కాంగ్రెస్ కిరణాలతో కమలం వికసిస్తుందా?
posted on Apr 7, 2023 @ 3:18PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, అరుణ్ సింగ్, బీజేపీ నేత లక్ష్మణ్ ఆధ్వర్యంలో శుక్రవారం (ఏప్రిల్ 7న) బీజేపీలో చేరారు. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2010 నవంబర్ 25 నుంచి 2014 మార్చి 1 వరకు సీఎంగా ఆయన పనిచేశారు. అంతకుముందు అసెంబ్లీ స్పీకర్‌గా, ప్రభుత్వ చీఫ్ విప్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన అనంతరం జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో అదే పార్టీ తరఫున ఆయన బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత కొద్ది కాలం రాజకీయాలకు దూరంగా ఆయన.. తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన చివరకు బీజేపీలో చేరారు.
నిజానికి గత కొంతకాలంగా కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారనే వార్త తరచూ తెర మీదకు వస్తూనే వుంది. అలాగే ఆయన పీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారనే కబుర్లు కూడా మీడియాలో షికార్లు చేశాయి. అయితే ఆ ఊహాగానాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నల్లారి కషాయి కండువా కప్పు కున్నారు. కాగా నల్లారి చేరికతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మరింత మెరుగుపడుతుందని ప్రహ్లాద్ జోషి ఆశాభావం వ్యక్తపరిచారు.
అలాగే కిరణ్ కుమార రెడ్డి 1952నుంచి తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉందని అసలు తాను కాంగ్రెస్ ను వీడతానని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ తప్పుడు నిర్ణయాల వల్ల ఒక్కో రాష్ట్రంలో అధికారంలో కోల్పోయిందన్నారు. దేశ నిర్మాణం, పేదరిక నిర్మూలనకు బీజేపీ చేస్తున్న కృషి నచ్చడంతోనే ఆ పార్టీలో చేరినట్లు కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బీజేపీలో చేరిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ కార్యకర్తల అమోఘమైన కృషి వల్లే బీజేపీ బలీయమైన శక్తిగా ఎదిగిందని చెప్పారు.
ప్రస్తుతం కాంగ్రెస్‌లో అలాంటి పరిస్థితి లేదన్నారు. అక్కడ పార్టీ పటిష్ఠత, కార్యాచరణపై నాయకులతో కనీస చర్చ కూడా ఉండదని కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌తో తమ కుటుంబానికి ఉన్న ఆరు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నట్లు చెప్పారు.
అయితే కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషీ ఆశించిన విధంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాకతో ఉభయ తెలుగు రాష్ట్రాలలో బీజేపీ నిజంగా బలపడుతుందా? కమలం వికశిస్తుందా అంటే లేదు. ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరొచ్చినా, ఏమి చేసినా బీజేపీ పుంజుకునే అవకాశం లేదు. తెలంగాణలో కిరణ్ రెడ్డి ఎంట్రీ వలన ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.