మళ్లీ తెగిన ఫ్లోటింగ్ బ్రిడ్జి.. కవరింగ్ ల నిగ్గు తేలిపోయిందిగా!
సీఎం జగన్మోహన్ రెడ్డికి కూల్చడాలే తప్ప కట్టడాలు తెలియదన్న అభిప్రాయానికి ఏపీ ప్రజలు వచ్చేశారు. నాలుగున్నారేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి చెప్పుకోదగ్గ ఒక్క కంపెనీని ఏపీకి తీసుకురాలేక పోయారు.. ఒక్కటంటే ఒక్క నిర్మాణం చేపట్టలేదు. రుషికొండ అక్రమ నిర్మాణాలు వేరే సంగతి. ప్రజలకు ఉపయోగపడే ఒక్కటంటే ఒక్క నిర్మాణం చేపట్టలేదు. ఒక్క రోడ్డు బాగు చేయించలేదు.. కానీ, చంద్రబాబు హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టి, ఏపీ యువతకు ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీలను మాత్రం వెళ్లగొట్టేశారు. ప్రజా వేదికను కూల్చేశారు. వైసీపీ హయాంలో ఏదైనా చిన్నాచితక పనిచేసినా అందులోనూ నాసిరకమే. ఇప్పటికే రాజధానిలేని రాష్ట్రంగా దేశవ్యాప్తంగా ఏపీని చిన్నచూపు చూస్తున్న పరిస్థితి. తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వం పరువు గంగలో కలిసింది. విశాఖ ఆర్‌కే బీచ్ లో అధికారులు ప్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. దేశం మొత్తంలో ఎవరూ ఇంత గొప్ప పని చేయలేదని స్వోత్కర్షలు చేసేసుకుంటూ దేశంలో ఎక్కడ ఇలాంటిది లేదు అన్నట్లుగా తమ భుజాలను తామే చరిచేసుకుని, ఏపీ ప్రజలకు ఒక మహత్తర కానుక ఇచ్చేశాం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చేశారు. అయితే ఇంత ఘనంగా చెప్పుకుని ఆర్బాటంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జి కనీసం ఒక్కటంటే ఒక్క రోజుకూడా నిలవలేదు. ప్రారంభించిన మరునాడే ఆ నిర్మాణంలోని డొల్లతనం బయటపడేలా తెగిపోయింది. ప్లోటింగ్ బ్రిడ్జి అంచునఉన్న భాగం విడిపోయి వంద మీటర్ల దూరం సముద్రంలోకి వెళ్లిపోయింది. దీంతో కంగుతిన్న నిర్వాహకులు పర్యాటకులను ప్లోటింగ్ బ్రిడ్జిపైకి వెళ్లకుండా అప్రమత్తం చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
వైసీపీ ప్రభుత్వానికి డ్యామేజ్ గా ప్లోటింగ్ బ్రిడ్జి వ్యవహారం మారడంతో.. ప్రభుత్వ పెద్దలు, అధికారులు రంగంలోకి దిగి తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ప్లోటింగ్ బ్రిడ్జి తెగలేదు. మాక్ డ్రిల్ లో భాగంగా మేమే విడదీశాం అంటూ ప్రచారం చేసుకున్నారు. దీనికితోడు ప్లోటింగ్ బ్రిడ్జి తెగిందన్నవారిని రాష్ట్ర దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ప్రజల కళ్లముందే తప్పుజరిగినా అది తప్పుకాదని ప్రజల చెవుల్లో మోతగించడంలో వైసీపీ సోషల్ మీడియా ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇప్పుడూ ముందే ఉంది. ప్రజలంతా చూస్తుండగానే ప్లోటింగ్ బ్రిడ్జి చివరిభాగం తెగిపోయి సముద్రలోకి వెళ్లిపోయినా.. అబ్బెబ్బే తెగిపోలేదు.. కావాలనే మాక్ డ్రిల్ నిర్వహించారని బుకాయించేసింది. ఆ బుకాయింపును ఎవరూ నమ్మలేదనుకోండి అది వేరే విషయం. ఏదైనా చిన్న యంత్రాన్ని ప్రారంభించాలన్నా దానిని ప్రారంభించే ముందు పలుసార్లు ట్రయల్ రన్ వేస్తారు.. ఒకటికిపదిసార్లు చెక్ చేసుకొని ప్రారంభించిస్తారు.. కానీ, అధికారులు మాత్రం ప్లోటింగ్ బ్రిడ్జిని ప్రారంభించిన తరువాత.. సందర్శకులను అనుమతించేసిన తరువాత పరిశీలన నిమిత్తం తెగ్గొట్టామంటూ చెప్పుకుని జనాలను నమ్మించడానికి విశ్వప్రయత్నం చేశారు. సరే జనం నమ్మారని అనుకున్నా.. తాజాగా శనివారం మరోసారి ప్లోటింగ్ బ్రిడ్జి చివరి భాగం తెగిపోయింది. ఇది కూడా మాక్ డ్రిల్లే అంటారా? అనగలరా? జనం మాత్రం జగన్ సర్కార్ కు కూల్చివేతలు తప్ప నిర్మాణాలు చాతకాదు అని బాహాటంగానే చెబుతున్నారు.
సదర్శనీయ స్థలం, ఆటవిడుపు పరికరాలు, సాహస క్రీడ.. ఇలా ఏదైనా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటే సమగ్ర సన్నద్దత అవసరం. ఎన్నో పరిశీలనలు, పరీక్షలు నిర్వహించిన తరువాత అనుమతించాలి. అలాంటిదేమీ పూర్తిగా చేయకుండానే వైసీపీ నేతలు, మంత్రులు తమ గొప్ప తనం చాటుకునేందుకు ఆర్కే బీచ్ లో గతనెల 25న ప్లోటింగ్ బ్రిడ్జిని ప్రారంభించారు. సందర్శకుల అనుమతికి టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. పెద్దలకు రూ.100, పన్నెడేళ్ల లోపు పిల్లలకు రూ. 70 వసూలు చేసేలా ధరలు నిర్ణయించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలత ఆధారంగా సందర్శకులను అనుమతిస్తామని బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే, వైసీపీ ప్రభుత్వ పెద్దలు, అధికారులు అనాలోచిత నిర్ణయాల కారణంగా విశాఖ ప్రజలు ప్లోటింగ్ బ్రిడ్జి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.
ప్లోటింగ్ బ్రిడ్జి విశాఖ తీరంలో ఎంతవరకు సురక్షితమనే అనుమానాలు తొలి నుంచీ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ తీరంలో ఇలాంటి ఏర్పాటు ఎవరూ ఎప్పుడూ చేయలేదు. ఆరేబియా సముద్రంతో పోల్చితే బంగాళాఖాతం అత్యంత ప్రమాకరమైంది. ఇక్కడ అలల తాకిడి ఎచాలా ఎక్కువ. ముఖ్యంగా సముద్ర అలల తీవ్రత ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయలేమని జాతీయ సముద్ర పరిశోధన సంస్థ నిపుణులు పేర్కొంటున్నారు. గోవా, ముంబయి, కేరళ రాష్ట్రాల్లో అరేబియా సముద్రం మే, జూన్, జులై, ఆగస్టు నెలల్లో ప్రమాదకరంగా.. మిగిలిన కాలం ప్రశాంతంగా ఉంటుంది. తూర్పుతీరం మాత్రం భీకర వాతావరణాన్ని కలిగి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. సువిశాలమైన ఈ తీరం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే గాలులతో నిత్యం అలజడిగా ఉంటుంది. ఎప్పుడు తక్కువ తీవ్రత ఉంటుందో అంచనా వేయడం సాధ్యం కాదు. అవేవి పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం హడావుడిగా ఆర్కే బీచ్ లో ప్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి అంత కంటే ఆర్భాటంగా ప్రారంభోత్సవం కూడా చేసేసింది. ఇప్పుడు అది స్వల్ప వ్యవధిలో రెండు సార్లు తెగిపోవడంతో ఇక ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కథ ముగిసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కవరింగులు ఇచ్చుకుని, మరమ్మతులు అంటే ఏదో ఒకటి చేసేసి సందర్శకులను అనుమతించినా జనం మాత్రం ఆ బ్రిడ్జి మీదకు రావడానికి ఏ మాత్రం ఇష్టపడే పరిస్థితి లేదని అంటున్నారు.