ధరణి సమస్యల పరిష్కారంపై రేవంత్ సర్కార్ నజర్!
posted on Mar 4, 2024 @ 11:23AM
బీఆర్ఎస్ హయాంలో ధరణి అవకతవకలపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ ధరణి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించింది. ధరణిని రద్దు చేసి దాని స్థానంలో మరో పోర్టల్ ను తీసుకువచ్చే కసరత్తు చేస్తున్నప్పటికీ, దానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో, అలాగే చట్ట సవరణ కూడా చేయాల్సిన పరిస్థితుల్లో ముందుగా ధరణి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణి సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేశారు. ఈ నెల 9లోగా వీలైనంత వరకూ ప్రతి సమస్యనూ పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారులు 2020 నుంచి పెండింగ్లో ఉన్న ఫైళ్ల పరిశీలనలో నిమగ్నమయ్యారు. జిల్లాల్లో మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులను ప్రోది చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఇందు కోసం 86 బృందాలను కూడా మొత్తం పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు అధికారులు వచ్చారని చెబుతున్నారు. భూమి రిజిస్ట్రేషన్ ముగిసి ధరణి రాకతో ముటేషన్లు ఆగిపోయిన అర్జీలను ముందుగా పరిష్కరించాలని నిర్ణయించారు. అలాగే గ్రీవెన్స్ ఆఫ్ ల్యాండ్ మేటర్ సమస్యలు, ఫొటో కరెక్షన్, జెండర్, ఆధార్, క్యాస్ట్, డిజిటల్ సైన్, మిస్సింగ్ సర్వే నంబర్ వంటి సమస్యలు ఈ పరిధిలోకి వస్తాయి. ఇటువంటి సమస్యలను త్వరగానే పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టలేదు.
ఇవిగాక సక్సెషన్, ఎల్ఏజీ, ఖాతా మెర్జింగ్, టీఎం ధరఖాస్తులను కూడా పెద్దగా సమస్యలేవీ లేకుండానే పరిష్కారం చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. నిషేధిత సర్వే భూములకు సంబంధించిన దరఖాస్తులను మాత్రం ప్రస్తుతానికి పక్కన పెట్టేయాలనీ, అలాగే కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న వాటిని కూడా అధికారులు ప్రస్తుతానికి పక్కన పెట్టేయాలని నిర్ణయించారు.
ధరణి పోర్టల్ అమలులోకి తీసుకువచ్చిన తరువాతనే ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయనీ, వాటిని సత్వరమే పరిష్కరించాలని రేవంత్ సర్కార్ కృత నిశ్చయంతో ఉంది. కోర్టు వివాదాలు లేని ప్రతి దరఖాస్తునూ పరిశీలించి పరిష్కరించాలని ఇప్పటికే రేవంత్ సర్కార్ జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో చాలా వరకూ సమస్యలు ఈ నెల 9నాటికి పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు.