ఎపికి పొంచి ఉన్న మిచౌంగ్ తుపాను ముప్పు
మిచౌంగ్ తుపాను కారణంగా ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కాకినాడలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుపాను నేపథ్యంలో ఏడు తీర ప్రాంత మండలాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వేటను నిలిపివేయాలని మత్స్యకారులను అధికారులు ఆదేశించారు. వరి కోతలు మానుకోవాలని రైతులకూ సూచించారు. మరోవైపు, ఆఫ్‌లైన్ ద్వారా యుద్ధ ప్రాతిపదికన 16 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఉప్పాడ జడ్పీ హైస్కూల్‌లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటూ హోప్ ఐలాండ్ మత్స్యకారులను తరలించారు.
కాగా, జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు తుపాను పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
ఇదిలావుంచితే, నేడు కృష్ణా జిల్లాలో అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షనూ వాయిదా వేసింది. ఎన్టీఆర్ జిల్లాలో నేడు, రేపు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
తెలంగాణలో...
తమిళనాడును వణికిస్తున్న మిచౌంగ్ తుపాన్ ప్రభావం తెలంగాణలోనూ తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సోమ, మంగళవారం పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రెండు రోజులకు సంబంధించి పలు జిల్లాలకు యెల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
మిచౌంగ్ తుపాన్ నేపథ్యంలో తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండలలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డిలలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
మంగళవారం నాడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. తుపాన్ కారణంగా గాలులు పెరగడంతో తెలంగాణలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
రాయలసీమలో...
ఇదిలా వుండగా మిచౌన్ తుపాను ప్రభావం రాయలసీమలో కూడా ఉంది. తిరుపతి వెళ్లే వారిని ఎపి ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇక్కడి నదులు, కాలువలు భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరుపతి జిల్లా వరదయ్య పాళ్యం మండలంలోని గోవర్ధనపురం వద్ద ఉన్న పాముల కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం నీటి ప్రవాహం పెరగడంతో శ్రీకాళహస్తి -చెన్నె మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు.అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటికి రావద్దని అధికారులు సూచించారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు.భారీ వర్షాలకు పాముల కాలువ పొంగిపొర్లుతోంది. దాంతో శ్రీకాళహస్తి చెన్నై మధ్య నీటి ప్రవాహం పెరిగి రాకపోకలకు భారీగా అంతరాయం ఏర్పడింది. దీంతో జాతీయ రహదారిపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. 15 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.దీంతో పలు మార్గాల్లో వాహనాలను అధికారులు దారి మళ్లించారు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా వెళ్లే వాహనాలను తొట్టంబేడు చెక్ పోస్ట్ వద్ద నిలిపేశారు. వాహనదారులు కడప, పామూరు, దర్శి వైపు వెళ్లాలని సూచిస్తున్నారు.