ప్రభుత్వ ఉద్యోగివా.. వైసీపీ కార్యకర్తవా..?
posted on Mar 4, 2024 8:34AM
వైసీపీ ప్రభుత్వంలో కొందరు అధికారుల తీరు హద్దులు దాటిపోతోంది. అలాగే కొందరు ఉద్యోగ సంఘాల నేతలు కూడా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి హార్డ్ కోర్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. తమ స్వలాభం కోసం ప్రభుత్వ పెద్దల ప్రసన్నంకోసం కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ఎంతకైనా తెగించేస్తున్నారు. పాతాళానికి సైతం దిగజారడానికి వెనుకాడటం లేదు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టకుండా వారికి అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ మోహన్ రెడ్డిని పొగిడేందుకే మనం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాం అన్నట్లుగా కొందరు ఉద్యోగం సంఘాల నేతలు వ్యవహరిస్తుండటం ఉద్యోగులు, ప్రజలలు విస్తుపోవడమే కాదు, ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో, ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులతో అధికారులు సత్సంబంధాలు కలిగి ఉండటంలో ఏమాత్రం తప్పులేదు. ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో సీఎం ఆదేశాలను, మంత్రుల ఆదేశాలను పాటించడా్నీ తప్పుపట్టలేం. ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడం ఉద్యోగుల విధి. కానీ, ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నామన్న సోయి మరిచి ప్రభుత్వంలోఉన్న పార్టీకి కార్యకర్తలా వ్యవహరిస్తుండటం ఉద్యోగ సంఘాల ఉనికి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితికి దారి తీస్తోంది. సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి తీరు అలానే ఉంది. వెంకట్రామిరెడ్డి తీరుపట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుగా వెంకట్రామిరెడ్డి 2022 డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన తీరు వివాదాస్పదంగానే ఉంది. ప్రభుత్వ ఉద్యోగిలా కాకుండా వైసీపీ కార్యకర్తలా ఆయన వ్యవహరిస్తున్నారంటూ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సీఎం వద్దకు, ప్రభుత్వ పెద్దల వద్దకు ఉద్యోగుల సమస్యలను తీసుకెళ్లి వాటి పరిష్కారంకోసం కృషిచేయాల్సిన ఉద్యోగ సంఘం నేత వెంకట్రామరెడ్డి స్వలాభంకోసం వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. గతంలో వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 2023లో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ప్రాణాపాయం ఉంటే చంపడానికైనా హక్కు ఉంది.. రాజ్యాంగంలో ఆ విషయాన్ని పొందుపరిచారంటూ వెంకట్రామి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సచివాలయ ఉద్యోగులుసైతం ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి.
వెంకట్రామిరెడ్డి తనను తాను పలు సందర్భాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి బంటునని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగి ఏ స్థాయిలో ఉన్నా ఉద్యోగ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. సీఎంపై, ప్రభుత్వంలో ఉన్న పార్టీపై ప్రేముంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి కార్యకర్తగా చేరితే బాగుంటుంది. కానీ, ఉద్యోగ సంఘం నేత ముసుగులో జగన్మోహన్ రెడ్డి వద్ద సచివాలయ ఉద్యోగులను తాకట్టుపెట్టిన వ్యక్తిగా వెంకట్రామిరెడ్డి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషించాల్సింది పోయి వైసీపీ కార్యకర్తలా మారిపోవటం పట్ల పలువురు ఉద్యోగులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల వెంకట్రామిరెడ్డి ఉద్యోగులతో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన మాటలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గ్రామ సచివాలయాల్లో మంచి జరిగిందా లేదా అన్నది వచ్చే ఎన్నికలే ఉదాహరణ.. ఒకవేళ వైసీపీ ఓడిపోతే మనం బాగా పని చేయనట్టే అని వెంకట్రామిరెడ్డి ఉద్యోగులతో అన్నారు. అంత వరకు బాగానేఉన్నా.. పలు పత్రికలు, చానల్స్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రాష్ట్రంలో ఏదో జరిగిపోయిందని కొన్ని మీడియా సంస్థలు పుంఖాను పుంఖాలుగా రాస్తూ టీవీ చానల్స్ లో డిబేట్ లు పెడుతున్నాయని వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించడం పట్ల ఉద్యోగుల నుంచే కాకుండా రాజకీయ వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగిగా మాట్లాడేటప్పుడు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని, వైసీపీ కార్యకర్తలా మాట్లాడితే రాబోయే కాలంలో ఉద్యోగులను ప్రజలు చీదరించుకునే పరిస్థితి వస్తుందని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పత్రికలు, చానల్స్ హైలెట్ చేస్తూ ఉద్యోగులకు మేలు జరిగేలా చేస్తుంటే.. వెంకట్రామిరెడ్డి పత్రికలు, ఛానల్స్ పై వైసీపీ కార్యకర్తలా ఆరోపణలు చేయడం ఉద్యోగులను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇప్పటికైనా ఉద్యోగ సంఘంలో కీలక హోదాల్లో ఉన్నవారు నిబంధనలకు లోబడి మాట్లాడితే బాగుంటుందని, లేకుంటే రానున్న కాలంలో ప్రభుత్వ ఉద్యోగులంటేనే ప్రజలు పార్టీల కార్యకర్తలుగా భావించే ప్రమాదం పొంచిఉందని పలువురు ఉద్యోగ సంఘం నేతలు, ఉద్యోగులు వాపోతున్నారు.