ఒంగోలు ఆఫర్ రిజెక్ట్.. జగన్ పై రోజా రివోల్ట్?
posted on Jan 29, 2024 @ 10:34AM
రోజా విషయంలో జగన్ భయపడినదే జరుగుతోందా? ఇప్పటి వరకూ జగన్ కోసం తన గొంతు అరువిచ్చిన రోజా ఇప్పడు జగన్ లక్ష్యంగా విమర్శలు సంధించనున్నారా? అంటే పార్టీ వర్గాలే కాదు పరిశీలకులూ విశ్లేషిస్తున్నారు. రాజకీయ వర్గాలు సౌతం ఔననే అంటున్నారు.
నగరి నియోజకవర్గంలో రోజాకు తీవ్ర వ్యతిరేకత ఉందంటూ గత కొంత కాలంగా సొంత పార్టీలోనే ప్రచారం ఓ రేంజ్ లో జరుగుతోంది. అంతెందుకు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షల సందర్భంగా అంటే దాదాపు ఎనిమిది నెలల కిందటే.. సీఎం జగన్ రోజాకు గట్టి వార్నింగ్ ఇచ్చారని కూడా పార్టీలో ప్రచారం జరిగింది. ఇక నియోజకవర్గాల మార్పు అంటూ జగన్ కసరత్తు ప్రారంభించిన క్షణం నుంచీ రోజాకు ఈ సారి పోటీకి అవకాశం లేదు.. కేవలం పార్టీ బాధ్యతలకే పరిమితం చేస్తారంటూ వైసీపీ శ్రేణులు చెబుతూ వస్తున్నాయి. అయినా ఐదు జాబితాలు ప్రకటించినా జగన్ రోజాకు స్థానం లేదని మాత్రం చెప్పడానికి ధైర్యం చేయలేకపోయారు.
ఆమె నోటి దురుసుతనం తెలిసిన జగన్ రోజా సిట్టింగు స్థానం మార్పు విషయంలో ఒక నిర్ణయం తీసేసుకున్నా దానిని బాహాటంగా వెల్లడించేందుకు మాత్రం జంకారు. ఇక ఇప్పుడు ఆమెకు నగరి అసెంబ్లీ స్థానం నుంచి కాకుండా ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా సమాచారం అందించారని చెబుతున్నారు. ఆమె స్పందన చూసిన తరువాత ప్రకటన చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. నగరి స్థానం నుంచి మార్చే విషయం ఇప్పటి వరకూ ఆమెకు నేరుగా చెప్పకున్నా.. లీకుల ద్వారా, నియోజకవర్గ పరిధిలోని పార్టీ స్థానిక ప్రజా ప్రతినిథుల ద్వారా చేయించిన ఆరోపణలు, పార్టీ వర్గాల చర్చలు, నియోజకవర్గంలో ఆమెకు వ్యతిరేక గ్రూపులకు అందించిన ప్రోత్సాహం వంటి విషయాలతో ఆమెను ఇప్పటికే మానసికంగా సిద్ధం చేసేశామన్న భావనకు వచ్చిన తరువాతే రోజాకు ఆమెకు గుంటూరు లోక్ సభ స్థానం కేటాయించినట్లు సమాచారం అందించారని అంటున్నారు.
అయితే ఇంత కాలం తన నియోజకవర్గ మార్పు విషయంలో జరుగుతున్న ప్రచారాన్నంతా మౌనంగా గమనిస్తూ వచ్చిన రోజా.. ఇప్పుడు ఆ ప్రచారాన్నికన్ ఫర్మ్ చేస్తూ తనకు జగన్ సమాచారం పంపించడంతో ఇక మౌనం వహించే ప్రశ్నే లేదంటూ గట్టిగా గళమెత్తారని అంటున్నారు. ఎవరి ద్వారా అయితే జగన్ తనకు ఒంగోలు కేటాయిస్తున్నట్లు సమాచారం పంపారో వారి ద్వారానే తాను అందుకు సిద్ధంగా లేనన్న బదులు కూడా పంపించారని అంటున్నారు. తాను పోటీలో ఉంటాననీ అయితే అది ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాత్రం కాదనీ ఆమె కుండబద్దలు కొట్టేశారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తాను నగరి నుంచే బరిలోకి దిగుతాననీ, వైసీపీ కాకపోతే ఇంకో పార్టీ అదీ కాకపోతే ఇండిపెండెంట్ అని తెగేసి చెప్పారని చెబుతున్నారు. రోజా నుంచి ఈ స్థాయిలో ధిక్కారం వస్తుందని ఊహించని జగన్ కంగుతిన్నారని అంటున్నారు.
అసలు నగరి నుంచి రోజాను వెళ్లగొట్టడమే లక్ష్యంగా పెద్దిరెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. జగన్ కు కూడా ఆమెకు మరోసారి టికెట్ ఇవ్వడం ఇష్టం లేకపోవడంతో నగరి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రోజాకు వ్యతిరేకంగా చేస్తున్న రాజకీయాలను ప్రోత్సహించారు. నియోజకవర్గంలో ఎవరితోనూ సఖ్యత లేదంటూ పలుమార్లు రోజాను మందలించిన జగన్ అందరినీ కలుపు పోవాలని సూచించినట్లు చేశారు. ఇవన్నీ ఎందుకంటే రోజా విమర్శల ఘాటు ఎంత తీవ్రంగా ఉంటుందో జగన్ కు తెలియడమే. ఆ కారణంగానే రోజా చేసే రచ్చకు భయపడే ఇంత కాలం నగరి నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించకుండా జాప్యం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఒంగోలు ఎంపీ అభ్యర్థి అంటూ చేసిన ప్రతిపాదనను రోజా నిర్ద్వంద్వంగా తిరస్కరించడంతో ఇప్పుడు కూడా రోజా అభ్యర్థితద్వ ప్రకటన జాప్యం చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద రోజాకు అయితే మాత్రం నగరి నుంచి పోటీ చేసేందుకు జగన్ అవకాశం ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఇక జగన్ ఆఫర్ చేసిన ఒంగోలు లోక్ సభ సీటును ఆమె నిరాకరిస్తే.. ఆమెకు ఇక పార్టీలో చోటు ఉండటం అనుమానమేనని అంటున్నారు. అదే జరిగితే ఆమె భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందన్న దానిపై ఏపీ పాలిటిక్స్ లో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది.