ఫ్యామిలీ ప్యాకేజీ లెక్కన జగన్ టికెట్ల పందేరం
posted on Jan 16, 2024 8:27AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలకు, చేతలకు పొంతన ఉండదని గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో ఆయన పాలన పదే పదే రుజువు చేస్తున్నది. పరిశీలకులు కూడా జగన్ హామీ ఇచ్చారంటే అది నెరవేరదని తేలిపోయినట్లేనంటూ సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. అలాగే ఓ మాట చెప్పారంటే దానికి కట్టుబడి ఉండే తత్వం ఆయనలో లేదని చెబుతున్నారు. గతంలో పలు సందర్భాలలో జగన్ తమ పార్టీలో కుటుంబానికి ఒకటే టికెట్ అంటూ ఘనంగా ప్రకటనలు గుప్పించారు. అయితే ఆచరణలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ముంగిట సిట్టింగుల మార్పు అంటూ ఓ వింత ప్రయోగానికి తెరలేపి ఆశావహుల్లో, సిట్టింగుల్లో, నేతల్లో, క్యాడర్ లో నిరాశనూ, నిరుత్సాహాన్నీ, ఆవేదననూ, అయోమయాన్నీ, గందరగోళాన్నీ సృష్టించిన జగన్.. ఇప్పుడు టికెట్ల విషయంలో కూడా గతంలో ఎవరూ చేయని విధంగా కుటుంబ ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో దాదాపు 20కి పైగా అసెంబ్లీ స్థానాలను కేవలం ఐదు కుటుంబాలకు అప్పగించేస్తున్నారు. ఇది గతంలో ఆయన ఘనంగా చెప్పిన ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అన్నదానికి పూర్తి విరుద్ధమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
వచ్చే ఎన్నికలలో విజయమే లక్ష్యం అంటూ జగన్ చేస్తున్న విన్యాసాలు, ప్రయోగాలు ఓటమికే దారి చూపుతున్నాయంటూ సొంత పార్టీ నేతలూ, క్యాడర్ గగ్గోలు పెడుతున్నా ఆయన చెవికి ఎక్కడం లేదు.
మొత్తం మీద రానున్న ఎన్నికలలో ఆయన పార్టీ అభ్యర్థలను ఫ్యామిలీ ప్యాకేజీల ప్రకటించేస్తున్నారు. ఆయన ఎవరికి టికెట్ ఇస్తున్నారు? ఎవరికి నిరాకరిస్తున్నారు? ఎవరిని నియోజకవర్గం మారుస్తున్నారు అన్న విషయంలో పార్టీ నేతలకే అర్ధం కాని పరిస్థితి ఉంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు ఈ సారి ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులలో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి చెందిన వారికి కనీసం నాలుగు సీట్లు దక్కే అవకాశం ఉంది. అలాగే మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబీకులకు ఐదు స్థానాలలో పోటీ చేసే అవకాశం ఉంది. ముందుగా బొత్స ఫ్యామిలీని తీసుకుంటే ఆయన సోదరులు ఇద్దరు, ఆయన మేనల్లుడు, భార్యకు టిక్కెట్లు ఇవ్వాలని జగన్ ఇప్పటికే డిసైడ్ అయిపోయినట్లు చెబుతున్నారు. అలాగే గత కొద్ది కాలంగా బొత్స తన కుమారుడికి కూడా వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని జగన్ వద్ద గట్టిగా పట్టుబడుతున్నారు. అవసరమైతే తాను పోటీ నుంచి వైదొలగి అయినా సరే తన కుమారుడిని చీపురుపల్లి నియోజకవర్గం నుంచి నిలబెట్టాలని చూస్తున్నారు. అందుకు జగన్ అంగీకరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఒక వేళ అలా కాకుండా బొత్సకూ, ఆయన కుమారుడికీ కూడా పోటీ చేసే అవకాశం ఇచ్చే చాన్సెస్ ను కూడా తీసిపారేయలేమని చెబుతున్నారు. అంటే వచ్చే ఎన్నికలలో కేవలం బొత్స కుటుంబం నుంచే ఐదు నుంచి ఆరుగురు వైసీపీ అభ్యర్థులుగా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయానికి వస్తే ఆయన కుటుంబానికి చెందిన వారు నలుగురు వచ్చే ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులుగా రంగంలోకి దిగనున్నారు. ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే చిత్తూరు జిల్లాలో నగరి, రిజర్వుడు నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన అన్ని స్థానాలలోనూ పెద్దరెడ్డి, ఆయన కుటుంబీకులు, ఆయన వర్గీయులే పార్టీ అభ్యర్థులుగా ఉంటారన్న టాక్ అయితే వైసీపీలో గట్టిగా వినిపిస్తోంది. వీరే కాకుండా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సోదరులు నలుగురు ఎమ్మెల్యేలు. ఈ సారి కూడా వారందరికీ, వారితో పాటు వారి వారసులూ కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారసుల సంగతి ఎలా ఉన్నా బాలనాగిరెడ్డితో పాటు వారి సోదరులకూ ఈ సారి పార్టీ టికెట్ ఖాయమేనని చెబుతున్నారు. ఇక మంత్రి ఆదిమూలం సురేష్ తో పాటు ఆయన సోదరుడికీ జగన్ ఇప్పటికే టిక్కెట్లు ప్రకటించారు. ఇక జగన్ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. అలాగే కారుమూరి కుటుంబాలకు కూడా రెండేసి టికెట్లను ఇప్పటికే జగన్ ఖరారు చేసేశారని అంటున్నారు. అంటే వైసీపీ నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేసే వారిలో అత్యధికులు ఓ నాలుగైదు కుటుంబాలకు చెందిన వారే ఉంటారన్న మాట.
అయితే జగన్ ఈ తీరు పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఇక విపక్షాలైతే జగన్ పార్టీ తరఫునుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అనివార్యంగా ఇలా ఓ నాలుగైదు కుటుంబాలకు చెందిన వారినే అభ్యర్థులుగా దింపాల్సిన పరిస్థితి జగన్ కు వచ్చిందని విమర్శలు, సెటైర్లు గుప్పిస్తున్నాయి. ఇక చెవిరెడ్డి భాస్కరరెడ్డి , అలాగే కారుమూరి కుటుంబాలకు కూడా రెండేసి టికెట్లను ఇప్పటికే జగన్ ఖరారు చేసేశారని అంటున్నారు.