అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం!
posted on Apr 11, 2023 @ 1:38PM
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలేనన్నాడు మావో. అయితే సంబంధాలు కాదు అనుబంధాలు, ఆత్మీయతలూ కూడా ఆర్థిక వ్యవహారాలుగానే మారిపోతున్నాయి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, భార్యా భర్తలు ఇలా అనుబంధాలన్నీఆర్థిక బంధనాలలో చిక్కుకుని చిన్నాభిన్నమైపోతున్నాయి. చిన్న చిన్న మొత్తాల కోసమే ఒకరినొకరు తెగనరుక్కునే పరిస్థితికి తెగబడుతున్నాయి.
తాజాగా ఖర్చుకు సొమ్ములు ఇవ్వలేదన్న కోపంతో కన్న తండ్రినే హతమార్చిన కొడుకు ఉదంతం ఒకటి వెలుగులోనికి వచ్చింది. హైదరాబాద్ రామంతాపూర్ లో ఒకడు కన్న తండ్రినే డబ్బుల కోసం హత్య చేశాడు. రామంతాపూర్ కు చెందిన పాండు సాగర్(54) కు ముగ్గురు కొడుకులు ఉన్నారు. నాలుగేళ్ల కిందట పాండు సాగర్ మరో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచీ మొదటి భార్య, పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పాండు సాగర్ కుమారుడు పవన్ డబ్బుల కోసం తండ్రిని నిలదీశాడు. ఈ సందర్భంగా మాటామాటా పెరగడంతో పవన్ తండ్రిని దారుణంగా హత్య చేశారు. ఇక ఇలాంటిదే మరో సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. హమీర్ పూర్ జిల్లాలో ఆస్తి కోసం తలెత్తిన వివాదంలో ఒక కొడుకు తండ్రిని నరికి చంపాడు. పట్టపగలు అందరూ చూస్తుండగా జరిగిన ఈ దారుణం కలకలం రేపింది.
ఇక మరో ఘటనలో బీమా డబ్బుల కోసం తండ్రిని హత్య చేసి దానిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశాడు మరో ప్రబుద్ధుడు. ఈ ఘటన రెండు వారాల కిందట తెలంగాణలోని కొడంగల్ మండలంలో జరిగింది. బిక్యానాయక్ తండాకు చెందిన రాథోడ్ శ్రీనివాస్ నాయక్ తండ్రి రాథోడ్ ధన్‌సింగ్ నాయక్ పేరుమీద ఓ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలో రూ.30 లక్షల వరకు బీమా పాలసీ ఉన్నది.
ఎలాగైనా ఈ డబ్బులను తీసుకోవాలన్న దురుద్దేశంతో ఉడిమేశ్వరం గ్రామ శివారు లో తండ్రి తలపై బండరాయితో బాది ఘోరంగా హత్యచేశాడు. ఆ తరువాత ఈ ఘటనను బైక్ ఆక్సిడెంట్‌గా చిత్రీకరించి ఇన్సూరెన్స్ కంపెనీని మోసం చేసేందుకు ప్రయత్నించాడు.