పడి లేచిన కెరటం రేవంత్ రెడ్డి!

గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి, ఈ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ముందుంజలో ఉండటమే కాకుండా తమ పార్టీని అధికారం దిశగా పరుగులు పెట్టించడం సాధ్యమేనా? అంటే రేవంత్ రెడ్డి లాంటి నాయకుడికి సాధ్యమనే చెప్పాలి. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టి మరీ కొడంగల్ లో కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డిని ఓడించింది. అయినప్పటికీ ఆ ఓటమితో కృంగిపోని రేవంత్, 2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచారు. అలాగే టీపీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చి, తెలంగాణలో విజయం దిశగా పార్టీని పరుగులు పెట్టించారు. ఈ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ తో పాటు, కేసీఆర్ బరిలో నిలిచిన కామారెడ్డిలో పోటీ చేశారు రేవంత్. అయితే ఇప్పుడు ఈ రెండు స్థానాల్లోనూ ఆయన ముందుంజలో ఉండటం విశేషం. అంతేకాదు కాంగ్రెస్ కూడా తెలంగాణలో 119 స్థానాలకు గాను 65 స్థానాలకు పైగా లీడ్ లో ఉండి, ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రేవంత్ రెండు చోట్లా గెలవడంతో పాటు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇది గొప్ప విషయంగానే చెప్పాలి.

కొడంగల్ లో రేవంత్ ముందంజ

కొడంగల్ 9వ రౌండ్‌లో రేవంత్‌రెడ్డి ముందంజ మహేశ్వరంలో 7వ రౌండ్ బీఆర్ఎస్ (4080) ముందంజ  సత్తుపల్లి ఏడో రౌండ్ కాంగ్రెస్ (4532) ముందంజ గద్వాల నాలుగో రౌండ్ బీఆర్‌ఎస్ (6209) ముందంజ కల్వకుర్తి 5వ రౌండ్ కాంగ్రెస్ ( 6273) ముందంజ అలంపూర్ 3వ రౌండ్ బీఆర్ఎస్ (5921) ముందంజ సూర్యాపేట 4వ రౌండ్ బీఆర్‌ఎస్ (2657) ముందంజ ఆందోల్ 6వ రౌండ్ కాంగ్రెస్ (11622) ముందంజ ఇల్లందు 8వ రౌండ్ కాంగ్రెస్ (27000) ముందంజ భద్రాచలం 5వ రౌండ్ కాంగ్రెస్ (1649) ముందంజ కరీంనగర్ 5వ రౌండ్‌లో బీజేపీ (943) ముందంజ కొల్లాపూర్ 4వ రౌండ్ కాంగ్రెస్ (5574) ముందంజ అశ్వారావుపేట 9వ రౌండ్ కాంగ్రెస్ (2605) ముందంజ హుజూర్ నగర్ 8వ రౌండ్ కాంగ్రెస్ (22210) లీడ్ హుస్నాబాద్ 6వ రౌండ్ కాంగ్రెస్ (4788) ముందంజ నారాయణ్ ఖేడ్ 6వ రౌండ్ కాంగ్రెస్ (789) ముందంజ మెదక్ 6వ రౌండ్ కాంగ్రెస్ (5418) ముందంజ సిరిసిల్ల 6వ రౌండ్ బీఆర్ఎస్ (7524) ముందంజ కోరుట్ల 3వ రౌండ్ బీఆర్‌ఎస్ (1770) లీడ్ మానుకొండూరు 10వ రౌండ్ కాంగ్రెస్ (10590) ముందంజ హుజూరాబాద్ 4వ రౌండ్ బీఆర్‌ఎస్ (2864) ముందంజ రామగుండం 8వ రౌండ్ కాంగ్రెస్ (26950) ముందంజ గజ్వేల్‌లో 3వ రౌండ్‌లో బీఆర్‌ఎస్ (3020) ముందంజ వేములవాడ 6వ రౌండ్‌లో బీఆర్‌ఎస్‌ (2776) ముందంజ

ఎంఐఎం కంచుకోటకి బీటలు.. నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ లీడ్!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వస్తే చాలు.. 119 సీట్లకు గాను అందులో ఎంఐఎం 7 సీట్లు గెలవడం ఖాయమని, మిగతా సీట్ల కోసం ఇతర పార్టీలు పోటీపడాలి అన్నట్టుగా పరిస్థితి ఉండేది. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ముఖ్యంగా ఆ పార్టీ కంచుకోటలో ఒకటైన నాంపల్లిలో ఓటమి ఎదురయ్యేలా ఉంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ చేతిలో ఎంఐఎం ఓడిపోయే అవకాశముందని విశ్లేషకులు ముందే అభిప్రాయపడ్డారు. ఓట్ల లెక్కింపు మొదలయ్యాక ట్రెండ్ ని గమనిస్తే అది నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ హుస్సేన్ పై కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఆధిక్యంలో ఉన్నారు. నాంపల్లిలో ఎంఐఎంని ఓడించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఫిరోజ్ ఖాన్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. 2009 లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన ఆయన ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014 లో తెలుగుదేశం తరపున పోటీ చేసి మరోసారి ఓటమిని చూశారు. 2018లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మూడోసారి కూడా ఓటమి తప్పలేదు. అయితే ఈ 2023 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ జయకేతనం ఎగుర వేసేలా ఉన్నారు.

గెలుపు గ్యారంటీ.. కర్నాటక క్యాంపుకు ఏర్పాట్లు రెడీ!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. సరిగ్గా ఈ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అదే దూకుడును ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కొనసాగించింది హస్తం పార్టీ. తొలి గంటలోనే పూర్తిస్థాయి మెజారిటీని సాధించింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్.. 60. ఈ మార్క్‌ను అలవోకగా అందుకుంది కాంగ్రెస్. తొలి రౌండ్ నుంచే ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చింది. ఎక్కడే గానీ వెనుకంజ వేసినట్లు కనిపించలేదు. పోస్టల్ బ్యాలెట్లలో సాధించిన పైచేయిని ఈవీఎం లెక్కింపుల్లోనూ కంటిన్యూ చేసింది. 68 స్థానాల్లో కాంగ్రెస్, 35 నియోజకవర్గాల్లో భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థులు ఆధిక్యతలో కనిపించారు. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్.. అయిదు చోట్ల లీడింగ్‌లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా తన ఆధిక్యతను పెంచుకోగలిగింది. తొలుత మూడు చోట్ల లీడింగ్‌లో ఉన్న కమలం పార్టీ అభ్యర్థులు ఆ తరువాత అయిదు చోట్ల పైచేయి సాధించారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ ఈ ఆధిక్యత చేతులు మారే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆంతర్యం అధికంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా- కిందటి నెల 30వ తేదీన తెలంగాణలో పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం అయ్యేలా ఉంది పరిస్థితి. తెలంగాణపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు భారీ ఆధిక్యతను కట్టబెట్టాయవన్నీ కూడా. ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలన్నీ దాదాపుగా నిజం అయినట్టే కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమైనట్టే.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతున్నది. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ 65 స్థానాలలో ఆధిక్యత కనబరుస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే సాధించాల్సిన 60 స్థానాల మ్యాజిక్ ఫిగర్ ను కాంగ్రెస్ ఇప్పటికే దాటేసింది. తుది ఫలితం కూడా  కాంగ్రెస్ కు అనుకూలంగానే ఉంటుందన్న విశ్వాసంతో కాంగ్రెస్ సంబురాలు చేసుకుంటోంది. ఇలా ఉండగా ఓట్ల లెక్కిపు పూర్తి కాగానే గెలిచిన వారంతా హైదరాబాద్ రావాలని ఆదేశించిన కాంగ్రెస్ అధిష్థానం వారిని కర్నాటకకు తరలించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేసింది. వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను ఇప్పటికే తాజ్ క్రిష్టా వద్ద ఉన్నాయి.  ఇవి కాకుండా శంషాబాద్ విమానాశ్రయంలో రెండు ప్రత్యేక విమానాలు, నాలుగె హెలికాప్టర్ ను కూడా రెడీగా ఉంచింది.     

ఖమ్మంలో క్లీన్ స్వీప్ దిశగా కాంగ్రెస్!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా బాగానే పోటీ ఇస్తోంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉండగా 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని, పదికి పది స్థానాలు తామే గెలుస్తామని హస్తం పార్టీ ముందునుంచి చెబుతోంది. అందుకు తగ్గట్టుగానే ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటి నేతల చేరికతో కాంగ్రెస్ మరింత బలంగా తయారైంది. అసలే ఖమ్మంలో సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఉన్నారు. ఆయనకు తోడు పొంగులేటి, తుమ్మల తోడు కావడంతో.. ఖమ్మంలో క్లీన్ స్వీప్ పట్ల కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది. ఖమ్మలో పది స్థానాలు ఉండగా, ఈ ఎన్నికల్లో తొమ్మిది చోట్ల కాంగ్రెస్ పోటీ చేసింది. కొత్తగూడెంలో మాత్రం కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ పోటీ చేసింది. ఇప్పుడు ఈ పది స్థానాల్లోనూ కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది. ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తే, కాంగ్రెస్ చెప్పినట్టుగానే ఖమ్మంలో క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

ఎమ్మెల్యేగా ఓటమి దిశగా కేసీఆర్.. 40 ఏళ్ళ తర్వాత మొదటి షాక్!

కేసీఆర్ వరుసగా మూడోసారి తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ ఎంతో నమ్మకంగా ఉంది. అయితే మూడోసారి సీఎం అవ్వడమేమో కానీ, పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒక్క చోట ఎమ్మెల్యేగా ఓడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేశారు. దీంతో గజ్వేల్ లో ఓటమి భయంతోనే గులాబీ బాస్ కామారెడ్డి బరిలో నిలిచారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం కామారెడ్డిలో కేసీఆర్ ఖంగుతినే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే అంచనా వేశాయి. ఓట్ల లెక్కింపు మొదలయ్యాక ప్రస్తుత ట్రెండ్ ని గమనిస్తే నిజంగానే కామారెడ్డిలో కేసీఆర్ కి షాక్ తగిలే ఛాన్స్ కనిపిస్తోంది. కామారెడ్డిలో పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ అభ్యర్థి వెంకట రమణా రెడ్డి ఆధిక్యత ప్రదర్శించగా, ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలయ్యాక కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి లీడ్ లోకి వచ్చారు. ఇదే ట్రెండ్ కొనసాగితే కామారెడ్డిలో కేసీఆర్ కి ఓటమి తప్పదు. ఒకవేళ కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతే, 40 ఏళ్ళ తర్వాత ఇది ఆయనకు ఎమ్మెల్యేగా మొదటి ఓటమి అవుతుంది. మొదటిసారి 1983 లో సిద్ధిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బీఆర్ఎస్ అధినేత.. ఆ తర్వాత సాధారణ, ఉప ఎన్నికలు కలిపి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా ప్రతిసారి జయకేతనం ఎగురవేశారు. అలాంటి కేసీఆర్ 40 ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యేగా ఓటమిని చూడబోతున్నారు అనిపిస్తోంది.

ప్రజా తీర్పునకు కౌంట్ డౌన్ షురూ

తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కౌంటింగ్ కౌన్ డౌన్ స్టార్ట్ అయింది. ఎన్నెన్నో ప్రశ్నలు.. ప్రతి ఒక్కరి మదిలో ఎంతో ఉత్కంఠ. అన్నిటికీ సమాధానం మరికొద్ది సేపట్లో. మరికొద్ది గంటల్లోనే ఫలితాలు వెలువడనున్నాయి. క్రమక్రమంగా ఉత్కంఠకూ తెరపడనుంది. నెల రోజులుగా ఉత్కంఠ రేపిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్ని కల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి.  రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ చూసినా, విన్నా ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 49 కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ మొదలైంది.  ఒక్కో నియోజకవర్గానికి 14+1 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం తెలనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా.. మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్‌ లెక్కింపు.. ఆ తరువాత ఈవీఎంల లెక్కింపు జరుగుతుంది. ఈసారి 80 ఏళ్లు పైబడిన వారు, వికలాంగులు కూడా ఇంటి నుంచి ఓటేసే అవకాశం కల్పించడంతో.. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల సంఖ్య భారీగా పెరిగింది. ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా తెలంగాణ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించి ఐదంచెల భద్రత ఏర్పాట్లు చేసారు.. కిలోమీటరు దూరంలోనే ఆంక్షలు అమలు చేస్తున్నారు. కాగా, భద్రాచలం , అశ్వారావుపేట, చార్మినార్ నియోజకవర్గాల్లో లెక్కింపు రౌండ్లు తక్కువగా ఉండడంతో వీటిలో ఏదో ఒక స్థానం ఫలితం తొలుత వెలువడవచ్చని అంచనా. చార్మినార్లో పోలైన ఓట్లు అతి తక్కువగా ఉన్నందున మిగిలిన రెండింటి కంటే దాని ఫలితమే మొదట తెలుస్తుందని భావిస్తున్నారు. ప్రతి 20 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం తేలే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలయ్యే సరికి ఎన్నికల ఫలితాల సరళి తెలిసే అవకాశం ఉందని రాష్ట్ర ఈసీ కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు.  కౌంటింగ్‌కు సంబంధించి.. ఏదైనా పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం యంత్రం పనిచేయకపోతే.. వీవీప్యాట్‌ డబ్బాలోని చీటీలను లెక్కిస్తారు. నియోజకవర్గంలోని ఈవీఎంలన్నీ సవ్యంగా పనిచేస్తే.. మరో రకంగా వీవీప్యాట్‌ చీటీలను లెక్కిస్తారు. ఏవైనా ఐదు పోలింగ్‌ కేంద్రాల వీవీప్యాట్ల డబ్బాలను తీసుకుని, ఆయా కేంద్రాల్లో ఈవీఎంల ఫలితాన్ని సరిపోల్చుతారు. పోస్టల్ బ్యాలెట్స్ కోసం ప్రత్యేక టేబుల్స్ ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్ 500ఓట్లకు ఒక టేబుల్ ఉంటుంది. ఈవీఎం ఓట్ల లెక్కింపుకు ముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ లో ఒక్కో టేబుల్ కు 6గురు అధికారులు ఉంటారు. ఒకరు మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు ఇద్దరితో మొత్తం ఒక్కో టేబుల్‌కు ఆరుగురు ఉంటారు. ప్రతీ ఈవీఎంను మూడు సార్లు లెక్కింపు ఉంటుంది కాబట్టి ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని సీఈఓ వికాస్ రాజ్ తెలియజేశారు. ఇక కౌంటింగ్ సమయాల్లో రోడ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులపై నిషేధం విధించినట్లు తెలిపింది. కాగా, తెలంగాణలో సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారా లేక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారా? క్లియర్ మెజార్టీ వస్తుందా? హంగ్ వస్తుందా? హంగ్ వస్తే, ఏ ప్రభుత్వం అధికారం చేపడుతుంది? ఇలా ఇవాళ్టి ఎన్నికల ఫలితాలపై ఎంతో ఆసక్తి ఉంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. శనివారం హైదరాబాద్ వచ్చారు. కాంగ్రెస్ నుంచి గెలిచే అభ్యర్థులను చేజారనివ్వకుండా చూసే పనిలో ఉన్నారు. అటు రాహుల్ గాంధీ సైతం.. కౌంటింగ్ కేంద్రాల దగ్గరే అభ్యర్థులు ఉండాలని కండీషన్ పెట్టారు. ఫలితాలు కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉంటే.. హైదరాబాద్ లోనే క్యాంప్ ఉంటుందనీ, అదే ఫలితాలు బీఆర్ఎస్‌కి అనుకూలంగా ఉంటే.. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కర్ణాటకకు తరలిస్తారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్.. తమ పార్టీ అభ్యర్థులకు కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు. అందువల్ల కాంగ్రెస్ లో ఆదివారం జరిగే క్యాంప్ పాలిటిక్స్ ఆసక్తి రేపనున్నాయి.

టాలీవుడ్ లో టెన్షన్.. కారణమేంటంటే?

ఐదేళ్లకోసారి ఎన్నికలు రావడం, ప్రభుత్వాలు మారడం, ఒక్కోసారి అధికారంలో ఉన్న పార్టీయే మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడం మనం చూస్తూనే ఉంటాం. ఈ విషయంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎప్పుడూ టెన్షన్‌ అనేది ఉంటుంది. టాలీవుడ్‌ ప్రముఖుల్లో వివిధ పార్టీలకు చెందినవారు ఉంటారు. అయితే పార్టీలతో సంబంధం లేకుండా చిత్ర పరిశ్రమకు చెందిన అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, దానికి అనుకూలంగా ప్రభుత్వం కూడా స్పందించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతూ వస్తోంది. అయితే ఒక్కో పార్టీ పాలసీ ఒక్కోలా ఉంటుంది. కొన్ని ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమ గురించిగానీ, అందులోని సమస్యల గురించిగానీ పెద్దగా పట్టించుకోని సందర్భాలు కూడా ఉన్నాయి. రెండు దఫాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్  మాత్రం సినీ పరిశ్రమ విషయంలో సానుకూలంగానే వ్యవహరించింది. ఈ విషయంలో టాలీవుడ్‌ ప్రముఖులు సంతోషంగానే ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా టాలీవుడ్‌లో కొంత టెన్షన్‌ వాతావరణం నెలకొందదని అంటున్నారు. ఇటీవలే  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆదివారం (డిసెంబర్ 30) కౌంటింగ్ జరిగి ఫలితాలు వెలువడతాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని కొందరంటుంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ సారి ప్రభుత్వ మార్పు తథ్యమనీ మరి కొందరు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీఆర్ఎస్ పరాజయం పాలై, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే పేర్కొన్నాయి. దీంతో టాలీవుడ్ లో ఒకింత టెన్షన్ వాతావరణం నెలకొందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.  ఎందుకంటే ఇప్పటివరకు కేసీఆర్‌ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ సానుకూలంగానే వ్యవహరించింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారితే.. వచ్చే కొత్త సర్కార్   పరిశ్రమ విషయంలో ఎటువంటి వైఖరి అవలంబిస్తుంది అన్నదే ఆ టెన్షన్ కు కారణమంటున్నాయి.  వందల కోట్ల బడ్జెట్‌తో పెద్ద సినిమాలు చేసే నిర్మాతలకి ఎక్స్‌ట్రా షోలు, టికెట్‌ రేట్లను పెంచుకునే వెసులుబాటు కావాలి. ఇలాంటి వాటి వల్లే నిర్మాత పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఇప్పటివరకు భారీ చిత్రాల నిర్మాతలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేదోడు వాదోడుగానే ఉంది.  ఇప్పుడు అధికారం మారి  కొత్త ప్రభుత్వం వస్తే టాలీవుడ్‌ పరిస్థితి ఏమిటన్నదే టాలీవుడ్ టెన్షన్ కు కారణమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం కాంగ్రెస్‌  అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  అదే జరిగితే కాంగ్రెస్ సర్కార్ టాలీవుడ్‌కి  అనుకూలంగా ఉంటుందా, భారీ చిత్రాల నిర్మాతలకు కావాల్సిన అనుమతుల్ని ఇస్తుందా అన్న సందేహాలు సినీ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.   

జగనాసుర పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కోసమే పొత్తు.. వ్యతిరేకించేవారంతా వైసీపీ కోవర్టులే!

తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు ఎంత దృఢంగా ఉందో, ఎంత దృఢంగా ఉండబోతోందో జనసేనాని పవన్ కల్యాణ్ విస్పష్టంగా ఎలాంటి సందేహాలకూ తావులేని విధంగా చెప్పేశారు. ఈ పొత్తును విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ పన్నుతున్న కుట్రలను సైతం కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. జనసేనలో తెలుగుదేశంతో పొత్తును వ్యతిరేకించే వారంతా వైసీపీ కోవర్టులేనని తేల్చేశారు. అటువంటి వారంతా పార్టీ వీడి వెళ్లి వైసీపీలో చేరిపోవాలని నిర్మొహమాటంగా చెప్పేశారు. జనసేన తెలుగుదేశంతో పొత్తు నిర్ణయాన్ని ఆషామాషీగా తీసుకోలేదని, రాష్ట్ర భవిష్యత్, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే.. ఓ ప్రజాకంటకుడి పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడం కోసమే తెలుగుదేశంతో పొత్తు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.  ఈ పొత్తు రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే కాదనీ రాష్ట్ర ప్రగతి, పురోగతి, ప్రజాక్షేమం, ప్రజా సంక్షేమం దృష్ట్యా తెలుగుదేశం పార్టీతో కలిసి వేళ్లాలని నిర్ణయించాననీ చెప్పారు.  వాస్తవానికి జనసేనాని మొదటి నుంచీ కూడా  స్పష్టతతోనే ఉన్నారు. బీజేపీ కలిసి వస్తుందా రాదా అన్నది పట్టించుకోకుండా.. తాను మాత్రం తెలుగుదేశంతో కలిసే  ఎన్నికలకు వెడతానని  చెబుతూ వస్తున్నారు.  చెప్పినట్లుగానే ఆయన అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో పొత్తు ప్రకటన విషయంలో ఇంకెంత మాత్రం జాప్యం కూడదని నిర్ణయించుకున్న ఆయన రాజమహేంద్రవరంలో చంద్రబాబుతో ములాఖత్ నుంచి బయటకు వచ్చీ రాగానే సెంట్రల్ జైలు ముందే జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసే ఎన్నికలకు వెడుతుందని ప్రకటించారు.  ఆ తరువాత పరిణామాలు వేగంగా ముందుకు కదిలాయి.   తెలుగుదేశం, జనసేన పార్టీలు సమన్వయ కమిటీలను  ఏర్పాటు చేసుకొని, ఉమ్మడి కార్యాచరణను కూడా రూపొందించుకున్నాయి.  ఉమ్మడి ప్రణాళిక అమలు కూడా మొదలైంది. ఉమ్మడిగా మినీ మేనిఫెస్టో కూడా వెలువరించాయి. ఇరు పార్టీల నేతలూ  కలిసికట్టుగా ప్రచారం కూడా మొదలు పెట్టారు.  ప్రజా సమస్యలపై పోరాటం ప్రారంభించారు. క్షేత్ర స్థాయిలో ఇరు పార్టీల శ్రేణులూ ఉమ్మడిగానే ముందుకు కదులుతున్నాయి. అయితే, అక్కడక్కడా కొందరు జనసేన ద్వితీయ శ్రేణి నేతలు ఈ పొత్తుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. జనసేన పార్టీ పెద్దలు ఇప్పటికే ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని పలుమార్లు హెచ్చరించారు. ఇప్పటికే కొందరు నేతలు పార్టీని వీడిపోయారు. అయితే అలా వెళ్లిపోయిన వారంతా  వైసీపీ కోవర్టులుగానే జనసేనలో చేరారని.. కేవలం జనసేనపై బురద జల్లేందుకే వీరు పార్టీలో ఉంటూ వచ్చారని జనసేన వారిపై ఆరోపణలు చేసింది.  అయితే  ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు విషయంలో కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశంతో  పొత్తును జనసేనలో ఎవరు వ్యతిరేకించినా వారంతా వైసీపీ కోవర్టులేనని, అటువంటి వారిపై చర్యలు తప్పవనీ, పార్టీ నుంచి బహిష్కరించడానికి కూడా వెనుకాడననీ తేటతెల్లం చేశారు.   మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో శుక్రవారం (డిసెంబర్ 1) నిర్వ‌హించిన పార్టీ ఉన్న‌త‌స్థాయి నాయ‌కుల స‌మావేశంలో ఏపీలో తెలుగుదేశం పార్టీతో, తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవడాన్ని వైసీపీ నేతలు విమర్శించడంపై పవన్ స్పందించారు.  ఎలాంటి సిద్దాంతాలు లేని పార్టీ వైసీపీకి తనను విమర్శించే అర్హత లేదన్నారు. ప్రజలకు ఏది అవసరమో అది చేస్తానన్నారు. ప్రజల కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటామన్నారు. తాను  ఏ పదవులు కోరుకోలేదని.. చేసే పని, పోరాటమే గుర్తింపు ఇస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక,  తెలుగుదేశంతో పొత్తుకు వ్యతిరేకంగా ఏ స్థాయి నాయకుడు మాట్లాడినా..   కార్యకర్త మాట్లాడినా ఊరుకునేది విస్పష్ట హెచ్చరిక చేశారు. పోత్తు నిర్ణయం నచ్చనివాళ్లు ఎవరైనా ఉంటే  ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోవచ్చని తేల్చి చెప్పారు.  ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీతో కలిసి తెలంగాణ ఎన్నికలలో  జనసేన పోటీలో దిగింది. ఈ విషయాన్ని ఎత్తి చూపుతూ..  జనసేనలో కొందరు  ఉద్దేశపూర్వకంగా ఏపీలో పొత్తుకు, పార్టీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో  పవన్ ఈసారి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.     నిజానికి వైసీపీ ఎప్పటి నుండో  తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తును దెబ్బతీసేందుకు చేయని ప్రయత్నం లేదు. ముందుగా జనసేనను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన  వైసీపీ నేతలు, ఆ తరువాత  ఎమోషనల్ గా పవన్ అభిమానులను రెచ్చగొట్టే  ప్రయత్నం చేశారు. కానీ, ఆ పప్పులు ఉండకలేదు. అలాగే  ఉద్దేశపూర్వకంగా కొందరు వైసీపీ నేతలను కోవర్టులుగా జనసేనలోకి పంపి పార్టీలో అయోమయం సృష్టంచేలా, పార్టీ విధానాలను వ్యతిరేకించే వ్యాఖ్యలు చేయించారు. అందులో భాగంగానే  తెలుగుదేశంతో కలిసే ఎన్నికలకు వెళతాం అన్న పవన్ ప్రకటన తరువాత  కొందరు జనసేనపై విమర్శలు చేసి పార్టీని వీడివెళ్లిపోయారు. మరికొందరిపై జనసేన చర్యలు కూడా తీసుకుంది. వాళ్లంతా వైసీపీ కోవర్టులేనని జనసేన అప్పట్లోనే స్పష్టం చేసింది. అలా పోగా మిగిలిన కొందరు ఇప్పటికీ  అడపాదడపా  పొత్తు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే     పవన్ పొత్తును వ్యతిరేకించే  వారంతా వైసీపీ కోవర్టులేననీ, అటువంటి వారిని ఉపేక్షించననీ తేల్చి చెప్పేశారు.  

రేవంత్ కోసం చంద్రబాబుకి అమిత్ షా ఫోన్?

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దూకుడుతో భవిష్యత్ లో  తమకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని..  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ముందే ఊహించారా? ఆ క్రమంలో రేవంత్‌రెడ్డికి బీజేపీ కండువా కప్పే ప్రయత్నాలు జరిగాయా?  అందులో భాగంగా.. రేవంత్‌రెడ్డిని ఒప్పించాలంటూ  తెలుగుదేశం అధినేత  చంద్రబాబు నాయుడుకు కేంద్ర మంత్రి అమిత్ షా పోన్ చేసి మరీ కోరారా?  అయితే చంద్రబాబు అందుకు నో చెప్పారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. అయితే ఇదంతా  గతంలో జరిగిందని అంటున్నారు.  ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న వేళ.. ఈ చర్చ తెలంగాణ సమాజంలో  విస్తృతంగా జరుగుతోంది.   2014లో ఓ వైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయితే.. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాదించగా.. ఆ తర్వాత బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) అధినేత  సీఎం కేసీఆర్  ఆపరేషన్ ఆకర్ష్‌ అంటూ ఎర్రబెల్లి, తలసాని, కడియం వగైరా వగైరా  నేతలను కారెక్కించేశారు.  కానీ అతికొద్ది మంది మాత్రమే తెలుగుదేశం పార్టీని అంటి పెట్టుకొని ఉన్నారని... వారిలో రేవంత్ రెడ్డి ఒకరు. అయితే ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా  చేశారు. కానీ ఇక్కడే కీలక పరిణామాలు తెరచాటుగా చోటు చేసుకొన్నాయనే ఓ చర్చ పొలిటికల్ సర్కిల్ లో జరుగుతోంది. అదేమంటే.. 2017, అక్టోబర్ 31న.. రేవంత్ రెడ్డి హస్తం పార్టీకి స్నేహ హస్తం అందించిన రోజు... అయితే అంతకు కొద్దిరోజుల ముందు బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) అధినేత, సీఎం కేసీఆర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి.. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని... అదే జరిగితే..  భవిష్యత్ లో రేవంత్ వల్ల తమ పార్టీకే కాదు,  బీజేపీకి సైతం   ముప్పు ఏర్పడే అవకాశాలున్నాయనీ చెప్పారనీ, దానిని నివారించేందుకు రేవంత్ ను బీజేపీలోకి తీసుకోవాలనీ కోరినట్లు చెబుతున్నారు. రేవంత్ బీజేపీలో చేరితే.. తెలంగాణలో కాంగ్రెస్  పుంజుకునే అవకాశాలు లేశమాత్రంగా కూడా ఉండవని చెప్పారని అంటున్నారు.  రేవంత్ రెడ్డి.. చంద్రబాబు మాట తప్ప.. మరోకరి మాట వినే రకం కాదంటూ అమిత్ షాకు కేసీఆర్ గట్టిగా చెప్పినట్లు పోలిటికల్ సర్కిల్స్ లో అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేసీఆర్ సూచన మేరకు అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేసి రేవంత్ బీజేపీలో చేరేలా ఒప్పించాలని కోరారని, అయితే అందుకు చంద్రబాబు నిరాకరించారని చెబుతున్నారు.     అయితే అమిత్ షా అంత చొరవగా చంద్రబాబును  ఎన్డీయే బాగస్వామిగా ఉండటమేనని కూడా అంటున్నారు.  ఆ చొరవతోనే చంద్రబాబుకు ఫోన్ చేసిన అమిత్ షా రేవంత్ ను బీజేపీలో చేరేలా ఒప్పించాల్సింగా కోరారు. అందుకు చంద్రబాబు రేవంత్ తమ పార్టీకి రాజీనామా చేశారనీ, ఆయనతో తాను ఎలా మాట్లాడి ఒప్పించగలననీ చెప్పినా, అమిత్ షా అందుకు అమిత్ షాకు టీడీపీ జాతీయ అధినేత బదులిస్తూ.. కొద్ది రోజుల క్రితమే ఆయన తమ పార్టీకి రాజీనామా చేశారని... అలాంటి వేళ రేవంత్ రెడ్డితో మాట్లాడి నేనెలా ఒప్పించగలనంటూ.. చెప్పినా అమిత్ షా మాత్రం రేవంత్ రెడ్డికి మీరంటే ఆరాధన, మీకు చెప్పే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అలాంటిది మీరు చెబితే తప్పకుండా వింటారంటూ ఒత్తిడి చేసినట్లు అప్పట్లో గట్టిగా వినిపించింది.  అంతే కాకుండా ప్రధాని మోదీ సైతం రేవంత్‌రెడ్డి బీజేపీ గూటికి రావాలని కోరుకుంటున్నారనీ, అందుకు మీరు సాయం చేస్తే ఆయన సంతోషిస్తారనీ కూడా అమిత్ బాబుపై ఒత్తిడి తెచ్చినట్లు చెబుతారు. అయితే చంద్రబాబు మాత్రం సున్నితంగానే అయినా చాలా స్పష్టంగా రేవంత్ మా పార్టీ వీడారు... అదీకాక రేవంత్ రెడ్డి రాజకీయ  భవిష్యత్ ఆయనే నిర్ణయించుకుంటారనీ తాను  ఒత్తిడి చేయలేనని చెప్పినట్లు అప్పట్లో చర్చ జరిగింది.   ఆ విషయాలన్నీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేల మరో సారి సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నాయి.   ఆదివారం (డిసెంబర్ 3) ఫలితాలు వెలువడనున్నాయి.  ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఈ సారి కాంగ్రెస్ విజయం తథ్యమని చెబుతున్నాయి.  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యం వల్లే  ఇది సాధ్యమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ తరుణంలో  దాదాపు ఆరేళ్ల కిందట గులాబీ బాస్ కేసీఆర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. రేవంత్ విషయంలో వేసిన ఆంచనాలు ఏ మాత్రం తూ చా తప్పకుండా జరిగుతున్నదనే విషయం సుస్పష్టమవుతోందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. అదీకాక.. అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత, అలాగే బీజేపీ ఎంపీ దర్మపూరి అర్వింద్‌లు వేర్వేరు సభల్లో తమ ప్రధాన ప్రత్యర్థి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రమే అని ప్రకటించడమే ఇందుకు నిదర్శమని పరిశీలకులు చెబుతున్నారు. ఇక కల్వకుంట్ల కవిత, దర్మపూరి అర్వింద్ ఇద్దరు నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేయగా.. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అర్వింద్ చేతిలో కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారని... కానీ వీరిద్దరూ ఇప్పుడు ఒకే గూటి పక్షుల్లాగా ఒకే మాట పలుకుతుండడం కోసమెరుపు.

బీఆర్ఎస్ ఓటమిని హరీష్ రావు అంగీకరించేశారా?

తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్.. రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్   కాంగ్రెస్ పార్టీ  అధికారం చేపట్టడం ఖాయమని ప్రిడిక్ట్ చేస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ కాదు ఎగ్జాట్ పోల్స్ మాకే ముచ్చటగా మూడో సారి అధకారాన్ని కట్టబెడతాయని  ఘంటా పథంగా చెబుతున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే మీడియా ముందకు వచ్చిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పోలింగ్ ముగిసిన మరుసటి రోజు పార్టీ నేతలతో సమావేశమైన పార్టీ అధినేత కేసీఆర్  హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్న ధీమానే వ్యక్తం చేశారు.  కేసీఆర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ప్రమాణ స్వీకారం ఎక్కడో, సంతకం పెట్టాల్సిన తొలి ఫైల్ ఏదో కూడా చర్చించినట్లు పార్టీ వర్గాలు చెప్పుకున్నాయి. అంతే కాకుండా.. ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే డిసెంబర్ 4న కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేసేశారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం పార్టీ శ్రేణుల్లో ఆ ధీమా కనిపించడం లేదు. అటు వైపు కాంగ్రెస్ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేయడమే కాకుండా, పార్టీ నుంచి గెలిచిన వారెవరినీ ప్రత్యర్థి పార్టీలు ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఇవ్వకుండా కర్నాటక తరలించేందుకు ప్రణాళికలు కూడా రచిస్తోంది. ఇటువంటి తరుణంలో బీఆర్ఎస్ కీలక నేత, మంత్రి, పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన తన్నీరు హరీష్ రావు పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నట్లు ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నది. అయితే ఆ వీడియో ఎప్పటిది.. అన్న స్పష్టత అయితే లేదు.  ఆ వీడియోలో  హరీష్ రావు బీఆర్ఎస్ పరాజయం పాలైనా ప్రజలలోనే ఉంటాం, ప్రజల కోసమే పని చేస్తుందనీ చెప్పారు. అంతే కాకుండా ఓటమికి తాను పూర్తి బాధ్యత వహిస్తానని చెప్పారు. ఇదే ఆ వీడియో నిజమేనా, నిజమే అయితే  ఆయన ఎప్పుడు మాట్లాడారు? ఏ సందర్భంగా మాట్లాడారు అన్న అనుమానాలకు తావిస్తున్నది. ఎందుకంటే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొత్తం కేసీఆర్ తన భుజస్కంధాలపై వేసుకుని రోజుకు దాదాపు మూడు నాలుగు సభలలో ప్రసంగించారు. ఒక వేళ పార్టీ ఓటమికి బాధ్యత వహించాల్సి వస్తే పార్టీ అధినేతగా, ప్రచార సారథిగా కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. లేదా పార్టీ సమష్టి బాధ్యతగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా హరీష్ రావు ఓటమి బాధ్యత పూర్తిగా తనదేనని చెప్పడం విస్తుగొలుపుతోంది. అన్నిటికీ మించి  ఈ వీడియోలో మెదక్ ఎంపీ, ప్రస్తుతం దుబ్బాక నుంచి పోటీ చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. మొత్తం మీద సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతన్న ఈ వీడియో వైరల్ అయ్యింది. ఎక్కడ చూసినా ఓటమిపై హరీష్ రావు వ్యాఖ్యలపైనే చర్చ జరుగుతోంది. 

ఆశలన్నీ వాలంటీర్లపైనే.. మరి ఆ వ్యవస్థే రద్దయితే?

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వాలంటీర్ ఉద్యోగాలను   పారదర్శకత అనేదే  లేకుండా సొంత పార్టీ కార్యకర్తలతొ  నింపేశారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలే పలు సభల్లో ప్రజల సాక్షిగా చెప్పుకొచ్చారు. వాలంటీర్లలో 90 శాతం పైగా వైసీపీ వాళ్లే ఉన్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ఓ సందర్భంలో  బాహాటంగానే చెప్పేశారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లు వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలను కొట్టి పారేయడానికి వీలులేని పరిస్థితి ఉంది. ఇంకా చెప్పాలంటే వాలంటీర్ వ్యవస్థను జగన్ ప్రభుత్వం తమ పార్టీ కరపత్రంలా వాడుకుంటుందన్నది అక్షర సత్యం. వీరంతా పార్టీ కార్యకర్తలే కాగా.. జగన్  చేత జగన్ కొరకు జగనే నియమించుకున్న వారే.  ప్రజలకు సంబంధించి సకల వివరాలు వీరి వద్ద ఉన్నాయి. వాటి ఆధారంగా వైసీపీ పార్టీకి మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ మధ్య కాలంలో తమకు అనుకూలంగా లేని ఓట్లను  రకరకాల కారణాలతో ఫామ్ 7 ద్వారా వలంటీర్ల ద్వారా   తొలగింపచేయడం  ద్వారా  వైసీపీ  ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది.  కాగా, ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ మాజీ క‌మిష‌న‌ర్ నిమ్మ‌గడ్డ ర‌మేష్‌బాబు వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. ప్ర‌భుత్వ జీతంతో పనిచేస్తూ.. ప్రభుత్వానికి చెందిన వారైన వాలంటీర్లు వైసీపీ పార్టీ  ప‌నులు చేస్తున్నార‌ని నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఓట‌ర్ల జాబితా తయారీలో కూడా ప్ర‌త్య‌క్షంగా పాల్గొంటున్నార‌ని, ఇది వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని ఆయ‌న సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు వ‌చ్చే నెల‌కు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే అసలు వాలంటీర్ల వ్యవస్థ గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పనుంది?  అసలు ఎన్నికల సమయానికి వాలంటీర్లు ఉంటారా?  కోర్టు ఆ వ్యవస్థను రద్దు చేస్తుందా? తాత్కాలికంగా వాలంటీర్లను ప్రభుత్వ వ్యవహారాల నుండి దూరం పెడుతుందా అనే చర్చ జరుగుతున్నది. అయితే  దాదాపుగా ఎన్నికల సమయానికి పూర్తిగా లేదా తాత్కాలికంగా వలంటర్ల వ్యవస్థ   సస్పెండ్ అయ్యే అవకాశాలే ఉన్నాయని న్యాయ‌నిపుణులుఅభిప్రాయపడుతున్నారు. అయితే, ఎన్నికల సమయానికి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసినా, లేదా తాత్కాలికంగా సస్పెండ్ చేసినా వైసీపీకి అది గట్టి ఎదురుదెబ్బే అవుతుంది. ఎందుకంటే  వైసీపీ వాలంటీర్ల మీదనే  ఎన్నికల బరిలో నిలిచి గెలవడానికి పూర్తిగా ఆధారపడింది. నిత్యం ప్రజలతో సంబంధం ఉండే వాలంటీర్లు చెప్తే ప్రజలు వింటారని భావిస్తుంది. మాట వినని వారిని బెదిరించైనా అనుకూలంగా మార్చే సత్తా వాలంటీర్లకు ఉందని వైసీపీ నమ్ముతున్నది. ప్రభుత్వంపై అసంతృప్తితో ప్రస్తుతం వైసీపీ క్యాడర్ పార్టీ కార్యక్రమాలలో  ఏమంత ఉత్సాహంగా పాల్గొనడం లేదు. ద్వితీయ శ్రేణి నేతలలో కూడా జోష్ కనిపించడం లేదు. అందుకే ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా అట్టర్ ప్లాప్ అయిపోతున్నది. వైసీపీ నేతలు ప్రజల మధ్యకి వెళ్లినా కార్యకర్తలు పట్టించుకోవడం లేదు. ప్రజలు మొహం చాటేస్తున్నారు. ఈ పరిస్థితులలో వాలంటీర్లే వైసీపీ నేతలకు ఫ్లెక్సీలు కట్టి స్వాగతం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. వాలంటీర్లు చేస్తున్నది కూడా అదే. అందుకే  ఎన్నికల సమయంలో  ఓటర్ మేనేజ్మెంట్ బాధ్యతలను వాలంటీర్లకు అప్పగించాలని వైసీపీ డిసైడ్ అయిపోయింది. ఈ తరుణంలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు సుప్రీం తీర్పుపై ఆధారపడి ఉంది. ఒక వేళ సుప్రీం వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా తీర్పు వెలువరిస్తే.. వైసీపీ ఆశలన్నీ గంగలో కలవడం ఖాయం. అయితే జగన్ సర్కార్ ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థకు ఏవైనా న్యాయపరమైన చిక్కులు వస్తే ఎలా అన్న విషయాన్ని పరిగణనలోనికి తీసుకునే  ప్రతి 50 ఇళ్లకు ఒక గృహసారథి చొప్పున నియమించుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వాలంటీర్ వద్ద ఉండే ప్రభుత్వ సమాచారాన్ని గృహసారథుల ద్వారా పార్టీ అవసరాల కోసం సేకరించి పెట్టుకుంటున్నదని చెబుతున్నారు. గృహసారథులకు ప్రజలతో నేరుగా సంబంధం లేదు. కానీ, ఒకవేళ వాలంటీర్ల వ్యవస్థ రద్దయితే కొంతలో కొంత సారథులు ఉపయోగించుకోవచ్చన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. మరి ఈ సారథులు ఎంతవరకు వైసీపీకి ఉపయోగపడతారన్నది చూడాల్సి ఉంది. 

చంద్రబాబు గెలిచారు.. తెలుగుదేశంను గెలిపించారు

ఒక దార్శనికుడిని రాజకీయ వైరంతో మరుగున పడేయడం ఎవరి వల్లా కాదు.   రాజకీయంగా చంద్రబాబుకు వస్తున్న గుర్తింపు, పెరుగుతున్న ప్రతిష్ట ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపు కలిగిస్తే కలిగించొచ్చు కానీ.. నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారూ చంద్రబాబు దార్శినికతను ప్రశంసిస్తూనే ఉంటారు. రాజకీయంగా విభేదించేవారు కూడా ఆయన దూరదృష్టిని ప్రస్తుతిస్తూనే ఉంటారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజా సంక్షేమం, ప్రగతి జపం చేసే ఆయన సంకల్పానికి ఎవరైనా సరే అచ్చెరువొందక మానరు. అటువంటి చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తాను గెలవడమే కాకుండా తెలుగుదేశం పార్టీని సైతం గెలిపించేశారు. ఔను అసలు పోటీలో దిగకుండానే ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసేశారు. తన అక్రమ అరెస్టు కారణంగా తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించడానికి అవకాశం లేని సంక్షోభ పరిస్థితులనే అందరికీ, అన్నిటికీ తానేననే పరిస్థితులను తీసుకువచ్చారు. ఔను ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అందరికీ చంద్రబాబే కావాలి.. గతంలో ఆయనతో పనిచేసిన వాళ్లకి, అసలు సంబంధమే లేని వాళ్లకి కూడా ఆయనే కావాలి. ఆయనను ప్రత్యర్థిగా భావించి దెబ్బకొట్టాలని చూసిన వారికీ ఆయనే దిక్కయ్యారు. బరిలో నిలిచి గెలవాలంటే ఆయన నామస్మరణ తప్ప మరో మార్గం లేదని అంతా భావించే పరిస్థితిని కల్పించారు.    వీరు వారు అని కాదు.. అన్ని పార్టీలకు చంద్రబాబే కావాలి. ఔను.. తెలంగాణ ఎన్నికలలో  కనిపించిన, కనిపిస్తున్న దృశ్యం  ఇదే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన అన్ని పార్టీల నేతలు చంద్రబాబు జపం చేశారు.   చంద్రబాబు పేరు లేకుండా తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేసిన పార్టీ లేదు. నాయకుడు లేరు.  ఉమ్మడి రాష్ట్రంలో అయన చేసిన అభివృద్ధిని కీర్తించిన వాళ్ళు కొందరైతే.. ఆయన అక్రమ అరెస్టు ఖండించి  క్రెడిట్ కోసం ప్రయత్నించిన వారు మరికొందరు. ఏది తెలంగాణ రాజకీయాలలో తెలంగాణ రాకీయాలలో చంద్రబాబు పేరు ప్రస్తావన రాని రోజు లేదు. నిజానికి ఇది దేశ రాజకీయాలలో సరికొత్త అధ్యాయం. ఎందుకంటే అవినీతి ఆరోపణలపై చంద్రబాబు జైలులో ఉన్న సమయంలోనే ఆయనను మా వాడంటే మా వాడని చెప్పుకున్నారు. ఇక ఆయన బెయిల్ పై బయటకి వచ్చిన తరువాత ఆయన పార్టీ తెలుగుదేశం  జెండా కోసం తెలంగాణ నేతలు తీవ్రంగా ప్రాకులాడారు.  తెలంగాణ ఎన్నికల ప్రచారంలో   ముఖ్యమైన మూడు పార్టీల అభ్యర్థులందరి మెడలో తెలుగుదేశం కండువాలు కనిపించాయి.   దాదాపుగా అన్ని పార్టీల నేతలు చంద్రబాబు నామస్మరణ చేశారు. తెలుగుదేశం మద్దతు దారులు, చంద్రబాబు అభిమానులు, ఆంధ్రా సెటిలర్ల   ఓట్ల కోసం   రాజకీయాలతో సంబధం లేకుండా అన్ని  పార్టీలూ, అందరు అభ్యర్థులూ ప్రాకులాడటం స్పష్టంగా కనిపించింది.  ఎవరికి వారు తెలుగుదేశం మద్దతు కోసం పసుపు కండువాలు మెడలో వేసుకున్నారు. తెలంగాణలో అతి పెద్ద పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు సైతం చంద్రబాబు నామస్మరణతోనే ప్రచారం సాగించారు. ఇది ఇంతకు ముందెన్నడూ చూడనిది.. గతంలో ఎన్నడూ జరగనిది. చంద్రబాబు తెలంగాణ ప్రాంతంలో పోటీ చేసినన్ని రోజులూ  ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం ఆయన కనీసం పోటీలో కూడా లేకుండానే గెలిచేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు   పోటీలో నిలపకుండానే  తెలంగాణలో తెలుగుదేశం పార్టీని గెలిపించారు.    ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. గత తొమ్మిదేళ్లలో తెలుగుదేశం ప్రస్థానాన్ని పరిశీలిస్తే  తెలంగాణలో ఆ పార్టీ పెద్దగా యాక్టివ్ గా లేదనే చెప్పాలి. అయినా తెలుగుదేశం పార్టీకి మరీ ముఖ్యంగా చంద్రబాబుకు తెలంగాణ వ్యాప్తంగా అసంఖ్యాక అభిమానులు ఉన్నారు. పార్టీకి బలమైన క్యాడర్ చెక్కు చెదరకుండా అలాగే ఉంది.  గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే ఇప్పటికీ తెలంగాణలో చాలా ప్రాంతాలలో పార్టీల జయాపజయాలను  ప్రభావితం చేయగలిగిన సత్తా, బలం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రజలలో ఉన్న నమ్మకం, అభిమానమే ఇందుకు కారణం. తెలంగాణ  జనం గుండెల్లో చంద్రబాబు కొలువై ఉన్నారనీ, ప్రజలు ఆయనను ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారన్న విషయం ఆయన అక్రమ అరెస్టుతో బయటపడింది. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనలతో తేటతెల్లమైంది. ఆయన అక్రమ అరెస్టుకు నిరసనగా వెల్లువెత్తిన ఆందోళనపై తెలంగాణ  మంత్రి కేటీఆర్  అభ్యంతరం వ్యక్తం చేసినా, ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం స్పందించకపోయినా.. బీఆర్ఎస్ నేతలూ, శ్రేణులూ మాత్రం బాబు జపం చేశారు. పరిస్థితిని గమనించిన కేటీఆర్ కూడా తన వ్యాఖ్యలకు నాలుక కరుచుకుని నష్టనివారణకు చేయగలిగినంతా చేశారు. దీనిని బట్టే  పోటీలో దిగకుండా చంద్రబాబు గెలిచేశారని, తెలుగుదేశం పార్టీని తెలంగాణలో గెలిపించేశారనీ అర్ధం చేసుకోవచ్చు.  తెలంగాణ ఎన్నికలలో తెలుగుదేశం పోటీ చేయదన్న నిర్ణయంతో విబేధించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా చేశారు. పరిశీలకులు పార్టీని పోటీలో నిలపకపోవడం పొరపాటు నిర్ణయం అంటూ విశ్లేషణలు చేశారు. అయితే తెలంగాణ ఎన్నికల ప్రచారం ఆరంభమైన తరువాత చంద్రబాబు ఎంత ముందు చూపుతో ఆ నిర్ణయం తీసుకున్నారన్నది అందరికీ అవగతమైంది. మొత్తం తెలంగాణ అంతా చంద్రబాబు వెంటే ఉందనీ, ఇప్పుడు ఎన్నికలలో ఏ పార్టీ గెలిచిందన్నది ముఖ్యం కాదు. కానీ ఏ పార్టీ గెలిచినా అది తెలుగుదేశం చలవతోనే అని చెప్పుకోవలసిన పరిస్థితి తెలంగాణలో ఏర్నడింది.  అన్ని పార్టీలూ చంద్రబాబును తమవాడిగా చెప్పుకునేందుకు పోటీలు పడ్డాయి. గతంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన వారు కూడా ఈ ఎన్నికలలో అయనను  కీర్తించడం విశేషం. దీంతో పోటీలో ఉండగా అందరినీ ముప్పతిప్పలు పెట్టిన చంద్రబాబు ఈ ఎన్నికలలో కనీసం పోటీలో లేకుండానే  ఘన విజయం సాధించేశారు.

ఎపిలో పొంచి ఉన్న ‘మియాచుంగ్’ తుపాను

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడనుంది.  ఆదివారం తుపానుగా మారుతుందని, దీని ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల ఆది, సోమ వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్య కారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. తుపాను తీవ్రత నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. పంట కోతలపై అవగాహన కల్పించాలని, రైతులకు అందుబాటులో ఉండాలని సూచించింది. తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రెండు రోజులుగా దంచికొడుతున్న వానలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువళ్లూరు, కాంచీపురం, చెన్నై ప్రాంతాలకు అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. అటు, బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఈరోజు సాయంత్రానికి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ చెబుతోంది. రెండ్రోజుల్లో అది తుపానుగా మారొచ్చని అంచనా వేసింది. గత వారం రోజులుగా ఏజెన్సీలో చలి ప్రభావం పెరుగుతోంది. చింతపల్లిలో కనిష్ఠంగా 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం వేళల్లో కాఫీ తోటలు, పంట పొలాలకు వెళ్లే కూలీలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు వణుకుతూ ప్రయాణం  చేస్తున్నారు.అల్పపీడనం వల్ల ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది.  రేపటికి తీవ్రవాయుగుండంగా, ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశం ఉంది.  సోమవారం సాయంత్రం చెన్నై- మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది.  దీని ప్రభావంతో ఆదివారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి.

వాటర్ వార్ లో కొత్త ట్విస్ట్.. ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. సరిగ్గా ఎన్నికల వేళ సాగర్ జలాల విడుదల విషయంలో ఏపీ సర్కార్ దుందుడుకుగా వ్యవహరించింది. సాగర్ డ్యాం నుంచి బలవంతంగా అనే కంటే దౌర్జన్యంగా నీటిని విడుదదల చేసింది. ఇంత కాలం ఊరుకుని ఇప్పుడు హడావుడిగా జగన్ సర్కార్ ఈ తీరులో దూకుడు ప్రదర్శించడం వెనుక  తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు రాజకీయ లబ్ధి చేకూర్చే ప్రయత్నం ఉందన్న  విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.   ఎన్నికల వేళ సెంటిమెంట్ రగిలించేలా.. రెండు రాష్ట్రాల మధ్యా విభజన నాటి ఉద్రిక్తతలను రేకెత్తించి.. తెలంగాణలో తన మిత్రుడికి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. సరే ఇప్పుడు ఆ వ్యూహం ఫలించిందా లేదా అన్న విషయాన్ని వదిలేస్తే.. ఏపీ పోలీసులు మాత్రం కచ్చితంగా చిక్కుల్లో పడ్డారు. ఏపీ పోలీసులు తమ భూభాగంలోకి దౌర్జన్యంగా ప్రవేశించారంటూ, డ్యామ్‌పై కాపలాగా ఉన్న ఎస్పీఎఫ్ పోలీసులు, తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు  ఏపీ పోలీసులపై విజయపురి స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 447, 427 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో   ఏ1గా ఏపీ పోలీసులను చేర్చారు.  500 మంది సాయుధ బలగాలతో డ్యామ్ పైకి బలవంతంగా వచ్చారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. డ్యామ్ 13 గేట్లు ధ్వంసం చేశారని.. కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఏపీకి నీటిని విడుదల చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  

4న కేసీఆర్ కేబినెట్ భేటీ.. కొత్త ఆనవాయితీకి శ్రీకారమా?

తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాలలో రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం ఎవరిది అన్నది తేలుతుంది. అయితే తెలంగాణలో ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అనూహ్యంగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బహుశా గతంలో ఏ ఆపద్ధర్మ ముఖ్యమంత్రీ ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉండరు. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తెల్లాడి అంటే డిసెంబర్ 4న కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ భేటీ  సోమవారం (డిసెంబర్ 4) మధ్యాహ్నం 2గంటలకు జరగనుంది.  ఈ మేరకు  సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. అసలు కేసీఆర్ ఫలితాల విడుదల తరువాత కేబినెట్ భేటీకి పిలుపునివ్వడాన్ని పరిశీలకులు తప్పుపడుతున్నారు. ఇప్పడు తెలంగాణ రాజకీయాలలో ఈ కేబినెట్ భేటీ హాట్ టాపిక్ గా మారింది. అసలా భేటీ ఉద్దేశమేమిటి, అజెండా ఏమిటన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   ఇలా ఉండగా కేసీఆర్ పోలింగ్ పూర్తయిన తరువాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు కానీ పార్టీ నేతల వద్ద మనం హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అన్న ధీమా వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవద్దనీ, ఆగం ఆగం కావద్దనీ పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పిన కేసీఆర్.. 3వ తేదీన సంబరాలకు సిద్ధం కావాలని కూడా వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం, సంతకం పెట్టే తొలి ఫైలు తదితర అంశాలపై కూడా కేసీఆర్ మాట్లాడారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసీఆర్ ను ఉటంకిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న ఈ వ్యాఖ్యలలో విజయం పై విశ్వాసం కంటే.. అనుమానాలే ఎక్కువగా వ్యక్తమౌతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో  కాంగ్రెస్ లో విజయం జోష్ అప్పుడే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కేబినెట్ భేటీ  ఏర్పాటు సంచలనం సృష్టిస్తోంది. ఆనవాయితీకి భిన్నంగా ఫలితాలు వెలువడిన తెల్లారి కేసీఆర్ కేబినెట్ భేటీ ప్రకటన వెలువడటంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.