మాజీ మంత్రి తలసానిపై గొర్రెల స్కాం ఉచ్చు
posted on Jan 17, 2024 @ 11:00AM
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై అవినీతి ఉచ్చు బిగుస్తోంది. గొర్రెల పంపిణీ స్కీంలో గోల్ మాల్ జరిగినట్టు ఎసిబి అధికారులు గుర్తించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోగానే పశు సంవర్ధక శాఖలో పైళ్లు మాయమవడంపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఫైళ్ల మాయం పై ఇప్పటికే నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. గొర్రెల పంపిణీ స్కీంలో రెండు కోట్ల పది లక్షల అవినీతి జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన 18 మంది నుంచి గొర్రెలను కొనుగోలు చేసిన పశు సంవర్ధక శాఖ వారికి డబ్బులు ఇవ్వలేకపోయింది. దీంతో ప్రకాశం జిల్లాకు చెందిన ఏడు కొండలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పశు సంవర్ధక శాఖ డబ్బులు విడుదల చేసినప్పటికీ తప్పుడు ఖాతాలోకి డబ్బులు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.
గొర్రెల పంపిణీ పథకం గత బిఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలోని యాదవ, కురుమ వర్గాలకు చెందిన వారికి తెలంగాణ ప్రభుత్వం నుండి సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేసే పథకం.
2017, జూన్ 20న సిద్ధిపేట జిల్లాగజ్వేల్ సమీపంలోని కొండపాకలో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ పథకాన్ని ప్రారంభించారు. గొల్ల, కురమ వర్గాల వారు తమ సాంప్రదాయ వృత్తులలో సాధికారత సాధించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతమవుతుందన్న ఉద్దేశ్యంతో ఈ పథకం ప్రారంభించబడింది. సాధారణంగా పశు సంవర్ధక శాఖలో అవినీతి అక్రమాలు జరిగే అవకాశం తక్కువ. కానీ గొర్రెల స్కీం స్కాంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అతని కుమారుడి పాత్ర ఉందని అధికారులు గుర్తించారు. ఈ లోకసభ ఎన్నికలకు ముందే తలసానిని అరెస్ట్ చేయవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.