బాబు సమక్షంలో తెలుగుదేశం గూటికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి?!
posted on Apr 7, 2023 @ 9:43AM
గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒకటి. జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు పది స్థానాల్లోనూ వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. దీంతో నెల్లూరు పెద్దారెడ్లంతా జగన్ పార్టీ వైపే ఉన్నారని చెప్పకనే చెప్పినట్లు అయింది. అయితే ఇటీవల చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో.. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలపై జగన్ పార్టీ సస్పెన్ష్ వేటు వేసింది. దీంతో ఆ జిల్లా రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది.
అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు.. జోనల్ సమావేశంలో భాగంగా.. శుక్రవారం ( ఏప్రిల్ 7) నెల్లూరు నగరానికి విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ నేతల దృష్టి ఏమో కానీ... అధికార వైసీపీ అగ్రనేతల ఫోకస్ అంతా నెల్లూరుమీదే కేంద్రీకృతమై ఉంది.
ఈ జోనల్ సమావేశానికి 5 లోక్‌సభ నియోజకవర్గాల్లోని ఎంపీలు, మాజీ ఎంపీలు, అలాగే 34 నుంచి 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ ముఖ్యనేతలు హాజరువుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వీరందరికీ చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికీ, ప్రస్తుత జగన్ ప్రభుత్వంలో జరిగిన అభివద్దికి బేరీజు వేయడం, అదే విధంగా పలు అంశాలను ఈ సందర్బంగా ప్రజలకు సోదాహణంగా వివరించే విధంగా పార్టీ నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
మరోవైపు ఇప్పటికే ఈ జోనల్ సమావేశాలు... ఏప్రిల్ 5న ఉత్తరాంద్రలోని విశాఖపట్నంలో.. ఏప్రిల్ 6న రాయలసీమలోని కడపలో చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన విషయం విదితమే. అదీకాక ఇటీవల జరిగిన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో... అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిపి నలుగురు టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణుల్లో నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం కోసం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో జోనల్ స్థాయిలో చంద్రబాబు అధ్యక్షతన సమావేశాలు ఏర్పాటు చేశారు.