షర్మిలకే విజయమ్మ మద్దతు!.. వైఎస్ రాజకీయ వారసురాలిగా అదే గుర్తింపు!
posted on Jan 17, 2024 @ 10:21AM
నిన్న మొన్నటి దాకా ఔనా కాదా?.. అవుతుందా అవ్వడా? అంటూ ఎన్నో అనుమానాలు. ఔను షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యతలు అప్పగిస్తుందా? పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించి అన్నపై యుద్ధానికి రెడీ కమ్మంటుందా అన్న అనుమానాలు పలువురిలో వ్యక్తం అయ్యాయి. అయితే వాటన్నిటికీ కాంగ్రెస్ హై కమాండ్ ఫుల్ స్టాప్ పెట్టేసింది. సంక్రాంతి పండుగ రోజు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఆ వెంటనే అంటే కనుమ పండుగ రోజున షర్మిలను ఏపీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ హై కమాండ్ అప్పాయింట్ చేసేసింది. దీంతో షర్మిల ఇక ఏపీలో కాంగ్రెస్ ప్రచార సారథ్యం చేపట్టినట్లే. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ టార్గెట్ గానే ఆమె విమర్శల బాణాలు సంధించనుంది. గతంలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ అప్పటి తెలుగుదేశం సర్కార్ పై విరుచుకుపడిన షర్మిల ఇప్పుడు జగన్ అంటే తాను ఎవరు వదిలిన బాణంగా రాజకీయాలలోకి ప్రవేశించిందో ఆ అన్నకు వ్యతిరేకంగా విమర్శనాస్త్రాలు సంధించనున్నారు.
జగన్ పాలనా వైఫల్యాలు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలపై ఇప్పటికే రాష్ట్రంలో విపక్ష తెలుగుదేశం, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన విమర్శలు గుప్పిస్తున్నాయి. జగన్ ఆర్థిక అరాచకత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆధారాలతో సహితంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరి షర్మిల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా కొత్తగా చేసే విమర్శలు ఏమై ఉంటాయి? జగన్ ప్రత్యర్థులను మించి ఆమె జగన్ పై ఏ విధంగా యుద్ధం చేస్తారు? అంటే పరిశీలకులు షర్మిల తన ప్రచారంలో సొంత అన్న తనకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు సోదాహరణంగా వివరించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.
అన్న జైల్లో ఉన్నప్పుడు తాను చేసిన పాదయాత్ర, గత ఎన్నికల ప్రచారంలో అన్న కోసం చేసిన ప్రచారం గుర్తు చేస్తూ, తీరా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తనను బయటకు పంపేసిన తీరు వంటి విషయాలనన్నిటినీ ప్రస్తావిస్తూ ముందుకు సాగే అవకాశాలే మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నారు. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ కుటుంబం చేతికి వచ్చాయి. అంటే కాంగ్రెస్ వైఎస్ వారసురాలిగా షర్మిలను ప్రకటించినట్లేనని అంటున్నారు. తండ్రి ఆశయాల సాధన కోసం షర్మిల ఏపీలో అనుసరించే వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. అన్న జగన్ ను ఎదుర్కొనేందుకు షర్మిల ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అన్నను షర్మిల విమర్శించేందుకు ఏయే అంశాలను ఎంచుకుంటారు? కేవలం జగన్ పాలనపైనే అస్త్రాలు సాధిస్తారా? లేక కుటుంబ వ్యవహారాలపై కూడా ప్రశ్నిస్తారా అన్న చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతోంది. అన్న పాలనా వైఫల్యాలతో పాటు, షర్మిల కుటుంబ వ్యవహారాలను కూడా ప్రచారంలో ప్రస్తావిస్తే తమ పరిస్థితి ఏమిటి? అన్న ఆందోళన వైసీపీలో వ్యక్తం అవుతోంది.
ఏపీలో అత్యంత ప్రజాకర్షణ శక్తి ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తెగా, రాజకీయవారసురాలిగా షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం రాజకీయంగా ఆమెకు, కాంగ్రెస్ పార్టీకీ కూడా ప్లస్ అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుత సీఎం కూడా వైఎస్ కుటుంబీకుడే అయినప్పటికీ, వైఎస్ అభిమానులు సైతం ప్రస్తుతం జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. వైఎస్ ఆత్మగా గుర్తింపు పొందిన కేవీపీ సైతం జగన్ కు మొదటి నుంచీ దూరంగానే ఉన్నారు. నాడు వైఎస్ కు సన్నిహితంగా ఉన్న ఎవరూ కూడా ఇప్పుడు జగన్ తో లేరు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హై కమాండ్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడంతో వైఎస్ అభిమానులు, సన్నిహితులు కూడా పార్టీకి దగ్గర అవ్వడమే కాకుండా ఆమెను వైఎస్ రాజకీయవారసురాలిగా అంగీకరించి మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికే జగన్ పాలనలో పూర్తిగా విఫలమై తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దానికి తోడు ఆయన వ్యక్తిగత నైజం కూడా ఆయన పార్టీలోని పలువురికి అక్కడ ఇమడలేని పరిస్థితిని తీసుకు వచ్చింది. అలా అటూ ఇటూ చూస్తున్న వారందరినీ షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించడం ద్వారా ఆకర్షించవచ్చన్నది కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచనగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వీటితో పాటు వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి షర్మిల వెంట కాంగ్రెస్ గూటికి చేరుతారా? అలా చేరి వచ్చే ఎన్నికలలో కుమారుడు జగన్ కు వ్యతిరేకంగా గళం విప్పుతారా అన్న ఆసక్తి కూడా సర్వత్రా ఉంది.
విజయమ్మ షర్మిల, జగన్ లలో ఎవరికీ మద్దతు తెలపకుండా తటస్థంగా ఉన్నా కూడా అది జగన్ కు నష్టమే. అలా కాకుండా షర్మిల తరఫున ఆమె నిలబడితే ఇక జగన్ కు రాజకీయంగా నూకలు చెల్లినట్లే అవుతుంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే విజయమ్మ షర్మిల వెంటే ఉంటారన్నది పరిశీలకుల విశ్లేషణ. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరిన తరువాత కూడా విజయమ్మ ఆమె తోనే ఉండటంతో ఆమె మద్దతు షర్మిలకే అని నిర్ధారణ అవుతోందంటున్నారు. అన్నిటికీ మించి జగన్ పార్టీకి విజయమ్మ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న సమయంలో షర్మిలకు రాజ్యసభ సభ్యత్వం కోసం జగన్ పై గట్టిగా ఒత్తిడి చేశారని చెబుతారు. జగన్ ససేమిరా అనడంతోనే ఆమె నొచ్చుకుని పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసి కుమారుడికి దూరంగా వచ్చేశారని అంటారు. అలా వచ్చేసిన తరువాత ఆమె ఇప్పటి వరకూ (షర్మిల కుమారుడి వివాహానికి జగన్ ను ఆహ్వానించిన సందర్భంలో కూతురుతో పాటు వెళ్లిన సందర్భం మినహాయిస్తే) తాడేపల్లి ప్యాలెస్ గడప తొక్కకపోవడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వారు కూడా విజయమ్మ తపన, తాపత్రయం అంతా కుమార్తె షర్మిల రాజకీయ భవిష్యత్ కోసమేనని, అందుకే ఆమె షర్మిల వెంటే నడుస్తారని చెబుతున్నారు. వైఎస్ హయంలో పనిచేసిన సీనియర్ నేతలకు విజయమ్మపై గౌరవాభిమానాలు ఉన్నాయి. అవి ఇప్పుడు షర్మిలకు అండగా మారాలంటే విజయమ్మ కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. గతంలో విజయమ్మ జగన్ కోసం, జగన్ ను సీఎంగా చూడడం కోసం రాజకీయ ప్రవేశం చేసిన విజయమ్మ ఇప్పుడు కుమార్తె షర్మిల రాజకీయంగా ఉన్నత స్థాయికి వెళ్లడం కోసం కృషి చేస్తారని అంటున్నారు. అన్నిటికీ మించి వివేకా హత్య కడప పార్లమెంటు స్థానం కోసమే జరిగిందని షర్మిల బహిరంగంగా చెప్పిన సందర్భంలో విజయమ్మ ఖండించకపోవడం అంటే ఆమె షర్మిల వ్యాఖ్యలను సమర్ధిస్తున్నట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సో షర్మిల కాంగ్రెస్ తరఫున తాను చేయబోయే ప్రచారంలో వివేకా హత్య కేసులో నిందితులకు జగన్ అండ వంటి అంశాలను కూడా ప్రస్తావించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. షర్మిల ఇప్పటికే పలుమార్లు ఈ హత్యపై వివేకా కుమార్తె సునీతకు మద్దతుగా మాట్లాడారు. అ లాగే సొంత వాళ్ళే తన చిన్నాన్నను హత్య చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందు ముందు కూడా ఇటువంటి విమర్శలతో షర్మిల జగన్ ను ఇరుకున పెట్టడం ఖాయమని అంటున్నారు. ఆ విమర్శలకు విజయమ్మ నుంచి ఖండనలు రాకపోతే.. ఇక జగన్ జనాలకు ముఖం చూపలేక చాటేయాల్సిన పరిస్థితి ఎదురౌతుందని చెబుతున్నారు. మొత్తంగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల అందుకున్న క్షణం నుంచీ జగన్ శిబిరంలో ఆందోళన మొదలైందని చెబుతున్నారు. ఇక విజయమ్మ కూడా షర్మిల వైపే నిలబడడం నైతికంగా జగన్ కు కోలుకోలేని దెబ్బే అవుతుందని విశ్లేషిస్తున్నారు.