ఆశలన్నీ వాలంటీర్లపైనే.. మరి ఆ వ్యవస్థే రద్దయితే?
posted on Dec 2, 2023 8:45AM
ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వాలంటీర్ ఉద్యోగాలను పారదర్శకత అనేదే లేకుండా సొంత పార్టీ కార్యకర్తలతొ నింపేశారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలే పలు సభల్లో ప్రజల సాక్షిగా చెప్పుకొచ్చారు. వాలంటీర్లలో 90 శాతం పైగా వైసీపీ వాళ్లే ఉన్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ఓ సందర్భంలో బాహాటంగానే చెప్పేశారు.
ఈ నేపథ్యంలో వాలంటీర్లు వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలను కొట్టి పారేయడానికి వీలులేని పరిస్థితి ఉంది. ఇంకా చెప్పాలంటే వాలంటీర్ వ్యవస్థను జగన్ ప్రభుత్వం తమ పార్టీ కరపత్రంలా వాడుకుంటుందన్నది అక్షర సత్యం. వీరంతా పార్టీ కార్యకర్తలే కాగా.. జగన్ చేత జగన్ కొరకు జగనే నియమించుకున్న వారే. ప్రజలకు సంబంధించి సకల వివరాలు వీరి వద్ద ఉన్నాయి. వాటి ఆధారంగా వైసీపీ పార్టీకి మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ మధ్య కాలంలో తమకు అనుకూలంగా లేని ఓట్లను రకరకాల కారణాలతో ఫామ్ 7 ద్వారా వలంటీర్ల ద్వారా తొలగింపచేయడం ద్వారా వైసీపీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది.
కాగా, ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌బాబు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వ జీతంతో పనిచేస్తూ.. ప్రభుత్వానికి చెందిన వారైన వాలంటీర్లు వైసీపీ పార్టీ పనులు చేస్తున్నారని నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఓటర్ల జాబితా తయారీలో కూడా ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని, ఇది వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపుతుందని ఆయన సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే అసలు వాలంటీర్ల వ్యవస్థ గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పనుంది? అసలు ఎన్నికల సమయానికి వాలంటీర్లు ఉంటారా? కోర్టు ఆ వ్యవస్థను రద్దు చేస్తుందా? తాత్కాలికంగా వాలంటీర్లను ప్రభుత్వ వ్యవహారాల నుండి దూరం పెడుతుందా అనే చర్చ జరుగుతున్నది. అయితే దాదాపుగా ఎన్నికల సమయానికి పూర్తిగా లేదా తాత్కాలికంగా వలంటర్ల వ్యవస్థ సస్పెండ్ అయ్యే అవకాశాలే ఉన్నాయని న్యాయనిపుణులుఅభిప్రాయపడుతున్నారు.
అయితే, ఎన్నికల సమయానికి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసినా, లేదా తాత్కాలికంగా సస్పెండ్ చేసినా వైసీపీకి అది గట్టి ఎదురుదెబ్బే అవుతుంది. ఎందుకంటే వైసీపీ వాలంటీర్ల మీదనే ఎన్నికల బరిలో నిలిచి గెలవడానికి పూర్తిగా ఆధారపడింది. నిత్యం ప్రజలతో సంబంధం ఉండే వాలంటీర్లు చెప్తే ప్రజలు వింటారని భావిస్తుంది. మాట వినని వారిని బెదిరించైనా అనుకూలంగా మార్చే సత్తా వాలంటీర్లకు ఉందని వైసీపీ నమ్ముతున్నది. ప్రభుత్వంపై అసంతృప్తితో ప్రస్తుతం వైసీపీ క్యాడర్ పార్టీ కార్యక్రమాలలో ఏమంత ఉత్సాహంగా పాల్గొనడం లేదు. ద్వితీయ శ్రేణి నేతలలో కూడా జోష్ కనిపించడం లేదు. అందుకే ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా అట్టర్ ప్లాప్ అయిపోతున్నది. వైసీపీ నేతలు ప్రజల మధ్యకి వెళ్లినా కార్యకర్తలు పట్టించుకోవడం లేదు. ప్రజలు మొహం చాటేస్తున్నారు. ఈ పరిస్థితులలో వాలంటీర్లే వైసీపీ నేతలకు ఫ్లెక్సీలు కట్టి స్వాగతం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. వాలంటీర్లు చేస్తున్నది కూడా అదే.
అందుకే ఎన్నికల సమయంలో ఓటర్ మేనేజ్మెంట్ బాధ్యతలను వాలంటీర్లకు అప్పగించాలని వైసీపీ డిసైడ్ అయిపోయింది. ఈ తరుణంలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు సుప్రీం తీర్పుపై ఆధారపడి ఉంది. ఒక వేళ సుప్రీం వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా తీర్పు వెలువరిస్తే.. వైసీపీ ఆశలన్నీ గంగలో కలవడం ఖాయం.
అయితే జగన్ సర్కార్ ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థకు ఏవైనా న్యాయపరమైన చిక్కులు వస్తే ఎలా అన్న విషయాన్ని పరిగణనలోనికి తీసుకునే ప్రతి 50 ఇళ్లకు ఒక గృహసారథి చొప్పున నియమించుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాలంటీర్ వద్ద ఉండే ప్రభుత్వ సమాచారాన్ని గృహసారథుల ద్వారా పార్టీ అవసరాల కోసం సేకరించి పెట్టుకుంటున్నదని చెబుతున్నారు. గృహసారథులకు ప్రజలతో నేరుగా సంబంధం లేదు. కానీ, ఒకవేళ వాలంటీర్ల వ్యవస్థ రద్దయితే కొంతలో కొంత సారథులు ఉపయోగించుకోవచ్చన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. మరి ఈ సారథులు ఎంతవరకు వైసీపీకి ఉపయోగపడతారన్నది చూడాల్సి ఉంది.