బీఆర్ఎస్ తో పొత్తు కోసం కాంగ్రెస్ సీనియర్ల తహతహ!
posted on Apr 1, 2023 @ 4:29PM
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇంచార్జిగా మాణిక్‌రావు గోవిందరావు ఠాక్రే వచ్చిన తర్వాత. గాంధీ భవన్ వాతావరణంలో మార్పు వచ్చింది. కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడింది. నాయకుల మధ్య విభేదాలు అలాగే ఉన్నా.. ఎవరి దారిన వారు పాద యాత్రలు, ఇతర కార్యక్రమాలలో బిజీ అయి పోయారు. అయితే అధికారం రుచి తెలిసిన సీనియర్ నాయకులు ముఖ్యంగా మొదటి నుంచి గులాబీ బాస్ తో ‘స్నేహ’ సంబంధాలున్నజానారెడ్డి వంటి పెద్దలు బీఅరేస్ తో పొత్తుకు తహతహ లాడిపోతున్నారు. పొత్తు విషయంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం పొత్తుకు ససేమిరా ఒప్పుకోకోవడం లేదు. కానీ సీనియర్ నాయకులు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా బీఆర్ఎస్ తో పొత్తు విషయాన్ని సందర్భం వచ్చి నప్పుడల్లా తెరమీదకు తెచ్చి చర్చకు తెరలేపుతున్నారు.
కొద్ది రోజుల క్రితం పార్టీ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొత్తు పొడిచే అవకాశం ఉందని అన్నారు. బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ బీఅరేస్ తో పొత్తు పెట్టుకోక తప్పదని హస్తిన వేదికగా సంచలన ప్రకటన చేసి హస్తం పార్టీలో సునామీ సృష్టించారు. అయితే ఆ తర్వాత రాష్ట్ర ఇన్ చార్జి ఠాక్రే జోక్యం చేసుకుని ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పడు మళ్ళీ అదే విషయాన్ని మరో సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పెద్దలు అంటూ గౌరవంగా సంభోదించే మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి లేవనెత్తి తేనె తుట్టెను కదిల్చారు. చాల కాలం తర్వాత మీడియా ముందుకొచ్చినఈ పెద్దాయన జానారెడ్డి బీజేపీని ఓడించేందుకు అవసరం అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుందని బాంబు పేల్చారు. అంతేకాదు రాహుల్ గాంధీ అనర్హత విషయంలో బీఆర్ఎస్ బహిరంగంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిందని సో ... శత్రువు, శత్రువు మిత్రుడు, థియరీ ప్రకారం కాంగ్రెస్ బీఆర్ఎస్ చేతులు కలపవచ్చని వివరణ కూడా ఇచ్చారు.
నిజానికి వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ తో జట్టు కట్టేందుకు సిద్దంగా ఉందనే సంకేతాలు దండిగానే అందుతున్నాయి.
ఇటీవల అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్, మరో ‘ముఖ్య’ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి సానుకూలంగా మాట్లాడుతున్నారు. అలాగే, ఢిల్లీ మద్యం కుంభకోణంలో అనుమానితులుగా ఈడీ విచారణ ఎదుర్కుంటున్న ముఖ్యమంత్రి కేసీఅర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత వివిధ టీవీ చానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బీజేపీ ని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అహంకారాన్ని, పెద్దన్న దర్పాన్ని వదిలించుకుని కలిసొస్తే కాదనే దేముందంటూ వ్యాఖ్యలు చేశారు. నిజానికి కాంగ్రెస్ అవసరం బీఆర్ఎస్ కు ఉంది. బీఆర్ఎస్ అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో రెండింటికీ చేతులు కలిసే అవసరం, అవకాశం రెండూ ఉన్నాయన్నది పరిశీలకుల విశ్లేషణ.
అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఒంటరిగానే అధికారంలోకి వస్తామని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇతర సీనియర్లు మాత్రం కారుతో షికారు కోరుకుంటున్నారు. ఇది కాంగ్రెస్‌లో కొత్త అలజడికి కారణం అవుతోంది. ఎదుర్కోవాల్సిన పార్టీతో పొత్తులని ప్రచారం చేసుకుంటే మొదటికే మోసం వస్తుందని పరిశీలకులు అంటున్నారు. అయితే చివరకు ఏమవుతుంది? ఏం జరుగుతుంది.. అన్న ప్రశ్నకు మాత్రం వేచి చూడాల్సిందే అన్న సమాధానమే వస్తోంది.