లోకేష్ పాదయాత్ర తొలి అడుగుకు ఏడాది!
posted on Jan 29, 2024 9:07AM
కనీ వినీ ఎరుగని నిర్బంధం నడుమ సరిగ్గా ఏడాది కిందట అంటే జనవరి 27, 2023) నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించారు. అంటే నారా లోకేష్ యువగళం పాదయాత్ర తొలి అడుగు వేసి ఏడాది పూర్తయ్యింది..
"జనం బాధలు, ఆకాంక్షలను అర్థం చేసుకోవడానికి, ప్రభుత్వ పీడితులకు నేనున్నానంటూ భరోసా ఇవ్వడానికి, చెలరేగిపోతున్న అరాచకశక్తులను హెచ్చరించడానికి... నారా లోకేశ్ యువగళం ప్రారంభించారు. 2023 జనవరి 27న కుప్పంలోని వరదరాజులు స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి అడుగు వేశారు. నిజానికి రాజకీయ నాయకులు ప్రజలతో ఎంతగా మమేకమైతే అంతగా వారికి దగ్గరౌతారు. అలాగే నాయకులకు పార్టీ కార్యకర్తలతో వ్యక్తిగత సంబంధాలు ఎంత బలంగా ఉంటే క్యాడర్ అంత గట్టిగా పార్టీ కోసం, నాయకుడి కోసం పనిచేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తన రాష్ట్రంలో చీకటి పాలనే సాగుతోంది. ప్రజాస్వామ్యం ఆనవాలు కూడా లేకుండా పోయింది. తాను చెప్పిందే జరగాలి, తన మాటే శాసనం అన్న తరహాలు నిరంకుశ పాలన కొనసాగుతోంది. ప్రశ్నించినా, ప్రతిఘటించినా, వ్యతిరేకించినా వేధింపులు. కేసులు, దాడులు జైళ్లు. అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితి మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో లోకేష్ ప్రజల ఆకాంక్షలు తెలుసుకుని, వారి కష్టాలకు, కడగండ్లకు చరమగీతం పాడుతానన్న భరోసా కల్పిస్తూ, అధికార పార్టీ అరాచకత్వాలు, వైఫల్యాలపై గళమెత్తుతూ అత్యంత సాహసోపేతంగా పాదయాత్ర ప్రారంభించారు.
ఆయన పాదయాత్ర జగన్ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులను అన్నిటినీ దాటుకుని విజయవంతంగా సాగడానికి కారణం తెలుగుదేశం క్యాడర్. ఆ క్యాడర్ లో లోకేష్ పట్ల ఉన్న నమ్మకం. ఔను పైన చెప్పుకున్నట్లు ఒక నాయకుడికి పార్టీ కార్యకర్తలతో వ్యక్తిగత సంబంధాలు ఎంత బలంగా ఉంటే క్యాడర్ అంత గట్టిగా పార్టీ కోసం, నాయకుడి కోసం పనిచేస్తుంది. లోకేష్ విషయంలో సరిగ్గా అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపే ప్రభుత్వ సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలన దుష్పరిణామాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఆయన చేసిన పాదయాత్ర ఇంత దిగ్విజయం అయ్యిందంటే అందుకు ఆయన పట్ల పార్టీ కేడర్ కు ఉన్న నమ్మకం, విశ్వాసమే కారణం. తమ కోసం నిలబడిన నేత కోసం నిలబడాలన్న కార్యకర్తల సంకల్పం.
పార్టీ కోసం పని చేస్తున్న యువ నాయకులు, కార్యకర్తల గురించి లోకేష్ తీసుకునే శ్రద్ధ గురించి కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మంచి చెడులు చూసుకోవడమే కాకుండా, వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇస్తున్నారు. కార్యకర్తలకు ఇన్సూరెన్స్ అన్నది లోకేష్ బ్రెయిన్ చైల్డ్ అనడంలో సందేహం లేదు. ఆయన ఆ విధానాన్ని ప్రారంభించిన తరువాతనే రాజకీయ పార్టీలు తమ పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడం మొదలెట్టారు. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి లోకేష్ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. సాంకేతికత సాయంతో కార్యకర్తలందరికీ చేరువ అయ్యారు. ప్రతి కార్యకర్తతోనూ లోకేష్ కు పేరు పెట్టి పిలిచేంత దగ్గర తనం ఉందని పార్టీ క్యాడర్ సగర్వంగా చెప్పుకుటుంటారు. లోకేష్ కారణంగానే పార్టీలో ప్రతి కార్యర్తా మరింత చురుకుగా పని చేయడానికి ఉత్సాహం చూపుతున్న వాతావరణం ఏర్పడింది. ఆ వ్యక్తిగత పరిచయం, దగ్గరతనం వల్లే లోకేష్ కు అండగా కార్యకర్తలు ఒక ప్రభంజనంలా కదిలారనీ, లోకేష్ పాదయాత్ర విజయవంతానికి ఇదో ప్రధాన కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.