ముద్రగడకు గవర్నర్ గిరి.. రాజ్యసభకు చిరు.. జగన్ తో బీజేపీ క్విడ్ ప్రోకో గేమ్!
posted on Jan 30, 2024 @ 2:04PM
ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుక్కు రావాలన్నది నానుడి. ఏపీలో బీజేపీ అదే పని చేస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వాస్తవానికి ఏపీలో బీజేపీకి బలం శూన్యం. కనీసం ఒక్కశాతం ఓటు స్టేక్ కూడా లేదు. ఆ విషయాన్ని హుందాగా అంగీకరించడానికి ఆ పార్టీకి అహం అడ్డువస్తోంది. పరాన్న జీవిలా పక్క వాళ్ల ను బలహీనపరిచి తాను బలపడాలన్న కుయుక్తులకు తెర తీస్తోంది. ఏపీలో అత్యంత బలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం మాత్రమే. ప్రస్తుతం అధికారంలో ఉన్నా.. గత ఎన్నికలలో 151 స్థానాలలో విజయం సాధించినా జగన్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో ఎదురీదుతోంది. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. సొంత పార్టీలోనే అసంతృప్తి ఆ పార్టీని దావాలనంలా దహించేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల పగ్గాలు చేపట్టిన తరువాత వైసీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వైనాట్ 175 అన్న ధీమా నుంచి ఓడిపోయినా బాధపడను అని జగన్ స్వయంగా అంటున్నారంటేనే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అవగతమౌతుంది.
ఇక ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం గత ఎన్నికలలో ఎదురైన పరాజయం నుంచి కోలుకుని అత్యంత శక్తిమంతంగా వచ్చే ఎన్నికలకు రెడీ అయ్యింది. ఆ పార్టీకి జనసేనతో పొత్తు అదనపు బలంగా మారింది. దీంతో ఏపీలో బీజేపీకి అసలు స్పేస్ లేని పరిస్థితి. అయితే కేంద్రంలో అధికారంలో ఉండటం.. తన ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ.. కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందన్న భయం, ఎన్నికల వేళ మోడీ సర్కార్ అండ ఉంటే మేలన్న భావం వెరసి తెలుగుదేశం, జనసేన కూటమి బీజేపీ కూడా కలిసి వస్తే బాగుంటుందని భావిస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం ఏపీలో విష రాజకీయాలకు తెరలేపింది. తెలుగుదేశం, జనసేన మధ్య కుదిరిన పొత్తును విచ్ఛిన్నం చేయడం, లేక ఆ కూటమికి బలమైన వర్గాన్ని దూరం చేసి అధికారంలో ఉన్న జగన్ పార్టీకి మేలు చేసి అందుకు ప్రతిఫలంగా రాజకీయ లబ్ధి పొందడం అనే వ్యూహంతో పావులు కదుపుతోంది.
ఒక వైపు జనసేనతో మిత్రత్వం నెరపుతూనే మరో వైపు తెరవెనుక ఆ పార్టీకి బలమైన సామాజిక వర్గాన్ని దూరం చేసి తన రహస్య మిత్రుడికి మేలు చేసే ప్రయత్నాలను కొనసాగిస్తోంది. తెలుగుదేశం, జనసేన పొత్తును విచ్ఛిన్నం చేయడానికి ఏపీ సీఎం జగన్, ఆయన పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైన తరుణంలో జగన్ కు ప్రయోజనం చేకూరేలా ఆ కూటమికి బలమైన సామాజిక వర్గాన్ని దూరం చేసే కుట్రకు బీజేపీ తెరలేపినట్లు కనిపిస్తోంది. జనసేన అధినేత సోదరుడు చిరంజీవికి యూపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేయడం, అలాగే కాపు ఉద్యమ నేత ముద్రగడకు గవర్నర్ పదవిని ఆఫర్ చేయడం ఈ వ్యూహంలో భాగమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వాస్తవానికి బీజేపీ, తెలుగు దేశం పార్టీ ఎప్పటి నుంచో మిత్ర పక్షాలు. ఎన్ని సార్లు విడిపోయాయో అన్ని సార్లూ కలిశాయి. ఆ రెండు పార్టీల మధ్య శతృ మిత్ర సంబంధాలు, తారు మారైన సందర్భాలు రాజకీయ చరిత్ర పుటల్లో చాలానే ఉన్నాయి. అంతే కాదు,అప్పట్లో, ఉభయ పార్టీ నేతలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరించిన సందర్భాలూ ఉన్నాయి. ఆ సమయంలోనే అటల్జీ, అద్వానీ వంటి బీజేపీ అగ్రనేతలు అనేక సందర్భాలలో తెలుగుదేశం పార్టీని విశ్వసనీయ మిత్ర పక్షంగా, చంద్రబాబును విశ్వనీయ మిత్రుడిగా పేర్కొన్నారు. గౌరవించారు. తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీకి అటువంటి మర్యాద గౌరవాన్నే ఇచ్చింది. అలాగే, రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన ప్రతి సందర్భంలోనూ ఉభయతారకంగా రెండు పార్టీలు ప్రయోజనం పొందాయి. రాష్ట్ర విభజన తర్వాత, ఉభయ పార్టీలు కలిసి పోటీ చేయడమే కాదు కేంద్ర, రాష్టం మంత్రి వర్గాలలో భాగస్వాములయ్యాయి.
అయితే, ఇదంతా గతం. అటల్జీ, అద్వానీల నాటి బీజేపీ వలే మిత్రధర్మం పాటించాలన్న ఉద్దేశం ఇప్పుడు మోడీ హయాంలోని బీజేపీకి ఇసుమంతైనా లేదు.
అందుకే ఒక్క తెలుగు దేశం పార్టీ మాత్రమే కాదు, ఇతర మిత్ర పక్షాలకు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు గౌరవం ఇవ్వకపోవడమే కాదు, అవకాశం చిక్కితే వాటి అడ్రస్ గల్లంతు చేసేందుకు వెనకాడేది లేదని చేతల్లో చూపిస్తున్నది. అందుకే, సిద్దాంత సారూప్యం ఉన్న శివ సేన, అకాలీ దళ్, ఒకప్పుడు బీజేపీ అగ్రనేతలే విశ్వనీయ మిత్ర పక్షంగా మెచ్చుకున్న తెలుగుదేశం సహా అనేక భాగస్వామ్య పక్షాలు బీజేపీకి దూరమయ్యాయి. ఇప్పటికీ కేంద్రంలో ఉన్నది పేరుకు ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వమే అయినా, మోదీ మంత్రివర్గంలో మిత్ర పక్షాలకు పెద్దగా వాయిస్ లేదు. మిత్ర పక్షాల నుంచి కాబినెట్ లో స్థానం దక్కిన మిత్ర పక్షాల మంత్రులకు అంతకంటే ప్రాధాన్యత లేదు. నిజానికి మోడీ, షాలను మినహాయిస్తే బీజేపీ మంత్రులలో కూడా ఎవరికీ పెద్దగా ప్రాధాన్యత ఉన్న దాఖలాలు కనిపించవు. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టి ఏపీ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి నిండా ఒక్క శాతం ఓటు కూడా లేదు. ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాట తప్పిన బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకున్న నేపధ్యంలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నోటా తో పోటీ పడింది. పోటీ చేసిన స్థానాలలో ఒక్కటంటే ఒక్క చోట కూడా ఆ పార్టీ డిపాజిట్ దక్కించుకోలేదు. అయితే కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రాష్ట్రంలో చక్రం తిప్పుతోంది.
ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల ముందు మరోమారు తన మిత్రుడు జగన్ కు మేలు చేసి ఆ తరువాత రాజకీయ లబ్ధి పొందే కుట్రలకు తెరలేపింది. అందులో భాగమే ముద్రగడకు గవర్నర్ పదవి, చిరంజీవికి రాజ్యసభ ఆఫర్లు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఢిల్లీకి పిలిపించుకుని మంతనాలు జరిపేందుకు రెడీ అయ్యింది. పవన్ ఢిల్లీ పర్యటన తరువాత బీజేపీ వ్యూహాలు ఏ మేరకు ఫలించాయి. అన్నది తేలుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ఏపీలో జగన్ సర్కార్ కు.. కేంద్రంలోని మోడీ సర్కార్ కు మధ్య క్విడ్ ప్రొకో సంబంధం ఉందని అంటున్నారు.