి అవకాశమే లేదని విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ వేటికవిగా వచ్చే ఎన్నికలలో తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్న పార్టీలు. ఆ రెండు పార్టీలూ కూడా దేనికదిగా అధికారం టార్గెట్ గా బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాక్షేత్రంలో ఉద్యామాలు నిర్మించి ముందుకు సాగాలన్న వ్యూహాలతో అడుగులు వేస్తున్నాయి. తమ పోరాటాలలో ఎవరినీ భాగస్వాములను చేసుకునేందుకు అవి పెద్దగా సుముఖత వ్యక్తం చేసే అవకాశం లేదు.
అన్నిటికీ మించి షర్మిల కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితపై ఎంత ఘాటు విమర్శలు చేసినా ఆమె రాజకీయ లక్ష్యాలపై కాంగ్రెస్, బీజేపీలలో పలు అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు కేసీఆర్ స్పాన్సర్డ్ పార్టీగా ఇప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ లు నమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు షర్మిల పిలుపు మేరకు ఐక్య పోరాటానికి కలిసి వస్తాయా అంటే అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు.