కాంగ్రెస్ సంక్రాంతి కానుక.. జగన్ మైండ్ బ్లాక్
posted on Jan 17, 2024 @ 11:20AM
పోకిరి అనే సినిమాలో ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అన్న ఓ పాపులర్ డైలాగ్ ఉంది. ఇప్పుడు షర్మిల ఏపీ పొలిటికల్ ఎంట్రీ జగన్ కు అలా దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బగానే మారింది. ఔను షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం అన్నది జగన్ కు అలాంటి ఇలాంటి దెబ్బ కాదు. వైసీపీ రాజకీయ భవిష్యత్, జగన్ రాజకీయ కెరియర్ ప్రశ్నార్థకంగా మారిపోయేంత చావుదెబ్బగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఔను తెలుగువారికి పెద్ద పండుగ అయిన సంక్రాంతి రోజునే జగన్ పొలిటికల్ కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ హై కమాండ్ తొలి అడుగు వేసింది. కనుమరోజున షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించి మలి అడుగు కూడా వేసేసింది. ఇక ఏపీలో షర్మిల వేసే ప్రతి అడుగూ జగన్ ను, జగన్ పార్టీనీ కొలుకోలేని విధంగా దెబ్బతీసేలాగే ఉంటాయని చెబుతున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. దీంతో అప్పట్లో కాంగ్రెస్‌లో చాలా మంది నేతలు, కార్యకర్తలు జగన్ నేతృత్వంలోని వైసీపిలో గంపగుత్తగా చేరిపోయారు. అదే విధంగా ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా వైసీపికి దఖలు పడిపోయింది. ఇప్పుడు అంటే దాదాపు పదేళ్ల తరువాత వైఎస్ షర్మిల రూపంలో రాష్ట్ర కాంగ్రెస్ కు మళ్లీ జవసత్వాలు కూడగట్టుకునే అవకాశం లభించింది. వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె మాత్రమే కాదు.. ఏపీ సీఎం జగన్ కు తోడబుట్టిన చెల్లి కూడా. దీంతో వైసీపిలో నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు భారీగా ఉండటం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈ నాలుగున్నరేళ్లలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. స్వోత్కర్ష, పరనింద వినా పాలనా పరంగా ఏ రకంగా చూసినా అన్నిందాల విఫలమైన జగన్ పాలనలో ఏ వర్గమూ కూడా హ్యాపీగా లేని పరిస్థితి నెలకొంది. ప్రజా వ్యతిరేకతకు తోడు పార్టీలో కూడా జగన్ పట్ల అసంతృప్తి కొండలా పేరుకుపోయింది. ముఖ్యంగా నియోజకవర్గంలో పార్టీ ఫేస్ గా ఉండాల్సిన ఎమ్మెల్యేలను డమ్మీలను చేసి వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావడం ద్వారా జగన్ క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణాన్నే కుప్ప కూల్చేసుకున్నారు.
నియోజకవర్గంలో పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యేలా చేసుకున్నారు. ఇప్పుడు అదే వ్యతిరేకతను సాకుగా చూపి ఇష్టారాజ్యంగా అభ్యర్థులను మార్చేస్తున్నారు. దీంతో సిట్టింగులలో తీవ్ర వ్యతిరేతక వ్యక్తం అవుతోంది. ఇంకెంత మాత్రం జగన్ నాయకత్వంలో పని చేసే ప్రశ్నే లేదని బాహాటంగానే చెబుతున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలలో అవకాశం లేని వారికి ఇప్పుడు కాంగ్రెస్ డెస్టినేషన్ గా మారింది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల వెంటే తన రాజకీయ అడుగులు అని ప్రకటించేశారు. అదే దారిలో జగన్ టికెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టేసినవారు, వైసీపిలో ఇమడలేక ఇబ్బంది పడుతున్న సీనియర్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇంతకాలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదన్న పట్టుదలతో తెలుగుదేశం, జనసేన కూటమి అడుగులు వేస్తోంది. ఆ దారిలో దాదాపు సక్సెస్ అయ్యింది. ఇప్పుడు వైసీపీ అనుకూల ఓటు షర్మిల ఎంట్రీతో గంపగుత్తగా కాంగ్రెస్ కు దఖలు పడనుంది.
దీంతో ఏపీలో వైసీపీకి ఓటు అనేదే లేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. మొత్తంగా కాంగ్రెస్ ఏపీ పార్టీ పగ్గాలను షర్మిలకు అప్పగించడం ద్వారా జగన్ ను ఎన్నికల యుద్ధంలో ఆస్త్రాలే లేకుండా చేసేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇప్పటి వరకూ ప్రత్యర్థి పార్టీల నాయకుల వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ, తిట్లూ దూషణలతో విరుచుకుపడిన జగన్ పార్టీకి ఇప్పుడు షర్మిల రంగంలోకి దిగడంతో నోరెత్తే అవకాశం ఉండదంటున్నారు. ఎందుకంటే జగన్ సొంత చెల్లే అన్నకు వ్యతిరేకంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాజకీయ విమర్శ అంటే ఏమిటో తెలియని వైసీపీ మూకలకు తమ అధినేత సోదరిపై నోరు పారేసుకునే ధైర్యం ఉండదు. ఒక వేళ తెగించి కువిర్శలు చేసినా.. అందుకు దీటుగా బదులివ్వడానికి షర్మిల ఇసుమంతైనా వెనుకాడరు. ఈ పరిస్థితుల్లో జగన్ , ఆయన పార్టీ నేతలు తెలుగుదేశం, జనసేనలపై అనుచిత విమర్శలు చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అన్నిటికీ మించి తన పాలనా వైఫల్యాలను సొంత సోదరి ఎత్తి చూపుతుంటే.. సమాధానం చెప్పుకుని, వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితిలో జగన్ ఇప్పుడు ఉన్నారు. సో షర్మిల ఎంట్రీతో జగన్ అండ్ కో పూర్తిగా డిఫెన్స్ లో పడిపోవడం ఖాయం. ఇప్పటి వరకూ గుడ్డ కాల్చి ముఖం మీద వేసి తుడుచుకోండి అన్న చందంగా ఇష్టారీతిగా విమర్శలతో , దూషణలతో చెలరేగిపోయిన జగన్ పార్టీకి ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జ్ గా షర్మిల సంధించే విమర్శలు, ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకోవడం వినా, ప్రతి విమర్శ చేయడానికి కానీ అవకాశం ఉండదు. ఇంతకాలం తెలుగుదేశం, జనసేనలు విమర్శలను జగన్మోహన్ రెడ్డి, వైసీపి నేతలు చాలా తేలికగా కొట్టిపడేస్తున్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల చేయబోయే విమర్శలు, ఆరోపణలను అలా కొట్టిపారేయడానికి అవకాశం ఉండదు. వాటికి సమాధానాలు చెప్పుకోవాలి? ఇంతకాలం ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టి ఆనందించిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సొంత చెల్లెలే తిరగబడి నిలదీసే పరిస్థితి రావడం చూస్తుంటే చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా అన్న సామెత గుర్తుకు వస్తున్నది.
అహంకారం, అధికార మదంతో నాలుగేళ్ల పాటు ఇష్టారీతిగా చెలరేగిపోయిన జగన్ కు ఇప్పుడు అడుగు వేయాలన్నా, అడుగు కదపాలన్నా నేలకింద భూమి కదిలిపోతున్న ఫీలింగ్ వచ్చే పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రజలలోకి వెళ్లాలంటే రోడ్లకు ఇరువైపులా పరదాలు కట్టుకుని వెళ్లే పరిస్థితి నుంచి షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చారని అంటున్నారు.