జగన్ ఫేట్ ఇదీ.. తేల్చిచెప్పిన ప్రశాంత్ కిషోర్
posted on Mar 4, 2024 7:54AM
ప్రశాంత్ కిషోర్.. 2019 ఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్త.. వైసీపీ విజయం సాధించడంతోపాటు అత్యధిక నియోజకవర్గాల్లో ఆ పార్టీ జెండా ఎగరడంలో కీలక భూమిక పోషించిన వారిలో ఒకరు. ప్రశాంత్ కిషోర్ సర్వే అంటే అందులో తిరుగుండదని దేశ రాజకీయాల్లో పేరుంది. ప్రజల నాడిని ప్రశాంత్ కిషోర్ తేలిగ్గా పట్టేయగలరు. అలాంటి ప్రశాంత్ కిషోర్.. ఏపీ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో గెలిచేది ఏ పార్టీనో క్లియర్ కట్ గా తేల్చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని, అందులో ఎలాంటి అనుమానం లేదని కుండబద్దలు కొట్టేశారు. అది కూడా అలాంటి ఇలాంటి ఓటమి కాదనీ, ఘోరమైన పరాజయం తప్పదనీ తేల్చేశారు.
వైసీపీ ఓటమికి కారణాలను కూడా ప్రశాంత్ కిషోర్ వివరించాడు. వైసీపీ ఓడిపోతుందని ప్రశాంత్ కిషోర్ చెప్పిన వెంటనే ఆ పార్టీ సోషల్ మీడియా రెచ్చిపోయింది.. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సర్వేలతో విజయం సాధించిన జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు ఆయన సర్వేలు తూచ్.. అంతా అబద్దం అని వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయడం మొదలైపోయింది. అంతేకాదు.. జగన్ తన మంత్రులతో ప్రశాంత్ కిషోర్ ను ఇష్టారీతిగా తిట్టించేశారు. బీహార్ లో చెల్లని రూపాయి అయిన ప్రశాంత్ కిషోర్ సర్వేలు ఇక్కడ పనిచేయవంటూ ఎదురుదాడి మొదలు పెట్టారు. ప్రశాంత్ కిషోర్ ఒక్కరేకాదు.. ప్రముఖ సర్వేల ఫలితాలన్నీ వైసీపీ ఓటమి ఖాయమని తేల్చేస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని కుండబద్దలు కొట్టేస్తున్నాయి.
ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటినుంచి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నది అందరికీ తెలిసిన విషయమే. కేవలం పథకాల పేరుతో అకౌంట్లలో డబ్బులు జమ చేయడం తప్ప, వైసీపీ కార్యకర్తలు, ప్రజలరు చెప్పుకోవడానికి కనీసం ఒక్క రోడ్డునుకూడా జగన్ మోహన్ రెడ్డి వేయలేక పోయారు. 2014 నుంచి 2019 వరకూ ఏపీ సీఎంగా చంద్రబాబు చేసిన అభివృద్ధిని కొనసాగించక పోవటంతోపాటు.. చంద్రబాబు హయాంలో నిర్మించిన భవనాలను కూల్చేశారు. అంతేకాదు.. చంద్రబాబు హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టిన పెద్దపెద్ద కంపెనీలను సైతం రాష్ట్రం నుంచి తరిమేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిది. మద్యం, ఇసుక పేరుతో జగన్ హయాంలో భారీ దోపిడీ జరిగింది. ఇదేమని ప్రశ్నించిన వారిపై దాడిచేయడం, అరెస్టులు చేయించి జైళ్లకు పంపడం తప్ప జగన్ ఐదేళ్ల పాలనలో జరిగింది ఏమీ లేదు. చంద్రబాబు హయాంలో అమరావతిని ఏపీ రాజధానిగా అసెంబ్లీలో తీర్మానంచేసి.. అక్కడ సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులతో పాటు పలు కార్యాలయాలకు భవనాలను కూడా నిర్మించారు. జగన్ అధికారంలోకి వచ్చే నాటికి అమరావతిలో కొన్ని భవనాలు పూర్తికాగా.. మరికొన్ని చివరి దశలో ఉన్నాయి. వాటిని కొనసాగించాల్సిన జగన్ మోహన్ రెడ్డి తన కక్షపూరిత రాజకీయాలతో అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. మూడు రాజధానుల పేరుతో ఏపీ ప్రజలను నిలువునా మోసం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. జగన్ హయాంలో జరిగింది కేవలం విధ్వంసం మాత్రమే.. అభివృద్ధి ఆనవాళ్లు భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు.
జగన్ ఐదేళ్ల పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రజల ఆగ్రహాన్ని గమనించిన జగన్మోహన్ రెడ్డి పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్పులు చేశారు. అయినా, సర్వే ఫలితాలన్నీ వైసీపీ ఓటమి ఖాయమని తేల్చేస్తున్నాయి. జగన్ సొంతగా నిర్వహించిన సర్వేలోనూ 75శాతం వైసీపీ అభ్యర్థులు ఓడిపోతారని తేలిందన్న ప్రచారం వైసీపీ వర్గాల్లోనే జరుగుతున్నది. గత ఎన్నికల సమయంలో ఏపీలో జగన్ ఘన విజయం సాధిస్తారని పలు జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో తేలింది.. అవే జాతీయ మీడియా సంస్థలు ఇటీవల నిర్వహించిన సర్వేల్లో వైసీపీ ఓటమి ఖాయమని తేల్చేశాయి. తాజాగా ప్రశాంత్ కిషోర్ కూడా వైసీపీ ఓటమి ఖాయమని తేల్చేశాడు. హైదరాబాద్‌లో ఓ పత్రిక కాంక్లేవ్‌లో పాల్గొన్న ఆయన ఏపీ రాజకీయాలపై స్పందించారు. ప్రజల బాగోగులు చూస్తున్నామని వాళ్ల సొమ్మును ఖర్చు చేయడం తప్పు.. జగన్ ఇలా చేయడం వల్లే రాజకీయంగా నష్టపోబోతున్నారని ప్రశాంత్ కిషోర్ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. తెలంగాణలో కేసీఆర్‌కికూడా అదే జరిగిందని అన్నారు. విద్య, ఉపాధి, అభివృద్ధి ఎన్నికల్లో కీలకంగా ప్రభావం చూపుతాయని, ప్యాలెస్‌లో కూర్చొని బటన్స్ నొక్కితే ఓట్లు పడబోవని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ప్రజల మధ్యలోకి రాకపోవడం కూడా జగన్ ఓటమికి కారణంగా మారుతుందని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈసీ కసరత్తు చేస్తున్న క్రమంలో .. ప్రముఖ సర్వే సంస్థల ఫలితాలన్నీ వైసీపీ ఓడిపోతుందని తేల్చేశాయి. దీంతో తాడేపల్లి క్యాంప్ తోపాటు వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైతం వైసీపీ ఓడిపోవడం ఖాయమని తేల్చిచెప్పాడు. వెంటనే ప్రశాంత్ కిషోర్ పై వైసీపీ సోషల్ మీడియాలో ఆ పార్టీ మూకలు అసభ్య పదజాలంతో దూషణలు మొదలు పట్టేశారు. ప్రశాంత్ కిషోర్ వైసీపీ ఓడిపోతుందని చెప్పిన కొద్ది సేపటికే మంత్రి అమర్నాథ్ ప్రెస్ మీట్ పెట్టి తిట్ల దండకం అందుకున్నారు. బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ ప్రజలను ఏమార్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై తన గట్ ఫీలింగ్ అంటూ ఏవేవో మాట్లాడారు. తెలుగుదేశం, జన సేన కూటమి చిత్తుచిత్తుగా ఓడిపోతుందని ఏపీ ప్రజలే అంటున్నారంటూ మంత్రి చెప్పుకొచ్చాడు. బీహార్ లో ప్రశాంత్ కిషోర్ చిత్తుగా ఓడిపోతారు. బీహార్ లో ప్రశాంత్ కిషోర్ లానే చంద్రబాబు కూడా ఆంధ్రా లో చెల్లని రూపాయి అంటూ మంత్రి మాట్లాడారు. మొత్తానికి వైసీపీ అధిష్టానం పైకి గంభీరంగా కనిపిస్తున్నా, ఓటమి ఖాయమని ఆ పార్టీ శ్రేణులే చెప్పేస్తున్నా, పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తన భుజాలను తానే చరుచుకుంటూ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజాగా పీకే సైతం జగన్ కు ఓటమి తప్పదని చెప్పడంతో వైసీపీ నేతల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.