కేసీఆర్ విద్యుత్ మాయ.. ట్రాన్స్ కో జెన్ కోల దుస్థితికి కారణం అదే!

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర రావుకు  రాజకీయ లబ్ధిపై దృష్టే తప్ప దార్శనికత అంటే దూర దృష్టి లేదని.. ఆయన అధికారం నుంచి దూరమైన  రెండో రోజే లోకానికి వెళ్లడైంది. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ అంటూ ఆయన అధికారంలో ఉన్నంత కాలం ఊదరగొట్టేశారు. అయితే ఆ పేరుతో విద్యుత్ రంగాన్ని ఎంతగా అప్పుల ఊబిలో కూరుకుపోయారో కొత్త ముఖ్యమంత్రి రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే తేటతెల్లమైపోయింది. తెలంగాణ నిర్మాణం అంటూ ఆయన చేసిన ప్రసంగాలన్నీ ఓట్లు దండుకునే రాజకీయ విన్యాసాలే వినా.. రాష్ట్రం నిజమైన ప్రగతి కోసం ఆయన చేసిందేమీ లేదనడానికి ఆయన అనుసరించిన విద్యుత్ విధానమే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అసలు ఒక్క విద్యుత్ రంగం అనే కాదు దాదాపుగా రాష్ట్రంలోని అన్ని సంస్థలు, రంగాల పరిస్థితీ అదేనని పరిశీలకులు చెబుతున్నారు.   ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి  ప్రమాణ స్వీకారం చేసి, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో దాదాపు రెండు గంటలు కరెంట్‌ పోయింది.  అందుకు కారణాలేమిటని చూడకుండానే బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ రాగానే కరెంట్ కోతలు షూరూ అంటూ ప్రచారం ఆరంభించేశారు.   ఇప్పుడు కూడా ఆ కారణాల సంగతి కొంచం సేపు పక్కన పెట్టి విద్యుత్ విషయంలో కేసీఆర్ హ్రస్వదృష్టి ఏమిటన్నది చూద్దాం. విద్యుత్తు విషయంలో కుట్ర జరుగుతున్నదని  టీపీసీసీ చీఫ్ గా రేవంత్‌ రెడ్డి పలు సందర్భాలలో  అప్పటి కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించిన సంగతి తెలిసిందే.   ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ విద్యుత్ రంగంపైనే దృష్టి పెట్టారు. సీఎంగా ఆయన నిర్వహించిన తొలి సమీక్ష కూడా విద్యుత్ పైనే. ఆ సందర్భంగా అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ లో  కేసీఆర్ విద్యుత్ మాయ బట్టబయలైంది. విద్యుదుత్పాదనపై కాకుండా కేసీఆర్ విద్యుత్ కొనుగోలుపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఎక్కువ వ్యయం కూడా చేశారు. అందుకే విద్యుత్ రంగం అప్పుల ఊబిలో కూరుకుపోయింది.  ట్రాన్స్ కో , జెన్ కోలకు కలిపి 81వేల516 కోట్ల రూపాయల అప్పు ఉంది. అదే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఈ అప్పులు 22 వేల 422 కోట్లు. దీనిని బట్టి చూస్తేనే కేసీఆర్ హయాంలో విద్యుత్ అప్పులు ఏ స్థాయిలో పెరిగాయో అవగతమౌతుంది. సరే అప్పులు చేశారు, మరి ఆదాయం మాటేమిటంటే.. దాని గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.  3వేల పై చిలుకు కోట్లు, అది కూడా ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా కలుపుకుంటే. దీనిని బట్టే కేసీఆర్ తీరు ఏమిటన్నది అవగతమౌతుంది.  తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యుత్ రంగ నిపుణులు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత విద్యుత్ రంగంలో తీసుకోవలసిన చర్యలపై కూడా వారు అప్పట్లో ప్రస్తావించేవారు. అయితే తెలంగాణ ఆవిర్భావం తరువాత.. రాష్ట్ర సాధకుడిగా క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకున్న కేసీఆర్.. ఉద్యమ సమయంలో తన వెంట నడిచిన వారందరినీ పక్కకు నెట్టేశారు. అలా నెట్టేసిన వారిలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు కూడా ఉన్నారు. అలాగే విద్యుత్ రంగ నిపుణులు కూడా. దీంతోనే తెలంగాణ కర్త, కర్మ, క్రియా అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్.. నిజమైన ప్రగతి కంటే ఓట్లు తెచ్చిపెట్టేలా  జనాలను ఆకర్షించడంపైనే పూర్తిగా ఆధారపడ్డారు. వ్యవస్థలు కుప్ప కూలే పరిస్థితి ఉన్నా దాచి.. ఇది సాధించాం, ఇంత సాధించేశాం అని ప్రసంగాలు ఇచ్చే వారు. ఆయన అధికార పాఠం నుంచి దూరమైన తరువాత ఒక్కొక్కటిగా ఆయన ఏరకంగా రంగాలను, సంస్థలను నిర్వీర్యం చేసేశారో బయటపడుతోంది. తొలుత విద్యుత్ రంగం ఎలా అప్పుల ఊబిలో కూరుకుపోయిందో బయటకు వచ్చింది.  ప్రజలకు ఫ్రీబీస్ ఇచ్చేస్తే చాలు ఇక వారు తన మాట జవదాటరు అన్న కేసీఆర్ అహంకార పూరిత వైఖరే  ప్రస్తుత పరిస్థితికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక్క విద్యుత్ రంగం అనే కాదు.. ఒకదాని తరువాత ఒకటిగా అన్ని రంగాలదీ ఇదే పరిస్థితి అంటున్నారు.  

పని మొదలెట్టేశారు!.. అధికారులు ఆ వేగం అందుకోగలరా?

పని చేసే ప్రభుత్వం వేగం ఎలా ఉంటుందో.. ప్రజలకు, రాష్ట్రానికీ సేవ చేయాలన్న సంకల్పం ఉండే సీఎం తీరు ఎలా ఉంటుందో.. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతలలో చూపిస్తున్నారు. ఒకే సమయంలో గత ప్రభుత్వ తప్పిదాలు, అవకతవకలపై సీరియస్ గా చర్యలకు ఆదేశిస్తూనే, ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల అమలుకు చర్యలూ తీసుకుంటున్నారు. అదే సమయంలో మంత్రివర్గం కొలువుదీరిన ఒక రోజు వ్యవధిలోనే కేబినెట్ భేటీ నిర్వహించి గత తొమ్మిదేళ్లలో గత ప్రభుత్వ ఖర్చులపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేసి రాష్ట్ర ప్రజలకు వాస్తవ పరిస్థితిని తెలియజేయాలని నిర్ణయించారు. అందుకు అవసరమైన వివరాలను రెడీ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆ వేగం చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఆ వేగం అందుకోగలమా అంటూ కంగారు పడుతున్నారు. ఇక తొలి క్యాబినెట్ భేటీలో ఆరు గ్యారెంటీల అమలుపై సుదీర్ఘంగా చర్చిచడమే కాకుండా. రెండు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టారు.  ఆ రెండు గ్యారంటీలనూ కూడా తెలంగాణ ఇచ్చిన అమ్మగా సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా   అంటే శనివారం (డిసెంబర్ 9) నుంచి అమలు చేయడానికి నిర్ణయించేశారు. ఆరు గ్యారంటీలలో ఒకటైన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం,   రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకూ పేదలకు వైద్యం హామీల అమలు శనివారం (డిసెంబర్ 9) నుంచి మొదలైపోయాయి. ఇక మిగిలిన ఆరు గ్యారంటీలనూ కూడా సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని కేబినెట్ తొలి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.   

కేసీఆర్ కు ఆపరేషన్.. రేవంత్ స్పందన పట్ల సర్వత్రా హర్షం

రాజకీయ నాయకుడికీ, నాయకుడికీ తేడా ఏమిటో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి చేతలలో చూపిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించిన, వ్యవహరిస్తున్న తీరుకూ, సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే  రేవంత్ వ్యవహరిస్తున్న తీరుకూ తేడాను జనం గుర్తించారు. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలూ సహజం. అయితే అవి అంశాల వారీగా ఆయా పార్టీల విధానాలకు అనుగుణంగా విమర్శలూ, ప్రతి విమర్శలూ ఉండాలి. ఆ పరిధి దాటి వ్యక్తిగత స్థాయికి విమర్శలు దిగజారితే.. అది ఎంత మాత్రం విజ్ణత అనిపించుకోదు. అలా విమర్శలు చేసే వారు ప్రజలలో చులకన అవుతారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు.. విపక్షాలపై చేసే విమర్శలు ఎన్నడూ విధాన పరిధి దాటిన సందర్భం కనిపించదు. వర్తమాన రాజకీయాలలో నాయకులలో హుందాతనం ఎలా ఉండాలన్నదానికి రోల్ మోడల్ గా బాబు నిలుస్తారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కూడా ఆ కోవలోకి వచ్చే నేతగా ఆయన వ్యవహార శైలి ఉంది.   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్, రేవంత్ పోటాపోటీగా ఒకరి మీద విమర్శలు చేసుకున్నారు.   ఎన్నికలు ముగిశాయి. ప్రజా తీర్పు కాంగ్రెస్ వైపు ఉండటంతో  రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్  పార్టీ విపక్షానికి పరిమితం అయ్యింది. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటమిని అంగీకరిస్తూ హుందాగా ప్రజల ముందుకో, మీడియా ముందుకో వచ్చి నూతన ప్రభుత్వాన్ని, నూతన ప్రభుత్వ సారథిని అభినందించలేదు. కేసీఆర్ అనేమిటి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎవరూ కూడా, (హరీష్ రావు మినహాయించి) కొత్త ప్రభుత్వాన్ని అభినందించి శుభాకాంక్షలు చెప్పిన దాఖలాలు లేవు.   అయితే రేవంత్ మాత్రం.. ఎన్నికలు పూర్తి అయిన తరువాత రాజకీయ విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. పాలనా వ్యవహారాలలో మునిగిపోయారు. కేసీఆర్ కు గాయం అయ్యిందనీ, ఆయన ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారనీ తెలియగానే.. రేవంత్ వేగంగా స్పందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యులను ఆదేశించారు. ఆయన చికిత్స పొందుతున్ ఆస్పత్రి వద్ద భద్రత పెంచారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని   X వేదికగా ఆకాంక్షించారు. రేవంత్ స్పందించిన తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నది. ఓటమిని అంగీకరిస్తూ, కొత్త ప్రభుత్వాన్ని అభినందిస్తూ కనీసం ప్రకటన కూడా చేయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, రేవంత్ కు ఉన్న తేడాను పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వ్యవహారశైలిని రేవంత్ తీరుతో పోల్చి చూపుతూ విమర్శలు గుప్పిస్తున్నారు.  ఏపీలో స్కిల్ కేసులో అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో చంద్రబాబు పట్ల, ఆయన ఆరోగ్యం పట్ల, ఆయన కుటుంబం పట్ల కూడా ముఖ్యమంత్రి జగన్,  వైసీపీ నాయకులు చేసిన చవకబారు వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. రాజకీయాలలో అహంకారానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన జగన్ , రేవంత్ రెడ్డి హుందాతనాన్ని చూసి నేర్చుకోవాల్సినది ఎంతో ఉందని అంటున్నారు.   

తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాలనలో వేగం చూపుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాల అమలుకు శ్రీకారం చుడుతున్నారు. తొలిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నెరవేర్చారు. రాష్ట్రంలో మహిళలు శనివారం (డిసెంబర్ 9) నుంచి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకం అమలులోకి వచ్చింది. ఈ పథకం కింద తెలంగాణలో శనివారం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతోంది. మహాలక్ష్మి స్కీమ్ ను అమలు ప్రారంభిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ స్కీమ్ ప్రకారం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, ఆర్డనరీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణమే. తెలంగాణ దాటి బయటకు వెళ్లాలనుకునేవారు మాత్రం బోర్డర్ వరకూ  ఉచితంగా ప్రయాణించి,  బోర్డర్ దాటిన తరువాత నుంచి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సూపర్ లగ్జరీ బస్సులను ఉచిత కేటగరిలో చేర్చకపోవడంతో డబ్బులు కట్టి వెళ్లాలనుకునే వారు ఆ బస్సుల్లో ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులు మామూలుగా తక్కువగా ఉంటాయి. అవి కిక్కిరిసిపోయే అవకాశం ఉంటుందన్న భావనతో వాటి సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.  

ఆ కేసుల సత్వర విచారణ.. ఏపీ హైకోర్టు నిర్ణయం

ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ హైకోర్టు పలువురు ఎంపీ, ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వారిపై నమోదైన కేసుల సత్వర విచారణకు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు నిర్ణయంతో   కళంకిత ప్రజాప్రతినిధులలో ఆందోళన మొదలైంది. వారిపై ఉన్న కేసులలో  ఏ ఒ  కేసులో  దోషిగా తేలినా ఎన్నికలలో పోటీకి అనర్హులయ్యే అవకాశం ఉండంతో పలువురు  ఎంపీలు, ఎమ్మెల్యేలలో ఆందోళన వ్యక్తమౌతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు,  ఇతర ప్రజాప్రతినిధులపై గతంలో నమోదైన కేసుల విచారణ నత్తనడక నడుస్తోందన్న ఫిర్యాదులపై తాజాగా స్పందించిన సుప్రీంకోర్టు.. వీటి వ్యవహారం వెంటనే తేల్చాలని దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర క్రిమినల్ కేసుల్లోనూ విచారణల్లో అసాధారణ జాప్యం చోటు చేసుకోవడంపై హైకోర్టులకు సుప్రీం అక్షింతలు వేసిన సంగతి విదితమే. హైకోర్టులో ఈ కేసుల విచారణకు ప్రత్యేక బెంచ్ లు ఏర్పాటు చేయాలని అప్పట్లో ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు స్పందించింది.  రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధులందరిపైనా నమోదైన కేసుల విచారణ వేగవంతం చేసే దిశగా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా కేసుల సత్వర విచారణపై ఆదేశాలు ఇచ్చేందుకు వీలుగా సుమోటోగా ప్రజాప్రయోజన వాజ్యం నమోదు చేసింది.  దీనిపై హైకోర్టు విచారణ జరిపి విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు తగిన ఆదేశాలు ఇవ్వనుంది. ఈ పిల్ లో ప్రతివాదులుగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుతో పాటు సీఎస్, డీజీపీ, హైకోర్టు పీపీని కూడా చేర్చింది. రెండు నెలల్లో ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ప్రజాప్రతినిధులపై కేసుల్లో విచారణను వేగవంతం చేసి తీర్పులు ఇవ్వడం మొదలుపెడితే ఆ ప్రభావం కచ్చితంగా ఇప్పటికే కేసులున్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై పడుతుంది. ఆ కేసులలో దోషిగా తేలిన ప్రజాప్రతినిథులు పోటీకి అనర్హఉలయ్యే అవకాశాలు ఉండటంతో హైకోర్టు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులకు ముచ్చెమటలు పడుతున్నాయి. 

ఆ ఫైళ్లలో ఏముంది?

పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని  మాజీ ఎస్డీవో హల్ చల్ చేశారు. కార్యాలయంలోని ఫైళ్ల తరలింపునకు, ధ్వంసానికి ప్రయత్నించారు. ప్రభుత్వం మారిన తరువాత ఆయన ఫైళ్ల తరలింపు, ధ్వంసానికి పాల్పడటం సంచలనం సృష్టించింది. అభ్యంతరాలను లెక్క చేయకుండా కార్యాలయంలోనికి ప్రవేశించిన మాజీ ఎస్టీవో కల్యాణ్ ఫైళ్లను ధ్వంసం చేసి, సంచీలలో మూటగట్టి బయటకు తీసుకువెళ్లేందుకు చేసిన ప్రయత్నం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. రెండు రోజుల కిందట ఓ వైపు కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే మంత్రి శ్రీనివాస గౌడ్ కార్యాలయం నుంచి ఫర్నీచర్ తరలింపునకు ప్రయత్నాలు జరగడం, అలాగే  పలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల కార్యాలయాల నుంచి కూడా ఫర్నీచర్ తరలింపునకు ప్రయత్నాలు జరగడం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఫైళ్ల ధ్వంసం, తరలింపునకు యత్నం జరగడం సంచలనం సృష్టిస్తోంది. గత ప్రభుత్వంలో పశుసంవర్ధక, సినిమాటోగ్రఫి,ఫిషరీస్ శాఖల మంత్రి అయిన  తలసానికి ఓఎస్డీగా పని చేసిన కల్యాణ్ ఆయా శాఖల ఫైళ్ల తరలింపునకు ప్రయత్నించడం అనుమానాలకు తావిస్తోంది. ఓఎస్డీగా తన పదవీ కాలం ముగిసిన నాలుగు రోజుల తరువాత, అదీ డిపార్ట్ మెంట్ నుంచి ఎలాంటి ఫైల్స్ తీసుకెళ్లొద్దని సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేసినా, కార్యాలయంలోని సిబ్బంది సహకారంతో దస్త్రాల తరలింపునకు ప్రయత్నించడంతో ఆ శాఖలో భారీ అక్రమాలు జరిగాయా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే బీరువాల్లో ఫైల్స్ ఎలుకలు కొట్టేస్తున్నాయనీ, అయినా అవేమీ అంత ముఖ్యమైనవి కావనీ కల్యాణ్ తన చర్యను సమర్ధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ప్రారంభమైన ప్రజా దర్బార్.. భారీగా తరలి వచ్చిన ప్రజలు 

పదేళ్ల కెసీఆర్ పాలనలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే సంస్కృతి లేదు. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన  రేవంత్ రెడ్డి మరుసటి రోజే చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం జ్యోతిరావు పూలే ప్రజాభవన్ (ప్రగతిభవన్)లో ప్రారంభమయింది. ప్రభుత్వానికి తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వారి నుంచి ముఖ్యమంత్రి వినతులను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్ లో ప్రజల అర్జీల వివరాలను అధికారులు నమోదు చేసుకుని, క్యూలైన్లలో లోపలకు పంపిస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి సెక్రటేరియట్ కు వెళ్లనున్నారు. విద్యుత్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. జడ్పిటిసి స్థాయి నుంచి సీఎం స్థాయికి వచ్చిన రేవంత్ రెడ్డికి ప్రజల నాడీ బాగా తెలుసు. సమస్యలకు పరిష్కారాలు వెతకడం ఆయనకు పెద్ద టాస్క్ కాదు. ఎమ్మెల్యేల స్థాయిలో ప్రజా దర్బార్ నిర్వహించాలని పరిశీలకులు అంటున్నారు. అత్యధిక మెజార్టీతో గెలుపొందిన గడ్డం వివేక్ వెంకటస్వామి  ఎన్నికల ప్రచారంలోనే తాను గెలిస్తే ప్రజా దర్బార్ నిర్వహిస్తానని హామి ఇచ్చారు. ఆయన బాటలోనే మిగతా ఎమ్మెల్యేలు ప్రజా  దర్బార్ నిర్వహించాలని ఆశిద్దాం.   

ఎన్పీడీసీఎల్ సీఎండి అన్నమనేని గోపాల్‌రావు రాజీనామా

ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ రాజీనామా చేసిన తర్వాత కార్పోరేషన్ చైర్మన్లు అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే.తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నత పదవుల్లో ఉన్నవారు వరుసపెట్టి రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు చేరారు. ఆయన నిన్న తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శికి పంపించారు. అనంతరం గోపాల్‌రావు మాట్లాడుతూ.. ఈ సుదీర్ఘ ప్రయాణంలో పదవి తనకు చాలా సంతృప్తినిచ్చిందన్నారు. ఇంతకాలం తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇటీవల ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, సాంస్కృతిక సలహాదారు రమణాచారి రాజీనామా చేశారు. తాజాగా, గోపాల్‌రావు కూడా తప్పుకున్నారు.

ప్రొటెం స్పీకర్ ఎవరు?

తెలంగాణలో తొలి సారి కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైంది. ఇక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షణం ఆలస్యం చేయకుండా పాలన ప్రారంభించేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని శనివారం నుంచే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్య బీమాకూడా తక్షణమే అమలుకు నిర్ణయం తీసేసుకున్నారు. వరుస సమీక్షలకు కూడా రెడీ అయిపోయారు. ఇక శనివారమే అసెంబ్లీ సమావేశంలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర మూడో అసెంబ్లీ తొలి సమావేశాలకు ప్రొటెం స్పీకర్ ఎవరన్ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.   ప్రొటెం స్పీకర్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సభ స్పీకర్ ను ఎన్నుకునేంత వరకూ ప్రొటెం స్పీకరే స్పీకర్ బాధ్యతలు నిర్వహిస్తారు. అటువంటి కీలకమైన ప్రొటెం స్పీకర్ ఎవరు అన్న విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.  ఈ ఆసక్తి ఎందుకంటే సాధారణంగా అసెంబ్లీకి ఎక్కువ సార్లు ఎన్నికైన సీనియర్ ప్రొటెం స్పీకర్ గా వ్యవహరిస్తారు. కొత్త అసెంబ్లీలో అందరి కంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావే. అయితే కేసీఆర్ అసలు అసెంబ్లీకి హాజరౌతారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకూ కొత్త ముఖ్యమంత్రిని అభినందించి శుభాకాంక్షలు చెప్పింది లేదు. కనీసం హుందాగా ఓటమిని అంగీకరిస్తూ ప్రతిపక్షంగా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తామన్న ప్రకటన కూడా చేయలేదు. ఇహ ఇప్పుడు ఆయన హాజరుపై ఎటువంటి అనుమానాలూ లేవు. ఎందుకంటే ఆయన గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కనుక ఆయన అసెంబ్లీ తొలి సమావేశాలకు హాజరయ్యే ప్రశ్నే లేదని తేలిపోయింది. ఇక మిగిలిన వారిలో సీనియర్లు అంటే అధికార కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. వారిరువురూ కూడా రేవంత్ కేబినెట్ లో మంత్రులు. ఇక బీఆర్ఎస్ నుంచి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, దానం నాగేందర్ ఉన్నారు. వీరు కాకుండా ఎంఐఎం నుంచి అసెంబ్లీకి ఆరుసార్లు ఎన్నికైన అక్బరుద్దీన్ ఒవైసీ ఉన్నారు. దీంతో ప్రొటెం స్పీకర్ గా ఎవరు ఉంటారన్నది ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన వారు ప్రొటెం స్పీకర్ గా ఉండేందుకు సుముఖత వ్యక్తం చేస్తారా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకూ ఆ పార్టీ శాసనసభాపక్ష నేతను కూడా ఎన్నుకోలేకపోయింది. పార్టీ శాసనసభా పక్ష నేత ఎంపిక విషయంలో పార్టీలో ఏకాభిప్రాయం లేదని బీఆర్ఎస్ వర్గాల నుంచే గట్టిగా వినిపిస్తోంది. అన్నిటికీ మించి బీఆర్ఎస్ నుంచి సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా వలసలు ఉంటాయన్న ప్రచారం రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. దీంతో ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ వ్యవహరంచే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మాజీలు.. కార్యాలయాల ఖాళీ నెపంతో ప్రభుత్వ ఫర్నీచర్ తరలింపునకు యత్నాలు!?

ఒక వైపు తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు జరుగుతుంటే.. ఇదే సందుగా మాజీ మంత్రులు తమ కార్యాలయాల నుంచి ప్రభుత్వ ఫర్నీచర్ ను తరలించుకుపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అది గమనించి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుపడటంతో రాష్ట్రంలో పలు చోట్ల ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కార్యాలయాలలో ఫర్నీచర్ ప్రభుత్వ సొత్తు. అధికారం ఉన్నంత వరకూ అనుభవించడం మాత్రమే మంత్రుల పని. అధికారం నుంచి తప్పుకోగానే ఆ కార్యాలయాన్ని వీడాలే తప్ప ఫర్నిచర్ ను కూడా తరలించేయడం సరికాదు. అయితే కొందరు బీఆర్ఎస్ మాజీలు అదే చేస్తున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనుచరులు రవీంద్ర భారతి సమీపంలో ఉన్న ఆయన కార్యాలయాన్ని ఖాళీ చేసే క్రమంలో ఫర్నీచర్, కంపూటర్లను కూడా ట్రాలీలోకి ఎక్కించేస్తుండగా గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రభుత్వ సొత్తును తరలించడం తగదంటూ వాగ్వాదానికి దిగారు. విషయం పోలీసుల వరకూ వెళ్లింది.  ఇక పలువురు ఎమ్మెల్యులు కూడా తమ తమ క్యాపు కార్యాలయాలను ఖాళీ చేసే నెపంతో ఫర్నీచర్ కు కూడా తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలనూ సముదాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలలోని ఫర్నిచర్, ఇతర వస్తువుల పర్యవేక్షణ బాధ్యత వహిస్తున్న రోడ్లు  భవనాల శాఖ స్పందించి.. పరాజయం పాలైన కొందరు ఎమ్మెల్యేలు కార్యాలయంలో ఫర్నీచర్ తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సరికాదని పేర్కొంది.    బోధన్‌లో మాజీ షకీల్ అమీర్  తన క్యాంపు కార్యాలయంలోని ఫర్నీచర్ తలరించడానికి చేసిన ప్రయత్నం కూడా ఉద్రిక్తతలకు దారి తీసింది.  అసలు విషయమేమిటంటే తెలంగాణ ఏర్పాటు అనంతరం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర  ఒక్కో నియోజకవర్గంలో క్యాంపు కార్యాలయాలను కోటి రూపాయల చొప్పున నిధులతో నిర్మించింది. వాటి విద్యుత్ బిల్లులు, పన్నులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ వచ్చింది.   ఇప్పుడు ప్రభుత్వం మారింది. పరాజయం పాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కొందరు తమతమ క్యాంపు కార్యాలయాలను ఖాళీ చేసే నెపంతో ప్రభుత్వ ఫర్నీచర్ ను కూడా తరలించే ప్రయత్నాలు చేస్తుండటంతో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. పరాజయం పాలైన  ఎమ్మెల్యేలు తమతమ క్యాంపు కార్యాలయాలను ఖాళీ చేసిన తరువాత వాటికి అవసరమైన మరమ్మతులు చేసి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఆర్అండ్ బీ శాఖ అప్పగించాల్సి ఉంటుంది.

 పైలట్ నుంచిహో మంత్రి వరకు...

దేశ సేవే పరమావధిగా పైలట్ గా అడుగుపెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి విలక్షణ శైలి. ఈ పేరు వింటే తెలుగు ప్రజల్లో ఒక ఉత్సాహం నెలకొంటుంది.  ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ లో విధులు నిర్వర్తించారు. ఎయిర్ ఫోర్స్ లో ఉన్నా.. రాష్ట్రపతి భవన్ లో విధులు నిర్వర్తించిన ఉత్తమ్ కుమార్  అది ప్రజా సేవే అని భావించేవారు.  ఆ సేవ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి  ఆయన అడుగుపెట్టారు. ప్రజలకు సేవ చేయాలి అని ఆయనలో వచ్చిన ఆ ఆలోచన ఇప్పుడు హోమ్ మంత్రి వరించేలా చేసింది.   ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టింది మొదలు ఇప్పటివరకు ప్రజా సేవే ప్రధాన అజెండాగా  ఆయన ముందుకు సాగారు. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే సీనియర్ నేతగా ఉత్తమ్ కుమార్ చేసిన కృషి ఎనలేనిది. ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టినున్న సందర్భంగా ఉత్తమ్ కుమార్ రాజకీయ ప్రస్థానం గురించి  చర్చించుకోవాల్సిన తరుణమిది.  1962 జూన్ 20న సూర్యాపేటలో పురుషోత్తంరెడ్డి- ఉషారాణి దంపతులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మించారు. ఆయన బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత భారత వైమానిక దళంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పైలట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ సేవలో తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత భారత రాష్ట్రపతి భవన్ లో సేవలు అందించారు. రాష్ట్రపతి విదేశీ ప్రయాణాల్లో సెక్యూరిటీ ప్రొటోకాల్ కంట్రోలర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎనలేని సేవలు అందించారు. అలాంటి ఒక గొప్ప పదవిలో ఉన్న వ్యక్తి ఎంతో సంతోషంగా తన జీవితాన్ని గడిపేయచ్చు. రిటైర్ అయిన తర్వాత భార్యాపిల్లలు, మనువలు, మనవరాళ్లు అంటూ జీవితాన్ని సంతోషంగా గడిపేయచ్చు. కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ దారిని ఎంచుకోలేదు. రాజకీయ బాటలో ముళ్లుంటాయని తెలిసినా రాజకీయాల్లోకి రావాలి అని బలంగా సంకల్పించారు.  దేశ సేవ చాలించి ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజా సేవ, రాజకీయాలు అంటే అవమానాలు, విమర్శలు, ఛీత్కారాలు ఉంటాయని తెలిసినా కూడా కావాలనే రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని, పార్టీకి అండగా ఉన్న నాయకులు, సీనియర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకరు. ఆయన రాజకీయ ప్రస్థానం 1994లో ప్రారంభమైంది. కాంగ్రెస్ తరఫున 1994లో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ, ఆ సమయంలో ఉత్తమ్ కు ఓటమి తప్పలేదు. కానీ, ఓటమితో ఆయన కుంగిపోలేదు. ప్రజాక్షేత్రంలోనే తన పోరాటాన్ని కొనసాగించారు. తర్వాతి దఫా 1999లో ఎన్నికల్లో మళ్లీ కోదాడ స్థానం నుంచే పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004 ఎన్నికల్లో రెండోసారి కోదాడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం పోటీ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడ్డ హుజూర్ నగర్ నుంచి పోటీ చేశారు. అప్పుడు కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014, 2018లో కూడ హుజూర్ నగర్ స్థానం నుంచే బరిలోకి దిగిన ఉత్తమ్ కుమార్ ఘన విజయం సాధించారు. 2019లో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహా రెడ్డిపై 25,682 ఓట్ల మెజారిటీతో అద్భుతమైన విజయం సొంతం చేసుకున్నారు. తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హుజూర్ నగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి.. ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నో కీలక  బాధ్యతలను కూడా నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ గా చేశారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో గృహ, బలహీన వర్గాల మంత్రిగా సేవలందించారు. 2015 నుంచి 2021 మధ్య తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా  కూడా ఉత్తమ్ కుమార్ పని చేశారు. తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే సీనియర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన సేవను పార్టీ సైతం మర్చిపోలేదు. అందుకే పార్టీలో ఉన్న ఒక సీనియర్ నేతను మంత్రి పదవితో గౌరవించింది. ఒక పైలట్ గా దేశానికి సేవలందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు మూడు దశాబ్దాలుగా అంతే బాధ్యతగా ప్రజాసేవకు అంకితమయ్యారు.

పీపుల్స్ మార్చ్ నుంచి డిప్యూటి సీఎం వరకు...

కాంగ్రెస్ పార్టీని తిరిగి విజయతీరాలకు చేర్చిన ముఖ్యుల్లో సీనియర్ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తన మార్కును నిరూపించారు. ఈ కారణంగానే ఆయనకు ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రి పదవి వరించింది. ఉమ్మడి రాష్ట్రంలో అధికారానికి ఆమడ దూరంలో ఉన్న కాంగ్రెస్ ను 2004లో అధికారంలో తీసుకువచ్చిన వైఎస్ రాజశేశరరెడ్డి  అయితే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ  ప్రధాన ప్రతిపక్షమైన సీఎల్పి నేతగా భట్టి విక్రమార్క పాదయాత్ర ద్వారా తెలంగాణ ప్రజలకు చేరువై అధికారంలో తీసుకురాగలిగారు. ఈ సంవత్సరం మార్చి6న ఆదిలాబాద్ జిల్లా బోధ్ నుంచి పాదయాత్ర ప్రారంభించి 108 రోజుల పాటు సాగిన పీపుల్స్ మార్చ్ ద్వారా  వైఎస్ రికార్డును బ్రేక్ చేశారు. పీపుల్స్ మార్చ్ తన స్వంత జిల్లా ఖమ్మంలో జులై 2న  ముగిసింది. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ లో సరికొత్త ఊపు తీసుకు వచ్చింది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆరోగ్యం క్షీణించినప్పటికీ లెక్క చేయకుండా భట్టి పాదయాత్ర చేశారు. 17 జిల్లాలు, 36 నియోజకవర్గాలు, 750 గ్రామాల మీదుగా నిర్విరామంగా 1350 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిన ఈ యాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభించింది. పెద్ద ఎత్తున యువకులు, మహిళలు పాల్గొన్నారు.  పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ ను అధికారంలో తీసుకురావడానికి దోహదపడటంతో పాటు ఇతర పార్టీల నాయకుల చెయ్యి అందుకోవడానికి సిద్దమయ్యారు. పాదయాత్ర ముగింపు సందర్బంగా ఖమ్మంలో నిర్వహించే జనగర్జన సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావ్ వంటి నేతలు కాంగ్రెస్ గూటిలో చేరారు.  మల్లు భట్టి ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున మధిర శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009, 2014 ఎన్నికలలో మధిర శాసన సభ సభ్యునిగా తిరిగిఎన్నికయ్యారు. 2009 నుండి 2011 వరకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ విప్‌గా ఉన్నారు. 2011 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. మల్లు భట్టివిక్రమార్క 1961 జూన్ 15న మల్లు అఖిలాండ, మాణిక్యమ్మ దంపతులకు జన్మించారు. ఖమ్మం జిల్లా, వైరా మండలం, స్నానాల లక్ష్మీపురం గ్రామంలో జన్మించారు. ఈయన అన్న మల్లు అనంత రాములు నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం మాజీ పార్లమెంటు సభ్యుడు. మరో అన్న మల్లు రవి మాజీ పార్లమెంటు సభ్యులు. విక్రమార్క హైదరాబాదులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ  నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.విక్రమార్కకు నందినితో వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులు.ఒకరు  సూర్య విక్రమాదిత్య మరొకరు సహేంద్ర విక్రమాదిత్య.  కాంగ్రెస్ లో  తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క 2007 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. 2009లో తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009లో చీఫ్ విప్ అయ్యారు. 2011, జూన్ 4న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనుండి పోటీచేసి సమీప సి. పి. యం పార్టీ అభ్యర్థి లింగాల కమల్​ రాజు పై 12,329 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజు పై 3567 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బోడేపూడి వెంకటేశ్వరరావు తర్వాత మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన రెండో వ్యక్తిగా విక్రమార్క సరికొత్త చరిత్ర  సృష్టించారు. 2019 జనవరి 18న తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా నియామకమయ్యారు.

ఇలా ప్రమాణ స్వీకారం.. అలా సీఎం రేవంత్ దూకుడు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ప్రమాణ స్వీకారం చేయగానే అలా పని మొదలెట్టేశారు. విపక్ష నేతగా ఆయన ఎంత దూకుడుగా వ్యవహరించారో, ముఖ్యమంత్రిగానూ అంతే వేగంగా కదులుతున్నారు.  ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే  కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. అలాగే ప్రిన్సిపల్ సక్రెటరీ, ఇంటెలిజెన్స్ చీఫ్ ల మార్పు కూడా  జరిగిపోయింది. అలాగే తన కేబినెట్ సహచరులకు శాఖల కేటాయింపు కూడా జరిపేశారు.  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖ,  ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోం శాఖ, సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ, కొండా సురేఖకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ కేటాయించారు.అలాగే తుమ్మలకు రోడ్లు భవనాల శాఖ, దామోదర రాజనరసింహకు ఆరోగ్య శాఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పురపాలక శాఖ కేటాయించారు. ఇక పొన్నం ప్రభాకర్ కు బీసీ సంక్షేమం, జూపల్లి కృష్ణారావుకు పౌరసరఫరాల శాఖ కేటాయించగా, పొంగులేని శ్రీనివారరెడ్డికి నీటిపారుదల శాఖ కేటాయించారు.   అంతకు ముందు ప్రమాణ స్వీకారం పూర్తిగాకాగా ఆ కార్యక్రమానికి వచ్చిన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించిన రేవంత్ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించిందని చెప్పారు.  ప్రజాప్రభుత్వం ఏర్పడిందనీ,న ఇక సమానాభివృద్ధే లక్ష్యమని ఉద్ఘాటించారు. పోరాటాలు, త్యాగాల పునాదితో ఏర్పడిన తెలంగాణ గత దశాబ్ద కాలంగా నిరంకుశ పాలనలో మగ్గిపోయిందన్నారు. ఇక రాష్ట్రంలో ప్రజా పాలన ఆరంభమైందని ప్రకటించారు. ప్రగతి భవన్ ముందున్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించేశామనీ, ప్రగతి భవన్ ఇక నుంచి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అనీ ప్రకటించారు. ఆ ప్రజా భవన్ లో ప్రతి శుక్రవారం ప్రజాదర్భార్ నిర్వహిస్తామన్నారు. మే పాలకులం కామనీ, మీ సేవకులమనీ చెప్పారు.  విద్యార్థి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తానన్నారు.    ఇక రేవంత్ మాట ఇస్తే నిలబెట్టుకుంటారు అన్న నమ్మకాన్ని ప్రజలలో కలిగేలా ఆయన రెండు ఫైళ్లపై సంతకాలు చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన   ఆరుగ్యారంటీల ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఇక రెండో సంతకం.. ఆయన రజజనీ అనే దివ్యాంగురాలికి ఉద్యోగ నియామక పత్రంపై రెండో సంతకం చేశారు. గతంలో దివ్యాంగురాలు రజనీకి రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమెకు ఉద్యోగం ఇస్తానని వాగ్దానం చేశారు. దానిని గుర్తు ఉంచుకుని తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రజనీని ప్రత్యేకంగా ఆహ్వానించారు.   దివ్యాంగురాలైన ఆమె  ఉన్నత చదువు పూర్తి చేసినా ఉద్యోగం రాకపోవడంతో ఆమె  గతంలో గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిని కలిసి ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ హామీని నెరవేర్చుకున్నారు. ఎక్కడా తాత్సారం లేకుండా చకచకా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను చూసి అధికారులు, సహచర మంత్రులే విస్తుపోతున్న పరిస్థితి. సాధ్యమైనంత త్వరగా పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలనను పరుగులెత్తిస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. 

అప్పుడు చేవెళ్ల చెల్లెమ్మ ఇప్పుడు ములుగు సీతక్క 

కాంగ్రెస్ పార్టీలో చెల్లెలు సెంటిమెంట్ వర్కవుట్ కావడంతో నూతనముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. 2004లో చేవెళ్ల చెల్లెమ్మ సెంటిమెంట్ తో అధికారంలో వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు.  ఈ సంవత్సరం ఫిబ్రవరి ఆరో తేదిన ములుగు నియోజకవర్గంలో సమ్మక్క సారక్క దేవతల సన్నిధి నుండి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన విషయం మనకు తెలిసిందే.   రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలో సీతక్క ఆయన  వెంట నడిచారు.  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపట్టిన బస్సుయాత్ర కూడా చెల్లెలు సెంటిమెంట్ తో ములుగు నియోజకవర్గంలోని రామప్ప దేవాలయంలో ప్రారంభమైంది. ములుగు నియోజకవర్గంలోనే మొట్టమొదటి సభ నిర్వహించి, రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ విజయ వంతంగా అధికారంలోకి రాగలిగింది. సబితా ఇంద్రారెడ్డిని సెంటిమెంట్ గా భావించిన రాజశేఖర్ రెడ్డి నాడు సబితాఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చి కృతజ్ఞత చాటారు. మరి రేవంత్ రెడ్డి  సీతక్క కు ఏకంగా డిప్యూటిసీఎం పదవి ఇచ్చి సరికొత్త చరిత్ర సృష్టించారు. దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అది కూడా కీలక శాఖ బాధ్యతలు అప్పగించడం ఈ చర్చకు దారి తీసింది.   సీతక్క అసలు పేరు ధనసరి అనసూయ. ఆమె  రెండుసార్లు ఎమ్మెల్యేగా ములుగు శాసనసభ నియోజకవర్గం ఎన్నుకోబడ్డారు. అంతే కాదు ఆమె అఖిల భారత మహిలా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతున్నారు.  ధనసరి అనసూయ పూర్వాశ్రమంలో నక్సలైట్. 13 ఏళ్ల ప్రాయంలోనే ఆమె నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితురాలై అడవి బాట పట్టారు. సీతక్క 1988 లో నక్సల్ పార్టీలో చేరినప్పుడు  ఏడో తరగతి విద్యార్థి.  ఫూలన్ దేవి రచనల నుండి ప్రేరణతో సీతక్క తొలుత విప్లవోద్యమం వైపు అడుగులు వేశారు. ఆ మార్గంలో జనశక్తి (సీపీఐ) (ఎంఎల్) పార్టీలో చేరారు.     నక్సలైట్ గా ఉన్న సమయంలో జననాట్య మండలి కళాకారులు గద్దర్, విమలక్క ఆమె  గ్రామాల్లో తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేసారు. రాజ్య హింసను కళ్ళకు కట్టే  నాటకాలతో  ప్రజలను చైతన్యవంతం చేశారు. కూలీరేట్ల, పాలేర్ల జీతాల పెంపు, అధికవడ్డీలకు వ్యతిరేకంగా ఆమె విరోచితంగా పోరాడారు.  గిరిజన ప్రాంతాలలో భూములు ఆక్రమించుకున్న భూస్వాములకు వ్యతిరేకంగా ఆమె పోరాటం సాగించారు. అమాయక గిరిజనులపై అటవీ అధికారులు, పోలీసులు సాగిస్తున్న దాష్టీకానికి వ్యతిరేకంగా ఉద్యమించారు.గిరిజన రైతాంగ పోరాటానికి బాసటగా నిలిచారు.  పెత్తందార్లు గిరిజన అమాయకులపై  కాల్పులు జరిపి చాలా మందిని చంపివేశారు,  స్త్రీలను అవమానించారు. భూస్వాములు చేసిన ఈ హత్యలపై అప్పట్లో పాలకులు కానీ,  పోలీసులు కాని ఎటువంటి చర్యా తీసుకోలేదు. దీంతో గిరిజన సాయుధపోరాటం అనివార్యమైంది. ఈ పోరాటానికి సీతక్క నాయకత్వం వహించారు.  బెంగాల్ లోని నక్సల్బరీ ఉద్యమం ఆమెకు ప్రేరణగా నిలిచింది. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పిలుపునిచ్చారు.  దీంతో పోరుబాట వదిలి లొంగిపోయారు. ఆరోగ్య కారణాలరీత్యా ఆమె జనజీవన స్రవంతిలో కలిసారు. సీతక్క కామ్రేడ్‌గా దాదాపు రెండు దశాబ్దాలు గడిపారు.  ఈ సమయంలో వరసకు ఆమె బావ అయిన దళకమాండర్ ని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కొడుకు.  ఆమె అజ్ఞాత జీవితానికి గుడ్‌బై చెప్పి జన జీవన స్రవంతిలోకి కల్సిన తర్వాత  హైదరాబాద్లో న్యాయవాదిగా మారారు.  సీతక్క సామాజిక సేవలో చురుకుగా ఉండటంతో   అప్పటి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెకు ములుగు టికెట్ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో పరాజయం చెందారు. దీంతో ఆమె డిప్రెషన్ కు గురైంది. ఈ సమయంలో చంద్రబాబు రెండోసారి ములుగు టికెట్ ఇచ్చి సీతక్కను గెలిపించుకున్నారు.   2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపు నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య పై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత  2014లో టీడీపీ అభ్యర్థినిగా బరిలో దిగారు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయారు.తెలంగాణవాదం బలంగా ఉండటంతో  ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందులాల్ పై  22,671 ఓట్ల మెజారిటీతో  కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అదే ములుగు నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థి, మాజీ నక్సలైట్  నాగజ్యోతిపై గెలిచారు. 

తెలంగాణ కొత్త స్పీకర్ ఎవరంటే?

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా వికారాబాద్ నుంచి విజయం సాధించిన గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ హై కమాండ్ ఖరారు చేసింది. గడ్డం ప్రసాద్ కుమార్ ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా అధిష్ఠానం నిర్ణయించడంతో  దళిత సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా స్పీకర్ పదవి దక్కినట్లైంది.  తెలంగాణ స్పీకర్‌గా వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. 2012లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో టెక్స్ టైల్ మంత్రిగా ప్రసాద్ కుమార్ పని చేశారు. తాజాగా కాంగ్రెస్ నిర్ణయంతో దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్‌కు స్పీకర్ పదవిని కట్టబెట్టినట్లయింది. కొత్త అసెంబ్లీ కొలువు దీరిన తర్వాత సభలో సీనియర్ ఎమ్మెల్యే ప్రొటెమ్ స్పీకర్ గా ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తరువాత ఎమ్మెల్యేలందరూ కలిసి స్పీకర్ ను ఎన్నుకుంటారు. కాంగ్రెస్ హైకమాండ్ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ఎంపిక చేయడంతో ఇక అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆయనను ఎన్నుకోవడం లాంఛనమే.  

జయంట్ కిల్లర్ యశస్విని రెడ్డి.. ఎవరీమె?

సీనియర్ నేత, కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రి, పాలకుర్తి నుండి పోటీచేసిన ఎర్రబెల్లి దయాకరరావు ఈసారి చిత్తుగా ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి  అనే 26 ఏళ్ల యువతి యర్రబెల్లిపై 14 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఓటమికి ముందు ఎర్రబెల్లి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా ఒకసారి ఎంపీగా గెలిచారు.   ఏ పార్టీలో ఉన్నా ఆయన ఓటమన్నదే ఎరుగని నేతగా కొనసాగుతూ వచ్చారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న  సమయంలో కూడా తెలుగుదేశం  అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఎర్రబెల్లి సునాయాసంగా గెలిచి సత్తా చాటారు. అలాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నేతను కాంగ్రెస్ అభ్యర్థి,  26 ఏళ్ల యశస్విని రెడ్డి ఓడించి సంచలనం సృష్టించారు. అమెరికా నుండి వచ్చిన యశస్విని రెడ్డి చేతిలో దయాకర్ రావు ఓటమి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం చర్చ అంతా యశస్వినీ రెడ్డి చుట్టూనే తిరుగుతోంది. ఆమె ఎవరు? రాజకీయ అనుభవం ఉందా? అన్న ప్రశ్నలకు సమాధానం కోసం నెటిజనులు అంతర్జాలంలో పెద్ద ఎత్తున  సెర్చ్ చేస్తున్నారు. యశస్విని రెడ్డి బిటెక్ పూర్తి చేసి అమెరికాలో  ఉన్నతోద్యోగం చేస్తూ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకే వరంగల్  వచ్చారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండానే తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి ఏకంగా మంత్రిపైనే గెలిచి సంచలన విజయం అందుకున్నారు.  ఒక్క ఎర్రబెల్లి మాత్రమే కాదు.. ఆయన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా వరంగల్‌ తూర్పు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా సురేఖ ప్రదీప్ రావును ఓడించారు. అయితే ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి దయాకరరావు అల్లుడు మదన్ మోహన్ రావు విజయం సాధించారు.  అది వేరే సంగతి. తన రాజకీయ అనుభవం అంత వయస్సుకూడా లేని యువతి చేతిలో  పరాజయం అంటే  ఎర్రబెల్లికి పరాభవమే అనడంలో సందేహం లేదు. మూడున్నర దశాబ్దాలుగా ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 37 ఏళ్లుగా ఎమ్మల్యేగా  ఉన్న వ్యక్తికి ప్రత్యర్థిగా పోటీలో దిగడమంటే ఆషామాషీ కాదు.  బాగా పాపులారిటీ, సత్తా ఉన్న నేతలే వెనక్కి జంకుతారు. కానీ అటువంటి వ్యక్తిని ఎదుర్కొని ఓడించి    యశస్విని రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. ఎర్రబెల్లి దయాకర్ ట్రాక్ రికార్డును బద్దలు కొట్టారు.   నిజానికి యశస్వినీ స్థానంలో  ఆమె అత్త ఝాన్సీ రాణి పోటీ చేయాల్సి ఉంది. యశస్విని అత్త హనుమాండ్ల ఝాన్సీరెడ్డిది పాలకుర్తి నియోజకవర్గం. ఝాన్సీ కుటుంబానికి అమెరికాలో స్థిరాస్తి వ్యాపారం ఉంది. ఆమె పాలకుర్తి సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ధార్మిక, సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు మరింత సేవ చేయడానికి ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.. పాలకుర్తి టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ, ఆమె ఎన్నారై కావడం.. భారత పౌరసత్వం లేకపోవడంతో పోటీ చేయడానికి ఇబ్బంది ఎదురైంది. ఆమె భారత పౌరసత్వ కోసం దరఖాస్తు చేసుకున్నా ఎన్నికల సమయానికి పౌరసత్వం రాకపోవడంతో.. ఆమె తన స్థానంలో యశస్వినీ రెడ్డిని దింపారు. యశస్వినీ రెడ్డి పార్టీ టికెట్ వచ్చినప్పటి నుంచే ప్రజల్లో తిరుగుతూ.. గట్టిగానే ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఎర్రబెల్లిపై యశస్విని పోటీకి దిగడంతో.. ఆమె విజయంపై  అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్లే ఆమె ప్రచారంలో కాస్త తడబడ్డారు.. జై కాంగ్రెస్ అనబోయి జై కేసీఆర్ అంటూ ఒక సారి నినాదం చేసి ఇబ్బంది పడ్డారు కూడా.  అయితే ఆరంభంలోని తడబాటును అధిగమించి ప్రచారాన్ని జోరెత్తించారు.  ప్రజాభిమానాన్ని గెలుచుకుని ఎర్రబెల్లి ట్రాక్ రికార్డును బద్దలు కొట్టి విజయం సాధించారు.  సీనియర్ రాజకీయ నేతగా.. మంత్రిగా ఎర్రబెల్లి ప్రజలకు సుపరిచితుడే అయినప్పటికీ,   యశస్విని రెడ్డి వైపే జనం మొగ్గు చూపారు.  సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి తీరుపై నియోజకవర్గ ప్రజలలో అసంతృప్తి, ఆగ్రహం వెల్లువెత్తాయి. దానికి తోడు కాంగ్రెస్ వేవ్..   అన్నిటికీ మించి కొత్త ముఖం, పిన్న వయస్సు, రాజకీయ అనుభవం లేని ప్రత్యర్థిపై విజయం సునాయాసమన్న అతి విశ్వాసంతో ఎర్రబెల్లి ఆరంభంలో పెద్దగా ప్రచారంపై దృష్టి పెట్టలేదు. పరిస్థితి గమనించి రంగంలోకి దిగేటప్పటికే చేయిదాటిపోయింది.  నియోజకవర్గంలో  అనుచరుల ఆగడాలు దయాకర్ రావుపై ప్రజలలో వ్యతిరేకతకు కారణమయ్యాయి. అదే యశస్వినికి ఓటు బ్యాంకుగా మారింది.  అలాగే ఎన్నికల బరిలోకి దిగిన యశస్వినిరెడ్డికి ఆమె అత్త ఝాన్సీ రెడ్డికి స్థానికంగా ఉన్న మంచి పేరు  ప్లస్ అయ్యింది. ఫలితాలలో యశస్విని మొదటి రౌండ్ నుంచే తన ఆధిక్యాన్ని కొనసాగించగా దయాకర్ రావు ఎక్కడా పోటీ ఇవ్వలేక పోయారు.