కృష్ణ కృష్ణా.. వైసీపీ ఖాళీయేనా?
posted on Jan 17, 2024 9:19AM
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రాజధానుల అంశానికి తోడు, జగన్ సిట్టింగుల మార్పు ప్రయోగం కూడా ఆ పార్టీకి జిల్లాలో చోటే ఉండని పరిస్థితిని తీసుకువచ్చింది. సరిగ్గా ఎన్నికల వేళ ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ వలసల ఉదృతి మొదలైనట్లు పరిశీలకులు చెబుతున్నారు.
మరీ ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం గూటిని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్న తరువాత వైసీపీలో అసంతృప్తి పతాక స్థాయికి చేరుకుందని అంటున్నారు. కేశినేని నాని పార్టీలో చేరకుండానే ఆయనను ఇన్ చార్జిగా జగన్ ప్రకటించడం పార్టీలో తొలి నుంచీ ఉంటున్న వారిలో అసంతృప్తికి, ఆగ్రహానికీ కారణమైందని చెబుతున్నారు.
ఇక ఇప్పుడు వైసీపీని వీడే వారి జాబితా కొండవీటి చాంతాడును మించిపోవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే జిల్లా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి బయటకు వచ్చేశారు. అలాగే బాలశౌరి కూడా తాను పార్టీ వీడుతున్నట్లు ప్రకటించేశారు. ఇంకా వసంత కృష్ణ ప్రసాద్, మల్లాది విష్ణు, గత ఎన్నికలలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొప్పన భవన్ కుమార్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఇలా చెప్పుకుంటూ పోతే సీనియర్ నాయకులు చాలా చాలా మందే ఉంటారని చెబుతున్నారు.
ఇలా వైసీపీకి గుడ బై చెప్పి బయటకు వచ్చే వారంతా వచ్చే ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పని చేయడం ఖాయంగా కనిపిస్తోంది. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తరువాత వైసీపీలోని పాత కాంగ్రెస్ వాదులందరికీ ఒక ధైర్యం వచ్చిందని అంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానం, గౌరవంతో వైసీపీ గూటికి చేరిన వీరందరూ ఇప్పటి వరకూ పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా మౌనంగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పగ్గాలను వైఎస్ తనయ షర్మిల చేపట్టారో వారందరికీ ఇప్పుడు కాంగ్రెస్ బెస్ట్ ఆప్షన్ గా మారిపోయింది. వీరు కాక.. ఇప్పటికే తెలుగుదేశం, లేదా జనసేనలో సీటు రిజర్వ్ చేసుకున్న వారు కూడా జగన్ కు జెల్ల కొట్టేసి పార్టీ మారేందుకు రెడీ అయిపోయారు.
మొత్తం మీద ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ దాదాపు ఖాళీ అయిపోయినా ఆశ్చర్య పోవలసిన పని లేదని అంటున్నారు. ఎదుటి పార్టీలను చీల్చి లబ్ధి పొందుదామనుకున్న జగన్ కు తన పార్టీ నుంచే నేతలు కుప్పతెప్పలుగా బయటకు పోవడం మింగుడు పడటం లేదనీ, వీరి వలసలను ఎలా ఆపాలో తెలియక తాడేపల్లి ప్యాలెస్ గోడలకు తలబాదుకుంటున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.