డేంజర్ బెల్స్.. తస్మాత్ జాగ్రత్త !
posted on Apr 2, 2023 @ 3:52PM
ఇది ఎండాకాల. ఎండలు మండే కాలం. మాములుగానే సమ్మర్ అనగానే వామ్మో... అని హడలి పోతుంటాము. అలాంటిది, ఈ సంవత్సరం, సూర్య ప్రతాపం మరింత భయంకరంగా ఉంటుందని, ఎకంగా మూడు నెలల పాటు ఎండలు మండిపోతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ముందుగానే హెచ్చరించింది. దక్షిణ భారతం, ద్వీపకల్ప ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా ఏప్రిల్ నుంచి జూన్ మధ్య అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నట్టు ఐఎండీ ప్రకటించింది. తూర్పు, మధ్య, వాయువ్య భారత్‌లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ప్రధానంగా బిహార్, ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి వేడిగాలులు వీస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్(డీజీ) మృత్యుంజయ మహాపాత్ర పేర్కొన్నారు.
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల వర్షాలు కురిసినా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. రాత్రి సమయాల్లో వాతావరణం కాస్త చల్లగా ఉంటుండగా మధ్యాహ్న సమయాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ప్రకటన పిడుగు లాంటి వార్తే అని చెప్పొచ్చు. మధ్య, తూర్పు, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వేడి గాలులు వీస్తాయని అంచనా వేసింది.
అదలా ఉంటే,మరో వంక దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రెండు వారాలుగా రోజువారీ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,823 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. ముందు రోజు (2,997 కేసులు) తో పోల్చితే ఇవి 27 శాతం అధికం. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకూ 1,33,153 నమూనాలను పరీక్షించగా..3,823 మందికి వైరస్ నిర్దారణ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.అలాగే, మరో 1,784 మంది మహమ్మారి నుంచి కోలుకోగా... ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య4,41,73,335గా ఉంది. రికవరీల రేటు 98.72 శాతం కాగా.. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 18,369కి చేరింది.
అలాగే, రోజువారీ పాజిటివిటీ రేటు దాదాపు 3 శాతానికి చేరువ కాగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 2.24 శాతంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఏడు నెలల తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి. మొత్తం 416 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. ముందు రోజు 195 కేసులతో పోల్చితే ఇది 40 శాతం అధికం.
మరోవంక గతంతో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో దేశ విద్యుత్ వినియోగం 10% పెరిగింది. రాబోయే వారాల్లో రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను వరుసగా రెండో ఏడాది పూర్తిస్థాయిలో నడపాలని కేంద్రం ఆదేశించింది. ఇది భారత్‌లో ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను పెంచుతుందని విశ్లేషకులు అంటున్నారు.ఇలా ఒకదాని వెంట ఒకటిగా గొలుసు కట్టు కష్టాలు క్యూ కట్టాయి.. డేంజర్ బెల్స్ ..మోగుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త.