కమలం గూటికి నటి మీనా.. నిజమేనా?
posted on Jan 17, 2024 @ 11:48AM
సినీ, రాజకీయ రంగాల మధ్య ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఎంజీఆర్, కరుణానిథి, ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇలా సినీ రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన వారి సంఖ్య చాలా పెద్దదే. అయితే రాజకీయరంగంలోకి అడుగుపెట్టిన సినీనటులు విజయం సాధించి ఉన్నత శిఖరాలను అందుకున్న వారి సంఖ్య మాత్రం తక్కువే.
అంటే సినీ రంగంలో ప్రజాభిమానం సంపాదించుకున్న వారంతా రాజకీయరంగ ప్రవేశం చేసి అక్కడా ప్రజాదరణ పొంది సక్సెస్ అవుతారని చెప్పలేం. సినీ రంగం నుంచి రాజకీయ అరంగేట్రం చేసి ఇలా వెళ్లా అలా వచ్చేసిన వారి సంఖ్య అసంఖ్యాకంగానే ఉంటుంది. అయినా సినీ రంగంలో లభించిన ప్రేక్షకాదరణ రాజకీయ రంగంలో ప్రజాదరణగా మారుతుందని ఆశించి వచ్చే వారి సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది.
తాజాగా ప్రముఖ నటి మీనా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్త ఇప్పుడు ప్రచారంలో ఉంది. ఆమె కమలం గూటికి చేరబోతున్నారని చెబుతున్నారు. ఆ వార్తలను మీనా కూడా ఖండించలేదు. అసలు మీనా పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన వార్త వైరల్ కావడానికి కారణం ఆమె ఢిల్లీలో బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి మురుగన్ ఆధ్వర్యంలో జరిగిన పొంగల్ వేడుకలలో తళుక్కుమనడమే కారణం. కేంద్ర మంత్రి మురుగన్ ఆహ్వానం మేరకు మీనా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే కార్యక్రమంలో ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, కీలక బీజేపీ నేతలూ పాల్గొన్నారు. అటువంటి కార్యక్రమంలో మీనాకు దక్కిన ప్రాధాన్యతే ఆమె రాజకీయ ప్రవేశంపై చర్చకు తెరలేపింది. ఎంతైనా నిప్పు లేనిదే పొగరాదుగా, మీనా కూడా రాజకీయ ప్రవేశం పట్ల ఆసక్తిగానే ఉన్నట్లు చెబుతున్నారు. తాను బీజేపీ గూటికి చేరనున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతున్నా.. దానిని మీనా ఖండించకపోవడమే ఇందుకు తార్కానంగా చెబుతున్నారు. మీనా పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినా.. మొత్తం మీద మరో సినీ సెలబ్రిటి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్త మాత్రం లోకం చుట్టేస్తోంది.