ఉద్యోగం ముసుగులో పార్టీ సేవ.. వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనన్న జగన్
posted on Jan 30, 2024 @ 10:43AM
జగన్ ఎంతో ఘనంగా లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పుకుంటున్నారు. ఆయన ఈ నాలుగున్నరేళ్ల పైచిలుకు కాలంలో ఇచ్చినవి వాలంటీర్ల ఉద్యోగాలు మాత్రమే. ఆ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలనీ, వారికి ప్రభుత్వోద్యోగమన్న ముసుగు వేసి పార్టీ కోసం వాడుకుంటున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వాలంటీర్లు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ వైసీపీ ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం ఎప్పటి నుంచో ఆరోపిస్తూనే ఉంది. వాలంటీర్ల పని ప్రజలను ప్రభుత్వ పథకాల పేరుతో బ్లాక్ మెయిల్ చేసి అధికార పార్టీకి అనుకూలంగా మార్చడమేనన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పలు సందర్భాలలో అంబటి వంటి వారు వాలంటీర్లు మనవాళ్లే అని బాహాటంగానే చెప్పేశారు. చివరాఖరికి టీచర్లను కాదని ఎన్నికల విధుల్లో కూడా వారినే నియోగించాలన్న జగన్ యత్నాలు విఫలమయ్యాయి.
అసలు వాలంటీర్ల నియామకంలోనే తేడా ఉంది. ఎలాంటి నిబంధనలూ లేకుండా వైసీపీ అనుకూలత ఉంటే చాలు అన్నట్లుగా ఆ నియామకాలు చేపట్టారు జగన్. ఈ విషయాన్ని బయటి వారెవరో కాదు.. స్వయంగా జగన్ సహా ఆయన కేబినెట్ సహచరులే వేరు వేరు సందర్భాలలో బాహాటంగానే చెప్పేశారు.
ఇక ఎన్నికల విధులలో వాలంటీర్ల సేవలకు అవకాశం లేదని తేలిపోయిన తరువాత జగన్ ఇంత కాలం వాలంటీర్లకు వేసిన ఉద్యోగులు అన్న ముసుగు తీసేశారు. అలా తీసేయడానికి ఆయన ఎన్నుకున్న వేదిక కూడా ఎన్నికల ప్రచార సభే కావడం ఎంత మాత్రం కాకతాళీయం కాదు. కావడానికి వీల్లేదు. ఇటీవల విశాఖపట్నం జిల్లా సంగివలసలో జగన్ ఎన్నికల ప్రచారానికి శంఖారావం మోగించారు. సిద్ధం పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభ వేదికగా ఆయన వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేననీ, వాళ్లు మనవాళ్లేననీ సగర్వంగా ప్రకటించారు. వాళ్లు ఇంత కాలం చేసిన సేవ, ఇక ముందు చేయబోయే సేవా వైసీపీకేనని కుండబద్దలు కొట్టేశారు. ప్రజాధనాన్ని వాలంటీర్లకు జీతాల రూపంలో ఇచ్చి తమ సొంత పార్టీ సేవకు వారిని వినియోగించుకుంటున్న సంగతిని ఎలాంటి దాపరికం లేకుండా బాహాటంగా చెప్పేశారు.
సొంత పార్టీకి లబ్ధి చేకూర్చడానికి, ఎన్నికల్లో విజయానికి పనిచేయడానికి వలంటీర్ల నియామకం జరిగిందని ఇంత కాలం విపక్షాలు చేస్తున్న వాస్తవాలు అక్షర సత్యాలని స్వయంగా జగనే అంగీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నల లక్షల మంది వాలంటీర్లను జగన్ సర్కార్ నియమించుకుంది. పార్టీ సేవలో తరించాలని వారికి ఉద్బోధ చేసింది. తర్ఫీదు కూడా ఇచ్చింది. వాలంటీర్లకు జగన్ సర్కార్ ఎన్నికల విధులను అప్పగించిందని విపక్షాలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ కలెక్టర్లకు ఆదేశాలిచ్చి చేతులు దులిపేసుకుంది.
ఫ్యాక్షన్ లీడర్లు సొంత అంటే ప్రైవేటు సైన్యాన్ని మెయిన్ టెయిన్ చేస్తున్నట్లుగా జగన్ సర్కార్ వాలంటీర్లను మెయిన్ టైన్ చేస్తోంది. ఫ్యాక్షన్ లీడర్లు సొంత సొమ్ముతో ప్రైవేటు సైన్యాన్ని పోషిస్తారు. కానీ జగన్ మాత్రం ప్రజల సొమ్ముతో తన పార్టీ ప్రైవేటు సైన్యాన్ని పోషిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిథులకు లేని స్వేచ్ఛ, అధికారం, హక్కులను కూడా జగన్ వాలంటీర్లకు దఖలు పరిచారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను ఉత్సవ విగ్రహాలను చేసి వారికి ప్రజలతో సంబంధం లేకుండా చేశారు. వాలంటీర్లే అన్నీ తామై పనులు చక్కబెడుతున్నారు. పార్టీ కోసం పని చేయడానికి ఒక్కో వాలంటీర్ కు ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ములు చెల్లిస్తున్నారు.