ఏపీలో వైసీపీ బీ టీమ్ బీజేపీ!
posted on Apr 1, 2023 7:20AM
అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలి.. కానీ, ఏపీ బీజేపీ నాయకులు నిజంగా నిజమే చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకే, ఏపీలో బీజేపీ ఎదుగు బొదుగు లేకుండా మిగిలి పోయింది. అందుకే బీజేపీ అంటే వైసీపే బీ టీమ్ అనే ముద్ర పడిపోయింది. ప్రత్యేక హోదా మొదలు ప్రతి విషయంలోనూ రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ ఇప్పుడు రాజకీయంగానూ రాష్ట్రంలో ప్రజాబీష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల పలు చేసిన వైసీపీతో, చాటుమాటుగా చెట్టాపట్టాలు వేసుకుని నడిచేందుకు సిద్దమైపోయిందని సామాన్య ప్రజలు మొదలు మేథావుల వరకు అందరికీ స్పష్టమై పోయింది.
వైసీసీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థతి అగమ్య గోచరంగా మారింది. అప్పులు తప్ప ఆస్తులు లేని పరిస్థితికి చేరిపోయింది. ఆ విషయం కేంద్రానికీ తెలుసు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఆ విషయం చెప్పారు. అయినా, చర్యలు లేవు. అంతే కాదు ఎవరో అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రిని దత్త పుత్రుడిగా కాదు ఏకంగా కన్నకొడుకుతో సమానంగా చూసుకుంటోంది. అందుకే బీజేపీ అంటే నైసీపీ బీ-టీమ్ అనే అభిప్రాయం బలపడిపోయింది.
మరోవంక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రం చేతిలో కీలుబొమ్మ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, సామాన్య ప్రజలకు కూడా అర్థమై పోయింది. అందుకే గడచిన నాలుగు సంవత్సరాలో ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాను కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఏ ఒక్కరినీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పల్లెత్తు మాట అనలేదు. అలాగని, పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్య నేత కేటీఆర్ స్థాయిలో రోజూ కేంద్ర ప్రభుత్వాన్ని,అయిన దానికి కానీ దానికీ విమర్శించాలని కాదు. కానీ విభజన హామీలు, రాష్ట్రానికి రావలసిన నిధుల విషయంలో అయినా కేంద్రాన్ని ప్రశ్నించాలి కదా? కనీసం అడగాలి కదా? అని ప్రజలు జగన్ సర్కార్ ను నిలదీస్తున్నారు. అందుకే, ప్రజలు, వైసీపీ, బీజేపీ సంబంధాలను అనుమానిస్తున్నారు. అనుమానించడం..కాదు, నువ్వొకందుకు పోస్తే నేనోకందుకు తాగుతున్నాను అన్నట్ల్గు ఆ రెండు పార్టీల మధ్యా చీకటి ఒప్పందం కుదిరిందని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తరచూ ఢిల్లీ వెళ్లి, ఆ ఇద్దరితో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును సాధ్యమైన మేరకు చీల్చి, పరోక్షంగా వైసీపీని గెలిపించేందుకు, ఢిల్లీ స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.
అయితే రాష్ట్ర బీజేపే నాయకులు మాత్ర్రం అబ్బే అదేం లేదు. వైసీపీతో బీజేపీ ఎలాంటి సంబంధాలు లేవని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. పక్షం రోజుల్లో ముఖ్యమంత్రి రెండు మార్లు ఢిల్లీ ఎందుకు వెళ్ళారో, ఎవరికీ తెలియదని అనుకున్నా, అందరికీ తెలిసి పోయింది. ఇంతవకు గుప్పెట్లో ఉన్న రహస్యం, ఇప్పడు బట్టబయలై పోయింది. అయినా బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మాత్రమే జగన్‌కు ఢిల్లీలో అపాయింట్మెంట్‌లు లభిస్తున్నాయని నమ్మించే ప్రయత్నం చేశారు. జగన్‌తో కానీ, ఆయన పార్టీతో కానీ బీజేపీకి స్నేహ సంబంధాలు లేవన్నారు. బీజేపీ, వైఎస్సార్ పార్టీల మధ్య సంబంధాలు కేవలం కేంద్ర - రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలు మాత్రమే అని చెప్పారు.అందుకోసం ఆయన ఏపీ పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందని అన్నారు. ఒకప్పుడు రాష్ట్ర్రానికి దేశంలోనే అన్నపూర్ణగా మంచి పేరుందని, కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయన్నారు. ఏపీలో ఆర్ధిక ఎమెర్జెన్సీ వచ్చే అవకాశం ఉందన్నారు.
ఆది నిజమే అయినా రాష్ట్రంలో ఇప్పడు కాదు, ఎప్పటి నుంచో ఆర్థిక ఎమర్జెన్సీ విధవలసిన పరిస్థితులు ఉన్నాయని, అయినా కేంద్ర ప్రభుత్వం, అర్హతకు మించి అప్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతులు ఇచ్చి రాష్ట్రాన్ని ఈ స్థితికి దిగజార్చడంలో కేంద్రం పాత్ర కూడా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.నిజానికి, ఇంతకాలం ప్రత్యర్ధి పార్టీలుగా నటిస్తూ వచ్చిన వైసీపీ, బీజేపీ అసలు బంధం ఇప్పడు బయట పడిందని అంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి బీజేపీ మద్దతు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుంది. అందుకు ప్రతిఫలంగా లోక సభ ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ మద్దతిస్తుంది. ఇదే స్టొరీ . అన్నీ అనుకున్నట్లు జరిగితే, లోక్ సభ ఎన్నికల నాటికి వైసేపీ, బీజేపీ ప్రత్యక్ష పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.అందుకే, ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఆలోచన తెరమీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. అక్టోబర్ నవంబర్ నెలలలో తెలంగాణ శాసన సభ ఎన్నికలతో పాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే విధంగా ఢిల్లీలో స్కెచ్ సిద్దమైందని అంటున్నారు .