పాపం బాలినేని! పొగపెట్టినా పోలేక ఉక్కిరిబిక్కిరి!
posted on Jan 30, 2024 @ 11:35AM
బాలినేని శ్రీనివాసరెడ్డి.. మాజీ మంత్రి.. సీఎంకు సమీప బంధువు..ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గట్టి పట్టున్న నేత. అయితే పాపం బాలినేనికి అవేమీ ఇప్పుడు అక్కరకు రావడం లేదు. పార్టీలో నిత్యం అవమానాలు తప్పడం లేదు. మంకుపట్టుపట్టి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి జగన్ చేత ఓకే అనిపించుకున్నా.. నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ ఆయన మాటకు పార్టీలో పూచిక పుల్ల విలువ లేని పరిస్థితిని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ క్రియేట్ చేశారు.
దీంతో మింగాలేను, కక్కాలేను అన్నట్లుగా తయారైంది బాలినేని పరిస్థితి. పార్టీ నుంచి రాజీనామా చేయడం చిటికెలో పని అంటూ గంభీరంగా ప్రకటనలు గుప్పించినా.. అలా రాజీనామా చేసి బయటకు వెళ్లే ధైర్యం మాత్రం బాలినేని చేయడం లేదు. వాస్తవానికి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో సొంత వర్గం ఉన్న నాయకుడు. అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్న నేత. అధికారదర్పం, అహంకారం పెద్దగా ప్రదర్శించే వ్యక్తి కూడా కాదు. అటువంటి బాలినేనిని జగన్ అడుగడుగునా అవమానిస్తున్నారు.
అసలు జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్బంగా బాలినేనికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికి అదే జిల్లాకు చెందిన మరో మంత్రిని కొనసాగించిన నాడే జగన్ బాలినేనిని పక్కన పెట్టేశారని, జిల్లాలో ఆయనకు ప్రత్యామ్నాయ నేతను రెడీ చేస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషించారు. బాలినేనిని జగన్ పక్కన పెట్టేయాలనుకోవడానికి కారణాలేమిటి? అన్న విషయంలో పెద్దగా తలలు బద్దలు కొట్టుకోవలసిన అవసరం లేదు. జగన్ కు తన పార్టీ వారంతా సొంత ఆలోచన, మెదడు, అలాగే సొంత వర్గం, సొంత బలం వదులుకుని తన మాటే శాసనం అని అంగీకరించి మసులు కోవాలని కోరుకుంటారు. అందుకు భిన్నంగా సొంత వ్యక్తిత్వం ఉంటే భరించ లేరు. వారిని దూరం పెట్టడానికి ఇసుమంతైనా ఆలస్యం చేయరు. సరే సొంత జిల్లాలో తనకంటూ ఒక వర్గం ఉండి, అందరినీ కలుపుకుని పోయే నేతగా బాలినేనికి గుర్తింపు ఉంది. జగన్ కినుకకు ఇతర కారణాలేమున్నా ముఖ్యకారణం మాత్రం బాలినేనికి వ్యక్తిత్వం ఉన్న నేతగా జిల్లాలో ఉన్న గుర్తింపే అని పార్టీ శ్రేణులే అంటున్నాయి.
కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన సందర్భంలోనే బాలినేని తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. అప్పట్లోనే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. బాలినేనిని బుజ్జగించడానికి అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి విశ్వ ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో జగనే బాలినేనిని బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. ఏం జరిగిందో ఏమో అప్పటికి బాలినేని సర్దుకు పోయారు. అయితే బాలినేని అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయడం, జగన్ బుజ్జగించి బతిమలాడే వరకూ పరిస్థితిని తీసుకురావడంతో అప్పటి నుంచే బాలినేనిని దూరం పెట్టడానికి, అదే సమయంలో ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లినా సొంత బలం, బలగం అండగా నిలిచే పరిస్థితి లేకుండా చేయడానికీ ప్రణాళికాబద్ధంగా పార్టీ అగ్రనాయకత్వం పావులు కదిపిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జిల్లాలో జగన్ కార్యక్రమానికి బాలినేనికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడం.. ఆయన ఆగ్రహించి వెనక్కు వెళ్లిపోయిన తరువాత తీరిగ్గా జగన్ ఫోన్ చేసి పిలిపించుకోవడం, బాలినేని కూడా సద్దుకుని నవ్వుతూ పొటోలకు పోజులివ్వడం తెలిసిందే. అదే కాదు.. వరుసగా బాలినేనికి పార్టీలో పరాభవాలు జరుగుతూనే ఉన్నాయి, ఆయన ఆగ్రహం వ్యక్తంచేస్తూనే ఉన్నారు. ఇలా పదే పదే జరగడం వల్ల బాలినేని జగన్ పట్ల వ్యతిరేకతతో బాహాటంగా ప్రకటనలు చేసినా చుట్టాలు, చుట్టాలు సర్దుకు పోతారు. బాలినేని తరఫున నిలబడి మనమెందుకు దూరం కావడం అన్నట్లుగా బాలినేనిని పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదు. జగన్ అండ్ కోకు కావలసింది కూడా ఇదే. అందుకే బాలినేనిని ఒంగోలులో ఒంటరిని చేసే వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేశారు.
తాజాగా మరోసారి జగన్ బాలినేనిని ఘోరంగా అవమానించారు. తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని ఆయన వచ్చిన తరువాత కలిసేది లేదని కబురంపించారు. దీంతో బాలినేని తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి కూడా కనీసం కారు దిగకుండా వెనుదిరగాల్సి వచ్చింది. అదే సమయంలో సీఎంవో పిలుపు మేరకు వచ్చిన పలువురు ఎమ్మెల్యేలకు మాత్రం నేరుగా తాడేపల్లి ప్యాలెస్ లోకి ఎంట్రీ దొరికింది. దీంతో బాలినేనిని ఉద్దేశపూర్వకంగానే పిలిచి అవమానించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇలాంటి అవమానాలు, పరాభవాలు ఇటీవలి కాలంలో బాలినేనికి అలవాటుగా మారిపోయాయి. నిన్నమొన్నటి వరకూ బాలినేనికి ఒంగోలు టికెట్ వస్తుందో రాదో కూడా అర్ధం కాని పరిస్థితి. అయితే ఎలాగో ఒంగోలు నుంచి పోటీకి టికెట్ సాధించుకున్నా జిల్లాలో వైసీపీ కీలక నేత అయిన బాలినేనిని నియోజకవర్గాల ఇంచార్జుల నియామక విషయంలో కనీసం సంప్రదింపులకు కూడా దగ్గరకు రానీయలేదు. బాలినేని ఎంతగా పట్టుపట్టినప్పటికీ ఒంగోలు ఎంపీ టికెట్ ను మాగుంటకు కేటాయించడానికి జగన్ ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలోనే బాలినేనికి తాడేపల్లి ప్యాలెస్ వద్ద ఎదురైన తాజా పరాభవం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. నేరుగా చెప్పకుండా బాలినేనిని వదిలించుకునే ఉద్దేశమే జగన్ లో కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ విషయం స్పష్టంగా తెలిసినా, మరో పార్టీలో చేరి ఒంగోలు అసెంబ్లీ టికెట్ హామీ పొందే అవకాశం లేకపోవడంతోనే బాలినేని వైసీపీని వదలడం లేదని అంటున్నారు.