నిజంగానే పోయిందా!
posted on Apr 10, 2023 @ 11:25AM
తన ఫోన్ పోయిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఈనెల 5న సంజయ్ అరెస్టు సమయంలో పోలీసులకు, భాజపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో తన ఫోన్ పడిపోయినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మేరకు మెయిల్ ద్వారా కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు పంపారు. హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఎంపీ బండి సంజయ్ ను ఫోన్ గురించి అడిగితే లేదన్నారు. ఎక్కడుందంటే తెలియదంటున్నారు. ఫోన్ ఇస్తే కీలక సమాచారం బయటకు వస్తుందని వారికి తెలుసు. అందుకే ఫోన్ ఇవ్వట్లేదు. అయినా.. బండి సంజయ్ ఫోన్ కాల్ డేటా సేకరిస్తామని పోలీసులు అంటున్నారు..
పరీక్ష పత్రం షేర్ అయిన అందరికీ ప్రశాంత్ ఫోన్ చేయలేదు. పిల్లల సాయంతో ప్రశ్నపత్రం బయటకు తెచ్చుకున్నారు. కొన్ని ఫోన్లలో మెసేజ్ లు డిలీట్ చేశారు.. వాటిని రిట్రైవ్ చేయాలి. కాల్ డేటా సేకరించాల్సి ఉంది. ఎలాంటి కుట్ర చేయకపోతే బండి సంజయ్ ఫోన్ ఇవ్వొచ్చు కదా? అని ఇటీవల వరంగల్ సీపీ రంగనాథ్ మీడియా సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే.
ఈనేపథ్యంలో తన ఫోన్ పోయిందంటూ బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఫోన్ పోయిందని బండి సంజయ్ అనడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. అధికార పార్టీని అప్రదిష్ట పాల్జేయటానికి .. బీజేపీ మరింతగా దిగజారిపోయిందన్న విమర్శలు వినవస్తున్నాయి.