బీఆర్ఎస్ లో టీఆర్ఎస్ గుబులు?
posted on Apr 11, 2023 @ 5:31PM
ఔను నిజమే.. టీఆర్ఎస్ గా మొదలై రాష్ట్ర రాజకీయాలను శాసించిన పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ అయిపోయింది. పేరుకే జాతీయ పార్టీ అయినా.. తెలంగాణలో తప్ప మరే రాష్ట్రంలోనూ ఆ పార్టీకి గుర్తింపు లేదని కేంద్ర ఎన్నికల సంఘం కుండ బద్దలు కొట్టేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్ రాష్ట్ర సమితిగా మారిపోయిన తరువాత ఇంత కాలం ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచిన తెలంగాణ సెంటిమెంట్ ఆ పార్టీకి దూరమైంది.
ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీ కాదు. అదో జాతీయ పార్టీ. రాష్ట్రంతో ఆ పార్టీ బీజేపీ, కాంగ్రెస్ లలాగే ఒక రాజకీయ పార్టీ. అంతే అంతకు మించిన అనుబంధమేదీ ఆ పార్టీకి రాష్ట్రంలో లేకుండా పోయింది. బీఆర్ఎస్ గా మారనంత కాలం.. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండటం వల్ల ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకున్నా తెలంగాణ సాధించిన పార్టీగా తెలంగాణ ప్రజలలో ఆ పార్టీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందుకే తెలంగాణ సాధించిన పార్టీగా టీఆర్ఎస్( ఇప్పుడు బీఆర్ఎస్) తెలంగాణ జనం గుండెలకు హత్తుకున్నారు. అయితే ఎప్పుడైతే పార్టీలో తెలంగాణను తీసేశారో.. జనం కూడా ఒక ఆ పార్టీకి తమ హృదయాలలో ఉన్న ప్రత్యేకత ను తొలగించుకున్నారు. అలాంటి వేళ ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా టీఆర్ఎస్ పేరుతో మారో పార్టీ ఆవిర్భవించబోతున్నది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద తెలంగాణ రాజ్య సమితి అనే పార్టీ రిజిస్టర్ అయింది. దానికి తోడు ఇటీవలే తెలంగాణ రైతు సమితి అనే పేరుతో రిజిస్ట్రేషన్ కోసం మరో దరఖాస్తు దాఖలైంది. రాష్ట్రంలో రెండుసార్లు అధికారాన్ని సాధించడానికి బీఆర్ఎస్ పార్టీకి తోడ్పడిన ‘తెలంగాణ’ తొలగించడంతోనే తెలంగాణతో బీఆర్ఎస్‌కు బంధం తెగిపోయిందని పరిశీలకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవలే పార్టీ నుంచి సస్పెండ్ అయిన బీఆర్ఎస్ నేతలు పొంగులేటి, జూపల్లిలు తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ కు వ్యతిరేకంగా బలంగా తీసుకువచ్చేందుకు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ను ఢీ కొనేందుకు వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణ రాజ్య సమితి లేదా తెలంగాణ రైతు సమితి లలో దేనినో ఒక దాన్ని ఎంచుకుని బీఆర్ఎస్ ను దెబ్బకొట్టేలా ఎన్నికల బరిలోకి దిగేందుకు బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పేరుతోనే గట్టి పోటీ ఇవ్వాలని పొంగులేటి భావిస్తున్నట్టు సమాచారం.
ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ సెగ్మెంట్లలో గణనీయమైన పట్టు ఉన్న పొంగులేటి.. తనతో వచ్చిన వారిని కలుపుకుని ఇతర జిల్లాల్లోనూ బీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ దూరం పెట్టిందనే అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని వారిని డ్రైవ్ చేసేలా ఇప్పటికే సంప్రదింపుల ప్రక్రియను ఆయన మొదలుపెట్టినట్టు సమాచారం.