ప్రజా తీర్పునకు కౌంట్ డౌన్ షురూ
posted on Dec 3, 2023 7:07AM
తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కౌంటింగ్ కౌన్ డౌన్ స్టార్ట్ అయింది. ఎన్నెన్నో ప్రశ్నలు.. ప్రతి ఒక్కరి మదిలో ఎంతో ఉత్కంఠ. అన్నిటికీ సమాధానం మరికొద్ది సేపట్లో. మరికొద్ది గంటల్లోనే ఫలితాలు వెలువడనున్నాయి. క్రమక్రమంగా ఉత్కంఠకూ తెరపడనుంది. నెల రోజులుగా ఉత్కంఠ రేపిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్ని కల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ చూసినా, విన్నా ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 49 కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ మొదలైంది. ఒక్కో నియోజకవర్గానికి 14+1 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం తెలనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా.. మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు.. ఆ తరువాత ఈవీఎంల లెక్కింపు జరుగుతుంది.
ఈసారి 80 ఏళ్లు పైబడిన వారు, వికలాంగులు కూడా ఇంటి నుంచి ఓటేసే అవకాశం కల్పించడంతో.. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల సంఖ్య భారీగా పెరిగింది. ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా తెలంగాణ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించి ఐదంచెల భద్రత ఏర్పాట్లు చేసారు.. కిలోమీటరు దూరంలోనే ఆంక్షలు అమలు చేస్తున్నారు. కాగా, భద్రాచలం , అశ్వారావుపేట, చార్మినార్ నియోజకవర్గాల్లో లెక్కింపు రౌండ్లు తక్కువగా ఉండడంతో వీటిలో ఏదో ఒక స్థానం ఫలితం తొలుత వెలువడవచ్చని అంచనా. చార్మినార్లో పోలైన ఓట్లు అతి తక్కువగా ఉన్నందున మిగిలిన రెండింటి కంటే దాని ఫలితమే మొదట తెలుస్తుందని భావిస్తున్నారు. ప్రతి 20 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం తేలే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలయ్యే సరికి ఎన్నికల ఫలితాల సరళి తెలిసే అవకాశం ఉందని రాష్ట్ర ఈసీ కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు.
కౌంటింగ్‌కు సంబంధించి.. ఏదైనా పోలింగ్ కేంద్రంలో ఈవీఎం యంత్రం పనిచేయకపోతే.. వీవీప్యాట్ డబ్బాలోని చీటీలను లెక్కిస్తారు. నియోజకవర్గంలోని ఈవీఎంలన్నీ సవ్యంగా పనిచేస్తే.. మరో రకంగా వీవీప్యాట్ చీటీలను లెక్కిస్తారు. ఏవైనా ఐదు పోలింగ్ కేంద్రాల వీవీప్యాట్ల డబ్బాలను తీసుకుని, ఆయా కేంద్రాల్లో ఈవీఎంల ఫలితాన్ని సరిపోల్చుతారు. పోస్టల్ బ్యాలెట్స్ కోసం ప్రత్యేక టేబుల్స్ ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్ 500ఓట్లకు ఒక టేబుల్ ఉంటుంది. ఈవీఎం ఓట్ల లెక్కింపుకు ముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ లో ఒక్కో టేబుల్ కు 6గురు అధికారులు ఉంటారు. ఒకరు మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు ఇద్దరితో మొత్తం ఒక్కో టేబుల్‌కు ఆరుగురు ఉంటారు. ప్రతీ ఈవీఎంను మూడు సార్లు లెక్కింపు ఉంటుంది కాబట్టి ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని సీఈఓ వికాస్ రాజ్ తెలియజేశారు. ఇక కౌంటింగ్ సమయాల్లో రోడ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులపై నిషేధం విధించినట్లు తెలిపింది.
కాగా, తెలంగాణలో సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారా లేక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారా? క్లియర్ మెజార్టీ వస్తుందా? హంగ్ వస్తుందా? హంగ్ వస్తే, ఏ ప్రభుత్వం అధికారం చేపడుతుంది? ఇలా ఇవాళ్టి ఎన్నికల ఫలితాలపై ఎంతో ఆసక్తి ఉంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. శనివారం హైదరాబాద్ వచ్చారు. కాంగ్రెస్ నుంచి గెలిచే అభ్యర్థులను చేజారనివ్వకుండా చూసే పనిలో ఉన్నారు. అటు రాహుల్ గాంధీ సైతం.. కౌంటింగ్ కేంద్రాల దగ్గరే అభ్యర్థులు ఉండాలని కండీషన్ పెట్టారు. ఫలితాలు కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉంటే.. హైదరాబాద్ లోనే క్యాంప్ ఉంటుందనీ, అదే ఫలితాలు బీఆర్ఎస్‌కి అనుకూలంగా ఉంటే.. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కర్ణాటకకు తరలిస్తారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్.. తమ పార్టీ అభ్యర్థులకు కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు. అందువల్ల కాంగ్రెస్ లో ఆదివారం జరిగే క్యాంప్ పాలిటిక్స్ ఆసక్తి రేపనున్నాయి.