షర్మిలకు లైన్ క్లియర్.. జగన్ కు రోడ్ క్లోజ్?!
posted on Jan 16, 2024 8:00AM
వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్ అయిపొయింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రాజీనామా చేసేశారు. సరిగ్గా సంక్రాంతి పండుగ వేళ ఆయన మాజీ పీసీసీ చీఫ్ అయిపోయారు. ఇక తన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గెకు పంపించేశారు. ఆయన రాజీనామా షర్మిల కోసమే అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. షర్మిల తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. త్వరలోనే షర్మిలకు ఆంధ్రప్రదేశ్ పార్టీ పగ్గాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. షర్మిలకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే తాను సంతోషంగా తప్పుకుంటానని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకే ఆయన రాజీనామా చేసి షర్మిలకు లైన్ క్లియర్ చేసేశారని చెప్పాలి. ఇక ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేతికి వెళ్లడమే తరువాయి.
షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ నేత. ప్రస్తుతానికి ఆమెకి పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వలేదు. కానీ పీసీసీ చీఫ్ షర్మిలనే అని ఖరారై పోవడంతో ఆమె ఇప్పటికే ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన కాంగ్రెస్ మాజీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఏపీ రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నది. గతంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న వైసీపీ నేతలను తిరిగి తమ పార్టీలోకి చేర్చుకోవడమే టార్గెట్ గా షర్మిల అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వారంలోనే షర్మిలకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. ఇకపై ఏపీలో అన్నా చెల్లెళ్ళ వార్ మొదలవబోతుందని షర్మిల ఇప్పటికే సంకేతాలు ఇచ్చేశారు. అయితే, షర్మిల అసెంబ్లీకి పోటీ చేస్తారా లేక పార్లమెంటు బరిలో దిగుతారా లేక రాజ్యసభకు వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఏది ఏమైనా ఇకపై ఏపీ రాజకీయాలు మరింత రసకందాయంగా సాగనున్నట్లు ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
ఇప్పటి వరకూ ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూటమి మధ్య పోరు నడుస్తుంది. మరి ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ఏమి అద్భుతాలు సాధిస్తుందన్నది ఆసక్తికరంగామారింది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పాల్సిన పని లేదు. కనీసం ఒక్క శాతం ఓటింగ్ ఉందా అంటే అనుమానమే. నిజం చెప్పాలంటే ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పగ్గాలు ఎవరు అందుకున్నా పార్టీని బతికించడం కష్టం అన్న భావన ఉంది. అయితే గత ఆరు నెలల ముందు వరకూ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ను అలాగే అనుకున్నా.. ఆరు నెలలలో అధికారం దక్కించునే స్థాయికి ఎదిగింది. ఏపీలో అధికారం పొందే స్థాయికి కాకపోయినా షర్మిలను ముందు పెట్టి ఎంతో కొంత ఉనికి చాటుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ చేస్తోంది. మరి కాంగ్రెస్ ఇక్కడ రాజకీయం మొదలు పెడితే నష్టం ఎవరికి అన్నదానిపై సహజంగానే విశ్లేషణలు జరుగుతున్నాయి.
అయితే ఏపీలో కాంగ్రెస్ అంటూ బలపడితే నష్టపోయేది జగన్ మోహన్ రెడ్డే. ఇప్పుడు వైసీపీలో ఉన్న సీనియర్ నేతలంతా ఇంతకు ముందు కాంగ్రెస్ నేతలే. జగన్ వైపు మళ్లింది కూడా కాంగ్రెస్ క్యాడరే. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ చచ్చి వైసీపీకి ఊపిరి పోసింది. మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ బ్రతికి వస్తే అది తీసేది వైసీపీ ఊపిరే అంటున్నారు పరిశీలకులు. అందుకే షర్మిలకు పీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది అనగానే జగన్ కు రోడ్ క్లోజ్ అయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. షర్మిల ఎంత త్వరగా పీసీసీ బాధ్యతలు స్వీకరిస్తే అంత వేగంగా జగన్ ఇబ్బందులలో కూరుకుపోతారు. జగన్ సిట్టింగుల మార్పు నిర్ణయంతో వైసీపీలో ఇప్పుడు తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో షర్మిల ఎంట్రీతో ఏపీ రాజకీయాలను ఎలాంటి మలుపులు తిరగనున్నాయో చూడాల్సి ఉంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణరెడ్డి లాంటి వారు షర్మిలతో ప్రయాణం మొదలు పెట్టగా.. షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ నుంచి మరిన్ని వలసలు ఖాయమని చెబుతున్నారు..