మళ్లీ తెగిన ఫ్లోటింగ్ బ్రిడ్జి.. కవరింగ్ ల నిగ్గు తేలిపోయిందిగా!

సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కూల్చ‌డాలే త‌ప్ప క‌ట్ట‌డాలు తెలియ‌ద‌న్న అభిప్రాయానికి ఏపీ ప్ర‌జ‌లు వ‌చ్చేశారు. నాలుగున్నారేళ్ల కాలంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పుకోద‌గ్గ ఒక్క కంపెనీని ఏపీకి తీసుకురాలేక పోయారు.. ఒక్కటంటే ఒక్క నిర్మాణం చేపట్టలేదు. రుషికొండ అక్రమ నిర్మాణాలు వేరే సంగతి. ప్రజలకు ఉపయోగపడే ఒక్కటంటే ఒక్క నిర్మాణం చేపట్టలేదు. ఒక్క రోడ్డు బాగు చేయించలేదు.. కానీ, చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీలో పెట్టుబ‌డులు పెట్టి, ఏపీ యువ‌త‌కు ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీల‌ను మాత్రం వెళ్ల‌గొట్టేశారు.  ప్రజా వేదికను కూల్చేశారు. వైసీపీ హ‌యాంలో ఏదైనా చిన్నాచిత‌క ప‌నిచేసినా అందులోనూ నాసిర‌క‌మే. ఇప్ప‌టికే రాజ‌ధానిలేని రాష్ట్రంగా దేశ‌వ్యాప్తంగా ఏపీని చిన్న‌చూపు చూస్తున్న ప‌రిస్థితి.  తాజాగా మ‌రోసారి ఏపీ ప్ర‌భుత్వం ప‌రువు గంగలో కలిసింది. విశాఖ ఆర్‌కే బీచ్ లో అధికారులు ప్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. దేశం మొత్తంలో ఎవరూ ఇంత గొప్ప పని చేయలేదని స్వోత్కర్షలు చేసేసుకుంటూ   దేశంలో ఎక్క‌డ ఇలాంటిది లేదు అన్న‌ట్లుగా తమ భుజాలను తామే చరిచేసుకుని, ఏపీ ప్రజలకు ఒక మహత్తర కానుక ఇచ్చేశాం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చేశారు. అయితే ఇంత ఘనంగా చెప్పుకుని ఆర్బాటంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జి కనీసం ఒక్కటంటే ఒక్క రోజుకూడా నిలవలేదు. ప్రారంభించిన మరునాడే ఆ నిర్మాణంలోని డొల్లతనం బయటపడేలా తెగిపోయింది.  ప్లోటింగ్ బ్రిడ్జి అంచునఉన్న భాగం విడిపోయి వంద మీటర్ల దూరం స‌ముద్రంలోకి వెళ్లిపోయింది.  దీంతో కంగుతిన్న నిర్వాహ‌కులు ప‌ర్యాట‌కులను ప్లోటింగ్ బ్రిడ్జిపైకి వెళ్ల‌కుండా అప్ర‌మ‌త్తం చేశారు. దీంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. వైసీపీ ప్ర‌భుత్వానికి డ్యామేజ్ గా ప్లోటింగ్ బ్రిడ్జి వ్య‌వహారం మార‌డంతో.. ప్ర‌భుత్వ పెద్ద‌లు, అధికారులు రంగంలోకి దిగి త‌ప్పును క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. ప్లోటింగ్ బ్రిడ్జి తెగ‌లేదు. మాక్ డ్రిల్ లో భాగంగా మేమే  విడ‌దీశాం అంటూ ప్ర‌చారం చేసుకున్నారు. దీనికితోడు ప్లోటింగ్ బ్రిడ్జి తెగింద‌న్నవారిని రాష్ట్ర దోషులుగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌జ‌ల క‌ళ్ల‌ముందే త‌ప్పుజ‌రిగినా అది త‌ప్పుకాదని ప్ర‌జ‌ల చెవుల్లో మోత‌గించ‌డంలో వైసీపీ సోష‌ల్ మీడియా ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇప్పుడూ ముందే ఉంది.   ప్ర‌జ‌లంతా చూస్తుండ‌గానే ప్లోటింగ్ బ్రిడ్జి చివ‌రిభాగం తెగిపోయి స‌ముద్ర‌లోకి వెళ్లిపోయినా..  అబ్బెబ్బే తెగిపోలేదు.. కావాల‌నే మాక్ డ్రిల్ నిర్వ‌హించారని బుకాయించేసింది. ఆ బుకాయింపును ఎవరూ నమ్మలేదనుకోండి అది వేరే విషయం. ఏదైనా చిన్న యంత్రాన్ని ప్రారంభించాల‌న్నా దానిని ప్రారంభించే ముందు ప‌లుసార్లు ట్ర‌య‌ల్ ర‌న్ వేస్తారు.. ఒక‌టికిప‌దిసార్లు చెక్ చేసుకొని ప్రారంభించిస్తారు.. కానీ, అధికారులు మాత్రం ప్లోటింగ్ బ్రిడ్జిని ప్రారంభించిన త‌రువాత.. సంద‌ర్శ‌కుల‌ను అనుమతించేసిన   త‌రువాత ప‌రిశీల‌న నిమిత్తం  తెగ్గొట్టామంటూ చెప్పుకుని జనాలను నమ్మించడానికి విశ్వప్రయత్నం చేశారు.  సరే జనం నమ్మారని అనుకున్నా.. తాజాగా శ‌నివారం మ‌రోసారి ప్లోటింగ్ బ్రిడ్జి చివ‌రి భాగం తెగిపోయింది. ఇది కూడా మాక్ డ్రిల్లే అంటారా? అనగలరా?  జనం మాత్రం జగన్ సర్కార్ కు కూల్చివేతలు తప్ప నిర్మాణాలు చాతకాదు అని బాహాటంగానే చెబుతున్నారు.  స‌ద‌ర్శ‌నీయ స్థ‌లం, ఆట‌విడుపు ప‌రిక‌రాలు, సాహ‌స క్రీడ.. ఇలా ఏదైనా ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావాలంటే స‌మ‌గ్ర స‌న్న‌ద్ద‌త అవ‌స‌రం. ఎన్నో ప‌రిశీల‌న‌లు, ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన త‌రువాత అనుమ‌తించాలి. అలాంటిదేమీ పూర్తిగా చేయ‌కుండానే వైసీపీ నేత‌లు, మంత్రులు త‌మ గొప్ప త‌నం చాటుకునేందుకు ఆర్కే బీచ్ లో  గ‌త‌నెల 25న ప్లోటింగ్ బ్రిడ్జిని ప్రారంభించారు. సంద‌ర్శ‌కుల అనుమ‌తికి టికెట్ కౌంట‌ర్లు ఏర్పాటు చేశారు. పెద్ద‌ల‌కు రూ.100, ప‌న్నెడేళ్ల లోపు పిల్ల‌ల‌కు రూ. 70 వ‌సూలు చేసేలా ధ‌ర‌లు నిర్ణ‌యించారు. వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు అనుకూల‌త ఆధారంగా సంద‌ర్శ‌కుల‌ను అనుమ‌తిస్తామ‌ని బ్యాన‌ర్లు ఏర్పాటు చేశారు. అయితే, వైసీపీ ప్ర‌భుత్వ పెద్ద‌లు, అధికారులు అనాలోచిత నిర్ణ‌యాల కార‌ణంగా విశాఖ ప్ర‌జ‌లు ప్లోటింగ్ బ్రిడ్జి అంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఏర్ప‌డింది.  ప్లోటింగ్ బ్రిడ్జి విశాఖ తీరంలో ఎంత‌వ‌ర‌కు సుర‌క్షిత‌మ‌నే అనుమానాలు తొలి నుంచీ ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ తీరంలో  ఇలాంటి  ఏర్పాటు ఎవరూ ఎప్పుడూ చేయలేదు.   ఆరేబియా స‌ముద్రంతో పోల్చితే బంగాళాఖాతం అత్యంత ప్ర‌మాక‌ర‌మైంది. ఇక్క‌డ అల‌ల తాకిడి ఎచాలా ఎక్కువ‌. ముఖ్యంగా సముద్ర అలల తీవ్రత ఎప్పుడు ఎలా ఉంటుందో అంచ‌నా వేయ‌లేమ‌ని జాతీయ స‌ముద్ర ప‌రిశోధ‌న సంస్థ నిపుణులు పేర్కొంటున్నారు. గోవా, ముంబ‌యి, కేర‌ళ రాష్ట్రాల్లో అరేబియా స‌ముద్రం మే, జూన్, జులై, ఆగ‌స్టు నెల‌ల్లో ప్ర‌మాద‌క‌రంగా.. మిగిలిన కాలం ప్ర‌శాంతంగా ఉంటుంది. తూర్పుతీరం మాత్రం భీక‌ర వాతావ‌ర‌ణాన్ని క‌లిగి ఉంటుంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. సువిశాల‌మైన ఈ తీరం ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చే గాలుల‌తో నిత్యం అల‌జ‌డిగా ఉంటుంది. ఎప్పుడు త‌క్కువ తీవ్ర‌త ఉంటుందో అంచ‌నా వేయ‌డం సాధ్యం కాదు. అవేవి పట్టించుకోకుండా ఏపీ ప్ర‌భుత్వం హ‌డావుడిగా ఆర్కే బీచ్ లో ప్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి అంత కంటే ఆర్భాటంగా ప్రారంభోత్సవం కూడా చేసేసింది. ఇప్పుడు అది స్వల్ప వ్యవధిలో రెండు సార్లు తెగిపోవడంతో ఇక ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కథ ముగిసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కవరింగులు ఇచ్చుకుని, మరమ్మతులు అంటే ఏదో ఒకటి చేసేసి సందర్శకులను అనుమతించినా జనం మాత్రం ఆ బ్రిడ్జి మీదకు రావడానికి ఏ మాత్రం ఇష్టపడే పరిస్థితి లేదని అంటున్నారు.  

కడప లోక్ సభ స్థానం నుంచి డాక్టర్ సునీత పోటీ ఫిక్స్.. పార్టీ ఏదంటే?

దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత వచ్చే లోక్ సభ ఎన్నికల పోటీ చేయడం దాదాపుగా ఖరారైపోయింది. ఆమె ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టడం ఖాయమని తేలిపోయింది. తన తండ్రిని అత్యంత దారుణంగా హత్య చేసి, గుండెపోటు అతి తొలుత నమ్మించడానికి ప్రయత్నించి, అది ఫలించకపోయే సరికి నారాసుర రక్త చరిత్ర అంటూ నెపాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబుపైకి నెట్టేసే ప్రయత్నం చేశారు.   అది కూడా అవాస్తవమని తేలిపోయేసరికి.. తన తండ్రి హత్య సూత్రధారులు, పాత్రధారులను చట్టం ముందు నిలబెట్టి వారికి శిక్షపడేలా చేయడమే లక్ష్యంగా డాక్టర్ సునీత అలుపెరుగని న్యాయపోరాటం చేస్తున్నారు. ఆమె డిమాండ్ మేరకే వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టింది. ఆమె డిమాండ్ మేరకే ఈ హత్య కేసు విచారణను కోర్టు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు మార్చింది. సీబీఐ దర్యాప్తులో భాగంగా వివేకా హత్య వెనుక ఉన్న కుట్ర కోణం ఏమిటన్నది దాదాపుగా అందరికీ క్లారిటీ అయితే వచ్చేసింది. వివేకా హత్య వెనుక సొంత బంధువులే ఉన్నారని ద్యాప్తు సాగుతున్న క్రమంలో డాక్టర్ సునీతకు కూడా స్పష్టత వచ్చింది. అలాగే వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ కు స్వయానా తోడబుట్టిన చెల్లెలు వైఎస్ షర్మిల తన చిన్నాన్న వివేక హత్యకు మోటివ్ కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలన్న అంశమేనని కుండ బద్దలు కొట్టేశారు.  వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టినా, కేసు ను ఏపీ నుంచి తెలంగాణకు మార్చినా విచారణను  అడుగడుగునా అడ్డుకునే విషయంలో ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి.  అదలా ఉంచితే..  వైఎస్ వివేకా హత్య కేసు 2019 ఎన్నికల సమయంలో కీలక అంశంగా ఉంది. ఇప్పుడు 2024 ఎన్నికలలో కూడా వివేకా హత్య అంశం కీలకం కానుంది. అయితే అప్పుడు జగన్ కు సానుభూతి వెల్లువెత్తడానికి కారణమైన ఈ అంశం ఇప్పుడు రివర్స్ లో కీలకంగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హత్య జరిగి ఐదేళ్లు గడిచినా ఇప్పటి వరకూ సీబీఐ దర్యాప్తు కూడా హంతకులు ఎవరన్నది, హత్య వెనుక కుట్ర ఏమిటన్నది తేల్చలేకపోవడం, అప్పట్లో వివేకా హత్యను తనకు సానుభూతిగా మార్చుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇదే హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి అండగా నిలవడంతో నాడు సానుభూతి కురిపించిన ఈ అంశం ఇప్పుడు జగన్ కు వ్యతిరేకత పెల్లుబకేలా చేస్తుందని పరిశీలకులు అంటున్నారు.  సరిగా ఈ తరుణంగా వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత.. తన తండ్రి హత్య కేసులో పురోగతి లేకపోవడాన్ని ఆక్షేపిస్తూ... ప్రజామద్దతు, ప్రజా తీర్పు కోరుతూ జనం ముందుకు రావాలని డిసైడైపోయారు. రాజకీయ మద్దతు, అండతో తన తండ్రి హత్య కేసులో పురోగతి లేకుండా నిందితులు రక్షణ పొందుతున్నారని ఆరోపించిన ఆమె ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేసి ప్రజామద్దతు కూడగట్టాలని నిర్ణయించుకున్నారు.  ఇటీవల హస్తిన వేదికగా ఆయన మీడియా సమావేశంలో తన తండ్రి హత్య కేసును ముందుకు జరగకుండా ఆపడంలో తన పెదనాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, ఏపీ సీఎం జగన్ ప్రమేయం ఉందని నేరుగా ఆరోపించారు. అటువంటి వ్యక్తికి, ఆయన పార్టీకీ ఓటు వేయవద్దని ప్రజలకు పిలుపుచర్చారు. ఈ మీడియా సమావేశం ద్వారా తాను ప్రత్యక్ష  రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. తమ కుటుంబంలో వైఎస్ సునీత ఒక్కరే తనకు అండగా నిలిచారని డాక్టర్ సునీత చెప్పారు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి. అయితే డాక్టర్ సునీత ఏ రాజకీయ పార్టీలో చేరతారన్న విషయంలో ఇప్పటి వరకూ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆమె హస్తిన వేదికగా మీడియా సమావేశంలో మాట్లాడిన దానిని  బట్టి చూస్తే వచ్చే ఎన్నికలలో ఆమె కడప్ ఎంపీ అభ్యర్థిగా నిలబడటం ఖాయమని అంటున్నారు. అదే సమయంలో  కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశం ఉందని వినిపిస్తున్నా, ఒక పార్టీ తరఫున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అంశాన్నీ తోసిపుచ్చలేమని చెబుతున్నారు. ఎందుకంటే వివేకా హత్య కేసు విషయంలో పార్టీలకు అతీతంగా జగన్ పై ఆగ్రహం, సునీతపై సానుభూతి వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.  

ధరణి సమస్యల పరిష్కారంపై రేవంత్ సర్కార్ నజర్!

బీఆర్ఎస్ హయాంలో ధరణి అవకతవకలపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ ధరణి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించింది. ధరణిని రద్దు చేసి దాని స్థానంలో మరో పోర్టల్ ను తీసుకువచ్చే కసరత్తు చేస్తున్నప్పటికీ, దానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో, అలాగే చట్ట సవరణ కూడా చేయాల్సిన పరిస్థితుల్లో ముందుగా ధరణి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని నిర్ణయం తీసుకుంది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణి సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేశారు. ఈ నెల 9లోగా వీలైనంత వరకూ ప్రతి సమస్యనూ పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  ఈ నేపథ్యంలోనే  అధికారులు 2020  నుంచి పెండింగ్​లో ఉన్న ఫైళ్ల పరిశీలనలో నిమగ్నమయ్యారు. జిల్లాల్లో  మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులను ప్రోది చేసి  క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఇందు కోసం 86 బృందాలను కూడా  మొత్తం పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు అధికారులు వచ్చారని చెబుతున్నారు.   భూమి రిజిస్ట్రేషన్​ ముగిసి ధరణి రాకతో ముటేషన్లు ఆగిపోయిన అర్జీలను ముందుగా పరిష్కరించాలని నిర్ణయించారు. అలాగే  గ్రీవెన్స్​ ఆఫ్​ ల్యాండ్​ మేటర్ సమస్యలు,  ఫొటో కరెక్షన్​, జెండర్​, ఆధార్, క్యాస్ట్​, డిజిటల్​ సైన్​, మిస్సింగ్​ సర్వే నంబర్​ వంటి సమస్యలు ఈ పరిధిలోకి వస్తాయి. ఇటువంటి సమస్యలను త్వరగానే పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టలేదు.  ఇవిగాక సక్సెషన్, ఎల్ఏజీ, ఖాతా మెర్జింగ్, టీఎం ధరఖాస్తులను కూడా పెద్దగా సమస్యలేవీ లేకుండానే పరిష్కారం చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.  నిషేధిత సర్వే భూములకు సంబంధించిన దరఖాస్తులను మాత్రం ప్రస్తుతానికి పక్కన పెట్టేయాలనీ, అలాగే కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న వాటిని కూడా అధికారులు ప్రస్తుతానికి పక్కన పెట్టేయాలని నిర్ణయించారు.    ధరణి పోర్టల్ అమలులోకి తీసుకువచ్చిన తరువాతనే ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయనీ, వాటిని సత్వరమే పరిష్కరించాలని రేవంత్ సర్కార్ కృత నిశ్చయంతో ఉంది.  కోర్టు వివాదాలు లేని ప్రతి దరఖాస్తునూ పరిశీలించి పరిష్కరించాలని ఇప్పటికే రేవంత్ సర్కార్ జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో చాలా వరకూ సమస్యలు ఈ నెల 9నాటికి పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు. 

తండ్రీ కొడుకులు చేతులెత్తేశారా? బీఆర్ఎస్ వలసలకు ఇక అడ్డేలేదా?

గండి పడి వరద నీరు ఊళ్లకు ఊళ్లను ముంచేసినట్లుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసల వరద కొనసాగుతోంది. పార్టీ అస్థిత్వానికే గండి పడిందా అంటూ  బీఆర్ఎస్ శ్రేణులే చర్చించుకునేలా పరిస్థితి మారిపోయింది. గండి పూడ్చడానికి బదులు వలసల ప్రవాహాన్ని పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అలా చూస్తూ ఊరుకోవడాన్ని చూస్తుంటే తండ్రీ కొడుకులిద్దరూ చేతులెత్తేశారా అని పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2014, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ రెండు సందర్భాలలోనూ కూడా బీఆర్ఎస్ లోకి వలసలు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఏకంగా శాసనసభా పక్షాలనే విలీనం చేసుకున్న చరిత్ర ఆ పార్టీది. కానీ 2023 ఎన్నికల తరువాత ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. అధినేత, కార్యనిర్వాహక అధ్యక్షుడు చెప్పినా కూడా ఆ పార్టీ నేతలే కాదు, క్యాడర్ కూడా ఖాతరు చేయని పరిస్థితి కనిపిస్తోంది. అసలు కేసీఆర్ నాయకత్వంపై ధిక్కారం పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మార్చిన నాడే మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక 2023 ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత పార్టీపై కేసీఆర్, కేటీఆర్ పూర్తిగా పట్టు కోల్పోయారని అంటున్నారు. నిన్న మొన్నటి వరకూ కళకళలాడుతూ ఉన్న తెలంగాణ భవన్ ఇప్పుడు వెలవెలబోతున్నది. నిన్న మొన్నటి వరకూ చేరికలతో కిటకిటలాడిన తెలంగాణ భవన్ ఇప్పుడు వలసన కారణంగా బోసిపోయి కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే కాదు పార్టీ రెండవ శ్రేణి నాయకత్వం కూడా ఏ పార్టీలో అవకాశం దొరికితే ఆ పార్టీలోకి జంప్ కొట్టేయడానికి రెడీగా ఉన్నారు. ఈ విషయంలో వారేమీ దాపరికం ప్రదర్శించడం లేదు.. బాహాటంగానే పార్టీ పట్ల తమ విముఖతను చాటుతున్నారు. క్యాడర్ పరిస్థితీ అలాగే కనిపిస్తోంది. మొదట్లో వలసలను ఆపడానికి ఏదో ఒక మేరకు ప్రయత్నించిన కేసీఆర్, కేటీఆర్ లు ఇప్పడు తమ ప్రయత్నాలు,  బుజ్జగింపులు ఫలించే పరిస్థితి లేదని అర్ధం చేసుకుని మౌనంగా జరుగుతున్నది చూస్తూ ఉండిపోతున్నారు.  ఓటమి తరువాత కూడా నెపం సిట్టింగుల మీదే నెట్టేసి.. వారి పట్ల ప్రజలలో ఉన్న అసంతృప్తే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమికి కారణమంటూ చెప్పుకొచ్చిన కేసీఆర్, కేటీఆర్ లకు ఇప్పుడు తత్వం బోధపడి బొమ్మ కనిపిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. అసంతృప్తి కేవలం సిట్టింగుల మీదే కాదనీ, సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలి, అహకర పూరిత వైఖరి పైన కూడానని వారికి అర్థమైనట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే వచ్చే లోక్ సభ ఎన్నికలలో పోటీకి టికెట్ ఇస్తామన్నా పోటీ చేయలేం బాబోయ్ అని పారిపోయే వారి సంఖ్యే ఎక్కువ కనిపిస్తున్నదని అంటున్నారు.  లీడర్లు పోయినా క్యాడర్ ను కాపాడుకోవాలని కేసీఆర్ పార్టీ నేతలకు గంభీరంగా చెబుతున్నప్పటికీ, క్యాడర్ లో పార్టీ పట్ల అసంతృప్తిని గమనించే లీడర్లు పక్క చూపులు చూస్తున్నారని అంటున్నారు. ఇందుకు ఉదాహరణ పార్టీ నుంచి వలసలలో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ అధికంగా ఉండడాన్ని చూపుతున్నారు. ఇక  బీఆర్ఎస్ ను వీడి వచ్చిన నేతలకు  బీజేపీ లోక్ సభ టికెట్లు ఇవ్వడం చూస్తుంటే ప్రజల అసంతృప్తి బీఆర్ఎస్ అధినాయకత్వం మీదా, సిట్టింగుల మీదా అన్నది స్పష్టంగా అవగతమౌతోందని అంటున్నారు. 

ఏపీకి రేవంత్ రెడ్డి!.. కాంగ్రెస్ ఆశలన్నీ ఆయనపైనే?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడింది. ఆ పార్టీ ఏపీ అధినేత్రిగా వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టిన తరువాత గత పదేళ్లుగా రాష్ట్రంలో కనిపించని కాంగ్రెస్ ఇప్పుడు ఉనికి చాటుకుంటున్న పరిస్థితి. వరుస సభలు, సమావేశాలతో ఆ పార్టీ క్యాడర్ లో జోష్ పుట్టించే ప్రయత్నాలు పెరిగాయి. షర్మిల రాకతో పార్టీలో  జోష్ అయితే కనిపించింది కానీ, ఆ జోష్ రాష్ట్రంలో ఏవో కొన్ని స్థానాలలోనైనా పార్టీని విజయం దిశగా నిడిపించేంతగా లేదని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సారి ఎన్నికలలోనైనా సరే అసెంబ్లీలో ప్రాతినిథ్యం ఉండి తీరాలన్న పట్టుదల ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ హై కమాండ్ షర్మిలకు తోడుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రచార బాధ్యతలు అప్పగించే యోచనలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఏపీ స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించే నిర్ణయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ హై కమాండ్ తీసేసుకుంది.  రాష్ట్ర విభజన ముందు వరకూ రాష్ట్రంలో అత్యంత బలంగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితి విభజన తరువాత ఉనికి మాత్రంగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ఆ పార్టీలో సీనియర్లు, క్రియాశీలంగా వ్యవహరించే నేతలూ అందరూ వేరే వేరే పార్టీల్లో సర్దుకున్నారు. అలా సర్దుకోలేనివారు రాజకీయంగా క్రీయాశీలంగా వ్యవహరించడం మానేశారు. కేవీపీ, పల్లంరాజు, రఘువీరారెడ్డి ఇలా పార్టీ వాయిస్ ను గట్టిగా వినిపిస్తారన్న పేరున్న నేతలే కాకుండా, రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించి లగడపాటి, ఉండవల్లి వంటి అంతో ఇంతో ప్రజా సంబంధాలు ఉన్న వారు రాజకీయాలకు దూరమయ్యారు. దీంతో గత పదేళ్లుగా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. పార్టీ కార్యక్రమాలు లేవు. ఒక వేళ ఏమైన కార్యక్రమం తలపెట్టినా చురుకుగా పాల్గొనే నేతలు లేరు, క్యాడర్ లేదు. దీంతో ఆ పార్టీ నామమాత్రంగా మిగిలిపోయింది. ఎన్నికలలో ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులే కరవైన పరిస్థితి. ఈ తరుణంలో 2024 ఎన్నికలలో ఎలాగైనా అసెంబ్లీలో ప్రవేశించాలన్న సంకల్పంతో రాష్ట్ర కాంగ్రెస్ కు కాయకల్ప చికిత్స చేస్తున్నది పార్టీ అధిష్ఠానం. ఇందు కోసం తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు ముందు నుంచే వ్యూహరచన ప్రారంభించింది. తెలంగాణ ఎన్నికలకు ముందు షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించేందుకు ముందుకు వచ్చినప్పటికీ, హై కమాండ్ ఆమెతో పలు మార్లు చర్చించి.. విలీనం లేకుండా ఆ పార్టీ పోటీ నుంచి దూరంగా ఉండేలా వ్యూహాత్యకంగా వ్యవహరించింది. వైఎస్పార్టీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ లబ్ధి పొందిందనడంలో సందేహం లేదు. ఆ తరువాత ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగానే  వ్యవహరించింది. పార్టీని విలీనం చేసిన షర్మిలను ఆమె కోరినట్లుగా రాజ్యసభకు పంపడం కాకుండా రాష్ట్ర ఎన్నికల బరిలోనే దింపాలని నిర్ణయించింది. దీని వల్ల వైఎస్ తనయగా షర్మిల వైఎస్ జగన్ ను గట్టిగా దెబ్బతీయగలుగుతారని భావించింది. అందుకు అనుగుణంగానే వైఎస్ షర్మిల ఎంట్రీతో జగన్ పార్టీలో కలకలం రేగింది. షర్మిల జగన్ పై నేరుగా చేస్తున్న విమర్శలు వైసీపీలో భూకంపం పుట్టిస్తున్నాయి. అయితే షర్మిల ఎంట్రీ జగన్ పార్టీని అయితే బలహీనం చేయగలిగింది కానీ, కాంగ్రెస్ హైకమాండ్ కోరుకున్నట్లుగా రాష్ట్రంలో కొన్ని స్థానాలలోనైనా పార్టీని గెలుపు వైపు నడిపించగలదా అంటే అనుమానమే అన్న భావన కాంగ్రెస్ శ్రేణుల్లోనే వ్యక్తం అవుతున్నది. దీంతో పార్టీలో మరింత జోష్ నింపాలంటే.. ఏపీలో కూడా మంది ఫాలోయింగ్ ఉన్న రేవంత్ ను రంగంలోకి దింపడమే మార్గమని హైకమాండ్ భావిస్తోంది. అందుకే రేవంత్ ను ఏపీలో విస్తృతంగా ప్రచారం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గతంలో తెలంగాణ కాంగ్రెస్ లోని షర్మిల ఎంట్రీ అన్న వార్తలు విస్తృతంగా వినిపిస్తున్న సమయంలోనే రేవంత్ ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం పని లేదనీ, ఆమె ఏపీకి వెడితే అన్ని విధాలుగా తాను సహాయ సహకారాలు అందిస్తాననీ చెప్పిన విషయాన్ని వారిక్కడ ప్రస్తావిస్తున్నారు.  ఇప్పుడు హైకమాండ్ రేవంత్ ను అదే పని చేయమంటోందంటున్నారు. అంటే తెలంగాణ ఎన్నికలకు ముందే.. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహ రచన చేసి ఉంటుందని చెబుతున్నారు.  తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఈ నెల 11న విశాఖలో పర్యటించనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 11న ఏపీ కాంగ్రెస్ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తలపెట్టింది. ఆ కార్యక్రమానికి  రేవంత్ హాజరు అవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న రేవంత్ కు ఏపీలో కూడా మంచి పరిచయాలున్నాయి. పార్టీలకు అతీతంగా పలువురు నేతలతో ఆయనకు పరిచయాలు, స్నేహం ఉంది. ఇప్పుడు తెలంగాణ సీఎంగా ఆ పరిచయాలు, స్నేహంతో  ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కోసం ఆయన పని చేస్తారని అంటున్నారు.    

ఈ నెల 12 తర్వాత ఈడీ విచారణకు నేను సిద్దమే: కేజ్రీవాల్ 

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా పేర్కొన్నారు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమే అయినా విచారణకు తాను సిద్ధమేనని పేర్కొన్నారు. అయితే, మార్చ్ 12 తరువాత విచారణ తేదీని ఖరారు చేయాలని సూచించారు.  మద్యం పాలసీలో అవకతవకలకు సంబంధించి ఈడీ ఇప్పటివరకూ ఎనిమిది సార్లు కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరవ్వాలని కోరింది. కానీ, ఈ నోటీసులు చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమైనవి అంటూ కేజ్రీవాల్ విచారణకు హాజరయ్యేందుకు నిరాకరిస్తూ వస్తున్నారు. ఈడీ తాజాగా ఫిబ్రవరి 27న మళ్లీ నోటీసులు జారీ చేసింది. మార్చి 4న తమముందు హాజరు రావాలని పేర్కొంది.  దీనిపై స్పందించిన ఆప్ మార్చి 12 తరువాత కేజ్రీవాల్ విచారణకు వస్తారని తెలిపింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు హాజరవుతారని చెప్పింది. అయితే, వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఈడీ పట్టుబడుతోంది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు నిబంధనలు అనుమతించవని చెబుతోంది.  ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. లంచాలు చేతులుమారడం, మద్యం పాలసీలో తప్పులు తదితర అంశాలపై కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇద్దరు ఆప్ సీనియర్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను గతేడాది ఫిబ్రవరిలో సీబీఐ అరెస్టు చేయగా, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను ఈడీ అక్టోబర్‌‌లో అరెస్టు చేసింది.  

సచివాలయాన్నీ తాకట్టు పెట్టేశారు.. ఇక మిగిలింది ప్రజల ఆస్తులే జగన్!

అభివృద్ధి అంటే తెలియ‌ని సీఎం జగన్ రాష్ట్రానికి పెట్టుబ‌డులు తీసుకురాలేని అస‌మ‌ర్ధ సీఎంగా ఇప్పటికే తనతు తాను ప్రూవ్ చేసుకున్నారు. అందుకు ప్రతిఫలంగా తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ప్రజలలో జగన్ ప్రభుత్వంపై ఎంతటి వ్యతిరేకత ఉందో.. వరుసగా వెలువడుతున్న సర్వేలన్నీ సందేహాలకు అతీతంగా రుజువు చేస్తూనే ఉన్నాయి. అది చాలదన్నట్లు గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో వ‌చ్చిన కంపెనీల‌ను వెళ్ల‌గొట్టేసిన సీఎం జగన్ ఇప్పుడు  ఏకంగా  ప్ర‌భుత్వ భూముల‌ను తాక‌ట్టు పెట్టేస్తున్నారు. అంతటితో ఆగకుండా  ఏకంగా రాష్ట్ర ప్ర‌జ‌లు దేవాల‌యంగా భావించే స‌చివాల‌యాన్నిసైతం బ్యాంకులో తాకట్టు పెట్టేశారు.  జగన్ వంటి ముఖ్యమంత్రి  దేశంలోనే కాదు.. ప్ర‌పంచంలో ఎక్క‌డైనా ఉంటాడా?  అని జనం విస్తుపోతున్నారు.  ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి కొత్త‌ నిర్మాణాలు  లేవు.. కొత్త‌గా వ‌చ్చిన కంపెనీలు లేవు.. కొత్త‌గా వ‌చ్చిన ఉద్యోగాలూ లేవు.. క‌ బ్జాలు  ఉన్నాయి.. ప్ర‌భుత్వ ఆస్తులు తాక‌ట్టు పెట్ట‌డాలు మాత్రం ఉన్నాయి. ఇలా ప్ర‌పంచంలో ఏక్క‌డా క‌నిపించ‌ని అరుదైన సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అంటూ ఏపీ ప్ర‌జ‌లు త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్ర‌జ‌లు దేవాల‌యంగా  ప్ర‌భుత్వ పాల‌న‌కు కేంద్రంగా ఉండే స‌చివాల‌యాన్నిసైతం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ్యాంకులో తాక‌ట్టు పెట్టారంటే.. ఇలాంటి సీఎంను ఎన్నుకున్నందుకు ఏపీ ప్ర‌జ‌లు సిగ్గుతో త‌ల‌దించుకుంటున్న ప‌రిస్థితి నెల‌కొంది.  జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టి న నాటి నుంచి రాష్ట్రంలో కంటికి క‌న‌ప‌డిన ప్ర‌భుత్వ ఆస్తుల‌ను తాక‌ట్టు పెట్టుకుంటూ వ‌స్తున్నారు. గ‌తేడాది మద్యం బాండ్ల పేరుతో తాగుబోతులను తాకట్టు పెట్టి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం 48వేల కోట్లు అప్పు తెచ్చింది..  విశాఖ‌లో 13 ప్ర‌భుత్వ భ‌వ‌నాలు, కాలేజీలు తాక‌ట్టు పెట్టి రూ. 25వేల కోట్లు.. రోడ్లు భ‌వ‌నాల శాఖ‌లో కొన్ని ఆస్తుల‌ను తాక‌ట్టు పెట్టి ఏడు వేల కోట్లను వైసీపీ ప్ర‌భుత్వం అప్పుగా తెచ్చింది. ఇన్నాళ్లూ తాక‌ట్టు పెట్ట‌కుండా ఏపీలో మిగిలింది ఏదైనా ఉందంటే అది స‌చివాల‌యం మాత్ర‌మే అని ఏపీ ప్ర‌జ‌లు చెప్పుకుంటూ వ‌చ్చారు. కానీ, జ‌గ‌న్మోహ‌న్ స‌చివాల‌యాన్ని కూడా వ‌ద‌ల్లేదు. గుట్టు చ‌ప్పుడు కాకుండా హెచ్‌డీఎప్‌సీ బ్యాంకుకు రూ. 370 కోట్ల‌కు స‌చివాల‌యాన్ని తాక‌ట్టు పెట్టేశారు. సచివాలయంలో ఐదు భ‌వ‌నాలు ఉన్నాయి. శాసన సభ, శాసనమండలి భవనాలు విడిగా ఉన్నాయి. ప్రస్తుతం సచివాలయంలోని ఐదు బ్లాకులను ప్ర‌భుత్వం తాకట్టు పెట్టింది. ఏపీ రాష్ట్ర బ‌డ్జెట్ మొత్తం దాదాపు 3ల‌క్ష‌ల కోట్లు.. అందులో రాష్ట్ర స‌చివాల‌యాన్ని తాక‌ట్టు పెట్టి అంత‌ డ‌బ్బు ఎందుకు తేవాల్సి వ‌చ్చిందో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌మాధానం చెప్పాల్సి ఉంది. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ ఆస్తుల‌న్నీ బ్యాంకుల్లో తాక‌ట్టు పెట్టి వ‌చ్చిన డ‌బ్బును ఏం చేస్తున్నారన్న విషయం ఆర్థిక అంశాల‌పై ప‌ట్టున్న వారికికూడా అర్థంకాని ప‌రిస్థితి నెలకొంది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఒక్క‌ చాన్స్ ఇవ్వండి   ప్లీజ్ అంటూ ఏపీ ప్ర‌జ‌లను వేడుకున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి,  అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఆస్తుల‌ను బ్యాంకుల్లో తాక‌ట్టుపెడుతూ వ‌స్తున్నారు. అందుకే ఒక్క చాన్స్ అడిగారా అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే తాకట్టు పెట్టడం తప్ప ఆయన ప్రభుత్వ పరంగా ఈ ఐదేళ్లలో ఏం చేసింది లేదని అంటున్నారు.  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయిన త‌రువాత ఏపీకి రాజ‌ధాని లేకుండా పోయింది. 2014లో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి కేంద్రంగా దేశంలోని మిగిలిన రాష్ట్రాల‌ను త‌ల‌ద‌న్నేలా ఏపీ రాజ‌ధానిని నిర్మించాల‌ని భావించారు. అమ‌రావ‌తి ప్రాంత రైతులుసైతం చంద్ర‌బాబు అడిగిందే త‌డ‌వుగా భూములిచ్చేశారు. భావిత‌రాల‌కు అద్భుత రాజ‌ధానిని అందించాల‌ని భావించిన చంద్ర‌బాబు ఒక్కో అడుగు ముందుకేస్తూ భ‌వ‌నాల నిర్మాణాలు చేప‌ట్టారు. అసెంబ్లీ, స‌చివాల‌యం, హైకోర్టు ఇలా  రూ.700 కోట్ల వ్యయంతో భ‌వ‌నాల‌ను నిర్మించారు. ఆ భ‌వ‌నాలు కొన్ని 80శాతం, కొన్ని 90శాతం, కొన్ని భ‌వ‌నాలు పూర్తిస్థాయిలో నిర్మాణం జ‌రిగాయి. అయితే  అవ‌న్నీ గ్రాఫిక్స్ మాత్ర‌మే అంటూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ప్ర‌చారం చేశారు. దీనికితోడు ఒక్క‌ చాన్స్ ప్లీజ్  అంటూ ప్ర‌జ‌ల‌ను వేడుకున్నాడు. దీంతో ప్ర‌జ‌లు సైతం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని గుడ్డిగా న‌మ్మి అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అమ‌రావ‌తి రాజ‌ధానికాదు అంటూ జ‌గ‌న్ బాంబు పేల్చాడు. ఒక్క‌ రాజ‌ధానితో ఏపీలో అభివృద్ధి జ‌ర‌గ‌దు.. నేను మూడు రాజ‌ధానులు క‌డ‌తా అంటూ జ‌గ‌న్ ఐదేళ్లుగా ప్ర‌జ‌ల చెవుల్లో పువ్వులు పెడుతూనే వ‌స్తున్నారు. అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు క‌ట్టిన భ‌వ‌నాలు ఏమీలేవంటూ ప్ర‌చారం చేసిన జ‌గ‌న్.. ఇప్పుడు ఆ భ‌వ‌నాల‌ను తాక‌ట్టు పెట్టి కోట్ల రూపాయ‌లు అప్పులు తీసుకున్నారు.  జ‌గ‌న్ అమ‌రావ‌తిని నిర్వీర్యం చేయ‌కుండా చంద్ర‌బాబు క‌ట్ట‌గా మిగిలిన భ‌వ‌నాల‌ను పూర్తిచేసినా ఏపీకి ఇప్ప‌టి వ‌ర‌కు ఓ మంచి రాజ‌ధాని అయ్యి ఉండేది. ప్ర‌జ‌ల సొమ్మును దోచుకోవ‌టానికి అలవాటు ప‌డిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ఆయ‌న కేబినెట్‌లోని మంత్రులు అమ‌రావ‌తి రాజ‌ధాని కాదు స్మ‌శాన వాటిక.. అక్క‌డ ఉంది బూడిదే అంటూ ప్ర‌చారం చేశారు. అంతేకాదు.. అమ‌రావ‌తిలో భ‌వ‌నాల నిర్మాణానికి 100 కోట్లు కూడా కాదు.. చంద్ర‌బాబు వెయ్యి కోట్లు పెడుతున్నారు.. ప్ర‌జల సొమ్మును చంద్ర‌బాబు దోచుకున్నారని జ‌గ‌న్ అండ్ కో గ‌తంలో ప్ర‌చారం చేసింది.. జ‌గ‌న్ చెప్పిందే నిజ‌మైతే.. మ‌రి ఇప్పుడు స‌చివాల‌యం తాక‌ట్టుకు బ్యాంకు రూ.370కోట్లు ఎలా అప్పు ఇచ్చిందంటూ ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. త‌ప్పుడు విమ‌ర్శ‌లు చేయ‌డం, సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం చేయించ‌డం.. త‌న‌కు అనుకూల ఛాన‌ల్స్ ద్వారా  త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌సారం చేయ‌డం.. ఇలా ఏపీ ప్ర‌జ‌ల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిలువునా మోసం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌చివాల‌యాన్ని  తాక‌ట్టుపెట్ట‌డాన్ని చూసి ఆర్థిక‌ వేత్త‌లు సైతం నివ్వెర పోతున్నారు. ఇలాంటి వ్య‌క్తినా ఏపీ ప్ర‌జ‌లు సీఎంగా ఎన్నుకుంది అంటూ జాలిప‌డుతున్నారు. స‌చివాల‌యం తాక‌ట్టు పెట్టిన విష‌యం తెలుసుకున్న చంద్ర‌బాబు నాయుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెరలేపి... రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసి... చివరికి అమరావతిలోని రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు.. ఇంత‌కంటే దారుణం ఏమైనా ఉంటుందా అంటూ  ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికైనా ఏపీ ప్ర‌జ‌లు మేల్కొని ఓటు ద్వారా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి బుద్దిచెప్ప‌కుంటే రాబోయే కాలంలో రాష్ట్రంలోని ప్ర‌తీఒక్క‌రి ఆస్తుల‌ను ప్ర‌భుత్వ ఆస్తులుగా చూపించి బ్యాంకుల్లో తాక‌ట్టు పెట్టి అప్పులు తెచ్చినా ఆశ్చ‌ర్యం పోవాల్సిన ప‌నిలేదని ఆర్థిక వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు.

ప్ర‌భుత్వ ఉద్యోగివా.. వైసీపీ కార్య‌క‌ర్త‌వా..?

వైసీపీ ప్ర‌భుత్వంలో కొంద‌రు అధికారుల తీరు హ‌ద్దులు దాటిపోతోంది.  అలాగే కొందరు ఉద్యోగ సంఘాల నేతలు కూడా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి హార్డ్ కోర్ కార్య‌క‌ర్త‌ల్లా వ్యవహరిస్తున్నారు. త‌మ స్వ‌లాభం కోసం  ప్ర‌భుత్వ పెద్ద‌ల ప్ర‌స‌న్నంకోసం కొంద‌రు ఉద్యోగ సంఘాల నేత‌లు ఎంతకైనా  తెగించేస్తున్నారు. పాతాళానికి సైతం దిగజారడానికి వెనుకాడటం లేదు.    ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టకుండా వారికి అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని పొగిడేందుకే మ‌నం ప్ర‌భుత్వ ఉద్యోగం చేస్తున్నాం అన్న‌ట్లుగా కొంద‌రు ఉద్యోగం సంఘాల నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం ఉద్యోగులు,  ప్ర‌జ‌లలు విస్తుపోవడమే కాదు, ఆగ్రహంతో రగిలిపోతున్నారు.  సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో,  ప్ర‌భుత్వంలో ఉన్న ప్ర‌జాప్ర‌తినిధుల‌తో అధికారులు స‌త్సంబంధాలు క‌లిగి ఉండ‌టంలో ఏమాత్రం త‌ప్పులేదు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల విష‌యంలో సీఎం ఆదేశాల‌ను, మంత్రుల ఆదేశాలను పాటించ‌డా్నీ తప్పుపట్టలేం. ప్ర‌భుత్వం ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ప‌నిచేయ‌డం ఉద్యోగుల విధి. కానీ, ప్ర‌భుత్వ ఉద్యోగిగా ఉన్నామ‌న్న సోయి  మ‌రిచి ప్ర‌భుత్వంలోఉన్న పార్టీకి కార్య‌క‌ర్త‌లా వ్య‌వ‌హ‌రిస్తుండటం  ఉద్యోగ సంఘాల ఉనికి ప్ర‌శ్నార్థ‌కంగా మారే ప‌రిస్థితికి దారి తీస్తోంది.  సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి తీరు అలానే ఉంది.  వెంక‌ట్రామిరెడ్డి తీరుప‌ట్ల ఉద్యోగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుగా వెంకట్రామిరెడ్డి  2022 డిసెంబ‌ర్ నెల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అప్ప‌టి నుంచి ఆయ‌న తీరు వివాదాస్ప‌దంగానే ఉంది. ప్ర‌భుత్వ ఉద్యోగిలా కాకుండా వైసీపీ కార్య‌క‌ర్త‌లా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఉద్యోగులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. సీఎం వ‌ద్ద‌కు, ప్ర‌భుత్వ పెద్ద‌ల వద్దకు  ఉద్యోగుల సమ‌స్య‌ల‌ను తీసుకెళ్లి వాటి ప‌రిష్కారంకోసం కృషిచేయాల్సిన   ఉద్యోగ సంఘం నేత వెంకట్రామరెడ్డి స్వలాభంకోసం వైసీపీ కార్య‌క‌ర్త‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. గ‌తంలో వెంక‌ట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి.  2023లో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో వెంక‌ట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ప్రాణాపాయం ఉంటే చంపడానికైనా హక్కు ఉంది.. రాజ్యాంగంలో ఆ విషయాన్ని పొందుపరిచారంటూ వెంకట్రామి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అప్ప‌ట్లో తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. సచివాలయ ఉద్యోగులుసైతం ఆయ‌న తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ప‌రిస్థితి. వెంక‌ట్రామిరెడ్డి త‌న‌ను తాను ప‌లు సంద‌ర్భాల్లో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బంటున‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌భుత్వ ఉద్యోగి ఏ స్థాయిలో ఉన్నా ఉద్యోగ నిబంధ‌న‌లకు లోబ‌డి ప‌నిచేయాల్సి ఉంటుంది. సీఎంపై, ప్ర‌భుత్వంలో ఉన్న పార్టీపై ప్రేముంటే ప్ర‌భుత్వ ఉద్యోగాన్ని వ‌దిలి కార్య‌క‌ర్త‌గా చేరితే బాగుంటుంది. కానీ, ఉద్యోగ సంఘం నేత ముసుగులో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌ద్ద స‌చివాల‌య ఉద్యోగులను తాక‌ట్టుపెట్టిన వ్య‌క్తిగా వెంక‌ట్రామిరెడ్డి ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో కీల‌క భూమిక పోషించాల్సింది పోయి వైసీపీ కార్య‌క‌ర్త‌లా మారిపోవ‌టం ప‌ట్ల పలువురు ఉద్యోగులు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల‌ వెంక‌ట్రామిరెడ్డి ఉద్యోగులతో జ‌రిగిన‌ స‌మావేశంలో పాల్గొని మాట్లాడిన మాట‌లు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. గ్రామ సచివాలయాల్లో మంచి జరిగిందా లేదా అన్నది వ‌చ్చే ఎన్నికలే ఉదాహరణ.. ఒక‌వేళ వైసీపీ ఓడిపోతే మనం బాగా పని చేయనట్టే అని వెంక‌ట్రామిరెడ్డి ఉద్యోగుల‌తో  అన్నారు. అంత‌ వ‌ర‌కు బాగానేఉన్నా.. ప‌లు ప‌త్రిక‌లు, చాన‌ల్స్ పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. రాష్ట్రంలో ఏదో జరిగిపోయిందని కొన్ని మీడియా సంస్థలు పుంఖాను పుంఖాలుగా రాస్తూ టీవీ చానల్స్ లో డిబేట్ లు పెడుతున్నాయ‌ని వెంక‌ట్రామిరెడ్డి వ్యాఖ్యానించ‌డం ప‌ట్ల ఉద్యోగుల నుంచే  కాకుండా రాజకీయ వర్గాల నుంచీ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌భుత్వ ఉద్యోగిగా మాట్లాడేట‌ప్పుడు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని, వైసీపీ కార్య‌క‌ర్త‌లా మాట్లాడితే రాబోయే కాలంలో ఉద్యోగుల‌ను ప్ర‌జ‌లు చీదరించుకునే పరిస్థితి వస్తుందని  ప‌లువురు ఉద్యోగులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పత్రికలు, చానల్స్  హైలెట్ చేస్తూ ఉద్యోగులకు మేలు జరిగేలా చేస్తుంటే.. వెంకట్రామిరెడ్డి పత్రికలు, ఛానల్స్ పై వైసీపీ కార్యకర్తలా ఆరోపణలు చేయడం ఉద్యోగులను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇప్ప‌టికైనా ఉద్యోగ సంఘంలో కీల‌క హోదాల్లో ఉన్న‌వారు నిబంధ‌న‌ల‌కు లోబ‌డి మాట్లాడితే బాగుంటుంద‌ని, లేకుంటే రానున్న కాలంలో ప్ర‌భుత్వ‌ ఉద్యోగులంటేనే ప్ర‌జ‌లు పార్టీల కార్యకర్తలుగా భావించే ప్రమాదం పొంచిఉందని ప‌లువురు ఉద్యోగ సంఘం నేత‌లు, ఉద్యోగులు వాపోతున్నారు.

జగన్ ఫేట్ ఇదీ.. తేల్చిచెప్పిన ప్ర‌శాంత్ కిషోర్‌

ప్ర‌శాంత్ కిషోర్.. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ వ్యూహ‌క‌ర్త‌..  వైసీపీ విజ‌యం సాధించ‌డంతోపాటు అత్య‌ధిక నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీ జెండా ఎగ‌ర‌డంలో  కీల‌క భూమిక పోషించిన వారిలో ఒక‌రు. ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వే అంటే అందులో తిరుగుండ‌ద‌ని దేశ రాజ‌కీయాల్లో పేరుంది. ప్ర‌జ‌ల నాడిని ప్ర‌శాంత్ కిషోర్ తేలిగ్గా ప‌ట్టేయ‌గ‌లరు. అలాంటి ప్ర‌శాంత్ కిషోర్‌.. ఏపీ రాజ‌కీయాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచేది ఏ పార్టీనో  క్లియర్ కట్ గా తేల్చేశారు.   2024 ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని, అందులో ఎలాంటి అనుమానం లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు.  అది కూడా అలాంటి ఇలాంటి ఓటమి కాదనీ, ఘోరమైన పరాజయం తప్పదనీ తేల్చేశారు. వైసీపీ ఓట‌మికి కార‌ణాల‌ను కూడా ప్ర‌శాంత్ కిషోర్ వివ‌రించాడు. వైసీపీ ఓడిపోతుంద‌ని ప్ర‌శాంత్ కిషోర్ చెప్పిన వెంట‌నే ఆ పార్టీ సోష‌ల్ మీడియా రెచ్చిపోయింది.. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వేల‌తో విజ‌యం సాధించిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ఇప్పుడు ఆయ‌న స‌ర్వేలు తూచ్‌.. అంతా అబ‌ద్దం అని వైసీపీ  పార్టీ సోష‌ల్ మీడియాలో విస్తృత ప్ర‌చారం చేయ‌డం మొద‌లైపోయింది. అంతేకాదు.. జగన్ త‌న మంత్రుల‌తో ప్రశాంత్ కిషోర్ ను ఇష్టారీతిగా తిట్టించేశారు.   బీహార్ లో చెల్ల‌ని రూపాయి అయిన ప్రశాంత్ కిషోర్   స‌ర్వేలు ఇక్కడ ప‌నిచేయ‌వంటూ ఎదురుదాడి  మొద‌లు పెట్టారు.  ప్ర‌శాంత్ కిషోర్ ఒక్క‌రేకాదు.. ప్ర‌ముఖ స‌ర్వేల ఫ‌లితాల‌న్నీ వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని తేల్చేస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వ‌స్తుంద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తున్నాయి. ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌న్నది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కేవ‌లం ప‌థ‌కాల పేరుతో అకౌంట్ల‌లో డ‌బ్బులు జ‌మ చేయ‌డం త‌ప్ప,  వైసీపీ కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లరు  చెప్పుకోవ‌డానికి క‌నీసం ఒక్క రోడ్డునుకూడా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వేయ‌లేక పోయారు. 2014 నుంచి 2019 వరకూ ఏపీ సీఎంగా చంద్ర‌బాబు చేసిన అభివృద్ధిని కొన‌సాగించ‌క పోవ‌టంతోపాటు.. చంద్ర‌బాబు హ‌యాంలో నిర్మించిన భ‌వ‌నాల‌ను కూల్చేశారు. అంతేకాదు.. చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీలో పెట్టుబ‌డులు పెట్టిన పెద్ద‌పెద్ద కంపెనీల‌ను సైతం రాష్ట్రం నుంచి త‌రిమేసిన ఘ‌న‌త సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిది. మ‌ద్యం, ఇసుక పేరుతో జ‌గ‌న్ హ‌యాంలో భారీ దోపిడీ జ‌రిగింది. ఇదేమ‌ని ప్ర‌శ్నించిన వారిపై దాడిచేయ‌డం, అరెస్టులు చేయించి జైళ్ల‌కు పంప‌డం తప్ప జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో జ‌రిగింది ఏమీ లేదు. చంద్ర‌బాబు హ‌యాంలో అమ‌రావ‌తిని ఏపీ రాజ‌ధానిగా అసెంబ్లీలో తీర్మానంచేసి.. అక్క‌డ స‌చివాల‌యం, అసెంబ్లీ, హైకోర్టుల‌తో పాటు ప‌లు కార్యాల‌యాల‌కు భ‌వ‌నాల‌ను కూడా నిర్మించారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చే నాటికి అమ‌రావ‌తిలో కొన్ని భ‌వ‌నాలు పూర్తికాగా.. మ‌రికొన్ని చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. వాటిని కొన‌సాగించాల్సిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో అమ‌రావ‌తిని నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నం చేశారు. మూడు రాజ‌ధానుల పేరుతో ఏపీ ప్ర‌జ‌ల‌ను నిలువునా మోసం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. జ‌గ‌న్ హ‌యాంలో జ‌రిగింది కేవ‌లం విధ్వంసం మాత్ర‌మే..  అభివృద్ధి ఆన‌వాళ్లు భూత‌ద్దం పెట్టి వెతికినా క‌నిపించ‌వు. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ప్ర‌జ‌ల ఆగ్ర‌హాన్ని గ‌మ‌నించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను మార్పులు చేశారు. అయినా, స‌ర్వే ఫ‌లితాల‌న్నీ వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని తేల్చేస్తున్నాయి. జ‌గ‌న్ సొంత‌గా నిర్వ‌హించిన స‌ర్వేలోనూ 75శాతం వైసీపీ అభ్య‌ర్థులు ఓడిపోతార‌ని తేలింద‌న్న ప్ర‌చారం వైసీపీ వ‌ర్గాల్లోనే జ‌రుగుతున్నది.  గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీలో జ‌గ‌న్ ఘ‌న విజ‌యం సాధిస్తారని ప‌లు జాతీయ మీడియా సంస్థ‌ల   స‌ర్వేల్లో తేలింది.. అవే జాతీయ మీడియా సంస్థ‌లు ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌ర్వేల్లో వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని తేల్చేశాయి. తాజాగా ప్ర‌శాంత్ కిషోర్ కూడా వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని తేల్చేశాడు. హైదరాబాద్‌లో ఓ పత్రిక కాంక్లేవ్‌లో పాల్గొన్న ఆయ‌న ఏపీ రాజకీయాలపై స్పందించారు. ప్రజల బాగోగులు చూస్తున్నామని వాళ్ల సొమ్మును ఖర్చు చేయడం తప్పు.. జగన్ ఇలా చేయడం వల్లే రాజకీయంగా నష్టపోబోతున్నారని ప్ర‌శాంత్ కిషోర్‌ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.  తెలంగాణలో కేసీఆర్‌కికూడా అదే జరిగిందని అన్నారు. విద్య, ఉపాధి, అభివృద్ధి ఎన్నికల్లో కీలకంగా ప్రభావం చూపుతాయని, ప్యాలెస్‌లో కూర్చొని బటన్స్ నొక్కితే ఓట్లు పడబోవని ప్ర‌శాంత్ కిషోర్‌ అన్నారు. ప్రజల మధ్యలోకి రాకపోవడం కూడా జగన్ ఓట‌మికి కార‌ణంగా మారుతుంద‌ని ప్ర‌శాంత్ కిషోర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేసేందుకు ఈసీ క‌స‌ర‌త్తు చేస్తున్న క్ర‌మంలో .. ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ‌ల ఫ‌లితాల‌న్నీ వైసీపీ ఓడిపోతుంద‌ని తేల్చేశాయి. దీంతో తాడేప‌ల్లి క్యాంప్ తోపాటు వైసీపీ శ్రేణుల్లో ఆందోళ‌న నెల‌కొంది. తాజాగా.. రాజ‌కీయ‌ వ్యూహ‌క‌ర్త  ప్ర‌శాంత్ కిషోర్ సైతం వైసీపీ ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని తేల్చిచెప్పాడు. వెంట‌నే ప్ర‌శాంత్ కిషోర్‌ పై వైసీపీ సోష‌ల్ మీడియాలో ఆ పార్టీ మూక‌లు అస‌భ్య‌  ప‌ద‌జాలంతో దూష‌ణ‌లు మొద‌లు ప‌ట్టేశారు. ప్ర‌శాంత్ కిషోర్ వైసీపీ ఓడిపోతుంద‌ని చెప్పిన కొద్ది సేప‌టికే మంత్రి అమ‌ర్నాథ్ ప్రెస్ మీట్ పెట్టి తిట్ల‌ దండ‌కం అందుకున్నారు. బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ ప్రజలను ఏమార్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై తన గట్ ఫీలింగ్ అంటూ ఏవేవో మాట్లాడారు. తెలుగుదేశం, జన సేన కూటమి చిత్తుచిత్తుగా ఓడిపోతుందని ఏపీ ప్ర‌జ‌లే అంటున్నారంటూ మంత్రి చెప్పుకొచ్చాడు. బీహార్ లో ప్రశాంత్ కిషోర్ చిత్తుగా ఓడిపోతారు. బీహార్ లో ప్రశాంత్ కిషోర్ లానే చంద్రబాబు కూడా ఆంధ్రా లో చెల్లని రూపాయి అంటూ మంత్రి మాట్లాడారు. మొత్తానికి వైసీపీ అధిష్టానం పైకి గంభీరంగా క‌నిపిస్తున్నా,  ఓట‌మి ఖాయ‌మ‌ని ఆ పార్టీ శ్రేణులే చెప్పేస్తున్నా, పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తన భుజాలను తానే చరుచుకుంటూ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజాగా పీకే సైతం జ‌గ‌న్ కు ఓట‌మి త‌ప్ప‌ద‌ని చెప్ప‌డంతో  వైసీపీ నేత‌ల్లో ఆందోళ‌న  స్పష్టంగా కనిపిస్తోంది.  

టిడిపి లో చేరిన నెల్లూరు వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదలి రా  కార్యక్రమం నెల్లూరు విజయవంతం అయ్యింది.  జగన్ ప్రభుత్వ  ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించే వారు క్రమంగా టిడిపిలో జాయిన్ అవుతున్నారు. వైసీపీ నేతలు సైతం చంద్రబాబును సమర్ధిస్తున్నారు. సమర్థించడమే కాదు వాళ్లు టిడిపిలో చేరుతున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ రా కదలిరా సభ కోసం నెల్లూరు వచ్చారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన అర్ధాంగి వేమిరెడ్డి ప్రశాంతిలకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆత్మీయ స్వాగతం పలికారు. రాష్ట్రం బాగు కోసం కలిసి పనిచేద్దాం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి కుటుంబం చంద్రబాబును సత్కరించి వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించింది. కాగా, వేమిరెడ్డి కుటుంబంతో పాటు నెల్లూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు, పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. నెల్లూరు పీవీఆర్ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు స్పందిస్తూ... రాజకీయాల్లో అజాతశత్రువు వంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని కొనియాడారు. ప్రజాసేవకు మారు పేరు వేమిరెడ్డి... ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక ఉద్దేశంతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అని తెలిపారు. ఆయన రాకతో నెల్లూరులో సునాయాసంగా గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు కార్పొరేషన్ మొత్తం ఖాళీ అయిపోతుందని అన్నారు. పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులకు టీడీపీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చంద్రబాబు ఉద్ఘాటించారు. 

ముంబై దాడుల సూత్రధారి అజామ్ చీమా మృతి

ముంబై ఉగ్రదాడి సూత్రధారి అజామ్ చీమా గుండెపోటుతో  పాకిస్థాన్ లో మరణించాడు.  నిన్నటి వరకూ ఆరోగ్యంగా ఉన్న చీమా హఠాత్తుగా గుండెపోటుతో మరణించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చీమా లష్కరే తోయిబా  ఉగ్రసంస్థ ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతి.  ముంబై దాడులతోనే కాకుండా పలు ఉగ్ర దాడులతో కూడా చీమాకు సంబంధం ఉంది.  ఆయన అంత్యక్రియలు ఫైసలాబాద్‌లోని మల్కన్‌వాలాలో పూర్తైనట్లు సమాచారం టెర్రరిస్ట్ జమీల్ ఉర్ అహ్మద్ ను అపహరించిన సాయుధులు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షేక్ అబ్దుల్ ఉర్ రెహమాన్ ను గుర్తు తెలియని సాయుధులు అపహరించారు. కొద్ది సేపటి కిందట ఈ సంఘటన జరిగింది. పాకిస్థాన్ లోని అబొట్టాబాద్ లో గుర్తుతెలియని సాయుధులు అతడిని అపహరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జమీల్ ఉర్ అహ్మద్ లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ సహా పలు ఉగ్రవాద సంస్థలలో ఉగ్రవాదులకు శిక్షకుడిగా ఉన్నాడు.   

విపక్షాల ఐక్యత ఎండమావేనా?.. కారణాలేమిటి?

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మరో పది పదిహేను రోజులలోగానే వెలువడే అవకాశాలున్న నేపథ్యంలో కేంద్రంలో మళ్లీ సర్కార్ ఏర్పాటుపై బీజేపీలో కనిపిస్తున్న ధీమా, కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారంలోకి వస్తామన్న విషయంలో విపక్షాలలో కనిపించడం లేదు. నిజమే.. బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా పొత్తుల వైపుగా పడిన విపక్షాల అడుగులు ఆదిలోనే తడబడ్డాయి. ఎవరికి వారే యమునా తీరే చందంగా వాటి అడుగులు పడుతున్నాయి.  అయినా దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల కాలానికి కాలం చెల్లిందనే పరిస్థితులే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికలలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన మోడీ సర్కార్  పేరుకు మాత్రమే సంకీర్ణ ప్రభుత్వం. 2014లో విపక్షాలకు ఏదో మేరకు గౌరవ ప్రదమైన గుర్తింపు ఇచ్చినా.. క్రమంగా బీజేపీ తన పెద్దన్న పాత్రను పెంచుకుంటూ పోయింది. 2019 ఎన్నికల సమయానికి కేంద్రంలో ఉన్నది నామ్ కే వాస్తే ఎన్డీయే ప్రభుత్వంగా మారిపోయింది. 2019 ఎన్నికలలో బీజేపీ ఘన విజయం తరువాత కేంద్రంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల పాత్ర పూర్తిగా తగ్గిపోయింది. 2014 ఎన్నికల వేళ విపక్షాల ఐక్యతకు గండికొట్టే ప్రయత్నంగా మాత్రమే బీజేపీ పాత మిత్రులకు ఆహ్వానం పలుకుతోంది. కొత్త మిత్రులకు తలుపులు తెరుస్తున్నది. అయినా కూడా ఆ పార్టీ ప్రకటించుకుంటున్న లక్ష్యలను చూస్తే ఎన్డీయే కాదు బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మిత్ర పక్షాల పాత్ర ప్రభుత్వంలో నామమాత్రంగానే ఉంటుంది అని చెప్పకనే చెబుతున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఇప్పటికే కేంద్రంలో  ఆ పరిస్థితి ఉంది.  ఇటువంటి పరిస్థితుల్లో ఐక్యంగా అడుగులు వేయాల్సిన విపక్షాలు అందుకు భిన్నంగా నడుస్తున్నాయి. నిజానికి దేశంలో ప్రతిపక్షాలకు అవకాశాలు క్షీణుస్తున్న దురదృష్టకర పరిస్థితులు నెలకొన్నాయని గతంలోనే సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. ఆయన ఈ మాట సీజేఐ హోదాలోనే అన్నారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ లో ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ పని తీరు రోజురోజుకూ దిగజారిపోతోందని ఆయన నాడు ఆవేదన వ్యక్తం చేశారు.   అవధులు లేని అధికారం కారణంగా ప్రభుత్వాలు ప్రజాస్వామ్య విలువల గురించి పట్టించుకోకుండా తమ మాటే నెగ్గాలన్న పట్టుదలతో ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒక విధమైన అహంకారంలో వ్యవహరిస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో తెలంగాణలో ప్రభుత్వ తీరును చూసినా, అలాగే జగన్ హయాంలో ఏపీలో పాలన సాగుతున్న తీరును చూసినా ఇది నిజమని ఎవరినా అంగీకరించే పరిస్థితులే ఉన్నాయి. అదే విధంగా కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా అస్మదీయులు, తస్మదీయులన్న స్పష్టమైన వివక్షను చూపుతూనే పాలన సాగిస్తోందని పరిశీలకులు ఉదాహరణలతో సహితంగా వివరించి విశ్లేషిస్తున్నారు.   ముఖ్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ ప్రత్యర్థులు, వ్యతిరేకుల లక్ష్యంగానే తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయన్న ఆరోపణలు, విమర్శలు ఇటీవలి కాలంలో పెచ్చరిల్లడమే ఇందుకు నిదర్శనం.  అదే విధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తాను ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే రాజ్యసభ వేదికగా పలుమార్లు రాజకీయ వ్యవస్థ దిగజారిపోతోందన్న ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  ఏది ఏమైనా ప్రజాస్వామ్య వ్యవస్థల ప్రతిపక్షాలు బలహీనం కావడం అంటే ఆ వ్యవస్థ దిగజారడమే అవుతుందని ప్రజాస్వామ్య వాదులు చెబుతున్నారు. విపక్షాల బలహీనత కారణంగానే దేశంలో  ప్రజాస్వామ్య విలువలూ రోజురోజుకూ దిగజారిపోతున్నాయన్నది కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. అయితే ఈ పరిస్థితి ఏర్పడడానికి అధికారంలో ఉన్న ప్రభుత్వాల తీరు ఎంత కారణమో, కేవలం అధికారమే పరమావధిగా, దేశ ప్రయోజనాలను పట్టించుకోకుండా, సర్దుబాట్లకు సిద్ధపడకుండా నాయకత్వ స్థానం కోసం పట్టుబడుతూ ఐక్యతకు బీటలు వారుస్తున్న విపక్షాల తీరు కూడా ఇందుకు కారణమేనని పరిశీలకులు అంటున్నారు.  ఏది ఏమైనా దేశంలో ప్రస్తుత పరిస్థితికి తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా తయారైందని చెప్పక తప్పదని అంటున్నారు.   

డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే లాస్య నందిత కారు ప్రమాదం

కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత  కారు ప్రమాదంపై రకరకాల ఊహాగానాలకు తెరపడింది. లాస్యనందిత కారు ప్రమాదం కేసులో మిస్టరీ దాదాపు వీడినట్టే. టిప్పర్ డ్రైవర్ తప్పిదం ఏమీ లేదని, లాస్య కారు డ్రైవర్ ఆకాశ్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. నిద్రమత్తులో ఉన్న ఆకాశ్ ముందు వెళ్తున్న టిప్పర్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఆ తర్వాత కారు అంతే వేగంతో రెయిలింగ్‌‌ను ఢీకొట్టడంతో లాస్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిజానికి తొలుత టిప్పరే లాస్య కారును ఢీకొట్టి ఉంటుందని పోలీసులు భావించారు. అందుకనే డ్రైవర్ ఆపకుండా పరారయ్యాడని అనుకున్నారు. కానీ, సీసీటీవీ ఫుటేజీల పరిశీలనలో అసలు విషయం బయటపడింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ టిప్పర్‌ (టీఎస్ 08 యూజే 0025)ను గుర్తించారు. కారు ఢీకొట్టడంతో టిప్పర్ వెనక సిగ్నల్ లైట్ బోర్డు పగిలిపోయింది. పైభాగంలోని ఇనుప గార్డు కూడా పక్కకి వంగిపోయింది. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిని ప్రశ్నిస్తున్నారు. కారు ఢీకొట్టిన విషయం తెలిసి కూడా లేనిపోని తలనొప్పులు ఎందుకున్న ఉద్దేశంతో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయి ఉంటాడని భావిస్తున్న పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు.

గురి చూసి కొట్టిన డాక్టర్ సునీత!

అధికారం రుచి మరిగి మరోసారి అబగా.. అధికారాన్ని అందుకోందామనుకొంటున్న వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశలపై ఆయన సోదరి నర్రెడ్డి సునీత  నీళ్లు చల్లారనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. మార్చి 1వ తేదీ దేశ రాజధాని హస్తినలోని కానిస్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా.. వివేకా హత్య.. కుట్రదారులు ఎవరు? అనే అంశంపై ఆమె ప్రెస్‌మీట్ పెట్టడం ఓ ఎత్తు అయితే..  ఆదే ప్రెస్‌మీట్‌లో ప్రజలందరికీ ఒక రిక్వస్ట్.. ప్లీజ్ మా అన్న పార్టీకి, వైసీపీకి ఓటు వేయద్దండి.. ఇంత వంచన చేసిన పార్టీకి, మోసం చేసిన పార్టీకి, తన అనుకున్న వాళ్లకి మాత్రమే హెల్ప్ చేసి. మిగిలిన ఎవరికీ సహాయం చేయకుండా ఉండే వాళ్లకు.. ప్లీజ్ ఓటు వేయకండంటూ ఆమె కోరడం మరో ఎత్తు అంటున్నారు. అలాగే తన తండ్రి హత్య కేసులో ప్రజా తీర్పు కావాలంటూ.. సునీత నర్రెడ్డి మీడియా ద్వారా ప్రజల ముందు ఇలా అభ్యర్థించడం ఇంకో ఎత్తు అన్న  అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే తన తండ్రి వివేకా హత్య కేసుతో.. ఇలా సమయం, సందర్భంతోపాటు వేదికను సైతం ఎంచుకోని.. తన సోదరుడు  జగన్‌ను సునీత నర్రెడ్డి గురి చూసి కొట్టిందంటున్నారు. ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో జరగనున్న వేళ ఆమె.. అటు విజయవాడలోనో.. లేకుంటే ఇటు హైదరాబాద్‌లోనో కాకుండా.. దేశ రాజధాని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి.. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజల సంక్షేమం సంగతి దేవుడెరుగు.. సొంత ఇంటి ఆడపడుచుకే న్యాయం జరగడం లేదనే ఓ క్లియర్ కట్ సందేశాన్ని ఢిల్లీలోని కేంద్ర పెద్దలకు సైతం తెలియజేసేందుకే  సునీత నర్రెడ్డి ఇలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వ్యక్తం అవుతోంది.   గతంలో వైయస్సీర్టీపీ అధ్యక్షురాలిగా ఉన్న వైయస్ షర్మిల.. కేసీఆర్ ప్రభుత్వంపై ఢిల్లీలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు ఓ వైపు ప్రచారం సాగుతుండగా.. ఇదే వివేకా హత్య కేసులో సీబీఐ కార్యాలయానికి వెళ్లి ఆమె వాంగ్మూలం ఇవ్వడమే కాదు.. ఆ తర్వాత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి.. వివేకా హత్య కేసులోని పలు కీలక అంశాలను  బహిర్గతం చేశారనీ,  సరిగ్గా అలాగే.. సునీత నర్రెడ్డి సైతం ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి.. తన జగనన్న బండరాన్ని బహిర్గతం చేశారన్న చర్చ వైరల్ అవుతోంది.  అంతేకాదు.. సునీత చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారని కూడా అంటున్నారు.  ఎందుకంటే.. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ లోపు.. ఏపీ సీఎం జగన్.. ఏదో ఓ రోజు ఢిల్లీ పర్యటకు వెళ్తారు.  ఆ క్రమంలో సునీత ప్రెస్ మీట్ అంశంపై ఆయన్ని మీడియా మిత్రులు ప్రశ్నిస్తారు. అలాంటి వేళ ఆయన స్పందన ఎలా ఉండబోతుంది. అలాగే  సీఎం జగన్.. న్యూఢిల్లీలో కేంద్రంలోని పెద్దలతో భేటీ అవుతారు.. ఆ సమయంలో సునీత ప్రెస్ మీట్‌ పెట్టి పేర్కొన్న అంశాలను కేంద్ర పెద్దలు జగన్ వద్ద ప్రస్తావిస్తే.. అప్పుడు ఆయన పరిస్థితి ఏమిటీ.. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొనే.. సునీత నర్రెడ్డి చాలా చాకచక్యంగా వ్యహరించారని చెబుతున్నారు. అదేవిధంగా సోదరుడు  జగన్‌ను ఢిల్లీలోనే అష్టదిగ్బందం చేసే విధంగా ఆమె వ్యవహరించారన్న చర్చ వైసీపీలోనే  జరుగుతోంది.   మరోవైపు.. జగన్ పాలనతోపాటు ఆయన వ్యవహార శైలిపై ప్రతిపక్షపార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరీలు విమర్శనాస్త్రాలు సంధిస్తే.. ఫ్యాన్ పార్టీలోని ఎవరో ఒకరితో ప్రెస్ మీట్ పెట్టించి.. బండ బూతులు తిట్టించడం రివాజుగా మారింది. ఇక సొంత సోదరి వైయస్ షర్మిల.. హస్తం పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత.. నేరుగా జగన్ పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీలోని కొడాలి నాని, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్ ఎక్సెట్రా ఎక్సెట్రాలు ఆమెపై విరుచుకు పడుతున్నారు.  అయితే  సునీత నర్రెడ్డి.. తన తండ్రి హత్య కేసులో న్యాయం కోసం.. అయిదేళ్లుగా పోరాటం చేస్తున్నారు.. ఆ క్రమంలో హస్తిన వేదికగా ప్రెస్ మీట్ పెట్టి.. చాలా సుతి మెత్తగా.. జగనన్న పాలన తీరును ఎండగట్టడం ద్వారా.. వైఎస్  ఫ్యామిలీలోని ఇంటి ఆడపడుచులు  పదునైన బాణాలుగా వ్యవహరించారనేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలనే చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.    ప్రతిపక్ష నేతగా వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి.. అలవి కానీ హామీలు ఇచ్చి.. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని.. అధికారం పీఠమెక్కిన   జగన్‌ను అధ: పాతాళంలోకి పడ తోసేందుకు సునీత నర్రెడ్డి హస్తినలో పెట్టిన ఈ ఒక్క ప్రెస్ మీట్ చాలనే ఓ చర్చ అయితే  రాజకీయవర్గాలలో జోరుగా నడుస్తోంది. 

మల్లారెడ్డి వేసిన అక్రమ రోడ్డు తొలగింపు 

బిఆర్ఎస్ హాయంలో జరిగిన అక్రమాలను ఒక్కోటి బయటకు తీయడానికి రేవంత్ రెడ్డి  సర్కార్ ఉపక్రమించింది. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు చేసిన కబ్జాలు వెలుగులోకి తెచ్చి పరిష్కార మార్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెతుకుతోంది.  బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ తగిలింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండీఏ లేఔట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. 2,500 గజాల భూమిని ఆక్రమించి ఈ రోడ్డును నిర్మించారు. తన కాలేజీ కోసం మల్లారెడ్డి ఈ రోడ్డును నిర్మించుకున్నారు. అయితే, ఈ వ్యవహారంపై గతంలో ఎంపీగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, రేవంత్ సీఎం అయిన తర్వాత ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎండీఏ లేఔట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును శనివారం  అధికారులు తొలగించారు.

ముసుగులు తీసేసిన ముద్రగడ, చేగొండి!

మాటకు ముందూ మాటకు తరువాత నా కాపు జాతి అనే ముద్రగడ పద్మనాభం, కాపు జాతి సంక్షేమమే తన లక్ష్యం అంటూ అడిగినా అడగకపోయినా సలహాలూ, సూచనలూ అంటూ పవన్ కల్యాణ్ కు బహిరంగ లేఖలు రాస్తూ శ్రేయోభిలాషినని చెప్పుకునే  చేగొండి హరిరామజోగయ్యలు ఇప్పుడు తమ ముసుగులు తీసేశారు. కాపు సామాజికవర్గ శ్రేయస్సు కంటే తమ రాజకీయ స్వార్థమే ముఖ్యమని తేటతెల్లం చేశారు. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రకటించిన క్షణం నుంచీ వీరురువురూ గతంలో ఏం చేసినా, ఎలా వ్యవహరించినా, రాష్ట్రంలోని కాపులందరి తరఫునా వకాల్తా పుచ్చుకుని మరీ హడావుడి చేశారు. పొత్తు పొసగకుండా పవన్ కల్యాణ్ వెనక్కు లాగేందుకు చేయగలిగినంతా చేశారు. అది కదరకపోయే సరికి సీట్ల సర్దుబాటులో బెట్టు చేయాలంటూ సూచనలు చేశారు. బహిరంగ లేఖలు రాశారు. చివరకు తమ మాట పవన్ వద్ద చెల్లుబాటు కాదని తేలిపోయిన తరువాత అప్పటి వరకూ వేసుకున్న కాపు ముసుగును తీసేసి.. వైసీపీ గూటికి చేరిపోయారు.  తెలుగుదేశం, జనసేన పొత్తు పొసగకుండా, ఒక వేళ పొత్తు పొసగినా సరే సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీలకూ సమన్వయం కుదరకుండా  ఇరువురు నేతలూ పడిన తాపత్రేయం, ఆత్రం అంతా ఇంతా కాదు. చివరికి తెలుగుదేశం, జనసేన తాడేపల్లి గూడం సభలో తమ రెండు పార్టీల మధ్యా చక్కటి సమన్వయం ఉందనీ, బలాబలాలూ, గెలుపు అవకాశాలూ అన్నీ బేరీజు వేసుకునే సీట్ల సర్దుబాటు చేసుకున్నామని సందేహాలకు అతీతంగా స్పష్టం చేసేయడంతో  తమ అసలు రూపు బయటపెట్టేయడానికి క్షణం ఆలస్యం చేయలేదు. చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీ గూటికి చేరిపోయి.. ఆ పార్టీ నుంచి పాలకొల్లు టికెట్ దాదాపు ఖరారు చేసుకున్నారు. మరో వైపు ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. ఆయన కుటుంబం నుంచి ఎవరో ఒకరు పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఇంత కాలం ఆ ఇరువురు నేతలూ పవన్ కల్యాణ్ కు శ్రేయోభిలాషులమంటూ బిల్డప్ ఇస్తూ చేసిన తతంగం అంతా వైసీపీ హైకమాండ్... తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ లోనేనని అందరికీ అవగతమైపోయింది.  హరిరామ జోగయ్య గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ విషయంలో కూడా తనదైన శల్యసారథ్యం చేసి కొంప ముంచారు అది వేరే సంగతి. ఆయనకు కాపు సామాజిక వర్గానికి పెద్దగా, ఆ సామాజికవర్గ సంక్షేమానికి పాటుపడే వ్యక్తిగా తనకు తాను ప్రకటించేసుకుని పబ్బం గడుపుకోవడం అలవాటేనని ఆయనను తెలిసిన వారు ఎప్పటి నుంచో చెబుతున్నారు. దాంతో తెలుగుదేశం, జనసేన పొత్తుల విషయంలో ఆయన చేసిన సూచనలూ, ఇచ్చిన సలహాలను ఆ సామాజికవర్గానికి చెందిన వారెవరూ పెద్దగా పట్టించుకోలేదు. వయస్సుకు, సీనియారిటీకి మాత్రమే గౌరవం ఇస్తున్నట్లు పవన్ మొదట్లోనే ప్రకటించి, ఆయనను పెద్ద సీరియస్ గా పట్టించుకోలేదు.  కానీ ముద్రగడ విషయం అలా కాదు.  ముద్రగడ తొలి నుంచీ తెలుగుదేశం, జనసేన పొత్తును వ్యతిరేకిస్తూనే వచ్చారు. అందులో ఆయన ఎటువంటి దాపరికం లేకుండానే వ్యవహరించారు. కాపు రిజర్వేషన్లు కుదిరే పని కాదని జగన్ సీఎం హోదాలో కుండబద్దలు కొట్టేసినా ఆయన కిమ్మనలేదు. పైగా జగన్ పార్టీకి గట్టి మద్దతుదారుగా తనను తాను ప్రకటించుకున్నారు కూడా.  కాపుల మద్దతు జనసేనకు దక్కకుండా  అడ్డుకోవడానికి వైసీపీ ముద్రగడను తొలి నుంచీ పావులాగా వాడుకుంది.  చాలాకాలంగా సీరియస్ నేతగానే  కాపులలో బలమైన ప్రభావం చూపగలిగిన నేతగా ముద్ర ఉన్న ముద్రగడ జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిపై సవాల్ చేసిన సమయంలో తాను కాపు సామాజిక వర్గ శ్రేయస్సు కంటే జగన్  పక్షపాతిగా ఉండడానికి ఇష్టపడతానని చెప్పకనే చెప్పేశారు. అప్పట్లో   ద్వారంపూడికి మద్దతుగా పవన్ కల్యాణ్‌పై విమర్శలకు దిగారు.  గతంలో కాపు రిజర్వేషన్ కోసం ఉవ్వెత్తున జరిగిన ఉద్యమానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది ద్వారంపూడేననీ, ఆయన ఖర్చుతోనే నాడు కాపు ఉద్యమ కారులకు ఉప్మా పెట్టాననీ ముద్రగడ రాసిన లేకపై కాపు సామాజిక వర్గంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. ఇవిగో నీ ఉప్మా డబ్బులు అంటూ ఆయనకు పెద్ద ఎత్తున మనీ ఆర్డర్లు పంపించిన సంగతి  కూడా తెలిసిందే. దీంతో బాహాటంగా జనసేనను వ్యతిరేకిస్తూ, జగన్ తో అంటకాగితే జనం నమ్మరని గ్రహించి అప్పటికి నెమ్మదించిన ముద్రగడ ఆ తరువాత జనసేన వైపే తన మొగ్గు అంటూ ఫీలర్లు పంపారు. జనసేన నేతలు కూడా ముద్రగడ పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉండడాన్ని స్వాగతించారు.   కానీ ఎందుకో పవన్ కల్యాణ్ ఆయనను నమ్మలేదు. ఎందుకు నమ్మలేదన్న విషయం ఇప్పుడు తేటతెల్లమైంది. పవన్ తనకు సలహాలూ, సూచనలూ అక్కర్లేదనీ, తనతో కలిసి నడిచే వారే తన వారనీ కుండబద్దలు కొట్టేయడంతో  ఇక ముసుగులతో పని లేదని ముసుగుతొలగించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జనసేనలో చేరి ఆ పార్టీనీ, పవన్ కల్యాణ్ ను డీఫేమ్ చేయాలన్న వ్యూహం పురిట్లోనే సంధి కొట్టడం వల్లే   ముద్రగడ ముసుగు తీసేసి జగన్ పార్టీ గూటికి చేరిపోయారనీ, ఇప్పుడు పిఠాపురం నుంచి ఏకంగా పవన్ పైనే పోటీ చేయడానికి రెడీ అవుతున్నారనీ పరిశీలకులు అంటున్నారు.   అందుకే ఇప్పటికే పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా ఖరారైన వంగా గీతను జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని సర్ది చెప్పారని అంటున్నారు. అంతే కాకుండా ఒక వేళ పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగితే.. తాను ఆయనపై పోటీ చేసి గెలిచే అవకాశం లేదని వంగా గీత కూడా చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ముసుగులు తీసేసిన కాపు నేతలను ఆ సామాజికవర్గం నమ్మే అవకాశాలు ఇసుమంతైనా లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

టిడిపిలో చేరిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ 

ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్న నేపథ్యంలో  వైసీపీ నుంచి టిడిపిలో చేరికలు పెరిగిపోతున్నాయి. మళ్లీ జగన్ ప్రభుత్వం  అధికారంలో రాదని తేలిపోవడంతో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరూ తెలుగు దేశం పార్టీలో చేరుతున్నారు. తాజాగా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి కృష్ణప్రసాద్ చేరుకున్నారు. కృష్ణప్రసాద్ కు పార్టీ కండువా కప్పిన చంద్రబాబు... టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు, ఇటీవల కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వైసీపీపై, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని అని చెప్పి మాట మార్చడం జగన్ కే చెల్లిందని అన్నారు. ప్రతిపక్ష నేతలను తిడితేనే వైసీపీలో పదవులు ఇస్తారని చెప్పారు. తనకు మైలవరం టికెట్ ఇస్తామని చెపుతూనే చంద్రబాబును, లోకేశ్ ను వ్యక్తిగతంగా దూషించాలని చెప్పారని మండిపడ్డారు. వైసీపీలో ఉండలేకే టీడీపీలో చేరుతున్నానని చెప్పారు. దేవినేని ఉమతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవని... ఇద్దరం కలిసి కూర్చొని అన్నీ మాట్లాడుకుంటామని తెలిపారు. మరోవైపు, మైలవరం ఎమ్మెల్యే టికెట్ ను దేవినేని ఉమకు కాకుండా వసంత కృష్ణప్రసాద్ కు చంద్రబాబు కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అన్నింటికీ చంద్ర‌బాబేనా? ప్ర‌జ‌ల‌ను ఎన్నాళ్లు న‌మ్మిస్తారు స‌జ్జ‌లా!

ఏపీ రాజ‌కీయాల్లో వైసీపీ నేత‌ల విచిత్ర ప్ర‌వ‌ర్త‌న ప్ర‌జ‌ల‌కు వెగుటు పుట్టిస్తోంది. త‌ప్పు చేయ‌డం ప‌క్క పార్టీల మీద నెట్ట‌డం.. ఇదే ఫార్ములాను వైసీపీ అధిష్టానం నుంచి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కూ తు.చ. త‌ప్ప‌కుండా పాటిస్తున్నారు. అధికారంలోకి రాకముందు,  వ‌చ్చిన త‌రువాత కూడా వారి బుద్దిలో ఏమాత్రం మార్పు రాలేదు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హ‌త్య‌ కేసు విష‌యంలోనూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అచ్చుగుద్దిన‌ట్లు ఇదే ఫార్ములాను అనుస‌రిస్తూ వ‌స్తున్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వివేకా హ‌త్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. ఈ హ‌త్య‌ కేసును సునాయాసంగా అప్ప‌టి సీఎం చంద్ర‌బాబుపై నెట్టేసి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల్లో సానుభూతి పొంది అధికారంలోకి వ‌చ్చారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వివేకా హ‌త్య జ‌గ‌న్ వ‌ర్గీయుల ప‌నేనంటూ ఒక్కో విష‌యం వెలుగులోకి రావ‌డం ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. స్వ‌యాన వివేకానందరెడ్డి కూతురు, సీఎం జ‌గ‌న్ చెల్లెలు న‌ర్రెడ్డి సునీతారెడ్డి మా నాన్న‌ను హ‌త్య‌చేసింది వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్క‌ర్ రెడ్డిలేన‌ని స్ప‌ష్టంగా చెబుతున్నారు. వారిని కాపాడేందుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నారనీ, ఆయ‌న్ను కూడా విచారించాల‌ని  డిమాండ్ చేస్తున్నారు. కానీ చెల్లెలు రోదన‌లు ప‌ట్టించుకోని జ‌గ‌న్‌.. త‌న సిపాయిల‌ను మీడియా ముందుకు పంపించి సునీత చెప్పేదంతా చంద్ర‌బాబు డ్రామాలో భాగ‌మే అంటూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గ‌త ఐదేళ్లుగా వివేకా హ‌త్య గురించి ఒక్కో విష‌యం వెలుగులోకి వ‌స్తున్నాయి. ప్రజలకు వివేకా హత్య కేసు సూత్రధారులు, పాత్రధారుల విషయంలో స్పష్టత వచ్చింది. ఈ హ‌త్య‌ కేసులో అరెస్ట‌యి జైలుకెళ్లిన వాళ్లుసైతం నిందితులు జ‌గ‌న్ మ‌నుషులే అని చెబుతున్నారు. అయినా, ప్ర‌జ‌లంతా పిచ్చోళ్లు అన్న‌ట్లుగా నిజాల‌ను అబ‌ద్దాలుగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చేయ‌డం నీచ‌ రాజ‌కీయాల‌కు ప‌రాకాష్ట అంటూ పరిశీలకులు విశ్లేషకులు అంటున్నారు. ఇక్క‌డ ప్ర‌జ‌లు గ‌మ‌నించాల్సిన మ‌రో విష‌యం ఏమిటంటే, చంద్ర‌బాబు ముస‌లోడు.. ఆయ‌న రాజ‌కీయాల‌కు, వ్యూహాలు ప‌న్న‌డానికి ప‌నికిరారు అంటూ ప‌బ్లిక్ మీటింగ్ ల‌పై  చెప్పే వైసీపీ నేత‌లు.. వివేకానంద హ‌త్య‌కేసులో జ‌గ‌న్, ఆయ‌న వ‌ర్గం వారి ప్ర‌మేయం ఉంద‌ని జ‌గ‌న్ చెల్లెలే స్వ‌యంగా మొత్తుకుంటుంటే మాత్రం.. దానికి కార‌ణం చంద్ర‌బాబు అని స‌జ్జ‌ల, వైసీపీ నేత‌లు అంటుండ‌టం విడ్డూరంగా ఉంది.  తాజా ప‌రిణామాల‌తో వివేకా హ‌త్య‌ మ‌ర‌కను తుడుచుకునేందుకు జ‌గ‌న్, స‌జ్జ‌ల చేస్తున్న ప్ర‌య‌త్నాలు చూసి విస్తుపోవ‌టం ఏపీ ప్ర‌జ‌ల వంత‌వుతున్నది. అస‌లు విష‌యానికి వ‌స్తే, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ పెట్టి తన తండ్రి హత్యకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డే అని వారిద్దరినీ జగన్మోహన్‌ రెడ్డి కాపాడుతున్నారని నేరుగా తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు, హంతకులు ఎక్కడో లేరు మన మధ్య‌నే ఉన్నారు. హత్యా రాజకీయాలు చేసే వైసీపికి ఎవరూ ఓట్లు వేయవద్దని సునీతారెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సునీతారెడ్డి ప్రెస్ మీట్ ఢిల్లీలో అయిపోయిన వెంట‌నే.. వైసీపీ తరపున సజ్జల రామకృష్ణా రెడ్డి తాడేప‌ల్లిలో మీడియా ముందు కొచ్చారు. సునీతారెడ్డి మాట‌ల‌న్నీ అబ‌ద్దం. మేము చెప్పేదే నిజం.. ప్ర‌జ‌లంతా మేము చెప్పిందే న‌మ్మాలి అన్నంత ప‌నీ చేశారు స‌జ్జ‌ల‌. అంతేకాక‌ ఇన్నాళ్ళకు సునీతారెడ్డి తన ముసుగును తీసేసి తన అసలు రూపం బయటపెట్టుకున్నందుకు ముందుగా ఆమెకు చాలా థాంక్స్ చెపుతున్నాను అంటూనే,  ఇన్నేళ్ళుగా మాట్లాడని ఆమె ఎన్నికలకు ముందు ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రెస్‌మీట్‌ పెట్టి తన తండ్రి హత్య కేసు గురించి మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డిని, మా ఎంపీ అవినాష్ రెడ్డిని నిందిస్తున్నారంటూ అరిగిరిన క్యాసెట్ నే  మ‌ళ్లీ వినిపించారు స‌జ్జ‌ల‌. ఇక్క‌డ స‌జ్జ‌ల‌కు తెలియాల్సిన విష‌యం ఏమిటంటే.. సునీతారెడ్డి గ‌త నాలుగేళ్లుగా త‌న తండ్రిని చంపిన నిందితుల‌కు శిక్ష‌లు వేయాల‌ని మీడియా ముందు అనేక‌సార్లు ప్ర‌స్తావించారు.. ఆమె ప్ర‌త్యేకంగా ఎన్నిక‌ల ముందు వ‌చ్చి మాట్లాడ‌లేదు. అంతేకాదు, చంద్ర‌బాబు ముస‌లోడు అంటూ ప్ర‌చారం చేసిన చేయించిన స‌జ్జ‌ల‌.. ఇప్పుడు మాత్రం సునీతా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్ట‌గానే అదంతా చంద్ర‌బాబు ప‌నేనంటూ చెప్ప‌డం వైసీపీ శ్రేణులనుసైతం విస్మ‌యానికి గురిచేస్తున్నది. వివేకా హత్య కేసుని వారంరోజుల్లో తేల్చేయవచ్చని సునీతారెడ్డి అంటున్నారు.. చంద్రబాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలోఎందుకు అడగలేదు? వివేకా హత్య జరిగిన తర్వాత దాదాపు రెండు నెలలుపైగా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా? అప్పుడే కేసుపై దర్యాప్తు జరిపించి దోషులను ఎందుకు పట్టుకోలేదు? అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే, ఈ ప్రశ్నలన్నిటికీ చాలా ఎదురు ప్రశ్నలున్నాయి. వాటన్నిటికీ సజ్జల రామకృష్ణా రెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వివేకాని తెలుగుదేశం నేతలే హత్య చేసిన్నట్లయితే, ఎన్నికల సమయంలో అదే విషయం చాటింపు వేసుకుంటే వైసీపీకే లబ్ధి కలిగేది కదా?  కానీ  గుండెపోటుతో చనిపోయారని ఎందుకు అబద్దం చెప్పారు? హత్య జరిగిన‌ట్లు తెలీయకుండా బ్యాండేజీలు ఎందుకు చుట్టారు? ఎవరు చుట్టారు?  పోస్ట్ మార్టం నిర్వహించకుండా అంత్యక్రియలు నిర్వహించడానికి ఎందుకు ప్రయత్నించారు? తెలుగుదేశం నేతలే ఈ హత్య చేసిన్నట్లయితే రాష్ట్రంలో వైసీపీయే అధికారంలో ఉంది కదా? మొదట ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసుల వద్ద ఉన్న సాక్ష్యధారాలన్నిటినీ సీబీఐకి సమర్పించి తెలుగుదేశం నేతలను లోపల వేయించేయొచ్చు కదా?  కానీ  వివేకా హత్య కేసు ముందుకు సాగనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌జ్జ‌ల స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా అని జనం ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సునీతా రెడ్డి ఢిల్లీలో లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ల‌కు స‌జ్జ‌ల స‌మాధానాలు చెప్ప‌లేక అంతా చంద్ర‌బాబు చేశారంటూ పాత‌పాటే పాడుతూ.. త‌ప్పును క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం ఏపీ ప్ర‌జ‌లను విస్మ‌యానికి గురిచేస్తోంది.