గెలుపు గ్యారంటీ.. కర్నాటక క్యాంపుకు ఏర్పాట్లు రెడీ!
posted on Dec 3, 2023 @ 9:39AM
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. సరిగ్గా ఈ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అదే దూకుడును ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కొనసాగించింది హస్తం పార్టీ. తొలి గంటలోనే పూర్తిస్థాయి మెజారిటీని సాధించింది.
తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్.. 60. ఈ మార్క్‌ను అలవోకగా అందుకుంది కాంగ్రెస్. తొలి రౌండ్ నుంచే ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చింది. ఎక్కడే గానీ వెనుకంజ వేసినట్లు కనిపించలేదు. పోస్టల్ బ్యాలెట్లలో సాధించిన పైచేయిని ఈవీఎం లెక్కింపుల్లోనూ కంటిన్యూ చేసింది.
68 స్థానాల్లో కాంగ్రెస్, 35 నియోజకవర్గాల్లో భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థులు ఆధిక్యతలో కనిపించారు. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్.. అయిదు చోట్ల లీడింగ్‌లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా తన ఆధిక్యతను పెంచుకోగలిగింది. తొలుత మూడు చోట్ల లీడింగ్‌లో ఉన్న కమలం పార్టీ అభ్యర్థులు ఆ తరువాత అయిదు చోట్ల పైచేయి సాధించారు.
ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ ఈ ఆధిక్యత చేతులు మారే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆంతర్యం అధికంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా- కిందటి నెల 30వ తేదీన తెలంగాణలో పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం అయ్యేలా ఉంది పరిస్థితి.
తెలంగాణపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు భారీ ఆధిక్యతను కట్టబెట్టాయవన్నీ కూడా. ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలన్నీ దాదాపుగా నిజం అయినట్టే కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమైనట్టే.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతున్నది. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ 65 స్థానాలలో ఆధిక్యత కనబరుస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే సాధించాల్సిన 60 స్థానాల మ్యాజిక్ ఫిగర్ ను కాంగ్రెస్ ఇప్పటికే దాటేసింది. తుది ఫలితం కూడా కాంగ్రెస్ కు అనుకూలంగానే ఉంటుందన్న విశ్వాసంతో కాంగ్రెస్ సంబురాలు చేసుకుంటోంది.
ఇలా ఉండగా ఓట్ల లెక్కిపు పూర్తి కాగానే గెలిచిన వారంతా హైదరాబాద్ రావాలని ఆదేశించిన కాంగ్రెస్ అధిష్థానం వారిని కర్నాటకకు తరలించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేసింది. వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను ఇప్పటికే తాజ్ క్రిష్టా వద్ద ఉన్నాయి. ఇవి కాకుండా శంషాబాద్ విమానాశ్రయంలో రెండు ప్రత్యేక విమానాలు, నాలుగె హెలికాప్టర్ ను కూడా రెడీగా ఉంచింది.