గురి చూసి కొట్టిన డాక్టర్ సునీత!
posted on Mar 2, 2024 @ 12:03PM
అధికారం రుచి మరిగి మరోసారి అబగా.. అధికారాన్ని అందుకోందామనుకొంటున్న వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశలపై ఆయన సోదరి నర్రెడ్డి సునీత నీళ్లు చల్లారనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. మార్చి 1వ తేదీ దేశ రాజధాని హస్తినలోని కానిస్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా.. వివేకా హత్య.. కుట్రదారులు ఎవరు? అనే అంశంపై ఆమె ప్రెస్‌మీట్ పెట్టడం ఓ ఎత్తు అయితే..
ఆదే ప్రెస్‌మీట్‌లో ప్రజలందరికీ ఒక రిక్వస్ట్.. ప్లీజ్ మా అన్న పార్టీకి, వైసీపీకి ఓటు వేయద్దండి.. ఇంత వంచన చేసిన పార్టీకి, మోసం చేసిన పార్టీకి, తన అనుకున్న వాళ్లకి మాత్రమే హెల్ప్ చేసి. మిగిలిన ఎవరికీ సహాయం చేయకుండా ఉండే వాళ్లకు.. ప్లీజ్ ఓటు వేయకండంటూ ఆమె కోరడం మరో ఎత్తు అంటున్నారు. అలాగే తన తండ్రి హత్య కేసులో ప్రజా తీర్పు కావాలంటూ.. సునీత నర్రెడ్డి మీడియా ద్వారా ప్రజల ముందు ఇలా అభ్యర్థించడం ఇంకో ఎత్తు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే తన తండ్రి వివేకా హత్య కేసుతో.. ఇలా సమయం, సందర్భంతోపాటు వేదికను సైతం ఎంచుకోని.. తన సోదరుడు జగన్‌ను సునీత నర్రెడ్డి గురి చూసి కొట్టిందంటున్నారు. ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో జరగనున్న వేళ ఆమె.. అటు విజయవాడలోనో.. లేకుంటే ఇటు హైదరాబాద్‌లోనో కాకుండా.. దేశ రాజధాని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి.. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజల సంక్షేమం సంగతి దేవుడెరుగు.. సొంత ఇంటి ఆడపడుచుకే న్యాయం జరగడం లేదనే ఓ క్లియర్ కట్ సందేశాన్ని ఢిల్లీలోని కేంద్ర పెద్దలకు సైతం తెలియజేసేందుకే సునీత నర్రెడ్డి ఇలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వ్యక్తం అవుతోంది.
గతంలో వైయస్సీర్టీపీ అధ్యక్షురాలిగా ఉన్న వైయస్ షర్మిల.. కేసీఆర్ ప్రభుత్వంపై ఢిల్లీలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు ఓ వైపు ప్రచారం సాగుతుండగా.. ఇదే వివేకా హత్య కేసులో సీబీఐ కార్యాలయానికి వెళ్లి ఆమె వాంగ్మూలం ఇవ్వడమే కాదు.. ఆ తర్వాత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి.. వివేకా హత్య కేసులోని పలు కీలక అంశాలను బహిర్గతం చేశారనీ, సరిగ్గా అలాగే.. సునీత నర్రెడ్డి సైతం ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి.. తన జగనన్న బండరాన్ని బహిర్గతం చేశారన్న చర్చ వైరల్ అవుతోంది.
అంతేకాదు.. సునీత చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారని కూడా అంటున్నారు. ఎందుకంటే.. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ లోపు.. ఏపీ సీఎం జగన్.. ఏదో ఓ రోజు ఢిల్లీ పర్యటకు వెళ్తారు. ఆ క్రమంలో సునీత ప్రెస్ మీట్ అంశంపై ఆయన్ని మీడియా మిత్రులు ప్రశ్నిస్తారు. అలాంటి వేళ ఆయన స్పందన ఎలా ఉండబోతుంది. అలాగే సీఎం జగన్.. న్యూఢిల్లీలో కేంద్రంలోని పెద్దలతో భేటీ అవుతారు.. ఆ సమయంలో సునీత ప్రెస్ మీట్ పెట్టి పేర్కొన్న అంశాలను కేంద్ర పెద్దలు జగన్ వద్ద ప్రస్తావిస్తే.. అప్పుడు ఆయన పరిస్థితి ఏమిటీ.. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొనే.. సునీత నర్రెడ్డి చాలా చాకచక్యంగా వ్యహరించారని చెబుతున్నారు. అదేవిధంగా సోదరుడు జగన్‌ను ఢిల్లీలోనే అష్టదిగ్బందం చేసే విధంగా ఆమె వ్యవహరించారన్న చర్చ వైసీపీలోనే జరుగుతోంది.
మరోవైపు.. జగన్ పాలనతోపాటు ఆయన వ్యవహార శైలిపై ప్రతిపక్షపార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరీలు విమర్శనాస్త్రాలు సంధిస్తే.. ఫ్యాన్ పార్టీలోని ఎవరో ఒకరితో ప్రెస్ మీట్ పెట్టించి.. బండ బూతులు తిట్టించడం రివాజుగా మారింది. ఇక సొంత సోదరి వైయస్ షర్మిల.. హస్తం పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత.. నేరుగా జగన్ పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీలోని కొడాలి నాని, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్ ఎక్సెట్రా ఎక్సెట్రాలు ఆమెపై విరుచుకు పడుతున్నారు.
అయితే సునీత నర్రెడ్డి.. తన తండ్రి హత్య కేసులో న్యాయం కోసం.. అయిదేళ్లుగా పోరాటం చేస్తున్నారు.. ఆ క్రమంలో హస్తిన వేదికగా ప్రెస్ మీట్ పెట్టి.. చాలా సుతి మెత్తగా.. జగనన్న పాలన తీరును ఎండగట్టడం ద్వారా.. వైఎస్ ఫ్యామిలీలోని ఇంటి ఆడపడుచులు పదునైన బాణాలుగా వ్యవహరించారనేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలనే చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.
ప్రతిపక్ష నేతగా వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి.. అలవి కానీ హామీలు ఇచ్చి.. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని.. అధికారం పీఠమెక్కిన జగన్‌ను అధ: పాతాళంలోకి పడ తోసేందుకు సునీత నర్రెడ్డి హస్తినలో పెట్టిన ఈ ఒక్క ప్రెస్ మీట్ చాలనే ఓ చర్చ అయితే రాజకీయవర్గాలలో జోరుగా నడుస్తోంది.