గజ్వేల్ లో బీఆర్ఎస్ కు ఎదురీతేనా?
posted on Apr 1, 2023 @ 3:31PM
మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుందన్న సామెత బీఆర్ఎస్ కు సరిగ్గా అతికినట్లుగా సరిపోతుంది. రాష్ట్రంలో ఎనిమిదేళ్లకు పైగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇందుకు కారణం అధినేత కేసీఆర్ రాష్ట్రంలో ప్రత్యర్థులే ఉండకూడదన్నట్లుగా ఆపరేషన్ ఆకర్ష్ పేరిటి ఇతర పార్టీల నుంచి గెలిచిన ప్రజాప్రతినిథులు సహా, కనిపించిన వారిని కనిపించినట్లుగా పార్టీలో చేర్చుకోవడమే. దీంతో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నిండిపోయింది. ఆ కారణంగానే నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు చొప్పున ప్రతి పదవికీ ఆశావహులు తయారయ్యారు.
ఈ పరిస్థితే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధినేతకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. చాలా నియోజకవర్గాలలో ఇతర పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ గూటికి చేరిన సిట్టింగ్ కు ప్రత్యర్థిగా బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి పరాజయం పాలైన అభ్యర్థే ఉన్న పరిస్థితి ఉంది. అందుకే సిట్టింగులకే టికెట్లు అని ప్రకటించిన కేసీఆర్ పదే పదే ఆ ప్రకటనకు సవరణలు చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆ నియోజకవర్గం.. ఈ నియోజకవర్గం అని ఎందుకు స్వయంగా కేసీఆర్ స్వంత నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ కీలక నేతలే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్ తమకు గౌరవం ఇవ్వడం లేదన్న భావనతో రగలిపోతున్నారు నియోజకవర్గ నేతలకు సైతం కేసీఆర్ అప్పాయింట్ మెంట్ గగనం అయిన పరిస్థితి ఉందని అంటున్నారు.
పిలిచినప్పుడు మాత్రమే ప్రగతి భవన్ కు పోవాలి. వాళ్లు చెప్పిందే వినాలి. అభిప్రాయం, సమస్యలు చెప్పుకునే అవకాశమే ఉండదు. ఈ కారణంగానే గజ్వే ల్ లో బీఆర్ఎస్ బలహీనపడింది. వాస్తవానికి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కనుక గజ్వల్ లోనే బీఆర్ఎస్ బలంగా ఉండాలి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇక్కడ వచ్చే ఎన్నికలలో కేసీఆర్ రంగంలోకి దిగితే ఆయన కూడా గడ్డు పరిస్థితి ఎదుర్కొనక తప్పని పరిస్థితి ఉందని ఆ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలే అంటున్నారు. అందుకు కారణాలను కూడా వారే వివరిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో విపక్షం అనేదే ఉండరాదన్న ఉద్దేశంతో కేసీఆర్ బెదిరించే, బుజ్జగించే బతిమాలో బామాలో ఇతర పార్టీలలోని నాయకులందరినీ బీఆర్ఎస్ లోకి లాగేశారు. వారి స్థాయి, బలం ఇలా బేరీజు వేసుకుని కొందరిని నామినేటెడ్ పదవులలో నియమిస్తే.. మరి కొందరికి ఇతరత్రా లబ్ధి చేకూర్చారు. మొత్తానికి గజ్వేల్ లో గులాబీ జెండా తప్ప మరోజెండా మోసే నాయకుడనే వారు లేకుండా చేయడంలో కేసీఆర్ కృతకృత్యులయ్యారు.
ఇప్పుడు ఆదే ఆయనకు పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు. గతంలో కేసీఆర్ మాయాజాలానికి లొంగిపోయి బీఆర్ఎస్ (అప్పుడు తెరాస) పంచన చేరిన ఇతర పార్టీల నేతలూ, మొదటి నుంచీ పార్టీలోనే ఉన్న వారూ కూడా తమకు తగిన గౌరవం, ప్రాధాన్యతా దక్కడం లేదన్న అసంతృప్తిలో ఉన్నారు. గజ్వేల్ రాష్ట్రంలోని మిగిలిన అన్ని నియోజకవర్గాల కంటే స్పెషల్. ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడంతో పథకాలన్నీ బ్రహ్మాండంగా అమలు అవుతాయి. అభివృద్ధికీ ఢోకా లేని పరిస్థితి. అయితే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే స్వయంగా ముఖ్యమంత్రి కావడంతో ఇక్కడ ఆయన ప్రతినిథులుగా పెత్తనం చెలాయించేవారి సంఖ్యా, చెలాయిద్దామనుకునే వారి సంఖ్యా లేక్కకు మించే ఉంటుంది. ఈ పరిస్థితి ఏర్పడడానికి కారణం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ గజ్వేల్ నాయకులను పూర్తిగా పక్కన పెట్టేశారు.
గజ్వేల్ లో చిన్న పని జరగాలన్నా, నియోజకవర్గానికి సంబంధించి ఏ పనిగురించి మాట్లాడాలన్నా ఎవరి దగ్గరకు వెళ్లాలన్నది ఎవరికీ తెలియని పరిస్థితి. సీఎం సెక్రటేరియెట్ ను ఎలా మరిచిపోయారో.. అలాగే గజ్వేల్ ను కూడా అలాగే మరిచిపోయారని నియోజకవర్గ ప్రజలే సెటైర్లు వేస్తున్న పరిస్థితి. ఆయన హైదరాబాద్ లో కంటే ఎక్కువగా నియోజకవర్గ పరిథిలోని ఫామ్ హౌస్ లోనే ఎక్కువ సమయం ఉంటారు. అయినా నియోజకవర్గ ప్రజలకు కానీ, నాయకులకు కానీ ఆయన దర్శన భాగ్యం ఉండదు. సొంత పార్టీ నేతలకు అదీ గజ్వేల్ నియోజకవర్గ నేతలకు ఆయన అప్పాయింట్ మెంట్ దొరకడం దాదాపు దుర్లభమే అని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.
గజ్వేల్‌లో సుమారు రూ.3 కోట్లతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు నిర్మించారు. అయినా ఇప్పటి వరకూ కేసీఆర్ ఆ క్యాంప్ ఆఫీసుకు వచ్చిన దాఖలాలు లేవు. ఎప్పుడో . 2018 అసెంబ్లీ ఎన్నికలకు ఒకటి రెండు సార్లు కేసీఆర్ గజ్వేల్ క్యాంపు ఆఫీసుకు వచ్చి ఉంటారు. ఆ తరువాత అటువైపు కన్నెత్తి చూడలేదు. ఈ కారణంగానే గజ్వేల్ లో పార్టీ నాయకులు పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి తమ నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న విషయాన్ని జనం మరిచిపోయే పరిస్థితి ఉంది.