జగన్ పాలన.. నాటి పాలెగాళ్ల రాజ్యం!
posted on Jan 15, 2024 @ 2:42PM
ఏపీలో ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది? జగన్ హయంలో ఏపీ ప్రజలు ఎలా ఉన్నారు? వైసీపీ భజన బృందం చెబుతున్నట్లుగా రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారా? అంటే నూటికి నూరు శాతం లేదనే చెప్పాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు జగన్ హయంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని చెప్పక తప్పదు. అందుకే ఇప్పుడు పరిశీలకులు ఏపీలో జగన్ పాలనను పూర్వం ఇదే ఆంధ్ర రాష్ట్రంలోని పాలెగాళ్ళ పాలనతో పోల్చి తూర్పార పడుతున్నారు. ఆంధ్ర ప్రాంతంలో 600 సంత్సరాల క్రితం రాచ వేమారెడ్డి అనే ఓ రాజు అరాచక పాలన సాగింది. సకల శుభాలతో వర్ధిల్లిన కొండవీటి రాజ్యాన్ని ఈ వేమారెడ్డి పతనం చేశారు. కొండవీడు ఆఖరి రాజు అయిన రాచ వేమారెడ్డి దుర్మార్గపు పాలన అత్యంత చెత్త పాలనగా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. రకరకాల వింత పన్నులను విధిస్తూ ప్రజలను పీడించి పిప్పి చేశాడు. అప్పుడే పుట్టిన బిడ్డపై పురిటి పన్ను, రైతులకు సాగు నీరుకు తూము పన్నులు వంటివి విధించాడు.
ఒక వైపు కరువు కాటకాలతో సతమతమౌతున్న ప్రజలపై మోయలేని పన్నుల భారాలను మోపి వేధించారు. రకరకాల పన్నులు, చెత్త పాలనతో రాజ్యంలోని ప్రజలు విసిగిపోయారు. రాజు చుట్టూ ఉండే అనుచరులు, సంస్థానంలోని సేవకులకు కూడా వేమారెడ్డి అంటే విరక్తి వచ్చేసింది. అందుకే వేమారెడ్డి వద్ద పనిచేసే ఓ వ్యక్తి అతన్ని హత్య చేసి రాజ్యంలోని ప్రజలకు విముక్తి కలిగించాడు. వేమారెడ్డితోనే ఆ వంశం అంతమైపోగా.. ఆ తరువాత కొండవీడు రాజ్యం గజపతులు, విజయనగర సామ్రాజ్యం ఏలుబడిలోకి వెళ్లిపోవడంతో మళ్ళీ కొన్నాళ్ళకు సాధారణ పరిస్థితికి వచ్చింది. అలాగే సుమారు 200 సంవత్సరాల క్రితం రాయలసీమలో అనాగరిక గ్రామీణ ముఠా కక్షలు మొదలయ్యాయి. ఈ సాంప్రదాయాన్ని పాలెగాళ్లు, పెత్తందార్లు అని పిలవగా.. బ్రిటిష్ పాలకులు ఫ్యాక్షనిస్టులుగా పిలిచేవారు. సామాజిక, ప్రజా ప్రయోజనాలు అనేవి లేకుండా రాజకీయాల కోసం, సారాయి వ్యాపారం, సివిల్ కాంట్రాక్టులు, నాపరాయి గనుల కోసం ఈ ఫ్యాక్షన్ పుట్టుకొచ్చి రాయలసీమలో బాంబుల మోత మోగిపోయింది.
ఈ పాలెగాళ్ళ లక్ష్యం, ఆలోచన, తీరు ఒక్కటే. ప్రజలపై తోచినంత పన్నులు విధించి తాలిబన్ తరహా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోని శాంతి భద్రతలను గుప్పెట్లో పెట్టుకోవడం, విభజించు పాలించు సిద్ధాంతంతో ప్రజలను రెండు వర్గాలుగా చీల్చి వారిని ఒకరిపై ఒకరికి పగలు, ప్రతీకారాలు పెంచి పాలెగాళ్ళు పెత్తనం చేసేవారు. ఈ పాలెగాళ్ళు తమని తాము హీరోలుగా భావించుకుంటూ ప్రజలను బిచ్చగాళ్లను చేసి ఆడించారు. రాజకీయంగా ఎదుగుదల కోసం నిసిగ్గుగా రాజకీయాలను రక్తసిక్తం చేసిన ఘనులు ఈ పాలెగాళ్ళు. ఆ తర్వాత 19వ శతాబ్దం తొలినాళ్లలో రాయలసీమ ప్రాంతం బ్రిటిష్ ఆధిపత్యంలోకి రాగా.. రాయలసీమ మొదటి కలెక్టర్ థామస్ మన్రో 1800లో 80 మంది పాలెగాళ్ళను గుర్తించారు. వారిలో 37 మంది పులివెందుల చుట్టుపక్కల వారే కావడం విశేషం. ఈ పాలెగాళ్ళంతా ఒక పెద్ద పాలెగాడి అండతో పెత్తనం సాగించేవారు. ఆ పెద్ద పాలెగాడు రాజుకు లోబడి ఉండేవాడు. ప్రతి పాలిగాడికి ఒక సైన్యం ఉండేది. ఈ సైనికులు యుద్ధాల సమయంలో గ్రామాలను లూటీ చేసి దోచుకుని సంపద పోగేసుకొనేవారు. ఈ పాలెగాళ్లలో కొందరు బ్రిటిష్ సైన్యంతో చేతిలో హతమవ్వగా.. మరికొందరిని ఉరి తీయించారు. మిగిలిన వారికి అధికారం తొలగించి పెన్షన్ ఇచ్చారు.
కాగా స్వాతంత్య్రం వచ్చాక ఫ్యాక్షన్ కొత్త రూపు సంతరించుకుంది. ప్రజా స్వామ్యంలో కూడా ఈ ఫ్యాక్షన్ లీడర్లు ప్రజలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ప్రజల నిత్య అవసరాలకు కూడా ముఠా నాయకుడి దయాదాక్షిణ్యలపై ఆధారపడేలా చేసుకున్నారు. ఒకరిపై మరొకరు ఆధిపత్యపోరులో ఊళ్ళ మీద బాంబులు పడ్డాయి.. హత్యలు జరిగాయి.. పొలాలు బీడు వారాయి. ఆ తర్వాత ఈ బీడు భూమిని తవ్వి మైనింగ్ సొమ్ముతో ఫ్యాక్షనిస్టులు సంపద గుట్టలు పోగేసుకున్నారు. ముఠా తత్వాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సొంతం చేసుకున్నారు. ఈ ఫ్యాక్షన్ కుటుంబాలలో ఇప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి కుటుంబం కూడా ఒకటి. జగన్ తాత రాజారెడ్డి కూడా ఒక ఫ్యాక్షనిస్టు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు జగన్ పాలనలో కూడా అదే మార్క్ దౌర్జన్యాలు, అరాచకాలు మనం ఎన్నో చూశాం. చూస్తున్నాం. తనను ఎదిరిస్తే అక్రమ అరెస్టులు చేసి వేధించడం చూశాం. ప్రశ్నిస్తే నామరూపాల్లేకుండా చేయడం చూశాం. ఈ దౌర్జన్యాలు, ఆధిపత్య పోరు జగన్ కు వెన్నతో పెట్టిన విద్యని ఇప్పటికే నిర్ధారణైపోయింది. దౌర్జన్యకారుల ఏలుబడిలో ప్రజల జీవన వసతులు పెరుగు పడతాయనుకుంటే అది పొరపాటే. అలాగే అభివృద్ధి పథకాలు అమలవుతాయనుకుంటే అమాయకత్వమే. ఒక ప్రాంతం అభివృద్ధి కాలేదు అంటే అక్కడ నాయకులు అసమర్థులని అర్ధం. అదే ఒక రాష్ట్రం అభివృద్ధి కాలేదంటే సమర్ధతలేని సీఎం కారణం. అలాగే తమకు కావాల్సిన అధికారం సాధించుకోవడం కోసం ఎన్ని కుట్రలైనా చేయడం, ఎన్ని హత్యలైనా చేయడం ఈ దౌర్జన్యకారుల పని. ఈ లక్షణాలన్నీ ఈ నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో కనిపించాయి. అందుకే ఇప్పటి ఈ ఏపీలో ఆనాటి పాలెగాళ్ళ పాలన సాగుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలే. ఆ విషయాన్ని ఇప్పటికే గుర్తించిన జనం ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. పాలెగాళ్ల పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నారు.