కొత్త పొత్తుల మొలకలు నిజమేనా?
posted on Apr 11, 2023 @ 3:10PM
రాజకీయాల్లో అసాధ్యమన్న పదానికి స్థానం లేదు. పాలటిక్స్ లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులూ ఉండరని అంటారు. అంటే నేడు తిట్టుకున్ననేతలే.. రేపు చేతులు కలుపుకుంటారు. నేడు చెట్టాపట్టాలు వేసుకు తిరిగిన పార్టీలు రేపు విమర్శల కత్తులు దూసుకుంటాయి. రాజకీయాలలో ఇలాంటివన్నీ సహజమే అని ఎంత సరిపెట్టుకుందామనుకున్నా.. అలా సరిపెట్టుకోవడానికి కూడా నమ్మశక్యం కానీ కొన్ని వార్తలు జనాలనే కాదు.. పరిశీలకులను సైతం అయోమయానికీ, సంభ్రమాశ్చర్యాలకూ గురౌతుంటాం.
అసలా వార్త నిజమా కాదా అని నిర్ధారణ అయ్యేదాకా వినడానికే ఎబ్బెట్టుగా అనిపిస్తుంటుంది. అలాంటి వార్త ఒకటి ఇప్పుడు రాజకీయవర్గాలలో సర్క్యులేట్ అవుతోంది. ఇందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా.. సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్న ఆ వార్త ఏమిటంటే... ఏపీలో ఎలాగైనా కాలు పెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న కేసీఆర్.. ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే కాదు.. స్వరాష్ట్రమైన తెలంగాణలో కూడా బలమైన పొత్తు లేదా అండ లేకపోతే ముందుకు సాగడం కష్టం అన్న నిర్ధారణకు వచ్చేశారు. ఈ విషయాన్ని ఎవరో ఆయన ప్రత్యర్థులు కాదు.. స్వయంగా బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. అందుకే ఆయన ఉభయ తారకంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ బలమైన పార్టీ నిర్మాణం, క్యాడర్ ఉన్న తెలుగుదేశంతో జట్టు కట్టడానికి విశ్వయత్నాలు చేస్తున్నారు.
ఇందు కోసం ఆయన ఏ అవకాశాన్నీ వదల దలుచుకోలేదు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ విధానాలనూ, వ్యవహరాశైలినీ, పాలనా తీరును తప్పుపడుతున్నారు. విమర్శలు చేస్తున్నారు. గత నాలుగేళ్లలో ఏపీ ప్రగతిని తెలంగాణ ప్రగతితో పోల్చి చూపుతున్నారు. తెలంగాణ మంత్రి, కేసీఆర్ కుమారుడు అయిన కేటీఆర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి మరీ ప్రపంచంలోనే అమరావతి గొప్పనగరం అని కీర్తించడమే కాకుండా గత నాలుగేళ్లలో అక్కడి ప్రభుత్వ నిర్వాకం వల్ల అమరావతి కుంటుపడిందని విమర్శించారు. సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు కేసీఆర్ తెలుగుదేశంతో చెలిమికి తహతహలాడుతున్నారు. ఇందు కోసం ఆయన అన్ని దారులనూ వెతుకుతున్నారు. ఒక వైపు చంద్రబాబు బీజేపీ, జనసేనలతో జట్టుకట్టేందుకు ప్రయత్రాలు చేస్తుంటే.. కేసీఆర్ మాత్రం తెలుగుదేశం పార్టీతో స్నేహం కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందు కోసం ఆయన చంద్రబాబు వద్దకు జేడీఎస్ నాయకుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని రాయబారానికి పంపే యత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో విస్తరించాలంటే చంద్రబాబు లాంటి అనుభవజ్ణుడి అండ అవసరమన్నది కేసీఆర్ భావనగా తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను సమన్వయం చేయడంలో పార్టీల మధ్య పొత్తులు కుదర్చడంలో చంద్రబాబు అనుభవం బీఆర్ఎస్ విస్తరణకు దోహదపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. ఇక అందుకు లిట్మస్ టెస్టుగా కర్నాటక ఎన్నికలలో చంద్రబాబుతో సమన్వయం చేసుకుని జేడీఎస్ నేత కుమారస్వామి ని ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా బీజేపీయేతర పార్టీల ఐక్యతా యత్నాలను సరికొత్తగా ప్రారంభించాలన్న యోచనతో కేసీఆర్ వ్యూహాత్మకంగా చంద్రబాబుతో చెలిమికి చేయి చాస్తున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.
ఇప్పటి వరకూ కేసీఆర్ రాయబారాలకు తెలుగుదేశం నుంచి కానీ, చంద్రబాబు నుంచి కానీ ఎటువంటి స్పందనా రాలేదంటున్నారు. అయితే పరిశీలకులు మాత్రం ఏపీలో బీఆర్ఎస్ పొత్తు వల్ల ఒకింత ప్రయోజనం ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. బీఆర్ఎస్ ఏపీలో ఒంటరి పోరుకు దిగితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదో మేరకు ఆ పార్టీకి మళ్లే అవకాశం ఉందని, అలా కాకుండా బీఆర్ఎస్ కూడా తెలుగుదేశం జట్టులో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశాలే ఉండవని విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి చంద్రబాబు లేకుండా గతరెండేళ్లుగా బీజేపీయేతర కూటమి యత్నాలు జరుగుతున్నాయి కానీ అవి ఇసుమంతైనా సఫలం కావడం లేదు. కేసీఆర్, మమతా బెనర్జీ, స్టాలిన్, శరద్ పవార్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్ ఇలా ఎవరికి వారుగా చేసిన ఐక్యతా యత్నాలు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు చందంగానే సాగాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును కలుపుకుంటే కొత్త పొత్తుల మొలకలకు అవకాశం ఉంటుందని పరిశీలకులు సైతం అంటున్నారు.