బీఆర్ఎస్ ఓటమిని హరీష్ రావు అంగీకరించేశారా?
posted on Dec 2, 2023 @ 9:31AM
తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్.. రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ప్రిడిక్ట్ చేస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ కాదు ఎగ్జాట్ పోల్స్ మాకే ముచ్చటగా మూడో సారి అధకారాన్ని కట్టబెడతాయని ఘంటా పథంగా చెబుతున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే మీడియా ముందకు వచ్చిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పోలింగ్ ముగిసిన మరుసటి రోజు పార్టీ నేతలతో సమావేశమైన పార్టీ అధినేత కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్న ధీమానే వ్యక్తం చేశారు. కేసీఆర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ప్రమాణ స్వీకారం ఎక్కడో, సంతకం పెట్టాల్సిన తొలి ఫైల్ ఏదో కూడా చర్చించినట్లు పార్టీ వర్గాలు చెప్పుకున్నాయి. అంతే కాకుండా.. ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే డిసెంబర్ 4న కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేసేశారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం పార్టీ శ్రేణుల్లో ఆ ధీమా కనిపించడం లేదు.
అటు వైపు కాంగ్రెస్ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేయడమే కాకుండా, పార్టీ నుంచి గెలిచిన వారెవరినీ ప్రత్యర్థి పార్టీలు ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఇవ్వకుండా కర్నాటక తరలించేందుకు ప్రణాళికలు కూడా రచిస్తోంది. ఇటువంటి తరుణంలో బీఆర్ఎస్ కీలక నేత, మంత్రి, పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన తన్నీరు హరీష్ రావు పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నట్లు ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నది. అయితే ఆ వీడియో ఎప్పటిది.. అన్న స్పష్టత అయితే లేదు. ఆ వీడియోలో హరీష్ రావు బీఆర్ఎస్ పరాజయం పాలైనా ప్రజలలోనే ఉంటాం, ప్రజల కోసమే పని చేస్తుందనీ చెప్పారు. అంతే కాకుండా ఓటమికి తాను పూర్తి బాధ్యత వహిస్తానని చెప్పారు. ఇదే ఆ వీడియో నిజమేనా, నిజమే అయితే ఆయన ఎప్పుడు మాట్లాడారు? ఏ సందర్భంగా మాట్లాడారు అన్న అనుమానాలకు తావిస్తున్నది. ఎందుకంటే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొత్తం కేసీఆర్ తన భుజస్కంధాలపై వేసుకుని రోజుకు దాదాపు మూడు నాలుగు సభలలో ప్రసంగించారు. ఒక వేళ పార్టీ ఓటమికి బాధ్యత వహించాల్సి వస్తే పార్టీ అధినేతగా, ప్రచార సారథిగా కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. లేదా పార్టీ సమష్టి బాధ్యతగా చెప్పుకోవాల్సి ఉంటుంది.
అందుకు భిన్నంగా హరీష్ రావు ఓటమి బాధ్యత పూర్తిగా తనదేనని చెప్పడం విస్తుగొలుపుతోంది. అన్నిటికీ మించి ఈ వీడియోలో మెదక్ ఎంపీ, ప్రస్తుతం దుబ్బాక నుంచి పోటీ చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. మొత్తం మీద సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతన్న ఈ వీడియో వైరల్ అయ్యింది. ఎక్కడ చూసినా ఓటమిపై హరీష్ రావు వ్యాఖ్యలపైనే చర్చ జరుగుతోంది.