సెల్ఫ్ గోల్ దిశగా జగన్ నాలుగో అడుగు!?
posted on Jan 17, 2024 @ 3:20PM
వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం నేల విడిచి చేస్తున్న సాము ప్రత్యర్థుల నెత్తిన పాలు పోస్తోంది. తన మీద ఉన్న ప్రజా వ్యతిరేకతను సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆపాదించి తనకు తోచినట్లుగా వారిని బంతాట ఆడుకుంటున్నారు. జగన్ ఆడుతున్న సిట్టింగుల మార్పు, తొలగింపు ఆటకు ఒక రూల్ అంటూ ఏదీ లేదు. రిఫరీతో పనేం లేదు. తాను ఔట్ అంటే ఔట్, కాదు. మొత్తంగా జగన్ తన కోసం తన చేత, తానే ఆడుతున్న ఈ ఆట పార్టీ పునాదులను కూల్చేస్తున్నా జగన్ కు వినోదంగానే ఉంది. సీతయ్యలా ఎవరి మాటా వినకుండా, ఎవరినీ పట్టించుకోకుండా జగన్ చేస్తున్న విన్యాసాలు.. పార్టీలో అసమ్మతిని రోజు రోజుకూ పెంచేస్తున్నాయి.
అందుకే జగన్ సిట్టింగుల మార్పు కోసం మొదలు పెట్టిన ఆట పార్టీని విజయతీరాలకు చేర్చడం కోసం అని ఆయన అనుకుంటుంటే, పార్టీ శ్రేణులు మాత్రం జగన్ సెల్ఫ్ గోల్ చేసు కుంటున్నారని, పార్టీ పుట్టి మునగడం ఖాయమని వాపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలను, చివరికి కొందరు మంత్రులను కూడా పక్కన పెట్టేస్తూ, వారిపై పని రానివారనీ, పనికి రాని వారనీ, వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతోందనీ, జరుగుతుందనీ ముద్ర వేసి మరీ తీసిపారేస్తున్నారు.
అందుకే ఇక్కడ చెల్లని కానీ ఇంకెక్కడా చెల్లదు అంటూ జనం తమ నియోజకవర్గానికి జగన్ ఎంపిక చేసిన ఇన్ చార్జిని పట్టించుకోవడం లేదు. ఇక పార్టీలో అయితే జగన్ తీసుకొచ్చి తమ నెత్తిన కూర్చో పెడుతున్న అభ్యర్థికి వ్యతిరేకంగా ఏకంగా ఆందోళనలకే దిగుతున్నారు. మీరే అసమర్ధుడని తీసి పారేసిన వ్యక్తిని మాకు అంటగట్టి గెలిపించమంటే ఎలా అని నిలదీస్తున్నారు. ఇక తమపై అసమర్ధుడని ముద్ర వేసి పక్కన పెట్టేసిన సిట్టింగులైతే.. తమ ప్రమేయం ఇసుమంతైనా లేకుండానే నియోజకవర్గాన్ని వాలంటీర్ల చేతిలో పెట్టి, ఇప్పుడు ప్రజా వ్యతిరేకత అంటూ తమను పక్కన పెట్టేయడమేంటని నిలదీస్తున్నారు. కొందరైతే జగన్ కు ఒక దండం, వైసీపీకి ఇంకో దండం అని ముఖం మీదే చెప్పేసి తమ దారి తాము చూసుకుంటున్నారు.
మరి కొందరు బాధను, కోపాన్ని మనసులోనే దాచుకుని సమయం కోసం వే చి చూస్తున్నారు. మొత్తం మీద జగన్ సిట్టింగుల మార్పు విన్యాసం, టికెట్ దక్కని నేతలు, దక్కిన నేతలు ఇద్దరిలోనూ సమానంగా అసంతృప్తిని నింపుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం వీటిని వేటినీ పట్టించుకోకుండా, నాలుగో జాబితాను రెడీ చేసేశారు. నేడో రేపో ఈ జాబితాను ప్రకటించేందుకు సిద్ధమౌతున్నారు. ఇప్పటికే తొలి జాబితాలో 11 మందిని, రెండో జాబితాలో 27 మంది, మూడో జాబితాలో 21 మంది చొప్పును మొత్తం 59 మందికి టికెట్స్ ఖరారు చేసారు. ఇక ఇప్పుడు నేడో రేపో ప్రకటించనున్న నాలుగో జాబితాలో ఎంతమందిని మారుస్తారు, ఇంకెంత మందికి పార్టీ టికెట్ ఇవ్వకుండా పక్కనపెట్టేస్తారు అన్న దానిపై పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
పార్టీ వర్గాల సమాచారం మేరకు జగన్ దాదాపు 90 మంది సిట్టింగులను మార్చేయాలని డిసైడ్ అయిపోయారు. దీంతో నాలుగో జాబితాలో తమ జాతకం ఏమిటన్న ఆందోళన సిట్టింగులలో వ్యక్తం అవుతోంది. టికెట్ లభించదని భయపడుతున్న వారు,లభించినా నియోజకవర్గం మారుతుందేమోనని ఆందోళన చెందుతున్న వారు తాడేపల్లి ప్యాలస్ వద్ద బెంగగా ఎదురు చేస్తున్నారు. అదే సమయంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తరువాత అక్కడ తమ బెర్త్ రిజర్వ చేసుకోవడానికి ప్రయత్నాలూ ప్రారంభించేశారు. మొత్తంగా జగన్ విజయం కోసం చేస్తున్న సర్పయాగం లాంటి ఈ సిట్టింగుల మార్పు క్రీడలో ఆయన తనతో పాటు తన పార్టీని కూడా ఆహుతి చేసేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద గెలుపు మంత్రం అంటూ జగన్ సిట్టింగుల మార్పుతో పార్టీ ఓటమికి రాచబాట పరుస్తున్నట్లుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.