కేవీపీ ఓపెన్ అయిపోతున్నారా?
posted on Apr 1, 2023 @ 2:23PM
కేవీపీ రామచంద్రరావు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ బంధువు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేత. వైఎస్సార్ రాజకీయ ప్రస్థానంలో సలహాదారుడిగా, సహచరుడిగా, సన్నిహితుడుగా, స్నేహితుడిగా ఆయన వెంట నడిచారు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ కేవీపీ పాత్ర ఉందని చెబుతారు. కాంగ్రెస్ పార్టీలోనూ ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు కేవీపీ. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అటు ప్రభుత్వం, ఇటు పాలనలో నెంబర్ టు స్థానం కేవీపీదే. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కేవీపీ.. వైఎస్సార్ మరణం తర్వాత తొలినాళ్లలో జగన్ కు మద్దతుగా నిలిచారు. అయితే అది కొద్ది రోజులే.
జగన్ స్థాపించినా కేవీపీ మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఇద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే ఒక విషయం మాత్రం అంగీకరించి తీరాలి. జగన్ తో పాటు ఆయన వైసీపీలోకి రాలేదు. విభేదాలున్నాయన్న ప్రచారాన్నీ ఖండించలేదు. అయితే పై మాత్రం చిన్న పాటి విమర్శ కూడా చేయలేదు. ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్ లో విపక్ష నేతగా ఉన్న సమయంలోనూ, అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్న ఈ నాలుగేళ్లలోనూ కేవీపీ జగన్ పై విమర్శ చేసిన దాఖలాలు లేవు. స్నేహితుడి కుమారుడిగా జగన్ ను ఆయన అభిమానిస్తూనే వచ్చారు. వైఎస్సార్ ఆత్మ బంధువుగా చిన్నప్పటి నుంచి జగన్ ను దగ్గరగా చూశారు కేవీపీ. అందుకే జగన్ వ్యవహార శైలీ, ఆయన నైజం గురించి కేవీపీకి తెలిసినంతగా మరొకరికి తెలియదంటారు. అలాంటి కేవీపీ ఇటీవల జగన్ కు వ్యతిరేకంగా ఓపెన్ అవుతున్నారు.
ఇటీవల కొంత కాలం కిందట జగన్ పాలన బాగాలేదని సుతిమెత్తగా చెప్పిన కేవీపీ.. తాజాగా జగన్ తో తన విభేదాల గురించి వివరంగా త్వరలో చెబుతానని అన్నారు. వాస్తవానికి జగన్ పట్ల తన అసంతృప్తి విషయంలో కేవీపీ గత ఏడాది డిసెంబర్ లోనే కొద్దిగా ఓపెన్ అయ్యారు. జగన్ విషయంలో కేవీపీ ఏం చెప్పినా దానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి కేవీపీ ఆత్మ బంధువు. వైఎస్ ఆత్మ కేవీపీ అంటారు. అంతగా వారి మధ్య సాన్నిహిత్యం ఉండేది. అటువంటి కేవీపీ జగన్ పాలన బాగాలేదని వ్యాఖ్యానించారు. అదీ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మూడున్నరేళ్ల తరువాత గత ఏడాది డిసెంబర్ లో తొలి సారిగా కేవీపీ.. పోలవరం, విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇలా ఏ విషయంలోనూ జగన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం సంగతి అటుంచి కనీసం విజ్ణప్తి కూడా చేయకపోవడాన్ని తప్పుపట్టారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధపడుతున్న సమయంలో దానిని ఆపేందుకు సీఎం జగన్ ఒక్క ప్రయత్నం కూడా చేయడం లేదని కేవీపీ విమర్శించారు.
ఎప్పుడో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ కార్యక్రమానికి హాజరైన కేవీపీ ఆ తరువాత ఎన్నడూ జగన్ ను కలిసింది లేదు. అలా అని జగన్ పాలనపై విమర్శించిందీ లేదు. కానీ దూరం మాత్రం మెయిన్ టైన్ చేశారు. ఒక్క కేవీపీ అనే కాదు... అధికారం చేపట్టిన తరువాత ఒక్కరొక్కరుగా వైఎస్ సన్నిహితులు, చివరికి కుటుంబ సభ్యులు కూడా జగన్ కు దూరం అవుతూనే వచ్చారు. అందుకు కేవీపీ మినహాయింపు కాదు. జగన్ కు దూరం అయిన వారంతా ఆఖరికి సొంత చెల్లెలు షర్మిల సహా అందరూ ఆయపై విమర్శలు గుప్పించారు. కానీ కేవీపీ మాత్రం ఇప్పటి వరకూ పన్నెత్తు మాట అనలేదు. కానీ మూడున్నరేళ్ల తరువాత గత డిసెంబర్ లో ఆయన పాలన పట్ల తన అసంతృప్తిని సున్నితంగా వ్యక్తం చేశారు. ఆయన ఆ మాత్రం విమర్శ చేయడమే అప్పట్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
అదలా ఉంటే తాజాగా ఆయన త్వరలో ఓ ప్రెస్ మీట్ పెడతానని ప్రకటించారు. అంతే కాదు తాను జగన్ కు ఎందుకు దూరంగా ఉన్నానన్న సంగతిని వెల్లడించడానికే ఆ ప్రెస్ మీట్ అని కూడా కేవీపీ చెప్పారు. గత ఏడాది డిసెంబర్ లో జగన్ పాలనా తీరును సున్నితంగా విమర్శించి, కేంద్రానికి తలొగ్గి ఏపీకి అన్యాయం చేయవద్దని సలహా ఇచ్చి ఊరుకున్న కేవీపీ ఇప్పుడు జగన్ గురించి చెప్పేందుకే ప్రత్యేకంగా మీడియా సమావేశం పెడతానని ప్రకటించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆయన వెల్లడించబోయే విషయాలన్నీ జగన్ కు నష్టం చేకూర్చేవిగానే ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మూడు నాలుగు నెలల కిందట జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి ఊరుకున్న కేవీపీ ఇప్పుడు ఒక జగన్ పాలనా వైఫల్యాలూ, ఆర్థిక అవకతవకలపై గళం విప్పేఅవకాశం ఉందనిఅంటున్నారు.