ఒక్క చాన్స్.. ఎరక్కపోయి ఇచ్చాము!
posted on Apr 11, 2023 @ 2:08PM
సహజంగా ఒక పార్టీ పేరున గెలిచిన ప్రజాప్రతినిధి ఎవరైనా ... లోపల ఎంత అశాంతి ఉన్నా, అంత త్వరగా బయట పడరు. అందులోనూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు అయితే, అసలే పెదవి విప్పరు. కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసీపీకి చెందిన సర్పంచులు పెదవి విప్పడం కాదు.. నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పేరు పెట్టి మరీ ... తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తున్నారు. చివరకు, ముఖ్యమంత్రిని ఉద్దేశించి ‘మీ పార్టీ తరఫున గెలిచామని చెప్పుకొనేందుకు సిగ్గుపడుతున్నాం. మీకు ఓటు వేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం. వైఎస్సార్ అంటే అభిమానం. ఆయన బిడ్డగా మిమ్మల్ని నమ్మాం. కానీ మీరు నట్టేట ముంచారు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారు. సర్పంచుల ఆత్మహత్యలు జరిగితే దానికి సీఎం జగనే కారణం” అంటూ ఆగ్రహాన్ని, ఆవేదననూ వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడలో సోమవారం (ఏప్రిల్ 10) జరిగిన ఉమ్మడి కృష్ణా జిల్లా సర్పంచుల సంఘం సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు .. వైసీపీ ప్రభుత్వం తమను నమ్మించి నట్టేట ముంచిందనే అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. అందులో భాగంగానే, ప్రకాశం జిల్లా చినగానిపల్లె సర్పంచి (వైకాపా), సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్, అందరి ముందూ తన చెప్పుతో చెంపల మీద కొట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు.
అలాగే, రాష్ట్రంలో 80 శాతం మంది సర్పంచులు వైకాపాకు చెందిన వారే ఉన్నారనీ, అందరినీ ఇంటింటికి వెళ్లి జగనన్నే మా భవిష్యత్తు అని చెప్పాలని ఆదేశాలు పంపుతున్నారని, అలా చెప్పాలంటే సిగ్గుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత డబ్బులు ఖర్చు చేసి సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తే బిల్లులు విడుదల చేయలేదని, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డామని రమేష్ వాపోయారు. అలాగే, మరో అధికార పార్టీ నేత, సర్పంచి కొండబాబు మాట్లాడుతూ పాము పిల్లలను పామే తిన్నట్లు సీఎం జగన్ పరిస్థితి తయారైందని మండిపడ్డారు. సర్పుంచులు సమస్యలు చెబితే కేసులు పెడుతున్నారు. ఏదైనా అడిగితే ఎదురు దాడి చేస్తున్నారు. సమాంతర వ్యవస్థలను పెట్టి మా విధులు, నిధులు లాక్కొన్నారు. సర్పంచిగా గెలిచి రెండేళ్లు అయింది. ఒక్క బిల్లు రాలేదు అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా వైకాపా నాయకుడు, సంఘం గౌరవ సలహాదారుడు ఆచార్యులు మాట్లాడుతూ జగనన్నే మా భవిష్యత్తు అని స్టిక్కర్లు వేయమంటున్నారు. కానీ పంచాయతీల భవిష్యత్తు ఏమిటి జగనన్నా అని మనం స్టిక్కర్లు వేయాలి’ అని పిలుపు నిచ్చారు.
గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం పంచాయతీలకు ఇచ్చిన నిధులు రూ.2020 కోట్లు ఏమాయ్యయని సర్పంచుల సంఘం వ్యవస్థాపకుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. సచివాలయాల కార్యదర్శులు, గ్రామ వాలంటీర్లతో సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసి పంచాయతీలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. నిజానికి, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఒక్కొక్క వ్యవస్థను నిర్వీర్యంచేస్తూ వస్తోందనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఎక్కడెక్కడి నిధులూ పట్టుకుపోయి, మీట నొక్కుడు ఖాతాలో.. కాదంటే ... సొంత ఖజానాలో వేసుకోవడమే కానీ, స్థానిక సంస్థల అవసరాలను తీర్చింది లేదు. అందుకే వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజాగ్రహం పతాక స్థాయికి చేరుకుంది. ఇప్పడు ఆ ఆగ్రహం అసంతృప్తి సర్పంచులను తాకింది... చెప్పుతో కొట్టుకునే స్థితికి చేర్చింది. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు చెప్పుతో కొట్టుకోవలసిన పరిస్థితి వచ్చిందని సర్పంచులే కాదు సామాన్యులు కూడా వపోతున్నారని, జనవాక్యంగా వినిపిస్తోంది.