జనసేనాని ఎక్కడ?
posted on Jan 30, 2024 @ 10:00AM
ఎన్నికల నగారా రేపో మాపో మోగనుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం మాత్రం కాక రేగి పోతోంది. ఇప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల్లోకి వెళ్లి సుడిగాలి పర్యటనలు చేస్తూ.. జగన్ పాలనను, ఆయన వైఖరిని ఎండగడుతున్నారు. ఆయన వైఫల్యాలను ప్రజల కళ్లకు కడుతున్నారు. అలాగే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కూడా ఎన్నికల శంఖారావాన్ని పూరించి.. వరుస పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇక నిన్న కాక మొన్న కాంగ్రెస్ గూటికి చేరి పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైయస్ షర్మిల సైతం బాణం లాగా ప్రజల్లోకి నేరుగా దూసుకు పోతున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అలాంటి వేళ.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎక్కడ.. ఎక్కడ అని ఆ పార్టీ శ్రేణులు వెతుకులాడుకుంటున్నారు. ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ కనిపించకపోవడమేంటన్న చర్చ సైతం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఇప్పటికే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి సాగుతామని పవన్ కల్యాణ్ సందేహాలకు తావులేని విధంగా ప్రకటించేశారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు.. ఆయనతో ములాఖాత్ అయి... ఆ తర్వాత అదే జైలు బయట.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో ప్రకటించారు.
నిన్న మొన్నటి వరకు నారా లోకేశ్.. యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహించారు. ఆ ముగింపు సభకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఆ తర్వాత.. చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ ఆయనతో భేటీ అయ్యారు. అలాగే పవన్ ఇంటికి వెళ్లి చంద్రబాబు సైతం సమావేశమయ్యారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఎక్కడా ప్రచారాల్లో పాల్గనడం లేదు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే విరామమే లేకుండా.. ప్రజల మధ్యకు వెళ్లి.. మరీ జగన్ పాలన పై విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారని.. కానీ పవన్ కల్యాణ్ జాడ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.
అయితే నారా చంద్రబాబు నాయుడు.. ఇటీవల రెండు అసెంబ్లీ స్థానాలు మండపేట, అరుకులో తమ పార్టీ అభ్యర్థులు బరిలో నిలుస్తారంటూ ప్రకటించారు. ఆ వెంటనే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం రాజానగరం, రాజోలులో తమ పార్టీ అభ్యర్థులను నిలుపుతామంటూ ప్రకటించారని.. మరి ఇందులో ఉన్న చొరవ.. ఎన్నికల ప్రచారంలో మాత్రం పవన్ కల్యాణ్‌లో ఎందుకు కొరవడిందని విశ్లేషకులు అంటున్నారు.
అయినా.. ఎన్నికల్లో గెలుపంటే.. ఒకరితోనో ఇద్దరితోనో సాధ్యం కాదని.. సమష్టి కృషి ఉండాలని.. అలా అయితేనే.. విజయం వరిస్తుందని.. అలా కాకుండా.. ఒకరు కష్టపడితే చాలు.. మరొకరు అందలం ఎక్కచ్చు అనుకుంటే.. అది కుదరని పని అనే విషయాన్ని తెలుసుకొని మసులు కొంటే మంచిదని అంటున్నారు.