ఈడీ.. కవిత.. దాగుడుమూతలు!
posted on Jan 16, 2024 @ 10:36AM
కారణాలు ఏమైనా ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి తనయ, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు వ్యవహారం గత కొంత కాలంగా రాజకీయ ప్రాముఖ్యత కలిగిన అంశంగా మారిపోయింది. ఆమెను ఈడీ విచారణకు పిలవడం, ఆమె కోర్టును ఆశ్రయించడం, ఈడీ వేగం మందగించడం వంటి అంశాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకూ హాట్ టాపిక్ గానే ఉన్నాయి.
కవితను అరెస్టు చేసే విషయంలో ఈడీ ఇదే కేసులో మిగిలిన నిందితుల పట్ల చూపిన చొరవ, దూకుడు చూపలేదన్నది మాత్రం వాస్తవం. సరిగ్గా ఈ అంశమే బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య మైత్రిని సామాన్య జనానికి కూడా అర్ధమయ్యేలా చేసింది. అలాగే , బీఆర్ఎస్ బీజేపీకి బీటీమ్ అన్న ఆరోపణలే వాస్తవమన్న భావన ప్రజలలో కలగడానికి దోహదపడింది. ఫలితంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీలు జమిలిగా నష్టపోయాయి. సరే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడింది. ఈ సారి ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ కు దూరం జరిగితేనే ఏదో మేరకు లబ్ధి పొందుతామన్న ఆలోచనలో ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ తాము బీజేపీకి దగ్గర అన్న భావన ప్రజలలో కలిగేలా వ్యవహరించడానికి మొగ్గు చూపుతోంది. అందులో భాగమే కవిత హిందుత్వ మంత్రం జపించడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ వైఖరి ఇలాగే కొనసాగితే.. భారీ నష్టం తప్పదన్న భావనలో ఉన్న కమలం.. బీఆర్ఎస్ తమకు ప్రత్యర్థి పార్టీయే అని ప్రజలను నమ్మించడానికి బీజేపీ శతథా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో బీజేపీతో తమకు వైరం లేదని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ తంటాలు పడుతోంది. సరిగ్గా ఈ తరుణంలో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపింది.
అయితే ఆ నోటీసులను కవిత సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించదు. తనను విచారణకు పిలిచే హక్కు ఈడీకి లేదని పేర్కొంటూ, సుప్రీం కోర్టు రక్షణ తనకు ఉందని ఈడీ నోటీసులకు సమాధానం ఇచ్చి ఊరుకున్నారు. అయినా మద్యం కుంభకోణం తెరమీదకు వచ్చి కవితపై ఆరోపణలు వెల్లువెత్తనప్పటి నుంచీ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ విచరణ పేరిట దాగుడు మూతలు ఆడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదిగో ఇప్పుడు అరెస్టు, అదిగో రెండు మూడు రోజుల్లో అరెస్టు అంటూ లీకులు వదులుతూ పొలిటికల్ హీట్ క్రియేట్ చేయడం వినా ఆ రెండు సంస్థలూ కవిత అరెస్టు విషయంలో ముందుకు అడుగేసింది లేదు. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈడీ ఏమైనా దూకుడు పెంచుతుందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే సమయంలో ఇలా నోటీసుల మీద నోటీసులు ఇచ్చి కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఈడీ ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోవడాన్ని చూపుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఎలాగైతే కేజ్రీవాల్ కు రక్షణగా నిలిచిందో.. కవితకు కూడా సుప్రీంలో విచారణలో ఉన్న పిటిషన్ రక్షణగా నిలుస్తుందని అంటున్నారు.
తనను ఇంటి వద్దే విచారించాలని కవిత గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. విచారణల విషయంలో మహిళలకు చాలా వెసులుబాట్లు ఉండాలని ఆమె తరపు లాయర్లు సుప్రీంకోర్టులో వాదించారు. ఆ నేపథ్యంలో అప్పట్లో కవితను విచారణకు పిలవకుండా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఆమె పిటిసణ్ విచారణను వాయిదా వేసింది. దాంతో ఆ మధ్యంతర ఉత్తర్వులను చూపుతూ తాను విచారణకు హాజరయ్యేది లేదని కవిత స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఈడీ నోటీసుకు సమాధానంగా పంపారు. దీంతో ఈడీ తదుపరి ఏ చర్య తీసుకోనుందన్నది ఆసక్తిగా మారింది. కవిత పిటిషన్ విచారణ వేగవంతం చేయాలని సుప్రీం కోర్టును కోరుతుందా చూడాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఈడీ నోటీసుతో తెలంగాణ రాజకీయాలలో మళ్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్టు అవుతారా? తేదా గతంలోలా దాగుడుమూతలతో సరిపెట్టేస్తారా అన్న చర్చ అయితే రాజకీయ వర్గాలలో విస్తృతంగా జరుగుతోంది.