ఫస్ట్ రిజల్ట్ కాంగ్రెస్ ఖాతాలో.. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన హస్తం!
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమైపోయింది. తొలి రౌండ్ నుంచి 60కి పైగా స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శిస్తూ హస్తం దూకుడు మీదుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ ను కూడా కాంగ్రెస్ దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. మూడు నాలుగు రౌండ్ల ఫలితాలలో కొన్ని కీలక స్థానాలు ఇప్పటికే అధీక్యత వేలల్లో ఉండడంతో ఈ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో చేరడం ఖాయమైపోయినట్లే భావించవచ్చు. తెలంగాణ ఎన్నికల ఫలితాలలో తొలి విజయం కూడా కాంగ్రెస్ పార్టీయే సొంతం చేసుకుంది. అశ్వరావు పేట నుంచి ఆదినారాయణరావు విజయం సాధించారు. అలాగే రెండో విజయం కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడింది. ఇల్లెందు నుంచి కూడా కాంగ్రెస్ గెలిచింది. మొత్తంగా చూస్తే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేటట్లు కనిపిస్తున్నది. ఈ జిల్లాలో పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించిన సంగతి విదితమే. ఏది ఏమైనా స్పష్టమైన మెజార్టీతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ వెలువడిన తొలి రెండు ఫలితాలనూ తన ఖాతాలోనే వేసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట అభ్యర్థి ఆదినారాయణరావు విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై ఆదినారాయణరావు విజయం సాధించారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ 65కు పైగా సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తూ విజయం దిశగా దూసుకెళ్తుండగా బీఆర్ఎస్ 40 సీట్లలో మాత్రమే ముందంజలో ఉంది. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాను పోటీ చేసిన కామారెడ్డి, కొడంగల్ రెండు స్థానాల్లోనూ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. కొడంగల్ లో మూడు రౌండ్లు పూర్తయ్యే సమయానికి ఆయన 4,159 ఓట్ల లీడ్ లో ఉండగా.. కామారెడ్డిలో ఫస్ట్ మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత ఆయన 2,354 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం గెలుస్తాడని భావించిన బీజేపీ కామారెడ్డిలో రెండో స్థానంలో ఉండగా.. సీఎం కేసీఆర్ మూడవ స్థానంలో ఉండడం బీఆర్ఎస్ శ్రేణులను షాక్ కు గురి చేస్తోంది. ఇక ఉమ్మడ నల్గొండ జిల్లాలో సూర్యాపేట మినహా మిగతా అన్ని స్థానాల్లోనూ హస్తం హవా కొనసాగుతోంది. సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి మినహా మిగతా అన్ని సీట్లలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. బీజేపీ కీలక నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్, రఘునందన్ రావు కూడా వెనకబడ్డారు.
ఇక హైదరాబాద్, రంగారెడ్డిలో కారు జోరు కాస్త కనపడుతోంది. గజ్వేల్ లో కేసీఆర్, సిద్దిపేటలో హరీశ్ రావు, సిరిసిల్లలో కేటీఆర్ లీడ్ లోకి రాగా.. కేసీఆర్, కేటీఆర్ స్వల్ప అధీక్యంలోనే ఉండడం ఉత్కంఠ కలిగిస్తుంది. కాంగ్రెస్ కీలక నేతలు రేవంత్ రెడ్డి రెండు చోట్ల అధీక్యంలో ఉండగా.. భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క తదితరులు స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ముందంజలో ఉండడం విశేషం. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ కాస్త ముందంజలో ఉంది. బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీలో ఉన్న సిర్పూర్ లో కౌంటింగ్ రసవత్తరంగా మారింది. అక్కడ బీజేపీ, బీఎస్పీ మధ్య నువ్వా, నేనా అన్నట్లుగా లెక్కలు మారుతున్నాయి.
కాగా, ప్రస్తుత ట్రెండ్స్ ను పరిశీలిస్తే హంగ్ వచ్చే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. చివరి రెండు మూడు రౌండ్లలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప హంగ్ వచ్చే పరిస్థితి లేదు. దీంతో అధికారంలోకి రావడం ఖాయమని ఫిక్స్ అయిన కాంగ్రెస్ ఆ దిశగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతల ఇళ్ల వద్ద సంబరాలు మొదలయ్యాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీస్ భద్రతా బలగాలు మోహరించగా.. కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ అభిమానులు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకుంటున్నారు. మరోవైపు గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక బస్సులను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ తాజ్ కృష్ణా వద్ద ప్రత్యేక బస్సులు రెడీగా ఉంచారు. అలాగే శంషాబాద్ లో రెండు స్పెషల్ ఫ్లయిట్స్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల కోసం మరో నాలుగు హెలికాఫ్టర్లను కూడా పీసీసీ సిద్ధం చేసింది.