బాబూ ఓ రాంబాబు!
posted on Jan 16, 2024 @ 11:07AM
తెలుగుదేశం పార్టీని విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ స్థాపించారు. జనసేన పార్టీని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించారు. ఆ రెండు పార్టీలలో కళా వల్లభులు పెద్దగా కనిపించరు. అయతే జగన్ పార్టీ అయిన వైసీపీలో మాత్రం మహానటుల స్థాయికి ఏ మాత్రం తగ్గనిక ళాకారులంతా వై గుట్టలుగుట్టలుగా ఉన్నారనే ఓ చర్చ అయితే సత్తెనపల్లి నియోజకవర్గంలో వైరల్ అవుతోంది.
తాజాగా సంక్రాంతి పండగ వేళ.. భోగి పండగను పురస్కరించుకొని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సంబరాల రాంబాబులా మారి వేసిన స్టెప్స్ కెవ్వు కేక పుట్టించాయని సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓ ప్రచారం వీర లెవల్ లో నడుస్తోంది. అలాగే నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ప్రజలంతా ఈ కార్యక్రమానికి హాజరై.. సంబరాల రాంబాబు డ్యాన్స్ కార్యక్రమాన్ని కనులారా వీక్షించి ఆనందించేశారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
గతంలో రాజకీయ పార్టీ అధినేతలపై మాత్రమే పాటలు ఉండేవని.. కానీ అంబటి రాంబాబు..తనపై పాట రాయించుకొని మరీ ఇలా డ్యాన్స్ చేయడం పట్ల ప్రజలలోనే కాదు, పరిశీలకులు, రాజకీయ వర్గాలలో సైతంఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. మరోవైపు మంత్రి అంబటి రాంబాబు.. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుతోపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ప్రెస్‌మీట్లు పెట్టి మరీ వ్యంగ్య బాణాలు సంధిస్తారని.. అయితే అదే అంబటి రాంబాబు... ఇలా స్టెప్స్ వేయడమే కాకుండా.. నేను సంబరాల రాంబాబును కూడా అంటూ భోగి మంటల సాక్షిగా ఇచ్చిన క్లారిటీ మాత్రం అదిరిపోయిందని వారు చెబుతున్నారు.
బాధ్యత కలిగిన ఓ ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ఆంధ్రుల జీవనాడి పోలవరం ఎప్పటికి పూర్తవుతుందంటే.. పవన్ కల్యాణ్ మళ్లీ పెళ్లి చేసుకొనే సమయానికి అంటూ తన వ్యంగ్య వైభవన్నా చాటిన అంబటి రాంబాబుకు.. జలవనరుల శాఖను కేటాయించే కంటే.. మరో శాఖ ఏదైనా కేటాయిస్తే బాగుండేదని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే కార్యక్రమంలో.. ఓ హీరోయిన్‌ని కూడా తీసుకు వచ్చి.. ఆమెతో కూడా కాలు కదిపి ఈ అంబటి రాంబాబు కనుక స్టెప్లు వేస్తే.. ఇంకా ఈ సీన్ సూపరో సూపర్‌గా ఉండేదని సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓ వేళ అంబటి రాంబాబు ఓటమి పాలైనా కొరియాగ్రాఫర్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం కలిగిందని సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు అంబటి రాంబాబు భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తున్నారు.
అయినా.. అంబటి రాంబాబులో చాలా టాలెంట్ ఉందని.. ఆయనలో.. ఆ టాలెంట్‌ను వైసీపీ అధినేత జగన్ గుర్తించారని.. అందుకే ఆయన్ని వదులు కోలేదని.. కానీ అంబటి రాంబాబు మంత్రి కావడం వల్ల.. ఆయనలో సహజ నటనంతా..మళ్లీ ఇలా సంక్రాంతి పండగ వేళ బయటకు తన్నుకొచ్చిందని.. ఇప్పటికే టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో ఆయన నటించారని.. అయితే ఆయన నటనను ప్రజలంతా దాదాపుగా మరిచిపోయారని.. కానీ ఆయనలోని ప్రతిభ పాటవాలు చూసి.. రాబోయే కాలానికి కాబోయే ఓ సహజ నటుడు టాలీవుడ్‌కి.. అది ఇలా సంక్రాంతి పండగ వేళ దొరికాడని.. దీంతో తెలుగు సినీ కళామతల్లి సైతం సిగ్గు మెగ్గలతో మెలికలు తిరుగుతూ తెగ మురిసిపోతుందని వారు వివరిస్తున్నారు.
జగన్ పార్టీలో కళాకారులకు కొదవే లేదని.. అంబటి రాంబాబుతోపాటు కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, ఆర్కే రోజా, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అవంతి శ్రీనివాసరావు, గుడివాడ అమర్నాథ్.. ఇలా ఇలాంటి డైమండ్ పీస్‌ల సంఖ్య పెద్దదే అయినా వారిలో అంబటి రాంబాబు అగ్రస్థానంలో నిలుస్తారనడంలో సందేహం లేదంటున్నారు.
గత సంక్రాంతి పండగ వేళ.. ఇదే అంబటి రాంబాబు, ఇదే సత్తినపల్లిలో గ్రూప్ డ్యాన్స్ చేసి చెలరేగిపోయారని.. దీంతో ఫ్యాన్ పార్టీ నాయకుడిగా.. ఎమ్మెల్యేగా... మంత్రిగా ఆయనకు రాని పబ్లిసిటీ.. ఒకే ఒక్క గ్రూప్ డ్యాన్స్‌తో పీక్స్‌కు చేరిందని.. మరోవైపు అంబటి రాంబాబు డ్యాన్స్‌పై ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తే.. తాను చేసింది ఆనంద తాండవం అంటూ పక్కా క్లారిటీతో వివరించారని ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఏదీ ఏమైనా.. అంబటి రాంబాబులో టాలెంట్ ఉందని.. అది కూడా కెవ్వు కేకంతగా ఉందని.. అందుకే .. బాబూ ఓ రాంబాబు.. అంటూ ఆయనపై సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.